ఎమ్మెల్సీ ఎన్నికని హిందూ వర్సెస్ ఎంఐఎంగా మార్చిన బీజేపీ ఫాన్స్
వ్రతం చెడినా ఫలితం వుండాలనేదేనా బిజెపి లక్ష్యం;
By : The Federal
Update: 2025-04-22 06:57 GMT
-వెలది. కృష్ణ కుమార్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అగ్నిపరీక్ష గా మారాయా..? ఈ పోలింగ్ కు దూరంగా వుండాలని ఆయా పార్టీల అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడతారా..? ఓటు వేయకపోతే ఎంఐఎం ను సమర్థించినట్లే అన్న బీజేపీ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారు..? పార్టీ ‘విప్’ కాదని హిందూవులుగా బిఆర్ ఎస్ కార్పొరేటర్లు ఎంఐఎం ను ఓడించేందుకు బిజెపికి ఓటేయాలని హైదరాబాద్ లో హిందూత్వ పేరుతో బ్యానర్లు వెలిశాయి. ఇదెంత వరకు పనిచేస్తుందో తెలియదు.రేపు (23వ తేదీ) జరిగబోయేది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగే అయినా అందరు ఆసక్తిగా అటువైపు దృష్టి సారించేలా చేసింది.
**
ఎలాగూ సంఖ్యా బలం లేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తమ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు అయినా బీజేపీ ఈ ఎన్నికల బరిలో దిగడానికి కారణం అందరికీ తెలిసిందే. ఎంఐఎం కు ఏకగ్రీవంగా ఆ పదవి కట్టబెట్టడం కమలనాధులకు సుతరామూ ఇష్టం లేదు. కాలం కలసివస్తే ..అనేమాట అట్లుంచితే.. హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్ల లెక్కలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఖచ్ఛితంగా బీజేపీ అభ్యర్థి ఓటమి పాలవుతారు. కళ్లముందు లెక్కలు కనిపిస్తున్నా ,ఓటమి తప్పదని తెలిసినా బీజేపీ వ్యూహం "వ్రతం చెడినా ఫలితం దక్కాలన్నదే"...అందుకే ఈ ఎన్నికను హిందూవులు ఎంఐఎం కు మధ్య పోరుగా కమలనాధులు అభివర్ణిస్తున్నారు. అలా చెప్పడమే కాదు ఎంఐఎం తో అంటకాగుతున్నాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఒక రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. ఆ రెండు పార్టీల కార్పొరేటర్లను ఇరకాటంలో పడేసే చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో AIMIM అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి విజయం సాధించడానికి రంగం సిద్దమైంది. బీజేపీ అభ్యర్థి ఎన్.గౌతమ్‌రావు గెలవడం అంటే ఏదైనా మిరాకిల్ జరాగాల్సిందే. మత ప్రాదిపదికన రెచ్చగొడితే క్రాస్ ఓటింగ్ తో విజయం దక్కవచ్చని కాషాయం నేతల ఆశ. ఆ ప్రయత్నాలలో చివరి అవకాశం వరకూ దేన్నీ వదల కూడదన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోంది.
ఈ ఎన్నికల్లో గెలవడం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వున్న బీజేపీ కి రెండు అంశాలలో కీలకం..... మొదటిది, దాని కార్పొరేటర్లు ఎవరూ కాంగ్రెస్‌కు మారలేదు ... రెండవది, కాంగ్రెస్ , BRS రెండూ ఎన్నికలకు దూరంగా ఉండి MIM సీటును గెలుచుకోవడానికి సహాయపడినప్పటికీ BJP ఎన్నికల్లో గెలిచిందని నిరూపించడం. ఆ అవకాశాలు వంద శాతం లేవనే భావించాలి. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండూ పోటీకీ,పోలింగ్ కూ దూరంగా వుంటున్నాయి. 2020 డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో, BRS 56 స్థానాలను గెలుచుకుంది, తరువాత BJP 48, MIM 44 , కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు కార్పొరేటర్లు వలస వెళ్ళారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి 48 సీట్లు గెలిచినా, వారందరికీ ఈ ఎన్నికలో ఓటు హక్కు వుండదు. వారిలో హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ల కే ఓటు హక్కు వుంటుంది .కాబట్టి ఎంఐఎం మెజారిటీ ఎక్కువ. వారితోపాటు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ,MLCలు ఉన్నారు.ఎంఐఎం ఏకగ్రీవంగా గెలవాల్సిన ఆ స్థానంలో పోటీకి దిగి చూస్తూ వుండండి మేమే గెలుస్తాం అంటూ బీజేపీ నేతలు చెప్పడమే ఈ ఎన్నికల వైపు అందరూ దృష్టి సారించేలా చేస్తోంది.
