‘బడుగులకు రాజ్యాధికారం రాకుండా చేసింది కమ్యూనిస్టుల చరిత్ర దృక్పథమే’
పెరియార్ రామస్వామిని ఆదర్శంగా తీసుకుని సాగితే ఫలితాలు వుంటాయి. అలాచేస్తేనే శతాబ్దాలుగా ఉన్న బ్రాహ్మణీయ రాజ్యాధికారం పోతుంది. ఇది నచ్చక కమ్యూనిస్టులు పోరాడేవారితో ఐక్య సంఘటన కట్టరు.;
By : The Federal
Update: 2024-03-06 11:23 GMT
భారతీయ చరిత్ర అధ్యయనంలో వారి వారి ప్రాధాన్యత ననుసరించి అనేక విధాల వ్యాఖ్యానాలు వెలిగించారు. వారి దృక్పథాన్ని అనుసరించి వాస్తవాలను, సాక్ష్యాధారాలను సేకరించారు." భారతీయ చరిత్ర శూద్ర దృక్పథం " అనే పుస్తకం రాస్తున్నప్పుడు పలు పుస్తకాలను పరిశీలించాను. వర్ణ కుల వ్యవస్థలో, గణ తెగ జనపద వ్యవసాయిక సమాజాల్లో రాచరికాల కాలంలో శూద్రులు నిర్వహించిన పాత్ర గురించి రాయడం నా పరిధి. ఆ కోణంలో ఆయా చరిత్రకారులు రాసిన గ్రంధాలలో వెతికాను. గుడులు గుడుల విధ్వంసం గురించి రాసిన గ్రంథాల్లో వాటిని నిర్మించిన శూద్రుల గురించి రాయలేదు. బౌద్ద, జైన ఆరామ, విహార, ఆలయాల గురించి, వాటిని హిందూ ఆలయాలుగా మార్చిన వివరాలు రాయలేదు. హిందూ దేవాలయాలను ముస్లింలు ఎలా ధ్వంసం చేశారో 900 పేజీలు రెండు సంపుటాలుగా వెలిగించారు. వారి టార్గెట్ ముస్లింలు. వారి లక్ష్యం వాటి పై ఆధారపడి జీవించే పూజారులు, వారి ప్రయోజనాలు, వారు అందులో దాచిన సంపద దోచుకు పోయిన వివరాలకు ప్రాధాన్యత నిచ్చారు.
కొందరు చరిత్రంటే వర్గ పోరాటాల చరిత్రే అని ఆ వివరాలతో రాసారు. కొందరు యుద్దాల చరిత్రే చరిత్రన్నట్టు యుద్దాలు వాటి తేదీలు స్థలాలు రాశారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బహుజనులను వారి శ్రమను శ్రమశక్తి ను , వారి ఉత్పత్తి నైపుణ్యాలను సేవలను శరీరాలను, మానసిక వ్యవస్థను రాజులు బ్రాహ్మణులు వైశ్యులు దోపిడి చేయడం, అణిచి వేయడమే భారతీయ చరిత్రకు పునాది అని వివరించారు. ధర్మశాస్త్రాలు వీరిని స్త్రీలను అణిచి ఉంచేందుకు ఉపయోగించారని వివరించారు. హిందూ దేవుళ్లు ఆయుధాలు ధరించి మూల వాసులను ద్రావిడులను అణిచివేయడానికే అని ఫూలే, పెరియార్ రామస్వామి వివరించారు. ఆర్యులు విదేశీయులు వలసదారులు అని బలంగా వాదించి నిరూపణలుచూపారు.
