కేంద్రం పట్టించుకోలేదు..అందుకే ‘సుప్రీం’కు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కరువు పరిస్థితుల్లో కేంద్రం సాయాన్ని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

Update: 2024-03-23 14:08 GMT

తీవ్ర కరువుతో అల్లాడుతున్నామని రాష్ట్రానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద గ్రాంట్లను వెంటనే విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

కర్ణాటక తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కేంద్ర సాయం కోరినా స్పందన లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతోంది.

‘‘ఐదు నెలల నిరీక్షణ తర్వాత ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కేంద్రంపై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో వారం రోజులు సెలవులు ఉన్నందున ఎండార్స్‌మెంట్‌ రాలేదు. వచ్చే వారం మేం ఆశిస్తున్నాం ”. అని సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఎన్‌డిఆర్ నిధులను తక్షణమే విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశామని, దీనిని చట్టం ప్రకారం కేంద్రం విడుదల చేయాలని ఆయన వివరించారు.

‘‘రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 తాలూకాలను కరువుగా ప్రకటించాం. మేము నాలుగు సార్లు మూల్యాంకనం చేసాము. 48 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. కేంద్రానికి వరుసగా మూడు మెమోరాండాలు పంపాం కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రాలేదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

గత ఏడాది అక్టోబరులో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి తనిఖీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసిటి) నివేదికను సమర్పించింది. నివేదిక అందజేసిన నెల రోజుల్లోగా రాష్ట్రానికి కేంద్రం పరిహారం ఇవ్వాల్సి ఉందని సిద్ధరామయ్య చెప్పారు.

కేంద్ర బృందం నివేదిక ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మెమోరాండంపై స్పందించకపోవడంతో కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణబైరేగౌడ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసే అవకాశం రాలేదని ఆయన అన్నారు.

“డిసెంబర్ 20న నేను, కృష్ణబైరగౌడ మళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అభ్యర్థించాం. అయినా మాకు పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీని నేనే స్వయంగా కలిశాను. అయినా పరిష్కారం దొరకలేదు’’ అని సిద్ధరామయ్య చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నుంచి రూ.650 కోట్లు విడుదల చేసిందని, 33.44 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

Tags:    

Similar News