మోదీ బ్రెయిన్ చైల్డ్.. ఎలక్టోరల్ బాండ్ల పథకం: రాహుల్

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయాలా? వద్దా? అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-03-15 15:43 GMT

ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రధాని మోదీకి ‘బ్రెయిన్ చైల్డ్’గా అభివర్ణించారు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్‌గా పేర్కొన్నారు. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులను శివసేన, ఎన్‌సిపి వంటి పార్టీలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని ఆరోపించారు. ఇంతకంటే దేశ వ్యతిరేకం మరొకటి ఉండదని కాంగ్రెస్ నేత అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయాలా? వద్దా? కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

"రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను తెచ్చినట్లు కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి చెప్పారు. ఇది దేశంలోని కార్పొరేట్లను భయపెట్టి డబ్బును దోపిడీ చేసే మార్గం అని తేలింది. ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలుగా మారాయి. వాటి దాడులకు భయపడి కార్పొరేట్లు ఎలక్టోరల్ బాండ్లను కొనడం ప్రారంభించారు.’’ అని చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా నిష్క్రమణ గురించి అడిగిన ప్రశ్నకు, వారు వెళ్లినా మహారాష్ట్రలో పార్టీకి నష్టమేమి లేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రికార్డు మెజార్టీతో లోక్‌సభ స్థానాలను దక్కించుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News