సిగాచీ పేలుడుపై హైకోర్టులో పిల్..

పరిశ్రమ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరిన పిటిషన్‌దారు డాక్టర్ బాబూరావు.;

Update: 2025-08-04 12:02 GMT

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పాశ మైలారం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ 30 న సిగాచీ ఫార్మా కంపనీలో జరిగిన పేలుడు ప్రమాదంపై జూన్ 17 న నిజ నిర్ధారణ చేసిన తెలంగాణ పౌర సమాజం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రం ఇచ్చింది. ప్రభుత్వం నుండీ తగిన స్పందన లేకపోవడంతో, మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేసింది.

ఈ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యంతో పేలుడు ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతూ, ఇందుకు అనుగుణంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని పౌర సమాజం పక్షాన పర్యావరణ వేత్త , సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ నాయకులు డాక్టర్ కలపాల బాబూరావు ఈ కేసులో పిటిషన్ దారుగా రాష్ట్ర హైకోర్టును కోరారు. ప్రజా న్యాయవాది వసుధా నాగరాజు ఈ కేసులో బాధితుల పక్షాన వాదిస్తున్నారు.

డాక్టర్ కలపాల బాబూరావు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో పర్యావరణ న్యాయం కోసం గట్టిగా పోరాడుతున్నారు. 100 కంటే ఎక్కువ EIA నివేదికలను విమర్శనాత్మకంగా పరిశీలించి, వ్యవస్థాగత వైఫల్యాలను బయట పెట్టారు. LG పాలిమర్స్ స్టైరీన్ లీక్ ఘటన విశ్లేషణలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. మానవ హక్కుల వేదిక, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తదితర పౌర సంస్థలలో ఆయన భాగస్వామిగా ఉంటూనే, ప్రజానుకూల శాస్త్రవేత్తలతో "సైంటిస్ట్స్ ఫర్ పీపుల్" అనే గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

జులై 17 న డాక్టర్ బాబూరావు నేతృత్వంలో TPJAC, NAPM, APCR ప్రతినిధి బృందం పేలుడు జరిగిన సిగాచీ ఫ్యాక్టరీని సందర్శించి, గాయపడిన కార్మికులు, మరణించిన కార్మికుల కుటుంబాల సభ్యులతో వివరంగా మాట్లాడింది. ఆ ప్రాంత జర్నలిస్టులు వివిధ వార్తా పత్రికలలో రాసిన , చానల్స్ లో ప్రసారం చేసిన నివేదికలను స్వయంగా పరిశీలించింది. .

క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం 30-06-2025 న ఉదయం 9:20 గంటలకు సిగాచి ఫ్యాక్టరీలో వరుసగా రెండు శక్తివంతమైన విస్ఫోటనాలు సంభవించాయి. ఈ విస్ఫోటనం ఫ్యాక్టరీ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా వినిపించేంత తీవ్రంగా ఉంది. బహుళ అంతస్తుల భవనం పేలుడు కారణంగా కూలిపోయి, డజన్ల కొద్దీ కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొంతమంది కార్మికులు శిథిలాల కింద నలిగిపోగా, మరికొందరు పేలుడు వల్ల సంభవించిన అగ్నిలో కాలిపోయారు.

ఆ రోజు మధ్యాహ్నానికి స్థానిక మీడియాలో విస్ఫోటనం, ఫ్యాక్టరీలో ప్రాణ నష్టం గురించి వార్తా నివేదికలు ప్రసారమయ్యాయి. ఈ పేలుడులో తన తండ్రిని కోల్పోయిన యశ్వంత్ అనే వ్యక్తి తన ఫిర్యాదులో, ఫ్యాక్టరీ లోని యంత్రాలు దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయని, రక్షణ చర్యలు అసలు లేవని, ఈ విషయాలపై కార్మికులు తరచూ ఫిర్యాదు చేసేవారని పేర్కొన్నాడు.

ఈ ఘటన కు కారణమైన కంపెనీ మేనేజ్‌మెంట్‌పై BNS సెక్షన్ 105, 110, 117 కింద భానూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నం. 184/2025 నమోదయింది.ఉదయం 11:40 గంటలకు నమోదైన ఈ FIR లో, అప్పటికే 13 మంది మరణించారని, 30-35 మంది కార్మికులు తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్నారని నమోదు చేశారు.

