సుమలతను బీజేపీ ఎందుకు వదిలేసింది?

కర్ణాటక మాండ్య సిట్టింగ్ ఎంపీ సుమలతకు ఈ సారి బీజేపీ హ్యండిచ్చింది. ఇప్పుడు ఆ స్థానాన్నిపొత్తులో భాగంగా జేడీ(ఎస్) ఎగరేసుకు పోయింది. ఇప్పుడు ఆమె ఏం చేయబోతున్నారు?

Update: 2024-03-30 06:29 GMT

సినీ నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన సుమలత రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 2019లో ఆమె మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరిపోయారు. ఈ సారి కూడా తానే బరిలో ఉంటానని అనుకున్నారు. కాని అలా జరగలేదు. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ జేడీ(ఎస్)కు కేటాయించింది.

సీటు తనకే కేటాయించాలంటూ ఆమె విశ్వప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. మాండ్య స్థానం జేడీ(ఎస్)కు కేటాయించడంతో హెచ్ డీ కుమారస్వామి నుంచి బరిలో దిగుతున్నారు.

తన భవిష్యత్ కార్యాచరణపై సుమలత ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. శనివారం ఆమె తన కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమెను పార్టీ నుంచి దూరం చేసుకోకుండా సుమలతకు బీజేపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

పట్టు తప్పిందా?

సుమలత బీజేపీలో చేరేందుకు సుమలత సుముఖత వ్యక్తం చేయడంతో గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ ఆమెను ఆదేశించింది. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను ఆమెకు అప్పగించింది. అయితే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థులు గెలవలేదు. గెలిచిన వారిలో ఆరుగురు కాంగ్రెస్‌, ఒకరు కాంగ్రెస్‌ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి, ఒక జేడీ(ఎస్‌) అభ్యర్థి ఉన్నారు.

అందుకే దూరం పెట్టారా?

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోవడంపై అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆమెకు నియోజకవర్గంలో పట్టు లేదని అంచనాకు వచ్చింది. గెలిచిన తర్వాత సుమలత బీజేపీలో చేరడంతో ఆమెకు మొదట్లో మద్దతు ఇచ్చిన స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దూరంగా ఉన్నారు.

మాండ్యాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజెగౌడ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. అంబరీష్ పట్ల ఉన్న సానుభూతితో గతంలో ఆమె గెలవగలిగారని, పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు నియోజకవర్గంలో తన రాజకీయ పట్టును కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు.

కాంగ్రెస్ ఆఫర్ మిస్సయ్యిందా?

సుమలతకు బెంగళూరు నార్త్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం ఉన్నా.. మాండ్య టికెట్ విషయంలో బీజేపీ నిర్ణయం కోసం వేచిచూస్తూ కాంగ్రెస్ ఆఫర్‌ను పట్టించుకోలేదు. బీజేపీతో పొత్తుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఆమెను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లకు దూరం చేశాయి.

అనుచరులతో సమావేశం..

మాండ్యా నుంచి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం తప్ప ఆమెకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. 2019కి, ఇప్పటికి రాజకీయ రూపురేఖలు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆమె తన అనుచరులతో శనివారం (మార్చి 30) సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది.

ట్రెండ్ మారింది..

భావోద్వేగాలు రాజకీయాలను నిర్దేశించవని, ఇది పూర్తిగా భిన్నమైన ఆట అని సినీ విమర్శకుడు బిఎన్ సుబ్రహ్మణ్య ఉద్ఘాటించారు. తన భర్త అంబరీష్ మరణం తర్వాత సుమలత ఎన్నికల్లో పోటీ చేశారని, ఆమె విజయంలో సానుభూతి ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రముఖ నటుడి జన్మస్థలం కూడా మాండ్య కావడం ఆమెకు కలిసిసొచ్చిందని చెప్పారు. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఓటర్ల ఆలోచనా విధానాన్ని ఊహించలేమని సుబ్రహ్మణ్య ముగించారు.

JD(S) వ్యూహం..

గత సార్వత్రిక ఎన్నికలలో సుమలతతో కత్తులు దూసిన హెచ్‌డి కుమారస్వామి ఇప్పుడు ఆమె పట్ల మెతక వైఖరిని అవలంభిస్తున్నారు. “అంబరీష్, నేను స్నేహితులు. శత్రువులం కాదు. ఆమె నాకు మద్దతు ఇస్తుందని నమ్ముతున్నాను. ” అని కుమారస్వామి చెప్పుకొస్తున్నారు.

కుమారస్వామి ఇప్పుడు మాండ్యా నుంచి ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన కొడుకు నిఖిల్‌ని తన చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతున్నారు. ఈ ఉపఎన్నికలో పోటీకి దింపాలని ప్లాన్ చేయడం ద్వారా మాండ్యా నుంచి తన కొడుకు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

పనిచేసిన సానుభూతి..

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నుంచి ప్రత్యక్ష మద్దతుతో, కాంగ్రెస్ నుంచి పరోక్ష మద్దతుతో జెడి (ఎస్)-కాంగ్రెస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామిని ఓడించి విజయం సాధించారు. సుమలత భర్త అంబరీష్ మరణం తర్వాత సానుభూతి ఓట్లు ఆమె విజయానికి దోహదపడ్డాయి. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనం నాడీ మారింది. సుమలత తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News