రైతు రుణమాఫీ సబబే, మోదీ కూడా ఈ భారం మోయాలి

గత పదేళ్ళలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే, రైతులకు 5 లక్షల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడానికి నిరాకరించింది

Update: 2024-07-18 07:10 GMT


*సంక్షోభంలో ఉన్న రైతుకుటుంబాల పంట ఋణాల మాఫీ సబబే ..

*వ్యవసాయం చేయని భూ యాజమానులకు ఋణమాఫీ, నిధుల దుర్వినియోగమే !

*రుణాల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన

*వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి కమిషన్ ను పునరుద్ధరించాలి.


2023 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట ఋణాలలో రెండు లక్షల రూపాయల వరకూ ఋణ మాఫీ చేస్తూ 15-07-2024 న జీవో. నంబర్. 567 విడుదల చేసింది. జులై 18 న లక్ష రూపాయల లోపు పంట రుణాలను 11,50,000 మందికి మాఫీ చేయడానికి 6,800 కోట్లు విడుదల చేయనుంది. ఆగస్ట్ 15 లోపు ఋణమాఫీ చేస్తామనే హామీని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం.

నిజానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రైతుల రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుని అమలు చేయాలని, దేశ స్థాయిలో రైతుల ఋణ విముక్తి కమిషన్ ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు డైనమిక్ గా రైతులను రుణాల ఊబిలో కూరుకు పోకుండా కాపాడాలని రైతు సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

కానీ గత పదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం ఎప్పుడూ దేశ స్థాయిలో రైతుల ఋణ మాఫీ గురించి ఆలోచించలేదు. మాఫీ చేయలేదు. పదేళ్ళలో దేశ కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికి పూనుకున్న మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న రైతులకు చెందిన సుమారు 5 లక్షల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడానికి మాత్రం నిరాకరించింది.

రాష్ట్ర స్థాయిలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆర్ధికంగా భారమే. రాష్ట్ర బడ్జెట్ లకు ఉండే పరిమితులే ఈ కారణం. గతంలో కూడా BRS ప్రభుత్వం రెండు సార్లు నిధుల కొరతతో, ఋణ మాఫీ హామీని అమలు చేయలేకపోయింది. అది రైతుల వ్యవసాయ ఋణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఋణ మాఫీ హామీ ఇచ్చి, దానిని అమలు చేయడానికి జీవో విడుదల చేసింది. మొదటి విడత నిధులను కూడా మంజూరు చేసింది. ఆ మేరకు ముందడుగే.

తెలంగాణ రైతు కుటుంబాల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడానికి సిద్దమైన పంట రుణాల మొత్తంలో సగం మొత్తాన్ని కేంద్రం భరిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గుతుంది. రాష్ట్రం నుండీ ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు ఈ మేరకు కేంద్రంతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఈ బడ్జెట్లో పెట్టించాలి.

గ్రామీణ రైతుల ఓట్లు కొల్లగొట్టడానికి , ఋణమాఫీ హామీని ఎన్నికల సందర్భంగా ఆకర్షణీయ నినాదంగా రాజకీయ పార్టీలు ఇస్తాయి కానీ, నిజానికి, బ్లాంకెట్ గా అందరికీ పంట ఋణ మాఫీ చేయడం అనవసరం.

దీనికి రెండు కారణాలు. ఒకటి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటి వరకూ దేశంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బ్యాంకులు క్షేత్ర స్థాయిలో వ్యవసాయం చేస్తున్న నిజమైన సాగు దారులకు మాత్రమే రుణాలు ఇవ్వడం లేదు. ప్రధానంగా ఇతర వ్యవసాయ రుణాల లాగే, పంట రుణాలను కూడా, సాగు భూములపై పట్టా హక్కులు కలిగిన భూ యాజమానులకే ఇస్తున్నాయి.

రాష్ట్రంలో వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు, పోడు, మహిళా రైతులను, అసైన్డ్ రైతులను కూడా సంస్థాగత రుణాల పరిధిలోకి తీసుకు రావడానికి ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ ప్రత్యేక ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. కౌలు రైతులను గుర్తించడానికి ఉన్న 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయడం లేదు. అలాగే వ్యవసాయం చేస్తున్న వేలాది మంది పోడు రైతులకు,మహిళా రైతులకు భూమి పై పట్టా హక్కులు లేవనే పేరుతో , బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. వీళ్లందరూ ప్రధానంగా ప్రైవేట్ రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు పంట రుణాలు మాఫీ చేసినప్పుడు వీళ్ళెవరికీ ఉపయోగం ఉండడం లేదు. సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా తక్కువే ఉంటున్నాయి. అందువల్ల వాళ్ళకు మాఫీ అయ్యేది తక్కువే.

అనర్హుల వల్ల నిధుల దుర్వినియోగం

వ్యవసాయం చేయకపోయినా, పంట రుణాలు తీసుకుంటున్న భూ యజమానులకు ఋణ మాఫీ పథకాలు ప్రధానంగా ఉపయోగపడి, వేల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఫలితంగా గతంలో చేపట్టిన ఋణ మాఫీ పథకాలు అనుకున్న ఫలితాలు సాధించలేదు. వాస్తవ సాగుదారులను రుణాల ఊబి నుండీ అవి బయట పడేయలేదు. గతంలో అనేక చెడు అనుభవాలు ఉన్నా, ఈ సారి కూడా వాస్తవ సాగుదారులను గుర్తించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండానే , రాష్ట్ర ప్రభుత్వం ఋణ మాఫీ చేస్తున్నది. అందుకే ప్రధానంగా రాజకీయ ప్రేరేపితంగా ఇచ్చే ఇటువంటి హామీలు, నిజమైన వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని పరిష్కరించవు.

రెండవది, పంటలు పండించిన ప్రతి రైతూ నష్టపోడు. కొన్ని సార్లు కొంతమంది రైతులు కొన్ని పంటల సాగులో అదనపు ఆదాయాన్ని కూడా పొందుతారు. అలాగే కొందరు రైతులు, స్వంత భూమి కలిగి ఉండి, స్వంత పెట్టుబడులతో, భారీగా వ్యవసాయం చేస్తుంటారు. వీళ్ళకు కూడా పంట రుణాలు ఉంటాయి. కానీ ఇలాంటి అందరి రైతుల రుణాలు రెండు లక్షల వరకూ మాఫీ చేయవలసిన అవసరమే లేదు. సంఖ్య రీత్యా వీరిది తక్కువ శాతమే అయినా, వీరిపై ఋణమాఫీ కోసం నిధులు ఖర్చు పెట్టడం సరైంది కాదు.

పైగా తెలంగాణ లో 2014 నుండీ ఇప్పటి వరకూ మూడు సార్లు ఋణమాఫీ పథకాలు ప్రకటించడం వల్ల, ఉచిత విద్యుత్ పథకం లాగా, ఇది కూడా ఎన్నికలలో పార్టీలకు ఉపయోగపడే ఉచిత పంట ఋణాల పథకం లాగా తయారవుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భౌగోళిక పరిమితుల రీత్యా, ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నడిపించి, రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం తప్పకుండా అవసరమే. దానిని కొనసాగించాలి.

కానీ, పంట రుణాలను అలా చూడకూడదు. ప్రతి సంవత్సరం వాస్తవ సాగుదారులందరికీ బ్యాంకుల నుండీ సంస్థాగత పంట ఋణాలు తక్కువ వడ్డీలకు ఇప్పించడం, వివిధ కారణాల వల్ల, సాగులో నష్టపోయిన రైతులను ఎంపిక చేసి, వారి వరకూ , రుణాలను మాఫీ చేయడం, మిగిలిన రైతులు బ్యాంకులకు తిరిగి రుణాలు చెల్లించేలా ప్రోత్సహించడం అనే ప్రక్రియ పంట ఋణాల విషయంలో సరైన పద్ధతి అవుతుంది.

నిధుల కొరత పేరుతో, ఋణమాఫీ పథకాలను ప్రభుత్వాలు సరిగా అమలు చేయకపోతే, మొత్తం సంస్థాగత ఋణ వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. రైతులకు బ్యాంకుల నుండీ తక్కువ వడ్డీలకు రుణాలు అందడం ఆగిపోతుంది. అనివార్యంగా రైతులు ప్రైవేట్ ఋణాల కోసం వెళ్ళి వడ్డీ భారలను మోయవలసి వస్తుంది. గత పదేళ్ళ తెలంగాణ రైతుల అనుభవం ఇదే.

కానీ పార్టీలు, ప్రభుత్వాలు దీర్ఘకాలిక దృష్టితో కాకుండా, తక్షణ రాజకీయ ప్రయోజనాల దృష్టితో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో నిధులు ఋణమాఫీ, రైతు భరోసా లాంటి ఒకటి,రెండు పథకాలకే ఖర్చయి, మిగిలిన అవసరాలకు నిధులు మిగలడం లేదు. ముఖ్యంగా రైతులకు న్యాయమైన ధరలు అందించడానికి , పంటల కొనుగోలు పథకాలకు నిధులు మిగలడం లేదు. పంటల బీమా పథకాలకు, విత్తనాలు, యంత్రాలు లాంటివి సబ్సిడీపై అందించడానికి నిధుల కొరత ఏర్పడుతున్నది.

గ్రామాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు లాంటివి లేకపోవడం వల్ల, సీజన్ లో రైతులు నష్టపోతున్న పంటల విలువ,ప్రభుత్వాలు ఋణ మాఫీ పథకాలపై పెట్టే ఖర్చు కంటే ఎక్కువ. నిల్వ గిడ్డంగులు లేక , పంట వచ్చిన వెంటనే, ప్రభుత్వం కొనుగోలు చేయక, ప్రైవేట్ వ్యాపారులకు రైతులను తమ పంటలను అమ్మేసుకోవడం వల్ల, కనీస మద్ధతు ధరలు కూడా అందక , రైతులు నష్టపోతున్న మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే రైతు భరోసా నిధుల ఖర్చు కంటే ఎక్కువ.

వ్యవసాయంలో ఋణ మాఫీ పథకాలు కూడా అవసరమే. కానీ ఆ నిధులు అందరికీ పప్పు, బెల్లంలాగా పంచిపెట్టడానికి కాకుండా, సంక్షోభంలో ఉన్న నిజమైన రైతు కుటుంబాలను సంక్షోభం నుండీ బయట పడేయడానికి ఉపయోగపడాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ప్రకటించే హామీ లాగా కాకుండా, రెగ్యులర్ గా వ్యవసాయం లో వస్తున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ, నష్టపోయిన రైతు కుటుంబాలను ఎప్పటికప్పుడు

గుర్తిస్తూ, ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలకు సిఫారసులు చేస్తూ, ఈ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిధులు కేటాయించేలా ఆదేశాలు ఇస్తూ పని చేసే ఒక శాశ్వత యంత్రాగం ఉండాలి.

రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు చేయాలి

2016 లో ఈ లక్ష్యంతోనే తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి చట్టం ఆమోదించింది. ఈ చట్టం క్రింద, రిటైర్డ్ న్యాయమూర్తి ఛైర్మన్ గా , మరో నలుగురు సభ్యులు గా ఒక కమిషన్ పని చేస్తుంది. అప్పులలో ఉన్న రైతుల నుండీ వచ్చే దరఖాస్తులను ఈ కమిషన్ పరిశీలించి, బ్యాంకులతో సంప్రదించి, తగిన ఆదేశాలు ఇస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినప్పుడు, క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు కూడా కమిషన్ చేస్తుంది.

అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టానికి KCR ప్రభుత్వం తూట్లు పొడిచింది. రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో తన పార్టీ మనిషిని ఛైర్మన్ గా పెట్టి కమిషన్ పని చేయకుండా చూసింది. గత ఎనిమిదేళ్లుగా ఈ కమిషన్ చట్టం స్పూర్తితో, అనుకున్న లక్ష్యం మేరకు సక్రమంగా పని చేసి ఉంటే, రాజకీయ పార్టీలు, ఎన్నికల సందర్భంగా ఋణమాఫీ పథకాలు ప్రకటించే అవసరం ఉండేది కాదు.

ఇప్పటికైనా ఈ చట్టం ప్రకారం కొత్త రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిషన్ ను ప్రకటించాలి. ప్రస్తుతం ఋణమాఫీ పరిధి నుండీ తప్పిపోతున్న వివిధ క్యాటగిరీల సన్న, చిన్నకారు రైతులకు తమ గోడును ఈ ఋణ విముక్తి కమిషన్ ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి.

ముఖ్యంగా 2014 నుండీ అమలైన పాత ప్రభుత్వ తప్పుడు విధానాలతో, ముఖ్యంగా గతంలో రెండు సార్లు ఋణమాఫీ హామీ సరిగా అమలు చేయని కారణంగా నష్టపోయిన రైతులు, ధరణి బాధిత రైతులు, జాయింట్ లయబిలిటీ గ్రూప్ ల సభ్యులు, రైతు మిత్ర బృందాల సభ్యులు, భూసేకరణ బాధిత రైతులు, భారీ వర్షం,వడగండ్లు లాంటి ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతులు, ఋణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతులు, కరువు మండలాలను ప్రకటించిన కారణంగా రుణాలు రీ షెడ్యూల్ చేయబడిన రైతులు, అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులతో చర్చించి, తమ బ్యాంకు రుణాలను పునర్ వ్యవస్థీకరించుకున్న రైతులు, ఈ కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం కల్పించాలి. ఒక సంవత్సరం కాల పరిమితిలో కమిషన్ వీటిపై విచారణ చేసి , రైతు సంఘాలతో కూడా చర్చించి కొన్ని సిఫారసులు చేయాలి. ఈ సిఫారసులను ప్రభుత్వం అమలు చేయడానికి వచ్చే సంవత్సర బడ్జెట్ లో నిధులను కేటాయించుకోవాలి

Tags:    

Similar News