కళ్లెదుటే కుప్పకూలుతున్న దక్కన్ డెవెలప్మెంట్ సొసైటీ...
మహిళ బాగుకోసం మొదలయిన తృణధాన్యాల విప్లవం ఇపుడు నమ్మక ద్రోహంతో నలిగిపోతున్నది;
తెలంగాణలో మహిళా సాధికారత కోసం నలభై యేళ్ల కిందట ఏర్పాటయిన డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (Deccan Development Society: DDS) ఇప్పుడు అపనమ్మకంతో మునిగిపోయింది. దీనికి వూపిరిపోసిన సభ్యులే ఈ వాలంటరీ ఆర్గనేజేషన్స్ ను విశ్వసించలేకపోతున్నారు. ఇటీవల దాకా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తెలంగాణలోని జహీరాబాద్‌లో అట్టడుగు స్థాయి సమాజ పరివర్తనకు మార్గదర్శిగా నిలిచింది. దళిత మహిళలను శక్తివంతం చేయడానికి – తృణధాన్యాల మిల్లెట్ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం, బంజరు భూములను తిరిగి పొందడం, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించడం - ఒక ఉద్యమంగా ప్రారంభించింది. ఇప్పుడు నమ్మక ద్రోహానికి, అపనమ్మకాన్ని కేర్ అఫ్ అడ్రస్ గా మారిడమే ఆశ్చర్యం. సంస్థలో డిపాజిట్ చేసిన పేదలు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. డిపాజిటర్ల పేరు బ్యాంక్ ల్లోనుంచి మాయమయ్యాయి, సమిష్టి భూములను అనధికారికంగా సంస్థతరఫున విక్రయించడం వంటి విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థ మీద ప్రభుత్వం దర్యాప్తు చేయాలనే డిమాండ్ సభ్యల నుంచి వినపడుతూ ఉంది.
డిడిఎస్ ను నిర్మించిన మహిళలే ఇప్పుడు సంస్థ పనితీరును ప్రశ్నిస్తున్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు. సంవత్సరాలుగా పొదుపు చేసి సొసైటీలో డిపాజిట్ చేసిన పొదుపు సొమ్ము ఎక్కడ ఉంది? తమ పేరున భూములను ఎవరు అమ్మారు? ఆర్థిక స్వాలంబన, సాధికారత, మన కాళ్లపై మనం నిలబడదాం గొప్ప మాటలు చెప్పినవారు చివరికి మమ్మల్ని చీకటి ప్రపంచంలో వదిలేశారని అంటున్నారు.
పి.వి సతీష్ నాయకత్వంలో, డిడిఎస్ స్థిరమైన వ్యవసాయం, విత్తన సార్వభౌమాధికారం, మహిళల నేతృత్వంలోని సంఘాల (స్వయం సహాయక బృందాలు) వినూత్న నమూనాకు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. జర్మనీకి చెందిన బ్రోట్ ఫర్ డై వెల్ట్ (Brot für die Welt: Bread for the World), కెనడాకు చెందిన ఇంటర్ పరేస్ (Inter Pares) వంటి ప్రపంచ దాతల నుంచి నిధులు సమకూర్చి డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ దళిత సాధికారత, మహిళా స్వాలంబన, ఆహార భద్రత, ఆహార న్యాయం అనే వాటికి పర్యాయ పదం గా మారింది. బంజరుభూములను వ్యవసాయోగ్యం చేసి,తక్కువ నీటి తోపండే తృణధన్యాల సేద్యం చేయడం, వారానికొక రుపాయ పొదుపుతో పేద, దళిత మహిలను భాగస్వాములను చేయడం, తమకు కావలసి విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుని నిల్వ చేయడం వంటి కార్యక్రమాలలో విజయవంతమయి ఈ సంస్థ అంతర్జాతీయగుర్తింపు పొందింది.
అయినప్పటికీ, ఈ సంస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. పొదుపు సొమ్ము లేకపోవడం, అనధికారికంగా భూమలు విక్రయించడం, ఆర్థికవ్యవహారాల లొసుగుల వంటి ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది డిపాజిటర్ల పేరు బ్యాకులలో నుంచి మాయమయిపోయాయి. వీళ్ల డబ్బులుపోయాయి. ఇంతకాలం ఎవ్వరూ ఈ సంస్థ కార్యక్రమాలను పరిశీలించలేక పోయారు. సక్సెస్ మాటున ఎంజరుగుతున్నదో ఎవ్వరు తెలుసుకోలేకపోయారు,.
ఒకప్పుడు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న మహిళలను నమ్మకద్రోహం చేసి నిట్ట నిలువునా ముంచేశారు. "మేము డిడిఎస్ ని నమ్మి వారానికి రు.1, రు., 5, రు.,10 చొప్పు ఆదా చేసాము. ఇప్పుడు, నా పేరు వారి రికార్డులలో కూడా లేదని హోతి గ్రామంకు చెందిన రంగమ్మ (60) వాపోతున్నారు. గతంలో మేము గౌరవం కోసం పోరాడాము, కానీ ఇప్పుడు మా బకాయిల కోసం పోరాడుతున్నాము అని దన్నవరం గ్రామస్తురాలు నాగమ్మ ఎంతో నిరాశతో చెబుతోంది. దళితుల కోసం ఉద్దేశించిన భూమి బయట వ్యక్తులకు అమ్మేశారు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బ్రోకర్ల పాలయిందని మాజీ డీడీఎస్ ఉద్యోగి జగన్నాథ్ రెడ్డి తెలిపారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రశ్నలు ఎప్పుడూ అనుమతించబడలేదని పని చేసిన సొసైటీ సభ్యులు తెలిపారు. సొసైటీ అధినేత సతీష్ దివంగతులైన తరువాత కీలక ఆరోపణలు సంస్థ పనితీరు మీద వెల్లువెత్తాయి. పొదుపులు లేకపోవడం, రుణాలు, జీవనోపాధి కోసం ఉద్దేశించిన దశాబ్దాల నాటి డిపాజిట్లు తిరిగి ఇవ్వడం లేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. వివాదాస్పద భూమి అమ్మకాలు, కుప్పానగర్, మన్సూర్ ఇతర గ్రామాలలోని సంఘం భూమిని సభ్యుల అనుమతి లేకుండా విక్రయించారని ఆరోపణలు వచ్చాయి - కొన్నింటిని మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరలకు అమ్మేశారు . దాతల నిష్క్రమణ, ఒకప్పుడు 28 అంతర్జాతీయ ఏజెన్సీల మద్దతుతో విరాజిల్లింది, ఇప్పుడు కేవలం నలుగురు దాతలపై మాత్రమే ఆధారపడుతుంది. బ్రోట్ ఫర్ డై వెల్ట్ వంటి ప్రధాన మద్దతుదారులు 2022 నాటికి నిధులను ఉపసంహరించుకున్నారు.
ఫిబ్రవరి 2025లో వేలాది మంది మహిళలు, డీడీఎస్ పూర్వ సంఘ సభ్యులు, సానుభూతిపరులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా నినదిస్తూ డీడీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పేద అట్టడుగు వర్గాలని ద్రోహం చేసిన డీడీఎస్ వల్ల ఉపయోగం ఏమిటిని పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జహీరాబాద్‌లో 24 గ్రామాల నుండి 600 మందికి పైగా మహిళా సభ్యులు సమావేశమై సంస్థలో జరిగిన మోసాలను ప్రశ్నించారు. మహిళలు కిలోమీటరు పొడవునా ఊరేగింపు నిర్వహించి, బ్యానర్లు చేతపట్టుకుని, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
పొదుపరుల పేర్లు ధృవీకరించి డబ్బు తిరిగి ఇస్తున్నట్లు డీడీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వేలుగురి పేర్కొన్నప్పటికీ, పొదుపు సంఘాలు మహిళా సంఘాలలో నమ్మకం కలగడం లేదు. తమ డబ్బు ఎక్కడ అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విజయాలు కాదనలేనిది. జహీరాబాద్ గ్రామాల్లో కుల అడ్డంకులను బద్దలు కొట్టింది. మిల్లెట్ వ్యవసాయం పునరుద్ధరించింది అలాగే ఇళ్ళు, విత్తన బ్యాంకులు ప్రత్యామ్నాయ పౌర సరఫరా వ్యవస్థను నిర్మించింది. అయినప్పటికీ, అది క్షీణ యుగంలో ప్రవేశించింది. ఇది ఒక బాధాకరమైన సత్యాన్ని నొక్కి చెబుతుంది. పారదర్శకత లోపించినప్పుడు ఎంత ప్రసిద్ధి చెందిన ఉద్యమాలైనా కూడా కూలిపోతాయి.
సతీష్ చనిపోయిన తర్వాత విశ్వాసం విచ్ఛిన్నం కావడం మొదలయింది. డీడీఎస్ ఒక అస్తిత్వ ప్రశ్నను ఎదుర్కొంటుంది. అది తన నైతిక అధికారాన్ని తిరిగి పొందగలదా, లేదా అనేది ప్రశ్నర్థకం. అది విరిగిన వాగ్దానాలు, నమ్మకద్రోహం మరొక హెచ్చరిక కథగా మారుతుందా? ప్రస్తుతానికి, జహీరాబాద్ మహిళలు మాత్రం సానుభూతి కోసం ఎదురుచూడడం లేదు, జవాబుదారీతనం కోసం వేచి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంస్థలు తక్షణమే జోక్యం చేసుకుని మహిళలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంస్థ వ్యవస్థాపక సభ్యులు కొమండూరి సంతాన గోపాల్, పౌర ప్రజా సంఘాలు కోరుతున్నాయి.