ఇవి ఇలా ఉండగా వర్గ పోరాటాల చరిత్రే చరిత్ర అనే చారిత్రక భౌతిక వాద దృక్పథం చేబూనిన కమ్యూనిస్టులు లో కొందరు అందుకు భిన్నంగా ఈ దేశంలో అలా జరిగి లేదని శాంతియుత అహింసాయుత పరిణామం , వర్ణ కుల విభజన లో స్వయంగా అహింసాయుతంగా తమంతట తామే బానిసలుగా పై వర్ణాలకు సేవ చేయడానికి పూనుకున్నారని రాసారు. అలా రాసిన వారు ఏ కులస్థులో వేరే చెప్పనక్కర లేదు. తమంతట తామే అణిగి పోవడానికి నిర్మించిన తాత్విక , ధర్మం శాస్త్రాలు, " దేవుడు కర్మ , పునర్జన్మ, స్వర్గం నరకం పాతాళం , రూపకల్పనలు పాపం పుణ్యం" మనుస్మృతి, రాజుల చే దండన కలిసి ఎంతగా మానసిక వ్యవస్థలను అణిచి వేసాయో! ఇప్పటికీ ఆ బానిస భావాలను డి బయట పడక అవి చెప్పే వారినే గౌరవిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.
ఈ దేశంలో రోడ్లు రైలు మార్గాలు వేయడం లో ఎంత రక్తం చిందిందో పాములు తేళ్లు వరదలు కరువులు ఎన్ని కోట్ల మందిని కఆటఏసఆయఓ వాటి గుండా ప్రయాణించే వారికి అక్కర లేదు. వారికి అంతా శాంతియుతంగా అహింసాయుతంగా సాగినట్టు కనపడుతుంది. పీడకులు దోపిడి దారులు, ఆధిపత్యం వాదులు చర్చీలు , గుడులు , రాజులు, రాజస్థానాల ద్వారా, ధర్మ శాస్త్రాల ద్వారా సాగిందంతా అహింసాయుత గా , శాంతియుతంగా సాగిందే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానైతే వర్గ పోరాటాల చరిత్రే చరిత్ర అనే కమ్యూనిస్టులు కూడా ఆ విధంగా రాయడమే విషాదం.
అంబేద్కర్, ఫూలే ఈ దేశంలో పుట్టనట్టు
కొందరు అంబేద్కర్, ఫూలే ఈ దేశంలో పుట్టనట్టు, ఏమీ రాయనట్టు భావించి తమదైన స్వంత కుల ప్రయోజనాల పరిమితికి లోబడి చరిత్ర రచన చేస్తుంటారు. అలాంటివారిలో కొందరు హిందూ ముస్లిం మతాల పేరిట గుళ్లు దోచారనే పేరిట రాస్తారు. ఆ సంపద ప్రజలనుంచి దోచిందే అని ఎలా దోచారో అనే వివరాలు రాయరు. ఎత్తుకు పోయారు అని మాత్రమే రాస్తారు. మన ఆడవాల్లను ఎత్తుకు పోయారు అని రాస్తారు. అంతేగానికి వారికి పుట్టిన పిల్లలు మన అక్క, చెల్లి సంతానమే అని, మేనల్లులే ముస్లింలయ్యారని స్త్రీల కోణంలో రాయరు. కుల హింస అణిచివేతనుండి విడుదల కావడం కోసం , రాజుల ప్రాపకంతో కాస్త ఊరట పొందవచ్చు అని, కుల వృత్తి నుంచి మతం మార్చుకున్నా వాల్ంతా మానవుల్లో అని. రాయరు. ఇలా హింస బారి నుండి బయట పడడానికి శాంతియుతంగా మతం మార్చుకొని ముస్లింలుగా క్రైస్తవులుగా వారి సంఖ్య పెరిగింది. ఇది మాత్రం శాంతియుతంగా సాగిందని రాయరు. బౌద్జులను లక్షలాది మందిని గుప్తరాజులు మొదలు కొని 2193 లో భక్తియీర్ ఖిల్జూ దాకా రక్తం ఏరులు పారించడంతో కొందరు చైనా జపాన్ వెల్లారు. ఇది రాయరు.
