క్రికెట్ అప్ డేట్: టీ 20 సిరీస్ నుంచి 'అప్గాన్ స్టార్' రషీద్ ఔట్

భారత్ తో జరగనున్న టీ20 సిరీస్ కు అప్గాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ దూరమయ్యాడు. అతడికి సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించామని కెప్టెన్ వెల్లడించారు.

Update: 2024-01-11 07:03 GMT
రషీద్ ఖాన్

భారత్ తో ఈ రోజు నుంచి మొహాలీ వేదికగా ప్రారంభంకానున్న టీ20 సిరీస్ కు తమ ట్రంప్ కార్డు రషీద్ ఖాన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియతో మాట్లాడారు. రషీద్ కు జరిగిన వెన్నెముక శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదని, అందుకే అతనికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చామని వెల్లడించారు.

రషీద్ గొప్ప ఆటగాడు, జట్టును ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటాడు, అతని లేని లోటు తీర్చడం కొంచెం కష్టమే అని మీడియా సమావేశంలో జద్రాన్ అన్నారు. అయినప్పటికీ జట్టులో అనేకమంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. చాలా రోజుల నుంచి మంచి క్రికెట్ ఆడుతున్నామని ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని అభిప్రాయపడ్డారు.

" ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరు మా దగ్గర ఉన్నారు. టీ20 ఆటకు సరిపోయే బ్యాట్స్ మెన్, ఫాస్ట్ బౌలర్లు మా సొంతం. ఇక్కడ మంచు ప్రభావం ఏమి లేదు, గత రెండు రోజుల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం" అని జద్రాన్ చెప్పారు. నా స్ట్రైక్ రేట్ ను సైతం మెరుగుపర్చుకుంటాని జద్రాన్ అన్నారు. వన్డే ఫార్మాట్ లో కేవలం యాంకర్ పాత్ర పోషించానని, ఇకముందు అలా జరగదని హమీ ఇచ్చారు.

వరల్డ్ కప్ లో అదరగొట్టిన అప్గాన్ జట్టు

గతేడాది భారత్ వేదిక గా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అప్గాన్ జట్టు అదరగొట్టింది. మొదట డిఫెండింగ్ చాంఫియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన అప్గాన్ తరువాత బలమైన పాకిస్తాన్ ను ఓడించింది. ఆస్ట్రేలియాను సైతం ఓటమి అంచుల్లో నెట్టింది. సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా పోరాడింది. ఒపెనర్ జద్రాన్ ఆ జట్టు టాప్ స్కోర్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా భారత్, అప్గాన్ పోరు అంటే అభిమానులు అలాంటి పోరాటాలను చూస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇరు జట్లు వచ్చే టీ20 వరల్డ్ కప్ కు దీనిని సన్నాహకంగా భావించే అవకాశం ఉంది. తమ బలాబలాలను సరిచూసుకోవడానికి అలాగే లోటుపాట్లను పరిశీలించుకోవడానికి ఈ సిరీస్ ను వేదిక గా చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తో పోల్చుకుంటే అప్గాన్ కాస్త బలహీనంగా ఉన్న, దానిపోరాట పటిమ ఎలా ఉంటుందో గత వన్డే ప్రపంచకప్ లో చూపించింది. కాస్త ఏమరపాటు గా ఉన్న భారత్ కు ఓటమిని రుచి చూపించేందుకు అప్గాన్ జట్టు ఎదురుచూస్తూ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. 

Tags:    

Similar News