పాలిటిక్స్ లోకి రావాలనుకునే కుర్రాళ్లకు ప్రత్యేక సూచనలు

ఎన్నికల్లో పోటీ చేస్తే నాయకులవుతారు, ఉద్యమాలు చేస్తే యాక్టివిస్టు అవుతారు. మీ దారి ఏది? సామాజిక తత్వ వేత్త బిఎస్ రాములు సీరియస్ గా వేస్తున్న ప్రశ్న.

Update: 2024-06-30 07:07 GMT
Photo: Freecalendarkart.com


ఇటీవలి ఎన్నికల తరువాత ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కొత్తతరం యువత రాజకీయాల్లోకి వస్తామనుకుంటున్నారు. .

ఈ కొత్తతరంకు సెల్ ఫోన్ తెలుసు. సోషల్ మీడియా తెలుసు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ ఎక్స్, ఇన్ స్టా గ్రాం తెలుసు. యూట్యూబ్ లు తెలుసు. యూ ట్యూబ్ చానల్స్ పెట్టడం తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టడం, పత్రికా ప్రకటన లివ్వడం తెలుసు. ఆన్ లైన్ పత్రికలు ప్రింట్ లేకుండానే తీసుకు రావడం తెలుసు. కొందరికి సందర్భానుసారంగా విరాళాలు వసూలు చేయడం తెలుసు. కొందరికి భూతగవులు పరిష్కరించి పర్సెంటేజీ సంపాదించడం తెలుసు. కొందరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం, దాని లాభాలు రిస్కులు తెలుసు. అందుకే ఇదొక కొత్త ట్రెండ్.

శక్తిగా మారడానికి సిద్దంగా ఉన్నారా?


విద్యావంతులు, నిరుద్యోగులు, ఏ పని చేయకుండా తిరిగేవాళ్లు కూడా ‘రాజకీయాల్లో దూరాలి. అధికారంలోకి రావాలి. పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఆస్తులు సంపాదించాల’ అనుకుంటున్నారు. రాజకీయాల్లో దూరుతా. పార్టీ పెడతా! మీరు మాకు సలహా లివ్వాలి అంటూ అడిగే వాళ్లుకూడా ఉంటారు. అయితే, కొందరు చిత్త శుద్దితో రాజకీయాల ద్వారా ఎంతో కొంత చేయాలి. చేయవచ్చు అనుకుంటున్నారు. అలాంటి అందరి కోసం సూచనలు చెప్పే ముందు ఏ పరిస్థితుల్లో, ఏ సామాజిక రాజకీయ నేపథ్యంలో యువత ఇలా ఆలోచిస్తున్నదో తెలుసుకోవాలి.

1980 దశాబ్దం ఎలా ఉండిందంటే...


1980 నుండి రాజకీయ సామాజిక పరిణామాలు మూడు నాలుగు పాయలుగా మహా నదులుగా సాగుతూ వస్తున్నాయి. ఇందిరాగాంధీ పోయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. అపైన అది ఓడిపోయి తిరిగి ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బిజేపీ రామ జన్మ భూమి అంటూ ప్రచారం చేసి హిందూత్వ సెంటిమెంటుతో బలమైన పార్టీగా ఎదిగింది. వరుసగా నేడు మూడోసారి అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ జనతా దళ్ గా మారి అధికారంలోకి వచ్చి మండల్ బీసీ రిజర్వేషన్లు పెట్టి అధికారం నుంచి దిగిపోయింది. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రామ నామంతో బీసీలను కూడా తనవైపు తిప్పుకొని బిజేపీ విజయయాత్ర సాగుతున్నది. రాష్ట్రంలో నక్సలైట్ల ఉద్యమాలు బలంగా ఉండేబి. అపుడు నక్సలైట్లే దేశ భక్తులంటూ తెలుగు దేశం పార్టీ యువతను ఆకట్టుకొని అధికారంలోకి వస్తూ వున్నది. 1990 నుండి ప్రపంచీకరణ మొదలైంది. మరోవైపు బహుజన సమాజ్ పార్టీతో బహుజన రాజకీయాలు వేగం పుంజుకున్నాయి.