హైదరాబాద్ లో ‘హిందువు’ల పేరిట వెలసిన బ్యానర్లు
MIM ను ఓడించాలని GHMC కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తూ హైద్రాబాద్ అంతటా హిందువుల, హిందూత్వ పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ అధిష్టానం ముఖ్యమా.. మీకు ఓటు వేసి గెలిపించిన మేము ముఖ్యమా తేల్చుకోండి... పోలింగ్ లో పాల్గొని MIM కు వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ కార్పొరేటర్ల ఇండ్లు , కార్యాలయాల ప్రాంతాలలో దర్శనమిస్తున్న బ్యానర్లు, ఫ్లైక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అన్ని డివిజన్లు పరిధిలోనూ ఈ బ్యానర్లు కట్టారు. హిందువుల పేరిట వెలసిన ఈ బ్యానర్లు కట్టించింది.. బీజేపీ నే ఎవరికీ తెలవంది కాదు.. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం, బీజేపీ లే పోటీ పడుతుండటంతో మత ప్రాతిపదికన ఓట్లు వేయాలన్న రీతిలో హిందూ, ముస్లిం ల మధ్య పోరుగా దీనిని బీజేపీ మార్చింది. ఇప్పుడు ఓటు వేయాల్సింది కేవలం కార్పొరేటర్లు కాబట్టి ,వారిని బీజేపీ టార్గెట్ చేసింది .
ఇప్పుడు పోలింగ్ కు దూరంగా వుండి MIM అభ్యర్థి ని గెలిపిస్తే వచ్చే GHMC ఎన్నికల్లో హిందీ వుల ఓట్లు దూరమవుతాయన్న భయాన్ని కార్పొరేటర్లలో కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎలాగూ గెలవలేము అయినా ఫలితం దక్కాలి.. అంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా ఈ పరిణామం తమకు లాభించేలా బీజేపీ చూసుకుంటోంది. ‘షాఫ్రాన్ వర్సెస్ గ్రీన్’ పోరు కార్పొరేటర్ల మనస్సు మార్చితే అద్భుతం ఆవిష్కరించ వచ్చన్న కమలం స్కెచ్ ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. దేశ ద్రోహులు, దేశ భక్తుల మధ్య జరుగుతున్న పోరుగా కూడా బీజేపీ నేతలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికను అభివర్ణించారు. ప్రజలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను దోషులుగా నిలపడమే కమలం వ్యూహం.
పార్టీలు విప్ జారీ చేయడం వంటిది ఉండదు కాబట్టి,రహస్య ఓటింగ్ కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కార్పొరేటర్లలో మెజారిటీ సంఖ్యలో ముస్లిమేతర కార్పరేటర్లు తమ అభ్యర్థి కి ఓటు వేస్తారన్నది బీజేపీ ఆశ.
హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరు?
హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు ఓటర్లుగా వుంటారు. వారికి తోడు ఎక్స్ అఫీషివో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వుంటారు. ఓటర్ల పరంగా చూస్తే ఎంఐఎం కు ఎక్కువ బలం వుంది. ఆ పార్టీకి 49 మంది బలం వుంది . 40 మంది కార్పొరేటర్లు, 7గురు ఎమ్మెల్యే లు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ వున్నారు .ఆ తరువాత వరుసగా బీజేపీ కి 19 మంది కార్పొరేటర్లు,ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, 4గురు ఎంపీలు కలిపి 25 మంది బలం వుంది. వున్నాయి. ఇక బీఆర్ఎస్ కు 15 మంది కార్పొరేటర్లు, 5 గురు ఎమ్మెల్యేలు,3ఎంపీలు,ఒక ఎమ్మెల్సీ తో కలుపుకుని 24 మంది ఓటర్లు వున్నారు.కాంగ్రెస్ కు 7గురు కార్పొరేటర్లు,ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీ లు ,ఒక ఎంపీతో కలిపి 13మంది ఉన్నారు. వీరుకాక టీజేఎస్ తరపున ఒక ఎమ్మెల్సీ వున్నారు. అంటే మొత్తంగా 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 7గురు ఎమ్మెల్సీ లు ,9 మంది ఎంపీలతో కలిపి 112 మంది ఓటర్లు పార్టీల పరంగా వున్నారు.
జీహెచ్ ఎంసీ పరిధిలో 150 కార్పొరేటర్లు వున్నా , అందులో 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ పరిధిలోకి వస్తాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి , రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఎంపిక చేసుకునే గడువు ముగిసింది. కాబట్టి తాజాగా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఓటు వేసే అవకాశం లేదు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నామని భావిస్తున్న బీజేపీ ప్రజలలోనూ అదే టెంపో మొయింటిన్ అయ్యేలా చూస్తోంది.
ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కి అనుకూల ఫలితాలు వచ్చాయి. అదే జోష్ తో హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ బరిలోనూ దిగింది. ఎంఐఎం ను ధీటుగా బీజేపీ ఎదుర్కొంటోందన్న భావన ప్రజలలో వుంది .అదీ హైదరాబాద్ లో మరీ ఎక్కువ. అందుకే త్వరలోనే జరగబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది.
అందుకే మత పరంగా భావోద్వేగాలు ఇప్పటి నుంచే తీసుకొస్తోంది. ఏదైనా మజ్లీస్ ను ఎదిరించే హిందుత్వ పార్టీగా ప్రజలలో ప్రచారంలో వుంటే సరిపోతుంది. అప్పుడు ఈ ఎన్నికలో గెలుపు బీజేపీ కి ముఖ్యం కాదు. ఓడిపోతామని తెలిసే పోటీలో దిగింది... అందుకే "వ్రతం చెడినా ఫలితం దక్కాలి".. ఈ సూత్రంలో కమలనాధులు విజయం సాధించారేమో...
(వెలది కృష్ణ కుమార్, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)