‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగేది అదే’’

కాంగ్రెస్ మేనిఫెస్టోలో "ముస్లింలీగ్ ముద్ర’’ కనిపిస్తోందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెడుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

Update: 2024-04-29 06:37 GMT

కాంగ్రెస్ మేనిఫెస్టోలో "ముస్లిం లీగ్ ముద్ర’’ కనిపిస్తోందని ప్రధాని మోడీ పదే పదే వ్యాఖ్యానించారు. దానర్థం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెట్టడమేనని ఒక ఇంటర్వూలో చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పిట్రోడా వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని కాంగ్రెస్ కొట్టిపారేసింది. కాని ఇదే అంశాన్ని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు.

ఎవరైనా బయటపెడతారని భావించా.. కానీ..

“ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోను చదవడం మీడియా చేసే పని. మీడియా ఆ పని ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూశాను. మేనిఫెస్టో విడుదల చేసిన మొదటి రోజే నేను స్పందించాను. అందులో ముస్లిం లీగ్ ముద్ర ఉందని గుర్తించాను. ఈ విషయం తెలిసి మీడియా షాక్ అవుతుందేమో అనుకున్నాను. మేనిఫెస్టోలోని ప్రతికూల విషయాలను ఎవరైనా బయటకు తెస్తారని భావించా. కాని ఎక్కడా దాని గురించి చర్చ జరగలేదు. ఇక నేనే ఈ నిజాలను బయటకు తీసుకురావలసి వచ్చింది’’ అని మోదీ చెప్పారు.

ఆ ఆలోచనే లేదు..

బీజేపీ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను విధించే ఉద్దేశం తమకు లేదని, సొంత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని ప్రధాని స్పష్టం చేశారు.‘బీజేపీ ఏం చేయాలనుకుంటున్నదో మా మేనిఫెస్టోలో రాసి ఉంది. మేం మా మేనిఫెస్టోతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం.’’ అని మోదీ పేర్కొన్నారు.

సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించడం గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. "సంపద పునర్విభజన" పేరుతో ముస్లింలకు పంచాలని చూస్తుంది. వారి ప్లాన్‌ను బయటిపెట్టి దేశాన్ని మేల్కొల్పడం తన బాధ్యత అని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News