కోమటిరెడ్డికి ఆంధ్ర మీద అంత ప్రేమ ఎందుకు?

Update: 2023-12-12 07:53 GMT
ఢిల్లీలో మీడియాతో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అన్యాయం అంటున్న  తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కోరడం ఆశ్చర్యం. ఈ రోజు ఆయన ఢిల్లీ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాఅనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అని దానిని విస్మరించడం సరికాదని అన్నారు. నిజానికి చాలా తెలివిగా విసిరిన భాణం లాగా కనబడుతుంది.

“2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆదుకునేందుకు ఇచ్చిన హామీ. ఇది పార్లమెంటులో చేసిన ప్రత్యేక హామీ. దీనిని అమలు చేయకపోవడం బాధకరం,”అని కోమటిరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి అనుకోని చేసిన అనుకోకుండా చేసిన చాలా తెలివైన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను పునరుద్ధరిచేందుకు తప్పకుండా ఉపయోగపడే నినాదం ఎందుకంటే,అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్షం లోఉన్న తెలుగుదేశం పార్టీ ఈ డిమాండ్ చేసే అవకాశం లేదు. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని ఏ విధంగా నొప్పించేందుకు సాహసించవు. అందుకే రెండు పార్టీలు అయిదేళ్లుగా ఈ డిమాండ్ ను ప్రస్తావించడమే లేదు.

ఇలాంటపుడు తెలంగాణ మంత్రి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడం రాజకీయంగా లబ్ధి చేకూర్చే విషయమే. ఈ డిమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఎంతగొడవయినా చేయవచ్చు. ఎన్ని ఉద్యమాలైనాచేయవచ్చు. జనసమీకరణ చేయవచ్చు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమే కాని, నష్టమేమీ ఉండదు.

దానికితోడు వైఎస్ ఆర్ కూతురు షర్మిలను ఆంధ్ర కాంగ్రెస్ ను నడిపించేందుకు పంపిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఆమె రాజకీయాల్లో కొనసాగాలంటే ఇక ఆంధ్రప్రదేశే మార్గం. ఆమెకు తెలంగాణలో ఒక చోటు లేదు. ఆమె రాజకీయాల్లోకి వస్తే జగన్ నొప్పించకుండా కాంగ్రెస్ పునరుద్ధరణకు పూనుకునేందుకు పనికొచ్చే డిమాండ్ ఇది. రాష్ట్రంలో ఉన్న పార్టీలను విమర్శించకుండా కాంగ్రెస్ ప్రచారం చేసేందుకు ప్రత్యేక హోదా, విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ నినాదాలు బాగా పనికొస్తాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్రంతో లాలూచిపడ్డాయని ఒక రాయి వేసి ఈ రెండు డిమాండ్లతో కేంద్రాన్ని విమర్శించి కాంగ్రెస్ కు కొంత మద్దతు లభించేలా చేయవచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్ బలపడేందుకు కర్నాటక కాంగ్రెస్ ఎలాకృషి చేసిందో, ఆంధ్రాలో కాంగ్రెస్ పునర్జీవం పొందేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తారనే టాక్ కూడా ఉంది. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ ప్రచారాని బాగా పనికొస్తాయి.

Tags:    

Similar News