కేరళ రుణ పరిమితి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏమంది?
తమ రుణపరిమితి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వడానికి..
By : Rajeev Ramachandran
Update: 2024-04-03 06:34 GMT
రుణ పరిమితులపై కేంద్రంతో న్యాయపరమైన పోరాటానికి దిగిన కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు షాక్ అనే చెప్పాలి. గత ఏడాది రుణాలు తీసుకునే పరిమితిని కేరళ ప్రభుత్వం దాటిందని, అందువల్ల ఈ ఏడు రుణాల పరిమితిని తగ్గించాల్సి వచ్చిందేనే కేంద్రం వాదనలకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్ పలు సందేహాలను లెవనెత్తుతూ దీనిని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సిన విషయం అని కూడా వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ సమస్య
“రాజ్యాంగంలోని అధికరణ 293 ను ఇంతవరకు న్యాయస్థానాల ద్వారా విచారింపబడలేదు. అలాగే ఎలాంటి అధికారిక వివరణ కూడా తీసుకోలేదు. పైన పేర్కొన్న అంశాల ప్రకారం రాజ్యాంగంలోని అధికరణ 145(3) పరిధిలోకి వస్తాయి కావునా.. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను సూచించడం ఉత్తమని మేము భావిస్తున్నాం” అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తమకు రుణాలు తీసుకోవడానికి మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వాలని, లేకపోతే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేరళ వాదించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఇలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం భవిష్యత్ లో ముంచుకు వస్తుందని న్యాయమూర్తులకు వివరించింది.
రాష్ట్ర రుణాల 'స్పిల్-ఓవర్ ఎఫెక్ట్స్'
రాష్ట్రం అదనపు రుణాలు తీసుకోవడం వల్ల స్పిల్-ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటాయని, మార్కెట్‌లో రుణాల పై వడ్డీ పెరగవచ్చని కేంద్రం వాదించింది. ఇది ప్రైవేట్ పెట్టుబడిదారులు తీసుకునే రుణాలను అధిగమించవచ్చని కేంద్రం కోర్టు ముందు పెట్టింది. ఇది మార్కెట్‌లోని వస్తువులు, సేవల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, బహుశా ప్రతి పౌరుడి ఆర్థిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని కేంద్ర ప్రభుత్వపు వాదనగా ఉంది.
కేంద్రం రుణ పరిమితి విధించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిమితి తన బడ్జెట్ కార్యకలాపాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, అంతేకాకుండా, ఇది ఆర్థిక సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించిందని వాదించింది.
కేంద్రం ఒప్పందం
కేంద్ర ప్రభుత్వం దేశం వెలుపల నుంచి డబ్బు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇస్తుంది కాబట్టి, రాష్ట్రాల రుణాలు అంతర్జాతీయ మార్కెట్‌లో దేశం క్రెడిట్ యోగ్యతతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వాలచే ఇటువంటి రుణాలు నియంత్రించబడకపోతే, అది మొత్తం దేశం యొక్క స్థూల-ఆర్థిక వృద్ధి స్థిరత్వానికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం వాదించింది. మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వకూడదని నివేదించింది.
సుప్రీంకోర్టు అంచనా
ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు “ మధ్యంతర ఉత్తర్వూలు ఇచ్చి వాటిని తరువాత కొట్టివేస్తే ఆలోగా జరిగే అనర్థాలను తరువాత సరిదిద్దలేమని అనిపిస్తోంది. ఇది దేశంపై తీవ్రంగా ప్రభావం చూపే అంశంగా మారవచ్చు ” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
లాభ నష్టాలు
“యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం, కేరళ అధిక అప్పులు చేసి ఇబ్బంది పడుతోంది. ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదు. సరైన నియమాలు పాటిస్తే బాగుంటుందంది, మొత్తం ఆదాయానికి ఖర్చుకు సంబంధం లేకుండా నిర్వహణ ఉంది. దేశాన్ని బాగు చేయడానికి రాష్ట్రాలపై ఆర్థిక నియంత్రణ విధించినట్లు పేర్కొంది. ఒకవేళ పరిమితి విధించకపోతే ఆదాయం, అప్పుల మధ్య అంతరం కుదరక అదో విషవలయంలోకి దారి తీస్తుందని హెచ్చరించింది. అయితే ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.
కేంద్రం అభిప్రాయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
కేంద్రం వాదనకు అనుగుణంగా, "రాష్ట్రం తన ఆర్థిక దుర్వినియోగం కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది, అటువంటి కష్టాలను కోలుకోలేని గాయంగా పరిగణించలేము, కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి మధ్యంతర ఉపశమనం అవసరం లేదు" అని సుప్రీం కోర్టు పేర్కొంది. "ఇటువంటి సందర్భాలలో మేము మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తే, అది రాష్ట్రాలు ఆర్థిక విధానాలను ఉల్లంఘించడానికి, అదనపు రుణాలను విజయవంతంగా క్లెయిమ్ చేయడానికి అనుమతించినట్లు అవుతుంది. ఇది ఒక చెడు సాంప్రదాయానికి నాంది అవుతుంది" అని అది పేర్కొంది.
రాజకీయ పరిణామాలు
రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం ఇవ్వకూడదని సుప్రీం కోర్టు నిర్ణయం కేరళ ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ప్రతిపక్షానికి ఆయుధంగా కూడా మారవచ్చు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.