ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేత రణ్‌దీప్

ఎంపీ, నటి హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Update: 2024-04-04 12:56 GMT

ఎంపీ, నటి హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అధికార పార్టీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. మోదీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలు, భారత రాజ్యాంగానికి హాని కలిగించే ప్రయత్నాల నుంచి ప్రజలను మళ్లించేందుకు బీజేపీ ఐటీ సెల్ ఎడిట్ చేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని సూర్జేవాలా మండిపడ్డారు.

హేమామాలిని పట్ల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి ఆమెకు మాత్రమే కాకుండా మొత్తం మహిళలను అగౌరవపరిచేలా ఉన్నాయని బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా పేర్కొన్నారు. నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనాటే సోషల్‌మీడియా పోస్టు గురించి కూడా మాల్వియా ప్రస్తావించారు.

తన ప్రసంగం మొత్తం వీడియోను పంచుకున్న సూర్జేవాలా తాను హేమమాలినిని అవమానించలేదని స్పష్టం చేశారు. నటుడు ధర్మేంద్రను వివాహం చేసుకున్నందున ఆమె "మా కోడలు" అని పేర్కొన్నారు. వీడియోలోని కొన్ని భాగాలను మాత్రమే వైరల్ చేసిందని చెప్పుకొచ్చారు.

హిమాచల్ ప్రదేశ్‌లో '50 కోట్ల రూపాయల విలువైన ప్రియురాలు' అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు? పార్లమెంట్‌లో మహిళా ఎంపీని ‘శూర్పణఖ’ అని ఎందుకు పిలిచారు? ఓ మహిళా సీఎంను ఇంత అసభ్యంగా ఎందుకు ట్రోల్ చేశారు? కాంగ్రెస్‌ అగ్రనేతలను 'జెర్సీ ఆవు'గా అభివర్ణించడం ఆమోదయోగ్యమా అని సూర్జేవాలా ప్రశ్నించారు.

తనతో పాటు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, బిజెపి నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్‌తో సహా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో జవాబుదారీగా ఉండాలని కోరుకునేవాడినని పేర్కొన్నారు.

’’వ్యక్తుల విజయం లేదా వైఫల్యం వారి పనిని బట్టి ఉంటుంది. హేమమాలినిని కించపరచాలని గాని, ఎవరినీ బాధపెట్టాలని గాని నేను అనుకోలేదు. అందుకే హేమమాలినిని మేము గౌరవిస్తాం. ఆమె మా కోడలు అని స్పష్టంగా చెప్పాను'' అని అన్నారు.

బీజేపీ మహిళలకు వ్యతిరేకమని, ప్రతి విషయాన్ని ప్రతికూల కోణంలోనే చూస్తోందని, తమ స్వలాభం కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత అన్నారు.

మాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుండి బిజెపి లోక్‌సభ సభ్యురాలు మరియు 2024 సార్వత్రిక ఎన్నికలలో అక్కడి నుండి పోటీ చేస్తున్నారు. ఈ వివాదంపై ఆమె ఇంకా స్పందించలేదు.

Tags:    

Similar News