మోదీ ఇస్తున్నది ‘‘నిరుద్యోగ హామీ’’: ప్రియాంక

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-02-04 09:40 GMT

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్యపై బడ్జెట్‌లో ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. గణాంకాల ప్రకారం.. దేశంలో దాదాపు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఒట్టి ప్రచారమే..

కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి ప్రచారం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

గడిచిన ఎనిమిదేళ్లలో 22 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. అందులో కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని 2022 జూలైలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. అందే దాదాపు 21.93 కోట్ల మంది అర్హులైన యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని పేర్కొన్నారు.

‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం ఉన్న పోస్టులను భర్తీ చేయదు. కొత్త ఉద్యోగాలు కల్పించలేదు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రధాని ఇస్తున్నది ‘‘నిరుద్యోగ హామీ’’ అని ప్రియాంక అన్నారు.

దురదృష్టకరం..

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కొత్త ఉద్యోగాల ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. నిరుద్యోగంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ‘‘దురదృష్టం’’ అని అన్నారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని అరికట్టడంలో కేంద్రం విఫలమైందని, మధ్యంతర బడ్జెట్‌ అన్ని వర్గాలను నిరాశపరిచిందని అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News