అమరావతి నిర్వాసితుల హోదా పోలవరం గిరిజన రైతులకు దొరకదా?

అమరావతి నిర్వాసితులకు దక్కుతున్న గౌరవం పోలవరం గిరిజన రైతులకు దక్కడం లేదా.. ఎందుకీ వివక్ష వస్తోంది.. వర్ణాతీతంగా పోలవరం గిరిజన నిర్వాసితుల పరిస్థితి..

Update: 2024-03-13 05:52 GMT
పోలవరం ప్రాజెక్టు


ఆ మధ్య షర్మిళ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుందని తెలిసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా, రాజధాని ప్రాంతంలో నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏమీ చేయలేదని, అందుకే తాను పార్టీని వీడుతున్నట్లుగా చెప్పారు. మరుసటి రోజే ప్రభుత్వం, రాజధాని ప్రాంతంలో నిర్వాసితులుగా మారి ఉపాధి కోల్పోయిన 17 వేల 215 మందికి ఇస్తున్న రూ.2,500 (చంద్ర బాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఇచ్చినవి) నెలసరి ఆర్థిక సహాయాన్ని మరోసారి రూ.5 వేలకు పెంచుతున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఆ పెంచిన పరిహారం కూడా మార్చి ఒకటో తేదీ నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది ఇరవై ఏళ్ల పాటు ఇవ్వాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టం చేస్తుంది. అంటే,12×5000=60,000. 20×60000=12,00000.దానర్థం ఏమిటంటే, ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు మంజూరు చేయటం జరిగింది.
కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన పేద రైతులకు ఈ భాగ్యం ఎందుకు లభించడం లేదు. వాళ్లకి ఇస్తానన్న పరిహారం తక్కువ, అమలు చేయడంలో జాప్యం. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు అధికారంలో ఉన్న వారికి రాజధాని రైతులు ఎక్కువ.. గిరిజన రైతులు తక్కువా? ఏమిటీ వ్యత్యాసం? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు చంద్ర బాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదనేది యక్ష ప్రశ్న!

ఎందుకంటే, 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చేది తమ ప్రభుత్వమేనని, వచ్చిన వెంటనే నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు పెంచుతామని, అంతేకాకుండా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రకటించిన ఎకరానికి రూ.1 లక్ష 15వేల పరిహారం పొందిన వారికి అదనంగా రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితులు గుడ్డిగా నమ్మి ఓట్లు వేశారు. తీరా చూస్తే ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. నిర్వాసితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది.
ఆ మధ్య వరదల కారణంగా ప్రజల కష్టాలు తెలుసు కోవటానికి అఖిల పక్ష నాయకులు వచ్చిన వెంటనే ప్రభుత్వం పది లక్షలు పరిహారం ఇస్తామని జీఓ ఆర్‌టీ నెంబర్ 224 (30.6.2021) ప్రకటించింది. అంతేనా, పనిలో పనిగా రూ.550 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పారు. ఇంకేమి ఉబ్బి తబ్బిబ్బుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాలాభిషేకం చేశారు. ఇదంతా జగమెరిగిన సత్యం. జగన్ ఎరిగిన సత్యం కూడా. ఈ అంశం గురించి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కానీ, లేదా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రశ్నించ లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉందంటే "ఎవడికి పుట్టిన బిడ్డో... వెక్కి వెక్కి ఏడుస్తుంది"అన్నట్లుగా ఉంది.


తక్కువ మార్కెట్ ధరకు భూములు కోల్పోయిన వారు పోలవరం మండలంలోని 8 గ్రామాల గిరిజనులను మొదటి విడతలో బలవంతంగా 2015 డిసెంబర్‌లో ఏ వసతి లేని పునరావాస ప్రాంతాలకు తరలించారు. వారిలో కొందరు ఇప్పటికీ భూమికి భూమి దక్కలేదు. వారిలో 300 మంది మరణిస్తే వారి వారసులకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వేలేరుపాడు మండలంలోని నార్లవరం, తాత్కురు గొమ్ము, రుద్రమ కోట, కుకునూరు మండలంలోని, వింజరం, మాధవరం గ్రామాల వారంతా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాకు అదనంగా పరిహారం వస్తుందని ఆశించిన వారందరికి నిరాశే మిగిలింది.

2004లో పోలవరం ప్రాజెక్ట్ కోసం శంకుస్థాపన చేశారు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రాల పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 100 శాతం నిధులు కేంద్రమే భరించి, పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. కానీ, అప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం బీజేపీతో ఏదో ఒప్పందం చేసుకుని నిర్మాణ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. అప్పటి భారీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు నాడు విలేకర్లు సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన మూడు సంవత్సరాలలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందని అన్నారు. ఏమైంది? ఏమీ కాలేదు? చివరికి మాకు బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదని విమర్శించారు.

తర్వాత 2019లొ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇస్తానన్న 10 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ, ఎకరాకు రూ.5 లక్షల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వలేదు. దానికి సమాధానం వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పాలి. నిర్వాసితులు తమ గోడును వినిపించుకోవడానికి కలవని వారంటూ ఎవరూ లేరు. "జగనన్నకు చెబుదాం" కార్యక్రమంలో కలెక్టర్‌తో చర్చించారు. గిరిజన దర్బార్‌లో కోట రామచంద్రా పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు.
ఒకప్పుడు ముంపు గ్రామాల్లో నల్ల రేగడి మట్టిలో ఎర్ర బంగారం (మిరప), తెల్ల బంగారం (పత్తి) పండించి దర్జాగా బతికిన మనుషులు ఈ రోజు నిర్వాసితులుగా మారి చితికిన బతుకులతో ఉపాధి లేక నష్ట పరిహారం కోసం కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నారు. వెనక్కి పొదామంటే, ఇండ్లు, భూములు, గ్రామాలూ అన్నీ ముంపుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గోస ఎలా ఉందంటే "ఆగ భోగాలు అంకాలమ్మవి.. పోలికేకలు పోలేరమ్మవి" అన్నట్లు ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్టుగా పేద గిరిజన రైతుల కోసం తెల్లం బాలరాజు కానీ, ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా రాజీనామా చేయవచ్చుగా?

(బాబ్జీ, అడ్వొకేట్. స్టేట్ సెక్రెటరీ, గ్రామీణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆంధ్ర ప్రదేశ్)


Tags:    

Similar News