జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు?
జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంపాయి సోరేన్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తమకు మంత్రి పదవులు దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జార్ఖండ్‌లో JMM నేతృత్వంలోని కూటమి పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ కొనసాగుతున్నారు. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 81. కాగా JMM నేతృత్వంలోని కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు (JMM-29, కాంగ్రెస్-17 మరియు ఒక RJD) ఉన్నారు.
ఇటీవల జేఎంఎంకు చెందిన నలుగురి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటులో మేం కూడా భాగస్వాములం కాబట్టి. తమకు కూడా పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చంపాయి సోరెన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరుపనున్నారు. పోర్ట్‌ఫోలియో పంపిణీపై JMM, కాంగ్రెస్ మధ్య గందరగోళంపై న్యూఢిల్లీలో మీడియా ప్రశ్నలకు "ఏ సమస్య లేదు, మా కూటమి బలంగా ఉంది" చంపాయి సోరెన్ సమాధానమిచ్చారు. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకోవడంపై అడిగిన ప్రశ్నకు.. "ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. వారే పరిష్కరిస్తారు. దాని గురించి నేను ఏమీ చెప్పలేను. జేఎంఎం,కాంగ్రెస్ మధ్య ఏ విభేదాలు లేవు. అంతా బాగానే ఉంది.’’ అని అన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కేబినెట్‌లోకి నలుగురు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు అసంతృప్తికి లోనయ్యారు. 12 మంది అసంతృప్త ఎమ్మెల్యేలలో 8 మంది శనివారం (ఫిబ్రవరి 17) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. "మేము ఢిల్లీ చేరుకున్నాం. మేము ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంతో చర్చిస్తాం.’’ అని చెప్పారు.
కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు, జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బెర్మో శాసనసభ్యుడు చెప్పారు. "జేఎంఎం ఇప్పటికే ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులను కైవసం చేసుకుంది. వారికి ఆరు మంత్రి పదవులు ఉన్నాయి, మిగిలిన ఒకటి మాకు కావాలి. మేము అందులో రాజీ పడం" అని జైమంగల్ డిమాండ్ చేశారు. ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్‌కు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులు రాంచీ హోటల్‌లో అంతకుముందు రోజు హల్‌చల్ చేశారు.
బహిష్కరణ బెదిరింపు
మంత్రి పదవులను కొత్తవారితో భర్తీ చేయకపోతే ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బెదిరించారు. రాష్ట్రంలోని 81 మంది సభ్యుల అసెంబ్లీలో JMM నేతృత్వంలోని కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు (JMM-29, కాంగ్రెస్-17 మరియు ఒక RJD) ఉన్నారు.
"JMM కొత్తవారికి మంత్రి పదవులు ఇస్తున్నపుడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వరు" అని ఖిజ్రీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ కచ్చప్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మహాగామా ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, మందార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పి నేహా టిర్కీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేల బృందం సంతకాలతో కూడిన లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అందజేసింది. ‘‘మొదట్లో ఫిబ్రవరి 8న ప్రమాణస్వీకారోత్సవం జరగాల్సి ఉండగా.. వాయిదా పడినప్పుడు పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని హామీ ఇచ్చారు.. కానీ ఎలాంటి మార్పు రాకపోవడం నిరాశ కలిగించింది. ’’ అని శిల్పి చెప్పారు.
ఎందుకు అవకాశం ఇవ్వరు..
‘‘కొత్త ముఖాలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. అందుకే ఈ తిరుగుబాటు.. ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాలని అనుకున్నాం, అయితే దీనిపై ఢిల్లీలో చర్చ జరుగుతుందని మా రాష్ట్ర ఇంచార్జి హామీ ఇచ్చారు.’’ అని మందార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పి నేహా టిర్కీ చెప్పారు. ఈ మంత్రులు గడిచిన నాలుగేళ్లలో ఏమి ఇవ్వలేదు. వారు ఇప్పుడు చేస్తారన్న నమ్మకం లేదు. అని పేర్కొన్నారు.
JMMలో అసంతృప్తి
చివరి క్షణంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కేబినెట్ నుంచి నన్ను తప్పించారు. ఇది నాకు అవమానం. నేను ఊరుకోను. అవసరమైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’’ అని అసంతృప్త JMM శాసనసభ్యుడు బైద్యనాథ్ రామ్ అన్నారు.