దేశవ్యాపితంగా సైద్దాంతిక శూన్యం


1992 నాటికి మండల్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు చల్లారాయి. బహుజనవాదంతో బీయస్సీ ముందుకు వచ్చింది. 1993 నాటికి నక్సలైలైట్ల ఉద్యమం యువతరాన్ని ఆకర్షించే శక్తి కోల్పోయింది. వామ పక్షాలు యువతను ఆకట్టు కోలేకపోయాయి. ఎంసెట్ పరీక్షలు, పరీక్షల మీద పరీక్షలు, సాఫ్ట్ వేర్ అవకాశాల విస్తరణ, మరో వైపు సెమీ విద్యావంతులు ఉపాధికోసం లక్షలాదిమంది గల్ఫ్ బాట పట్టడం జరిగింది. 1996 తరువాత బీయస్పీ ఉత్తేజం నీరు కారింది. అదే సమయంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం వేగం పుంజుకుంది. మధ్యలో ప్రజారాజ్యం పార్టీ ఒక ఆట ఆడి దిగిపోయింది. 2024 ఎన్నికల నాటికి 40 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న బిజేపీ హిందూత్వ రామనామ జపాల మత్తు దిగి పోయింది. నలభై ఏళ్ల పాటు నిరుద్యోగం, వంటి అంశాలు పక్కదారి పట్టించడంలో బిజేపీ హిందూత్వ ఘన విజయం సాధించాయి.

ఒకటి రెండు తరాలు గడిచిపోయాక, బతుకులు తెల్లారిపోయాక ఇంతకూ మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అని తల్లిదండ్రులు అలు, యువత ఇటు ఆలోచించడం మొదలైంది. ఇలా ఇపుడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిద్ధాంత శూన్యం ఏర్పడింది. ఒక సామాజిక ఉద్యమాలు లేని శూన్యం ఏర్పడింది. ఇపుడు వామపక్ష, నక్సలైట్ మావోయిస్టు ఉద్యమాలు లేవు. అటు రామనామ జప జప ఉద్యమాలు రంగు వెలిసి పోతున్నాయి. టీవీ సినిమా, సోషల్ మీడియా సెల్ఫోన్ ఆధారిత విషయాలు విసుగు. అవి బువ్వ పెట్టవు. ఆకలి తీర్చవు. శారీరక శ్రమ చేయడం ఇచ్చగించదు. దేశంలో యువత శారీరక శ్రమ చేయక ప్రపంచంలో అత్యంత పనికివంగని వారిగా కొనసాగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మేల్కొంటుందా యువత

ఈ నేపథ్యంలో రాజకీయాల్లో దూకాలని, ఓ పార్టీ పెట్టేయాలని ఆకాశానికి ఆధారం లేకుండా నిచ్చెన వేయాలని యువతకు ఆలోచనలు కలుగుతున్నాయి. అది వారి తప్పు కాదు. సమాజంలో ఒక శూన్యం ఏర్పడింది. కోట్లాది మంది విద్యావంతులు, సెమీ విద్యావంతులు కుటుంబ పెద్దలపై ఆధార పడి పరాన్నభుక్కులుగా జీవిస్తున్నారు. వీరి అసంతృప్తిని, ఆశలను, ఆశయాలను వ్యక్తం చేసే వేదిక లేకుండా పోయింది. వ్యక్తిగతంగా ఆ పని చేస్తే పట్టించుకనే దిక్కులేదు. తీరికలేదు. ఈ దశలో యువతలోని నిర్వీర్యత తొలగించి ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఉద్యమాలు అవసరం.

