’’భారతరత్న‘‘ మా నాయకులకు ఎప్పుడు ప్రకటిస్తారు?

భారతరత్న పురస్కారానికి తమ నేతల పేర్లును కూడా ప్రకటించాలన్న డిమాండ్‌ మొదలైంది. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా కొందరు నాయకులు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.

Update: 2024-02-10 03:30 GMT

శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌ హిందుత్వ నేత, స్వాతంత్ర సమరయోధుడు వీడీ సవార్కర్‌కు అలాగే శివసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌థాకరేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సవార్కర్‌ను మరిచారు..

‘‘ప్రధాని మోదీ ఇటీవల బీజేపీ రాజకీయ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. శుక్రవారం ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాని సవార్కర్‌, బాల్‌థాకరే పేర్లు మరిచిపోయారు’’ అని రాజ్యసభ ఎంపీ రౌత్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

1999లో గరిష్టంగా నాలుగు భారతరత్న పురస్కారాలను ప్రకటించగా ఈ ఏడాది ఒకటి అదనంగా ప్రకటించారని రౌత్‌ పేర్కొన్నారు.

కాన్షీరాంకు ఇవ్వాలి: మాయవతి

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నేత మాయవతి కూడా కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

‘‘బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రముఖులకు భారతరత్న పురస్కారాలను ప్రకటించడం మాకూ సంతోషమే. కాని దళితుల కోసం కృషిచేసిన నాయకులను మరువడం తగదు. కాన్షీరాంకు కూడా భారతరత్న ప్రకటించాలి’’ అని ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా మోదీని కోరారు. చాలా కాలం తర్వాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Tags:    

Similar News