చరిత్ర వక్రీకరణ
వాల్మీకి రాసినట్టు చరిత్ర రాసిన వారిలో డి డి కోశాంబి ఒకరు. ఆయన చరిత్రకారుడు కాదు. టాటా ఇనిస్టిట్యూట్ లో మ్యథమెటిక్సులో సైంటిస్టు. కె బాలగోపాల్ కూడా చరిత్ర కారుడు కాదు. ఆయన కూడా లెక్కలు ప్రొఫెసర్. అతను తెలుగులో కోశాంబి విజన్ ను ప్రాచీన చరిత్ర పేరిట పరిచయం చేశారు. కోశాంబి చరిత్ర వక్రీకరణ ద్వారా వామ పక్ష అగ్రకులాల నాయకులకు బాగా నచ్చింది. అందులో చరిత్రలో బ్రాహ్మణ వాదం చేసిన దుర్మార్గపు చరిత్ర మలుపు కనపడకుండా చేయబడింది.. కనుక తమ నేటి నాయకత్వానికి ఢోకా లేదు అనుకున్నారు. దానివల్ల వారికి నాయకత్వమైతే దక్కింది గానీ కమ్యూనిస్ట్ ఉద్యమమే ఎండిపోయి గిడసబారింది.
ప్రపంచంలో అత్యంత హింస వర్ణ వ్యవస్థ ద్వారా శతాబ్దాలుగా సాగుతున్నది. కోశాంబి చరిత్ర క పరిశీలన వక్రంగా వుందని పరిశోధకులు ఎప్పుడో చెప్పారు. ముఖ్యం గా మార్క్స్ చెప్పిన ఉత్పత్తి సంబంధాల వివరణ అనే మౌలిక అంశాన్ని అపార్థం చేసుకున్నారు. ఈ దేశంలో ఉత్పత్తి శక్తులు శూద్రులు అతిశూద్రులు ఆదివాసులు. ఉత్పత్తి సాధనాలు వారివే. సంపద పంపిణీని ఉత్పత్తి సంబంధాలనే మానవ సంబంధాలు నిర్ణయిస్తాయి. వాటిని వర్ణ వ్యవస్థ , ధర్మశాస్త్రాలుగా పిలువబడే అధర్మ శాస్త్రాలు నిర్దేశించాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు ఏ ఉత్పత్తి చేయని కస్టమర్లు. అన్ని మాకిచ్చేయాలి. మీరు చిప్ప పెట్టుకోవాలి అన్నారు. అలా వారికి సుఖ భోగాలు, కోట్లు గుడులు నగలు గుండెల్లో టన్నుల కొద్ది బంగారం దేవదాసీ, వ్యవస్థ గానీ బజానా " కళారాధన", "సౌందర్య ఆరాధన" ( వేశ్యా వ్యవస్థలు ) కొనసాగించారు.
ఆర్యుల కంటే ముందే వ్యవసాయం
వలస వచ్చినపుడు ఆర్యులు పశు పోషకులు. ఇప్పటికీ గోత్రం అనేమాట చూడవచ్చు. అది పశుపోషణ కొండ గుర్తు. వారి రాకకు పూర్వమే ఈ దేశ మూల వాసులు తల్లులు వ్యవసాయం కనుక్తున్నారు. చేస్తున్నారు.. వారినే కట్ట మైసమ్మ పోచమ్మ వంటి అమ్మ దేవతలుగా పిలుస్తున్నారు . కొలుస్తున్నారు. పీపుల్ దయాకర్ తదితరులు వివరంగా రాసారు.కోశాంబి రాతలను దేవీ ప్రసాద్ చట్టోపాధ్యాయ వంటి వారు తన లోకాయత లో విమర్శిఉంచారు.
