2024: సామూహిక హత్యలు, యుద్దాలు - ‘యూఎన్’ పట్టించుకోదా?
రెండు విడిపోయిన భద్రతా మండలితో సంక్షోభంలో ప్రపంచం
By : KS Dakshina Murthy
Update: 2024-12-26 08:09 GMT
కొన్ని రోజుల్లో 2024 ముగియబోతోంది. ఈ సంవత్సరం నుంచి కొన్ని సంఘటలను తీసుకుంటే స్పష్టంగా ఓ విషయం అర్థమవుతోంది. ప్రపంచం వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని చెప్పవచ్చు.
గాజాలో జరగుతున్న మారణహోమంలో 45 వేల మంది చనిపోయారు. రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఆప్గానిస్తాన్ లో తాలిబన్ల చెరలో మహిళలు సామాజిక బహిష్కరణ ఎదుర్కొంటున్న ప్రపంచం కిక్కురుమనకుండా ఉంది.
ప్రపంచ వ్యవస్థలు ఇలా పతనం కావడానికి ప్రధాన కారణం ఐక్యరాజ్య సమితి చేతగానితనమే అని చెప్పవచ్చు. అందుకే గాజాలో వేలాది మంది మరణించిన ఎవరూ పట్టించుకోలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపలేకపోయింది. తాలిబన్ పాలనలో మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నయూఎన్ఓ చేష్టలుడిగి కూర్చుంది.
యూఎన్ఓ చేతగానితనం..
యూఎన్ఓ లో అత్యంత కీలకమైన విభాగం భద్రతామండలి. అందులో ఐదు దేశాల శాశ్వత భాగస్వామ్యం ఉంటుందనేది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు అందులో ఉన్న దేశాలన్నీ రెండు పక్షాలుగా విడిపోయి యుద్ధాలను ప్రేరిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ అనే అగ్రదేశాలు ఉక్రెయిన్ వైపున నిలబడగా, రష్యా తరఫున చైనా వకాల్తా పుచ్చుకుంది. ఇది ఏ సమస్యను తెగనీయకుండా ప్రపంచం మీద కుంపటి పెడుతున్నాయి.
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణల కోసం 1997 లో అప్పటి సెక్రటరీ జనరల్ ప్రయత్నించాడు. కానీ మిగిలిన సభ్య దేశాల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అవన్నీ మరుగున పడ్డాయి. తరువాత ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు.
ప్రస్తుత ప్రపంచంలో ఐరాస పనితనం ఎలా ఉందంటే.. క్రికెట్, ఫుట్ బాల్ లో ఇరు జట్లు ఆడుతుంటే అంపైర్ వచ్చి నిర్ణయాలు తీసుకుంటూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తాడు. కానీ ఇక్కడ అమెరికా- రష్యా అనే ఆటగాళ్లు నేరుగా, లేదా ప్రాక్సీలతో ఆడుతుంటే ఐరాస మాత్రం ఎటువంటి రోల్ పోషించకుండా చూసిచూడనట్లు కొనసాగుతోంది.
విశ్వసనీయతను కోల్పోయిన ఐరాస?
భద్రతామండలిలో ఉన్న దేశాలు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటూ ఉండటంతో ఐరాస దాని ప్రభావాన్ని, విశ్వసనీయతను కోల్పోతోంది. ఈ రోజు దాని పై ఎలాంటి గౌరవం లేకుండా పోవడంతో పాటు దాని ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారింది.
ఎనిమిది దశాబ్దాల కాలంలో మెల్లమెల్లగా దాని ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తోంది. కానీ ఎలాంటి సంస్కరణలు అమలు చేయట్లేదు. అయితే యూఎన్ఓ సైద్దాంతిక ముగింపు వేలాదిమందిపై ప్రభావం చూపుతుంది. ఇది గాజాలో మన కళ్లముందు కనిపించింది.
ఆఫ్ఘానిస్థాన్ పరిస్థితి..
