కర్ణాటక ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల ఎప్పుడంటే..
కర్ణాటక ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తెలిపారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల జాబితాను దశల వారీగా విడుదల చేస్తున్నాయి.16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మార్చి 2న విడుదల చేసింది. కర్ణాటక విషయానికొస్తే.. రెండో జాబితా బుధవారం ఖరారు చేస్తారని అంటున్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప.
తాను బుధవారం (మార్చి 6) దేశ రాజధానికి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. “బుధవారం ఢిల్లీలో మీటింగ్ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా ఖరారు కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ వెళ్తున్నాను. జాబితాపై జాతీయ నేతలు తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని చెప్పారు.
అభ్యర్థుల రెండో జాబితాలో కర్ణాటకలోని మొత్తం 28 నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయా? అని అడిగిన ప్రశ్నకు యడియూరప్ప మాట్లాడుతూ.. ‘‘అన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటకలో కొందరు కొత్త ముఖాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే జాతీయ నేతల మదిలో ఏముందో నాకు తెలియదు. ఢిల్లీలోని ఆగ్రనేతలదే తుది నిర్ణయం’’ అని చెప్పారు.
కర్ణాటకలో ఎన్‌డిఎ భాగస్వామ్య జెడి(ఎస్)కి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న దానిపై యడ్యూరప్ప క్లారిటీ ఇవ్వలేదు.