అవిశాంతియుతంగా సాగడం దేహానికి, దేశానికి మేలు చేస్తుంది. భారత రాజ్యాంగం , ప్రజల హక్కులు తెలియ జేయడంతో ఇది ప్రారంభం కావాలి. అందువల్ల మీ అనుభవం పండిన సూచనలు కావాలి అని అడుగుతున్న యువతరానికి విషయాలకు సూచనలు:


1. మీరు యువతరం మధ్య పని చేసి ఉద్యమాలు నిర్మించవచ్చు.

2. ⁠భారత రాజ్యాంగం విశిష్టతను వివరిస్తూ మొదలు పెట్టవచ్చు.

3. భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పుస్తకం రాసాను. ఓపది వేల కాపీలు అందులో మీ లక్ష్యాలు కూడా చేర్చి అచ్చు వేయించుకొని పంచండి/ అమ్మండి.

4. పైసలు లేక పోతే విరాళాలు సేకరించి అచ్చు వేయండి.


సామాజిక ఉద్యమాలకు రాజకీయాలకు సంఘ సంస్కరణలకు ఇవి అవసరం.


1. చక్కని ప్రసంగాలు / నినాదాలు చేయగలగడం. రూపొందించడం.

2. ప్రజలను సమీకరించ గలగడం

3. ⁠మనీ సేకరించి గలగడం

4. ⁠ధైర్యంగా ముందుకు సాగడం

5. ⁠శాంతి భద్రతల సమస్య రాకుండా రాజ్యాంగ పరిధిలో పని చేయడం

6. ⁠ప్రజల హృదయాలు గెలుచుకోవడం

7. ⁠ఈ. సామర్థ్యాలు సాధించుకోవడం.

8. ⁠రామరాజ్యం అంటే మరేమిటి కాదు సోషలిజమే! అని చెప్పడం.

9. ⁠స్వేచ్చ సమానత్వం సౌభాతృత్వమే , పరోపకారమే,మనుషులందరు సమానమే

అని ఆచరించడమే రామ రాజ్యం/ సోషలిజం, అని చాటి చెప్పండి

10. మీరు బౌద్ద అభిమానులైతే బుద్దుని పేరిట కూడా ఇలాగే చెప్పండి.

మీరు అల్లా అభిమానులైతే అల్లా కోరింది ఇదే అని చెప్పండి.

ఆర్థిక వనరులు ఎలా?

రాజకీయాల్లోకి రావాలంటే ఆర్థికబలం తప్పనిసరి

రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టులు, వ్యాపారం, పారిశ్రామిక రంగంలో చేయి తిరిగినవాళే సామాజిక రాజకీయ , సినిమా టీవీ మీడియా రంగాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసిస్తున్నారు. కనక వారిలో ఒకరుగా ఎదగడమో వారితో లాబీ తయారు చేసుకోవడమో అవసరం. ఇది తప్పదు. అపుడే ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. ఇది యువతకు తొలి పాఠం. ఇవి తెలుసుకుని తేల్చుకుని ముందుకు వారికే మిగతా పాఠాలు. సెల్ఫోన్లో అడిగినంత, తెలుసుకున్నంత సులభం కాదు ఆచరణ. ఇవి తెలిసినంత మాత్రాన నాయకుడు కాదు. అట్లయితే పాఠాలు చెప్పే లెక్చరర్లే నాయకులై ఉండేవారు. ఎన్నికల్లలో పోటీ చేసేవారే నాయకులు.ఎన్నికలలో పోటీ చేయకుండా పనిచేసేవారు సామాజిక ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు.


ఏ రంగంలో పని చేసినా సమాజానికి మేలే జరుగుతుంది. యువత తమ శక్తి సామర్థ్యాలను సామజిక మార్పు కోసం సామాజిక న్యాయం కృషి. చేసే వారే నేటి హీరోలు రేపటి తరాలకు వైతాళికులు చరిత్ర నిర్మాతలు.



Tags:    

Similar News