పాక్ బౌలింగ్ ను ఉతికేసిన కివీస్ యంగ్ ఓపెనర్

న్యూజిలాండ్ అంటేనే గాలులు వేగంగా, బలంగా వీస్తాయనే పేరుంది. బంతి ఒక్కోసారి సిక్స్ వెళ్తుంది అనుకుంటే బలమైన గాలుల ధాటికి అది కాస్త ఫీల్డర్ చేతుల్లో పడొచ్చు.

Update: 2024-01-17 06:13 GMT
ఫిన్ అలెన్. న్యూజిలాండ్ ఓపెనర్

అయితే బుధవారం ఇంతకంటే బలమైన ప్రపంచ గాలి గ్రౌండ్ లో వీచింది. ఆ పెనుగాలుల ధాటికి తట్టుకోలేక పాకిస్తాన్ కకావికలు అయింది. ఈ గాలి ఒకవైపు నుంచి కాకుండా గ్రౌండ్ మొత్తం కలియతిరిగింది. ఈ ప్రచండ మారుతాన్ని సృష్టించి, పాకిస్తాన్ కు పీడకలలు మిగిల్చింది.. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలన్.

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలన్ పాకిస్తాన్ తో జరిగిన మూడో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 62 బంతుల్లో 137 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 16 సిక్సర్లు బాదాడు. ఒక్క టీ20 ఇన్నింగ్స్ లో 16 సిక్స్ లు బాదిన అప్గాన్ ఒపెనర్ హజ్రాతుల్లా జజాయ్ రికార్డ్ ను అలెన్ సమం చేశాడు. 2019లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జజాయ్ 62 బంతుల్లో 162 పరుగులు సాధించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

బుధవారం డునెడిన్ వేదిక గా జరిగిన మూడో టీ20 లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 179 పరుగులు సాధించి 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిరీస్ ను కోల్పోయింది.

ఇంతకు ముందు జరిగిన రెండు టీ20 మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓటమి పాలైంది. కాగా మరో రెండు టీ20 మ్యాచ్ లు మిగిలిఉన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో కూడా పాక్ ఘోరంగా పరాజయం పాలైంది. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.

దొరకని బంతులు

ఫిన్ అలెన్ కొట్టిన సిక్స్ లలో రెండు ఏకంగా 100 మీటర్ల ఆవల పడ్డాయి. మరో మూడో సిక్స్ లు గ్రౌండ్ ఆవల పడ్డాయి. ఆ బంతులు దొరకకపోవడంతో కొత్తబంతులను తీసుకోవాల్సి వచ్చింది. ఈ సెంచరీతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ 2012లో బంగ్లాదేశ్ పై సాధించిన 123 పరుగుల వ్యక్తిగత రికార్డ్ కనుమరుగైంది.

ఫిన్ అలెన్ కు టీ20లో ఇదీ రెండో సెంచరీ. ఈ మ్యాచ్ లో అలెన్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్స్ లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ మార్క్ ను 48 బంతుల్లో చేరువయ్యాడు. ఇందులో 11 సిక్స్ లను బాదడం విశేషం. మూడో వికెట్ కు టిమ్ సీఫెర్ట్ (31) తో కలిసి 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

హరీస్ రవూఫ్ కు చుక్కలు

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో బంతులు సంధించగల బౌలర్లలో ఒకడైన హరీస్ రవూఫ్ బౌలింగ్ ను కివిస్ బ్యాట్స్ మెన్ లు ఉతికేశారు. రవూఫ్ మొదటి ఓవర్లతో కేవలం రెండు పరుగులు ఇవ్వగా, తరువాత రెండు ఓవర్లలో ఏకంగా 28, 23 పరుగులు సమర్పించుకున్నాడు.

హరీస్ రవూఫ్ వేసిన ఆరో ఓవర్లో ఫిన్ అలెన్ 6,4,4,6,6,1 బాదాడు. ఇందులో ఒక వైడ్ కూడా ఉంది. స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో బాదిన సిక్స్ ఏకంగా 10 7 మీటర్ల దూరం వెళ్లింది. చివరకు 18 ఓవర్లలో జట్టు స్కోరు 203-4 వద్ద ఫిన్ పెవిలియన్ చేరాడు.

బొల్తాపడ్డ పాకిస్తాన్

ఛేజింగ్ లో పాకిస్తాన్ ఏ దశలోను న్యూజిలాండ్ కు పోటీ ఇవ్వలేదు. ఆరోస్టానంలో బ్యాటింగ్ కు దిగిన బాబర్ ఆజం మాత్రమే అర్ధసెంచరీ(58) సాధించి జట్టు గౌరవప్రదమైన ఓటమి దక్కెందుకు సాయపడ్డాడు. బాబర్ ఆజం ఈ సిరీస్ లో వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు.   

Tags:    

Similar News