తెలంగాణలో రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి? ఎవరవి తీసేయాలి

ఇటీవల వచ్చిన గిగ్ అండ్ ప్లాట్ ఫాం శ్రామికులను, ఓలా, ఊబర్ లలో అప్పు కారుతో బతుకుతున్నవారిని పేదరికంలో ఉన్న వారిగా పరిగణించి రేషన్ కార్డులు ఇవ్వాలి.

Update: 2024-10-30 03:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని సెప్టెంబర్ 16న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘంలో నిర్ణయించారు. ఈ నెలాఖరులోపు ఇందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కూడా నిర్ణయించారు. 2025 జనవరి నుండి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని, ఇకపై అర్హులకు ఆహార భద్రత కార్డుగా ఇచ్చే స్మార్ట్ కార్డ్ తో, రేషన్ దుకాణాల నుండి బియ్యం తీసుకోవచ్చని కూడా నిర్ణయించారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం రాష్ట్రంలో 89,96,075 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఖాతాలో 54,44,911రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 1,91,80,788 మంది లబ్ధిదారులు గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 35,51,000 కార్డులు జారీ చేయగా, వాటి కింద 90,01,000 మంది లబ్ధిదారులు గా ఉన్నారు. అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కార్డులు సహా మొత్తం రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర జనాభా 3,81,00,000 మందిలో 2,81,63,759 మంది రేషన్ లబ్ధిదారులుగా ఉన్నారన్న మాట.

గత 75 ఏళ్లుగా వివిధ పార్టీల ప్రభుత్వాలు దేశంలో అమలు చేసిన ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ విధానాల వలన దేశంలో మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా పెరగకపోగా సమాజంలో ఆర్థిక అంతరాలు మరింత తీవ్రమయ్యాయి. జీడీపీ, GSDP ఆధారిత ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వాలు చెప్పుకున్నప్పటికీ, దేశంలో పేదరికం, ఆకలి, నిరుద్యోగం తగ్గడం లేదు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మన దేశం ఇంకా చాలా దూరంలో ఉంది.

దేశంలో, రాష్ట్రంలో అనారోగ్య మరణాలు, అకాల మరణాలు పెరిగిపోతున్నాయి. స్త్రీలలో రక్తహీనత పెరుగుతున్నది. పిల్లలలో కూడా రక్తహీనత, ఎదుగుదల స్తంభించి పోవడం కనపడుతున్నది. ఆహార భద్రత చట్టం కింద కార్బోహైడ్రేట్స్ అందించడానికి బియ్యం, గోధుమల లాంటివి నెలకు ఐదు కిలోలు ఉచితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS ) ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ, నిజమైన పోషకాహార భద్రత మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ అందట్లేదు. ప్రజలకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెలు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం ద్వారా పోషక విలువలు అందాలి. కానీ వాటి ధరలు గణనీయంగా పెరిగి పోయాయి. ప్రజల కొనుగోలు శక్తి ఆ స్థాయిలో పెరగలేదు. అందువల్లనే ఆకలి సూచీలో మన దేశపు స్థాయి మరింత క్రిందికి దిగజారిపోయింది.

భారత దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా , లక్షల కోట్లు ఖర్చు పెట్టి, ప్రజలకు చవక ధరలకు ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, దేశ జీడీపీ లో ఆహార సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు వాటా 2014-2015 లో 0.9 శాతం కాగా, అది 2024-2025 నాటికి 0.6 శాతానికి పడిపోయింది. కరోనా కాలంలో ఒక్క సంవత్సరం 2020-2021 లో మాత్రమే అది జీడీపీ లో 2.7 శాతానికి చేరింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం జీడీపీ లో కనీసం 5 శాతం కేటాయించినా అన్ని ముఖ్యమైన ఆహార ఉత్పత్తులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు సబ్సిడీ ధరలపై అందించవచ్చు. అప్పుడే ప్రజల కు పౌష్టికాహారం అంది, ఆరోగ్యకర సమాజం నిర్మాణం అవుతుంది.

సమగ్ర కుటుంబ సర్వే నివేదిక పై మార్చ్ 2019లో ప్రభుత్వ ప్రెజెంటేషన్ ప్రకారం , దళిత కుటుంబాలు, అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగల (PVTG) కుటుంబాలు,ఇతర గిరిజన కుటుంబాలు, దినసరి కూలీ కుటుంబాలు (దినసరి వేతన కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు) ఇంట్లో ఒక్క రూమ్ ఉన్న కుటుంబాలు, మట్టితో కట్టిన ఇల్లు, తాత్కాలిక షెల్టర్, పాక్షికంగా ధ్వంసం అయిన రెండు గదుల ఇల్లు ఉన్న కుటుంబాలు, అనాధలు ఉన్న కుటుంబాలు, వికలాంగులు ఉన్న కుటుంబాలు (PWD), శాశ్వత నివాసం లేని సంచార జాతుల కుటుంబాలు, ఇతర చోట్ల శాశ్వత నివాసం ఉన్న సంచార జాతులు,ఇప్పటికీ వృత్తిలో ఉన్న చేతి వృత్తుల కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు పొందడానికి అర్హులు.