అనేక శరీరాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని కూడా FIRలో పేర్కొన్నారు. గాయపడిన, మరణించిన కార్మికులను పటాన్‌ చెరు ఏరియా హాస్పిటల్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించారు. మీడియా నివేదికల ప్రకారం, మరణించిన కార్మికుల కుటుంబాలు వారి శరీరాలను గుర్తించ లేకపోయాయి, ఎక్కువగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉండడమే ఇందుకు కారణం. శిథిలాలలో కనిపించిన మాంసం భాగాలతో DNA సరిపోల్చడానికి కార్మికుల కుటుంబ సభ్యులు తమ రక్త నమూనాలను ఇవ్వవలసి వచ్చింది. కార్మికుల శరీరాలు ఎంతగా నాశన మయ్యా యంటే, బాధిత కుటుంబాలు చాలా సందర్భాల్లో కేవలం శరీర భాగాల సంచి మాత్రమే పొందాయి.

వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్రం, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్,స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం డిపార్ట్‌మెంట్,స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్, చైర్‌పర్సన్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కమిషనర్ ఆఫ్ లేబర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సంగారెడ్డి జిల్లా,మేనేజింగ్ డైరెక్టర్ & CEO, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసి , మూడు వారాలలో జవాబు ఇవ్వాలని ఆదేశించింది.

సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1989 లో స్థాపించబడిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది దేశ వ్యాప్తంగా మూడు తయారీ యూనిట్లను కలిగి ఉంది. ఒక యూనిట్ హైదరాబాద్‌లో ఉండగా, మిగిలిన రెండు గుజరాత్‌ లో ఉన్నాయి. ఈ కంపెనీ మైక్రోక్రిస్టలైన్ సెల్యులోస్ (MCC)ని తయారు చేస్తుంది, దీనిని కలప గుజ్జు నుండి సంగ్రహిస్తారు. ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్, ఆహారం, పోషకాహార పరిశ్రమలలో ఎమల్సిఫైయర్, టెక్స్చరైజర్ మరియు బల్కింగ్ ఏజెంట్‌గా దీనిని ఉపయోగిస్తారు. ఈ కంపెనీ MCC తయారు చేసే ముఖ్యమైన సంస్థలలో ఒకటిగా పరిగణించ బడుతుంది. జూన్ 30 నాటికి నాటికి, కంపనీ హైదరాబాద్ యూనిట్ మొత్తం 21,700 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 6,000 మెట్రిక్ టన్నులను (MTPA) అందించింది, మిగిలిన ఉత్పత్తి గుజరాత్‌ లోని మరో రెండు యూనిట్ల నుండి వచ్చింది. కంపెనీ 15 మైక్రాన్ల నుండి 250 మైక్రాన్ల వరకు వివిధ గ్రేడ్‌ల MCC డస్ట్‌ను తయారు చేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కంపనీలో జరిగిన ప్రమాదం, అందుకు కారణాలను సమీక్షించడానికి, విచారించడానికి జూన్ 30 న ఒక హైపవర్ కమిటీని ప్రకటించారు. ఐదుగురు సభ్యుల ఈ కమిటీలో చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్), ప్రిన్సిపల్ సెక్రటరీ (లేబర్), ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్), అడిషనల్ DGP (ఫైర్ సర్వీసెస్) ఉన్నారు. CMO ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ సంఘటనను విచారించడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి సిఫార్సులను సమర్పించే బాధ్యత కూడా ఈ కమిటీకి ఉంటుంది.

జులై 1 న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు, ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు రూ. 10 లక్షలు, స్వల్ప గాయాలయిన కార్మికులకు రూ. 5 లక్షలు ప్రకటించారు. గాయపడిన కార్మికులకు, వారి కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు. మరణించిన కార్మికుడి ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు, గాయపడిన ప్రతి కార్మికునికి 50,000 రూపాయలు తాత్కాలిక ఉపశమనం క్రింద ప్రకటించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్‌లు, బలమైన పారిశ్రామిక బధ్రత విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను ఉద్దేశించి జులై 2 న రాసిన లేఖ ప్రకారం, మరణించిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం, గాయపడిన కార్మికులకు పూర్తి వైద్యం, పునరావాస సహాయం అందిస్తామని కూడా ప్రకటించింది. ఈ ప్రమాదం రియాక్టర్ విస్ఫోటనం కాదని ఈ లేఖలో రాసింది.

