చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిన తెలంగాణ

తెలంగాణలో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెర లేచింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన కుల గణన హామీ అమలు దిశగా అడుగులు వేసింది.

Update: 2024-02-16 13:41 GMT

తెలంగాణలో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెర లేచింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన కుల గణన హామీ అమలు దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం సంపాయించింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకురాగా చర్చలు, ప్రతిపక్షాల చిటపటల అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ  తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సహా పలువురు సూచనలు చేశారు. చట్టబద్ధత ఉండాలన్నారు. న్యాయ విచారణ కమిషన్‌ వేయాలని, బిల్లును సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని బీఆర్‌ఎస్‌ కోరినా అధికార పక్షం పట్టించుకోలేదు. కుల గణనపై తమకు చిత్తుశుద్ధి ఉందని, నిర్మాణాత్మక సూచనలు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినా వివరాలు బయటపెట్టలేదన్నారు. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

తీర్మానంపై చర్చలో ఎవరెవరు ఏమన్నారంటే...

ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అనేక అంశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 'కులగణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి. తీర్మానంపై ఏదైనా న్యాపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షాలకు తెలిస్తే చెప్పండి. కుల గణన వల్ల అర శాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం' అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తమ తీర్మానం చాలా స్పష్టంగా, సరళంగా, బీసీ వర్గాలకు మేలు చేసేలా ఉందని చెబుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేయలేకపోయిన పనిని కాంగ్రెస్‌ రెండు నెలల్లో పూర్తి చేసిందన్నారు రేవంత్‌. ఈ తీర్మానం బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుందన్నారు.


తెలంగాణ నుంచే మొదలు...

ఇదే తీర్మానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. బీసీ కులగ‌ణ‌న తీర్మానం ప్రవేశవేశ‌పెట్టడం దేశ చ‌రిత్రలోనే చారిత్రాత్మకమన్నారు. 'దేశ వ్యాప్తంగా కుల గ‌ణ‌న జరగాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నిక‌ల్లో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పాం. కుల‌గ‌ణ‌న తెలంగాణ నుంచి మొద‌లు పెడ‌తామ‌ని చెప్పి క్యాబినెట్‌లో చాలా కులంకుశంగా చ‌ర్చించి నేడు అసెంబ్లీలో కుల గ‌ణ‌న‌పై తీర్మానం పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కుల‌ గ‌ణ‌న తో పాటు సోష‌ల్‌, ఎకాన‌మిక్‌, ఎడ్యుకేష‌న్‌, పొల్టిక‌ల్‌, ఎంప్లాయిమెంట్ అంశాల‌పై స‌ర్వే చేస్తాం. ప్రతిపక్ష స‌భ్యులు కుల గ‌ణ‌న‌పై ఏలాంటి ఆందోళన, గంద‌ర‌గోళం కావొద్దు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పున‌కు పునాధిగా తెలంగాణ మార‌బోతుంది' అన్నారు భట్టి విక్రమార్క. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కుల గ‌ణ‌న చేయ‌లేదన్న భట్టి… ఇప్పుడు కుల గ‌ణ‌న చేయాల‌ని, ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యాక్రమానికి మ‌ద్దతు ఇవ్వకుండ ర‌న్నింగ్ కామెంట్రీ చేయ‌డం స‌రికాదని హితవు పలికారు.

చట్టం చేద్దామా...

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. కులగణనపై తీర్మానం మాత్రమే కాదు చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా… ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో… పూర్తిస్థాయిలో స్పష్టత లేదన్నారు. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదన్నారు. కులగణన చేప్పట్టిన పలు రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని…. అలాంటివి రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News