రాజ్యసభకు నేడు నామినేషన్‌ వేయనున్న సోనియా..

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి బరిలో ఉండబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Update: 2024-02-14 06:17 GMT

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి బరిలో ఉండబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సోనియా గాంధీ ఈ రోజు (ఫిబ్రవరి 14) నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు జైపూర్‌ వెళ్తున్నారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం.

ఐదుసార్లు లోక్‌సభకు..

రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా కొనసాగారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1999లో తొలిసారిగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 77 ఏళ్ల సోనియా రాజ్యసభకి వెళ్లడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌లో ముగియనున్న పదవీకాలం..

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 27న ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15.

రాజస్థాన్‌లో జరగనున్న ఎన్నికలలో మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్‌ కైవసం చేసుకోవడం సునాయాసంగా కనిపిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరేళ్ల పదవీకాలం పూర్తికావడంతో ఏప్రిల్‌లో ఆ స్థానం ఖాళీ కానుంది.

గాంధీ కుటుంబం నుంచి రెండో సభ్యురాలు..

ఆగస్టు 1964 నుంచి ఫిబ్రవరి 1967 వరకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న వారిలో సోనియా రెండో సభ్యురాలు. ఇదే తనకు చివరి లోక్‌సభ ఎన్నికలని 2019లో సోనియా ప్రకటించిన విషయం తెలిసిందే.  

రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక..

సోనియా గాంధీ ఈసారి రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి తప్పుకోవడంతో ఆ స్థానం నుంచి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సోనియా గాంధీ తెలంగాణ లేదా కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కాకుండా రాజస్థాన్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అక్కడి నుంచి గెలవడం తేలిక. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి దూరం కావడం లేదన్న దానికి సంకేతం కూడా. 

సోనియాతో పాటు మరో ముగ్గురు.. 



రాజ్యసభకు సోనియాతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు.బీహార్‌ నుంచి డాక్టర్‌ అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోర్‌ పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News