లేబర్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ (లాబ్-II) డిపార్ట్‌మెంట్ జులై 2 న GO Rt నం. 277 జారీ చేసి, సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన భారీ విస్ఫోటనం గురించి వివరణాత్మక నివేదికను సమర్పించడానికి ఒక ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్‌లోని CSIR-IICT నుండి ఇద్దరు శాస్త్రవేత్తలు, చెన్నైలోని CSIR-CLRI నుండి ఒకరు, పూణేలోని CSIR-NCL నుండి మరొకరు ఉన్నారు. ఈ కమిటీ ఒక నెలలో నివేదిక సమర్పించాలని GO లో పేర్కొన్నారు. .

ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటిషన్ దారు క్రింది కోర్కెలను పెట్టారు. పేలుడు ఘటనపై FIR నమోదైన నం. 184/2025 దర్యాప్తును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బదిలీ చేయాలనీ, మరణించిన మరియు గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించాలనీ, హై పవర్డ్ కమిటీ నివేదికను విడుదల చేయాలనీ, NFPA 652 ప్రమాణాలకు అనుగుణంగా డస్ట్ హజార్డ్ నిబంధనలను రూపొందించాలనీ, కోరారు.

తక్షణ ప్రాతిపదికన 54 మంది మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలనీ, జూన్ 30 న ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల జాబితాను సమర్పించాలనీ, గాయపడిన 28 మంది కార్మికులను వర్గీకరించి పరిహారం చెల్లించాలనీ, 8 మంది గల్లంతైన కార్మికులను మరణించిన వారిగా ప్రకటించాలనీ, హిందీ మరియు తెలుగులో సమాచారం అందించే హెల్ప్‌లైన్ ను ఏర్పాటు చేయాలనీ కోరారు. .

కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విస్ఫోటనం రియాక్టర్ పేలుడు కారణంగా జరగ లేదని పేర్కొంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీడియాకు ఇచ్చిన మరో ఇంటర్వ్యూ లో ఈ ప్రమాదం డ్రైయర్‌లో జరిగిన పేలుడు కారణంగా జరిగిందని, అది డస్ట్ విస్ఫోటనమని కూడా చెప్పారు. యాజమాన్యం ఇచ్చిన ఈ వివరణతో, ఇది రసాయన రియాక్టర్ సంఘటన కాకుండా, దహన డస్ట్ విస్ఫోటనమని తేలింది. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ (MCC) ఉత్పత్తి ప్రక్రియపై జరిగిన దర్యాప్తులో స్ప్రే డ్రైయర్ ఈ విస్ఫోటనానికి కారణమని తేలింది.

కంపనీ లో ఈ పరికరం, MCC ఎండబెట్టడానికి అత్యంత కీలకమైనది. డ్రైయర్‌ లోని ప్రాథమిక పేలుడు, ఫ్యాక్టరీ అంతటా స్థిర పడిన డస్ట్‌ను కదిలించడం ద్వారా మరింత వినాశకరమైన ద్వితీయ విస్ఫోటనానికి దారితీసింది. దహన డస్ట్ తీవ్రమైన ప్రమాదాలను ఇది ముందుకు తెస్తుంది. ఫ్యాక్టరీలో బధ్రత పరమైన నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఈ ద్వితీయ విస్ఫోటనం జరిగిందని కార్మికులు చెప్పారు. కంపెనీ దహన డస్ట్ జ్వలన ప్రమాదాలను నివారించడానికి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఇన్‌స్పెక్షన్ మరియు రెగ్యులేటరీ అథారిటీలు బధ్రత ప్రోటోకాల్స్ లేకపోవడాన్ని గుర్తించడంలో, శిక్షించడంలో విఫల మయ్యాయని బయట పడింది. ఇది నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) మార్గ దర్శకాలకు విరుద్ధమైనది.

సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యం మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ (MSDS)లో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ (MCC) వల్ల "విస్ఫోటన ప్రమాదం లేదు" అని తప్పుడు సమాచారం ఇచ్చారు. MCC ని దహన డస్ట్‌గా వర్గీకరించే గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు ఇది భిన్నమైన సమాచారం ఫిషర్ సైంటిఫిక్, సిగ్మా-ఆల్డ్రిచ్ వంటి సంస్థలు ఈ ప్రమాదాన్ని గుర్తించి నప్పటికీ, సిగాచి లో దీనిని సరిగా గుర్తించకపోవడంవల్ల తీవ్రమైన ప్రమాదానికి కారణమైంది.

