అలాగయితే ‘‘ప్రత్యేక దేశం’’ కోరాల్సి వస్తుంది : కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌

కర్ణాటక నుంచి వసూలు చేస్తున్న పన్నులను ఉత్తరాది రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు బెంగుళూరు రూరల్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌.

Update: 2024-02-02 07:40 GMT

కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ బీజేపీపై ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నులను ఉత్తర భారతదేశానికి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలు మరో దేశం కోరే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. హిందీని దక్షిణ భారతదేశంపై కేంద్రం బలవంతంగా రుద్దారని చూస్తోందన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సురేశ్‌ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘జిఎస్‌టి, కస్టమ్స్‌, ప్రత్యక్ష పన్నులలో మన వాటా మన రాష్ట్రం నుంచి పొందాలి. దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది. మన డబ్బు ఉత్తర భారతదేశానికి ఎక్కువగా ఇవ్వడాన్ని మేం గమనించాం. ఈరోజు దీన్ని ఖండిరచకపోతే, రాబోయే రోజుల్లో ప్రత్యేక దేశం (దక్షిణాది కోసం) కోసం డిమాండ్‌ చేయాల్సి వస్తుంది’’ అని సురేష్‌ అన్నారు.

‘‘కర్ణాటక నుంచి కేంద్రం రూ.4 లక్షల కోట్లకు పైగా పన్నులు వసూలు చేస్తోంది. దానికి ప్రతిఫలంగా మనకు ఎంత వస్తోంది? దీనిని మనం ప్రశ్నించాలి. 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు తమ గళాన్ని వినిపించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంపై కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తూ.. వ్యాపార సంస్థలు, సంస్థల సైన్‌ బోర్డుల్లో 60 శాతం కన్నడ భాషను తప్పనిసరిగా వినియోగించాలనే ఆర్డినెన్స్‌ను కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ తిరస్కరించారని పేర్కొన్నారు.

సురేశ్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం శివకుమార్‌ స్పందించారు. తన సోదరుడు ప్రజాభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశాడని, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడని సమర్ధించారు.

అన్యాయం జరిగితే తమ డిమాండ్లను కేంద్రానికి తెలపవచ్చు. ఒత్తిడి కూడా తీసుకురావచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.‘‘పన్నుల పంపిణీలో అన్యాయం జరిగింది. పన్నుల విభజన సక్రమంగా జరగడం లేదు. 14వ ఆర్థిక సంఘం నుంచి 15వ ఆర్థిక సంఘం వరకు పన్నుల కేటాయింపులో 1.07 శాతం తగ్గుదల ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే ఇది జరిగింది’’ అని సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘‘పన్ను వసూళ్లలో దేశంలో మహారాష్ట్ర తర్వాత మన (కర్ణాటక) నంబర్‌ 2. అయినా మాకు అన్యాయం జరుగుతోంది’’ అని అన్నారు.

Tags:    

Similar News