మూడు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మొదట తామేదో ఉదారవాదులమన్నట్లు ప్రవర్తించారు. కానీ మెల్లమెల్లగా వారి పాత ప్రవర్తనను బయటకు తీసుకొచ్చారు. మనకు ఇది 2024 లో కూడా కనిపించింది. ముఖ్యంగా తాలిబన్లు మహిళలను బలవంతంగా అణచివేసే విధానాలను కొనసాగిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం కాబుల్ లో మెడికల్ కోర్స్ చదువుతున్న విద్యార్థినులను ఉన్నఫలంగా వెనక్కి పంపించారు. అంతేకాకుండా రాజధానిలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా మాట్లాడకూడదని కూడా ఆంక్షలు విధించారు. అంటే భవిష్యత్ వాళ్లకు నిరసనలు చేసే హక్కు కూడా లేదని పరోక్షంగా ప్రకటించేశారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళలు బురఖా ధరించకుండా బయటకు రాకూడదని మధ్య యుగాల నాటి కఠిన ఆంక్షలు ప్రకటించారు.
ట్రంప్ రాకతో పరిస్థితి..
ఐరాసలో లో ఉన్న విభాగాలన్నీ అంతర్గత కల్లోలంతో ఉన్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. ఇప్పుడు ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడనేది కీలకం. ఐరాస ఆయన చెప్పినట్లు నడవాలని నిర్దేశిస్తే అది కచ్చితంగా ఆపని చేయాల్సిందే.
అలా కాకుండా ముందుకు వెళితే అది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్లే ఆయన.. పోయిన సారి అనేక ఒప్పందాలు, కొన్ని ఐరాస విభాగాల నుంచి అమెరికాను బయటకు లాగేశారు. ఇప్పుడదే పని చేయరని గ్యారెంటీ లేదు. ఈసారి ఆయన మరింత దూకుడుగా ముందుకు సాగే పరిస్థితి ఉంది.
భారత్ కు కూడా వార్నింగ్..
రెండో ప్రపంచయుద్ధం తరువాత అమెరికా నేతృత్వంలో ఏర్పాటయిన పాశ్చాత్య సైనిక కూటమికి ఇన్నాళ్లు వాషింగ్టన్ నాయకత్వం వహించేంది. కానీ ఆయన మొదటిసారిగా నాటో పై తమ మిత్ర దేశాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు ఒప్పందం ప్రకారం ఖర్చు చేయాలని లేకపోతే నాటో రక్షణ లభించదని హెచ్చరించారు. ఆయన ప్రకటన పశ్చిమ యూరప్ కూటమిలో విబేధాలు సృష్టించేలా ఉంది. ఇది రష్యాకు నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కానీ ఈ పరిణామం ప్రపంచాన్ని మరోసారి సంక్షోభంలోకి నెడుతుంది.
నెల రోజుల క్రితం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన బ్రిక్స్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ పై టారిఫ్ లు విధిస్తానని కూడా హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడు అని ఆయనే స్వయంగా చెప్పినప్పటికీ న్యూఢిల్లీకి మాత్రం వార్నింగ్ విషయంలో మినహయింపు ఇవ్వలేదు.
2025 ఎలా ఉండబోతుందో..
ట్రంప్ రాకతో ప్రపంచం మరో వాణిజ్య యుద్దం చూడవచ్చు. రష్యా- ఉక్రెయిన్ వార్ తో మొదలైన మాంద్యం ఇది అదనంగా తోడవతుందనే భయం ఉంది. కానీ ఏ ఒక్క దేశం కానీ, గ్రూపుకానీ నేరుగా యూఎన్ లేదా అమెరికాను ఛాలెంజ్ చేసే స్థితిలో లేవు ఒక్క చైనా తప్ప.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి గాజాలో పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్ ప్రధానికి సలహ ఇచ్చారు. దానర్థం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చివరలో 2024 లో ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని చవిచూడగా 2025 పూర్తిగా పతనాన్ని చవిచూడవచ్చు.