రాహూల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు..
రాహూల్ గాంధీ ఈసారి ఎన్నికల్లో వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేయబోరని కాంగ్రెస్ ప్రకటించింది. అదే రాష్ట్రంలో కేసీ వేణుగోపాల్ సైతం పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ..
By : The Federal
Update: 2024-03-08 10:47 GMT
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహూల్ గాంధీ అమేఠీ, రాయ్ బరేలీతో పాటు ప్రస్తుత ఎంపీగా ఉన్న వయనాడ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని ఆ పార్టీ నాయకత్తం కొట్టిపారేసింది. ఆయన కేరళలోని వయనాడ్ ను వదిలిపెట్టి వేరే స్థానంలో పోటీ చేయరని తాజాగా కాంగ్రెస్ వెల్లడించింది.
ఆయనతో పాటు కేరళలోని అలప్పుజా నుంచి పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తారని తాజాగా వార్తలు వస్తున్నాయి. వేణుగోపాల్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం 2026 తో ముగుస్తుంది. అయితే మళ్లీ వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలంటే కాంగ్రెస్ కు సంఖ్యాబలం లేదు. అందుకే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని టాక్.
అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ సీఎం కరుణాకరన్ కుమార్తె, పద్మజా వేణుగోపాల్ మార్చి 7న ఢిల్లీ వెళ్లి కమలం పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి కాస్త గందరగోళంలో పడింది. ముఖ్యంగా వడకర, త్రిస్సూర్ లో అభ్యర్థులను పేర్లను ఫైనల్ చేసే క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కే మురళీ ధరన్ ను వడకర నుంచి త్రిస్సూర్ కు పంపగా, అక్కడ ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ముస్లిం ఎంపీలు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఒక్కరూ కూడా లేరు. అందుకే ఇక్కడ నుంచి సిద్దీఖీ లేదా షఫీ పరంబాలీని నియమించాలని అనుకుంటోంది. వీరిద్దరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ కూడా పదును తేలిన వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేరళలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది. అందుకోసం త్రిస్సూర్ లో సురేష్ గోపీని గెలవడానికి పద్మజా గోపాలన్ సేవలు వాడుకోవాలని చూస్తోంది. మురళీధరన్ ఓడించాలని ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ త్రిస్సూర్ కు చెందిన టీన్ ప్రతాపన్ ను తప్పా.. మిగిలిన వారందరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముస్లిం వర్గాల మద్దతు పొందడానికి షఫీ లేదా సిద్దిక్ ను దింపాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది.