బెంగాల్ రాజ్ భవన్ పై లైంగిక వేధింపుల మరక

పశ్చిమ బెంగాల్ గవర్నర్‍ను లైంగిక వేధిపులు చుట్టుముట్టాయి. గవర్నర్ బంగళాలో పనిచేసే ఓ ఉద్యోగి తనను గవర్నర్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది.

Update: 2024-05-03 08:29 GMT

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఖండించారు. కట్టుకథలకు తాను భయపడబోనని చెప్పారు. రాజ్ భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు చేశారు.

“సత్యమే గెలుస్తుంది. నేను బెదిరింపులకు భయపడను. ఎవరైనా నన్ను కించపరచాలను చూస్తే.. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు' అని గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

స్పందించిన పోలీసులు..

వేధింపులకు గురైన మహిళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని సోషల్ మీడియాలో టీఎంసీ నేతలు పోస్టులు పెట్టడంతో పోలీసులు స్పందించారు. ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

"మేము ఫిర్యాదు స్వీకరించాం. దర్యాప్తు మొదలుపెట్టాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గవర్నర్ కావడంతో ఆయనపై చర్య తీసుకునే ముందు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం.’’ అని సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ విలేకరులతో అన్నారు.

‘‘గవర్నర్ తనను వేధించారని ఆయన బంగాళాలో పనిచేసే ఉద్యోగి ఆరోపిస్తోంది. ఇది దురదృష్టకరం. నరేంద్రమోదీ కోల్ కతాలో పర్యటించబోతున్నారు. గవర్నర్ బంగళాలో స్టే చేయబోతున్నారు. బాధితురాలిని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.’’ అని TMC రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్ లో పోస్టు చేశారు.

గవర్నర్ పదవికి అవమానకరం..

పశ్చిమ బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ.. గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడం సిగ్గు చేటని, ఈ ఘటన గవర్నర్ పదవికి అవమానకరమని పేర్కొన్నారు.

‘‘బాధితురాలికి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని ఆశచూపాడు. మహిళల హక్కులు, నారీ శక్తి గురించి మాట్లాడటానికి సందేశ్‌ఖాలీ వచ్చిన ఇదే గవర్నర్ ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించడం సిగ్గు చేటు. రేపు బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. ఆయన ఈ ఘటనపై నోరు విప్పాలి’’ అని మంత్రి డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు, పాలక TMC ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు లేవు. నవంబర్ 2022లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే పద్దతి కొనసాగుతోంది. పరువు నష్టం, మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రవేశాన్ని కూడా గవర్నర్ నిషేధించారు. మంత్రి పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొననని గవర్నర్ తన కార్యాలయానికి ఆదేశించారు.

దీని టిఎంసి కుట్రగా భావిస్తున్నారు బీజేపీ నేతలు. "SSC స్కామ్ విషయంలో TMC కూరుకుపోయి ఊపిరి పీల్చుకుంటోందని మనందరికీ తెలుసు. కాబట్టి ఇది TMC చేసిన కుట్రనా లేదా దానిలో ఏదైనా నిజం ఉందా అనేది చూడాలి" అని BJP నాయకుడు సువేందు అధికారి అన్నారు.

Tags:    

Similar News