ఎన్నికలపుడు దేశం విడిచి వెళ్లిన దేవేగౌడ మనవడు

హసన్ పార్లమెంటేరియన్ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన దేశం వీడారు.

Update: 2024-04-28 12:38 GMT

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కర్ణాటకలో దుమారం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజ్వల్‌కు సంబంధించినట్టుగా చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం (ఏప్రిల్ 27) రాత్రి ప్రకటించారు.

సిద్ధరామయ్య X లో ఇలా పోస్ట్ చేశారు.. "ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో క్లిప్‌పై విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళలపై లైంగిక హింసకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సిట్ విచారణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.


లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సెక్స్ స్కాండల్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నటీమణులు, సాధారణ గృహిణులు, ఇతరులపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.

ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ..

ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఎల్టీఈ జి పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయాస్ పటేల్‌తో పోటీపడుతున్నారు.

రేవణ్ణ తన అధికార బలంతో మహిళలను బెదిరించి, ప్రలోభపెట్టి వారితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తానే రికార్డ్ చేసిన పోర్న్ వీడియోలు ఏడాది క్రితం ఒకరి చేతిలో పడ్డాయని కొందరంటున్నారు. కర్ణాటకలో మొదటి దశ ఎన్నికలకు ముందు హాసన్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఈ వీడియోలు బాగా వైరలయ్యాయి.

మహిళా కమిషన్ జోక్యం..

మహిళల గౌరవం, జీవితాలను సంబంధించిన అంశం కావడం, మహిళా సంఘాల ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని సిద్ధరామయ్య, డీజీపీకి లేఖ రాసింది. ప్రజ్వల్ బాధితురాలిగా చెప్పుకుంటున్న ఒక మహిళ అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టాలని మహిళా కమిషన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు లేఖ రాసింది.

ఎన్నికల విధుల్లో బీజీ..

మహిళా కమిషన్ రాసిన లేఖపై హాసన్ జిల్లా ఎస్పీ సుజిత మహ్మద్ స్పందించారు. లేఖ తమకు అందిందని అంగీకరించారు. ప్రస్తుతం ఎన్నికల డ్యూటీలో బిజీగా ఉన్నందున, సోమవారం ఆ విషయంపై దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు.

భగ్గుమంటున్న మహిళా సంఘాలు..

ఇదిలావుండగా శుక్రవారం హాసన్‌ నియోజకవర్గానికి ఓటింగ్‌ ముగిసిన తర్వాత శనివారం ఉదయం ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పారిపోయారని సమాచారం. రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోవడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం జాప్యం చేయడంతోనే నిందితుడు తప్పించుకున్నాడు అని యునైటెడ్ జనవాది ఉమెన్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన కెఎస్ విమల ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. సిట్ దర్యాప్తుతో తాము సంతోషంగా లేమన్నారు. నిందితుడి తండ్రికి ముఖ్యమంత్రి సన్నిహితుడని, ఈ కేసులో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.

“మేం న్యాయ విచారణను డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. సిట్‌ దర్యాప్తు కంటితుడుపు చర్యేనన్న అనుమానం కలుగుతోంది. అలాగే నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ విచారణపై మాకు నమ్మకం లేదు’’ అని విమల పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. రెండు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్) అధ్యక్షుడు రవికృష్ణారెడ్డి హాసన్, హోలెనర్సీపూర్‌లో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సున్నితమైన కేసును పోలీసు శాఖ సుమోటోగా స్వీకరించి దర్యాప్తు మొదలుపెట్టాలని కోరారు.

“ ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కూడా స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజ్వల్ పార్లమెంటేరియన్ కావడంతో ఆయన వెంట పోలీసు ఎస్కార్ట్‌ ఉంటుంది. ప్రజ్వల్‌పై అభియోగం వచ్చినపుడు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదు. అతను తప్పించుకోవడానికి పోలీసు అధికారులు సహకరించారా? అన్న అనుమానం కలుగుతోంది’’ అని అన్నారు రవికృష్ణారెడ్డి.

"ఇలాంటి కేసులో అతని పేరు ప్రస్తావించిన క్షణం నుండి పోలీసు శాఖ ప్రజ్వల్ కదలికలపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా, హసన్ ఎస్పీ నిశితంగా గమనించాలి. కానీ అలా జరగలేదు. సులభంగా ప్రజ్వల్ దేశం వీడాడు. ప్రభుత్వం, పోలీసు శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.’’ అన్నారు.

Tags:    

Similar News