స్పేస్ సెక్టార్ లో కొత్త పాలసీ వల్ల ఏయే మార్పులు వస్తాయి?

అంతరిక్ష రంగంలో పలు కీలక ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం పచ్చజెండా ఊపింది. ఇక నుంచి ఎఫ్ డీఐ ల కోసం అంతరిక్ష రంగాన్ని మూడు భాగాలుగా విభజించింది.

Update: 2024-02-22 07:21 GMT

విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ కంపెనీలను స్పేస్ రంగంలోకి ఆకర్షించడానికి ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పలు సంస్కరణలను ప్రతిపాదించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారికి ప్రకటన ప్రకారం ఉపగ్రహ రంగం ప్రధానంగా మూడు విభాగాలుగా విభజిస్తారు. ప్రతి రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులు నిర్ణయించబడ్డాయి.

ఆటోమేటిక్ రూట్ 74 శాతం ..

దీనిప్రకారం ఆటోమేటిక్ రూట్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు 74 శాతం వరకూ అనుమతి ఉంటుంది. ఈ రంగంలో ఉపగ్రహాల తయారీ, నిర్వహణ, ఉపగ్రహ డేటా ఉత్పత్తులు, గ్రౌండ్ సెగ్మెంట్, వినియోగదారుల విభాగానికి వర్తిస్తాయి. అయితే ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి.

ఆటోమేటిక్ రూట్ 49 శాతం 

ఇది ప్రయోగ వాహనాలు, అనుబంధిత వ్యవస్థలు లేదా ఉప వ్యవస్థలు, అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించడానికి, వాటిని స్వీకరించడానికి స్పేస్ పోర్ట్ ల సృష్టికి ఇది వర్తిస్తుంది. 49 శాతానికి మించితే ఇవన్నీ కూడా ప్రభుత్వ మార్గం దర్శకత్వంలోనే జరుగుతాయి.

ఆటోమేటిక్ రూట్ 100 శాతం

ఉపగ్రహాలు, గ్రౌండ్ స్టేషన్ సెగ్మంట్, వినియోగదారుల సెగ్మంట్ కోసం కొన్ని విడిభాగాల తయారీ, సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ తయారీకి ఇది వర్తిస్తుంది.

ప్రస్తుత ఎఫ్ డీ ఐ విధానాలు ఎలా ఉన్నాయంటే

ప్రస్తుత విధానాల ప్రకారం ప్రభుత్వం అనుమతిస్తేనే ఉపగ్రహాల తయారీ, నిర్వహణలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కింద ఉన్న దాని లక్ష్యాలు, వ్యూహానికి అనుగుణంగా కేంద్ర కేబినేట్ వివిధ కార్యకలాపాల కోసం ఎఫ్ డీఐ లను అనుమతించేది. ప్రస్తుతం వీటిని సడలించారు.

ఇక ఈ నిర్ణయంతో అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్ లోకి చేరే అవకాశం ఉండడమే కాకుండా సరైన పోటీ ఇవ్వగలవు.

మంత్రిమండలి తాజా సడలింపులతో అంతరిక్ష రంగంలోకి ప్రవేశించాలనుకునే వాటికి ఓ మార్గం సూచించినట్లు అయింది. ఉపగ్రహాలు, ప్రయోగవాహనాలు, ఇతర అనుబంధ వ్యవస్థలలో విదేశీ పెట్టుబడులు రావడానికి అవసరమైన స్పష్టత అందించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.

మెరుగైన అంతరిక్ష రంగం పాలసీల వల్ల దేశ సామర్థ్యం పెరగడమే కాకుండా, గరిష్ట వాణిజ్య ప్రయోజనాలన్ని పొందడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాపార సౌలభ్యం పెరగడం, ఎఫ్ డీ ఐ ల ప్రవాహ వేగాన్ని పెంచి తద్వారా పెట్టుబడి ఆదాయం పెరుగుతుందని, అది ఉపాధి సృష్టికి దోహదపడుతుందని ప్రభుత్వం అంచనా. అలాగే కంపెనీలు ఇక్కడే స్థాపించడం జరిగితే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని ప్రభుత్వం ఆశ.

Tags:    

Similar News