మిల్క్ పౌడర్ స్ప్రే డ్రైయింగ్ యూనిట్లలో జరిగిన అగ్ని, విస్ఫోటన సంఘటనల గురించి బ్రిటన్ సంస్థ ఫైర్ రీసెర్చ్ స్టేషన్ “ జర్నల్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ డైరీ టెక్నాలజీ” లో నివేదికలు ప్రచురించింది. "ఉత్పత్తి విస్ఫోటన ప్రమాదం లేదు" అనే వాదన శాస్త్రీయమైనది కాదు.

తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంస్థ గత 35 సంవత్సరాలుగా తాను నిర్వహించిన తనిఖీ లలో MCCని దహన డస్ట్ హజార్డ్‌ గా గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. దీని విస్తృత ఉపయోగం దృష్టిలో ఉంచుకుని దీనిని అంతర్జాతీయంగా విస్ఫోటక కణంగా గుర్తించినప్పటికీ, ఇక్కడ మాత్రం ఎటువంటి బధ్రత చర్యలు తీసుకోలేదు. దీనివల్ల ప్రమాదాలను సరిగా అంచనా వేయలేదు. డస్ట్ హజార్డ్ అనాలిసిస్ (DHA) కూడా సిఫార్సు చేయలేదు. ఫలితంగా సిగాచీ ఫ్యాక్టరీ లో సేఫ్టీ ప్రోటో కాల్స్ లేకపోవడం వల్ల జూన్ 30 న ఈ ఘోర విస్ఫోటనం జరిగి అనేక ప్రాణాలు పోయాయి.

హైదరాబాద్ చుట్టూ జీడిమెట్ల, పటాన్‌చెరు, సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతాల్లో గతంలో ఇలాంటి విస్ఫోటనాలు, అగ్ని ప్రమాదాలు అనేకం జరిగాయి. వీటిలో కార్మికులు గాయపడ్డారు, మరణించారు. ఏప్రిల్ 3 న సంగారెడ్డి జిల్లాలోని SB ఆర్గానిక్స్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగి, సుమారు 6 గురు కార్మికులు మరణించారు, 19 మంది గాయపడ్డారు.

ఈ ప్రమాద కారణాలను విచారించడానికి నియమించబడిన ఎనిమిది మంది సభ్యుల కమిటీలో డాక్టర్ బాబూరావు గారు కూడా ఒక నిపుణుడిగా ఉన్నారు. కమిటీ నివేదికలో అనర్హ వ్యక్తులు యంత్రాలను నిర్వహించడం, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం, సేఫ్‌ గార్డ్స్ లేకుండా పనిలో పాల్గొనడం, మాన్యువల్ ఆపరేషన్, అసమర్థ కూలింగ్ సిస్టమ్స్ వంటి అనేక కారణాలను ఈ కమిటీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికునికి 41 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఇప్పటి వరకూ మరణించిన 6 గురు కార్మికుల కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించినప్పటికీ, గాయపడిన కార్మికులకు ఇంకా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. వారికి కేవలం ఆసుపత్రుల్లో చికిత్స మాత్రం అందించారు. .

ఆగస్ట్ 21 న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అచ్చుతాపురం ( అనకాపల్లి ) M/s ఎస్సియెంటియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ లో జరిగిన ఘోర విస్ఫోటన ప్రమాదంలో 17 మంది ఉద్యోగులు మరణించగా, 39 మంది గాయపడ్డారు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ బల్క్ డ్రగ్స్ తయారీలో ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 1 కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన కార్మికులకు 50 లక్షలు, స్వల్ప గాయాలు పొందిన కార్మికులకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. తహసీల్దార్‌ల ద్వారా మరుసటి రోజే చెక్కులు కూడా జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు చెక్కులు బాధిత కుటుంబాలకు చేరేలా నిలకడగా పని చేశారు.

ప్రస్తుతం సిగాచీ కేసులో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించిన కార్మికులకు పరిహారం కోటి పరిహారం ప్రకటించినప్పటికీ, బాధిత కుటుంబాలకు ఇంకా ఇప్పటి వరకూ పరిహారం పూర్తిగా చెల్లించ లేదు.

కోర్టు ఆదేశించినట్లుగా, రాబోయే మూడు వారాలలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, సిగాచీ కంపనీ యాజమాన్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది..

Tags:    

Similar News