ఉన్నదంతా ధైర్యం పేర
దోచుకొని గోచిగుడ్డ చాలు , ఈ భౌతిక సుఖాల దేముంది స్వర్గం లో అన్నీ సుఖాలే.. ఇపుడు మాకు సేవ జేస్తే అని వెనుకబడిన కులాల వారికి " గొప్ప సామ్యవాదం నూరిపోశారు. సంపద సుఖాలు వారికి చిప్ప వీరికి ! అసలు ఉత్పత్తి రంగం లో లేని ద్విజ కులాల ఉనికి వారి నిరంతర వలసలు గూర్చి కొందరు కమ్యూనిస్టు చరిత్రకారులు విస్మరించారు. కుల వర్ణ సామాజిక సంబంధాలు ఉత్పత్తి సంబంధాలను, పంపిణీని నిర్దేశించడం నుండి వర్గాలు ఆవిర్భవిస్తున్నయని, వర్గాలను కాని పెంచే తల్లి కుల వర్ణ వ్యవస్థలు అని చెప్పడానికి అగ్రకుల కమ్యూనిస్టులకు నోరు రాలేదు. ఇండియాలోని శతాబ్దాల క్రమాలను 1858 వరకు ప్రతి చారిత్రక అంశం ను మార్క్స్ రాసినా దాన్ని యీయన చూడలేదేమో! మార్క్స్ రాసిన 335 వ్యాసాలు కులాల గూర్చి మార్క్స్ చేసిన ఆర్థిక విశ్లేషణ బ్రాహ్మణుడు కాబట్టి అర్థం కాలేదేమో! మార్క్సిజం లోని పురుషాధిక్య, యూరప్ చరిత్ర అనుకూల పరిమితిని బహు జనవాదం, స్త్రీ వాదం, వెలికి తీసి దశాబ్దాలు గడిచాయి. చదవక , స్వీకరించక , కన్సర్వేటివ్ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. వేలమంది బౌద్ధ జైన్ హిందూ భిక్కుల వేట వల్ల దేశం వదిలి పరాయి దేశాలకు పారిపోవడం , మైదానాలు వదిలి అరణ్యాలకు పారిపోయిన మొదటి వాసుల భయానక దాడులుఎన్నో! ఇపుడు దేశం బ్రాహ్మణ హిందుత్వ వాదం ఏలుబడిలో కొనసాగుతున్నది.
కమ్యూనిస్టు నాయకులు, సోవియట్ యూనియన్ పార్టీ అంటరాని కులాలను పార్టీ లోకి తేవాలనే సూచన పట్టించు కోలేదు . చైనా వలె భారత్ విముక్తి కాకపోవడానికి అగ్రకులాల పరిమితులే. బ్రాహ్మణీయ వ్యవస్థను వ్యతిరేకించే విజన్ ను వర్గ పోరాటాలను చేపట్టక పోవడం వల్ల పర్యవసానంగా హిందుత్వ చేతుల్లోకి భారత్ ను చేర్చినట్లయింది. హిందుత్వ పేరుతో జరుగుతున్న హింస, బలహీన వర్గాలపై అత్యాచారాలు , ముస్లింలపై, క్రైస్తవులపై జరుగుతున్న సంఘటిత అణిచివేత, వర్ణాదిక్య కులాధిక్య ఆధిపత్యాలను స్థిరీకరించే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బానిసలుగా, రెండో శ్రేణి పౌరులుగా మార్చడం కోసమే అని శూద్రులు తెలుసుకునే నాటికి జరగాల్సిన నష్టం జరిగి పోతుంది.
పెరియార్ రామస్వామిని ఆదర్శంగా తీసుకుని సాగితే ఫలితాలు వేరుగా వుంటాయి. అందుకు తమిళనాడు ఒక ఉదాహరణ. ఇలా చేస్తే శతాబ్దాలుగా ఉన్న బ్రాహ్మణీయ రాజ్యాధికారం పోతుంది కనక దాని జోలికి పోరు. అందుకు పోరాడేవారితో ఐక్య సంఘటన కట్టరు. పైగా వారిని వ్యతిరేకించడం బలహీనపరచడం వారికి అవసరమవుతుంది.
-బీఎస్ రాములు (సామాజిక శాస్త్రవేత్త బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ తెలంగాణ రాష్ట్రం)