రేషన్ కార్డుకు అర్హులను నిర్ణయించడంలో రావాల్సిన మార్పులేమిటి? మంత్రివర్గ ఉప సంఘం లో చర్చకు కొన్ని అంశాలను ప్రతిపాదిస్తున్నాము. ఆహార భద్రత రేషన్ కార్డు మంజూరు చేయడానికి ప్రధాన మార్గదర్శకం గ్రామీణ ప్రాంతంలో లక్షన్నర లోపు ఆదాయం, పట్టణ,నగర ప్రాంతాలలో 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండటం. ఈ ఆదాయాన్ని నిర్ధారించడానికి ప్రాతిపదిక ఏమిటి? రెవెన్యూ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి ఆదాయ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం కాకుండా, ఈ అధికారులకు మరో రూపంలో కుటుంబ ఆదాయాన్ని తెలుసుకునే మార్గమేదైనా ఉందా ? లేదు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి, ఒక కుటుంబానికి అతి తక్కువ ఆదాయం చూపిస్తూ ఇన్ కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తే దానికి ఎంత క్రెడిబిలిటీ ఉన్నట్లు?

తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రైవేట్ రంగ సంస్థలలో ముఖ్యంగా వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న దశలో నెలసరి వేతనం పై ఆధారపడి బతుకుతున్న వారి సంఖ్యపై ఎవరికీ స్పష్టత లేదు. అలాగే పరిశ్రమలలో పనిచేస్తున్న పర్మినెంట్, క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యపై కూడా స్పష్టత లేదు. వివిధ రాష్ట్రాల నుండీ తెలంగాణకు తరలి వస్తున్న వలస కార్మికుల వివరాలను నమోదు చేసే యంత్రాంగం, విధానం కూడా లేదు.

ముఖ్యంగా పట్టణ,నగర ప్రాంతాలలో ప్రైవేట్ రంగంలో కార్మికుల, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, వారికి ఆయా సంస్థలలో నియామక పత్రాలు, వేతన రసీదులు, సాంఘిక, సంక్షేమ పథకాలు ఉండవు. పని గంటలు, సెలవులు కూడా నిర్ధిష్టంగా ఉండవు. అదనపు పని గంటలు పని చేస్తే, అదనపు వేతనం చెల్లిస్తారన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, కార్మికులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖపై ఉంది. కానీ గత మూడు దశాబ్దాలుగా కార్మిక శాఖ ఆ బాధ్యత తనది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్న వారి ఆదాయాలు స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి రేషన్ కార్డు కావాలనుకున్న ప్రతి కుటుంబం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వయం ప్రకటిత డిక్లరేషన్ తో, ఆదాయం చెప్పి దరఖాస్తు చేసుకుంటున్నది. ఆయా కుటుంబాల వద్దకు ఎంక్వైరీ కి వెళ్ళిన రెవెన్యూ సిబ్బంది, తమ విచక్షణతో దానిని ఆమోదించడమో , తిరస్కరించడమో చేస్తున్నారు.

కానీ నిజానికి గ్రామీణ, పట్టణ ప్రాంతలలో దినసరి కూలీలను, పీస్ రేట్లపై పని చేస్తున్న హమాలీ కార్మికులను, ఇళ్ళలో పని చేసే లక్షలాది మహిళా కార్మికులను, స్వయం ఉపాధి శ్రామికులను, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను, ప్రభుత్వ రంగ పరిశ్రమల లోనూ, ప్రభుత్వం లోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను, కార్మికులను, గత ఐదారేళ్లుగా కొత్తగా రంగం లోకి వచ్చిన గిగ్ అండ్ ప్లాట్ ఫారం శ్రామికులను, ముఖ్యంగా రవాణా రంగంలో వచ్చిన ఓలా , ఊబర్ లాంటి ప్రైవేట్ సంస్థలలో స్వంత కారుతో, లేదా కారు కిరాయికి తీసుకుని జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి కూడా క్యాబ్ నడుపుకుంటున్న వారిని ఇతర ప్రమాణాల రీత్యా పేదరికంలో ఉన్న వారిగా పరిగణించాల్సి ఉంటుంది. (ఇప్పుడు నాలుగు చక్రాల కారు / వాహనం ఉన్న వారిని రేషన్ కార్డు మంజూరు నుండీ మినహాయిస్తున్నారు) వారికి రేషన్ కార్డు మంజూరు చేయడానికి, ఇప్పటి వరకు అమలైన మార్గదర్శకాలలో వెంటనే మార్పులు చేయాల్సి ఉంటుంది.

కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డు జారీకి కుటుంబానికి ప్రస్తుతమున్న సంవత్సరానికి లక్షన్నర ఆదాయ పరిమితిని మూడు లక్షల రూపాయలకు,పట్టణ ప్రాంతాలలో సంవత్సరానికి ప్రస్తుతమున్న రెండు లక్షల ఆదాయ పరిమితిని మూడు లక్షల అరవై వేల రూపాయలకు పెంచాలి. ప్రభుత్వ , ప్రైవేట్ రంగాలలో ఈ వేతనం లోపు ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డు అందేలా చర్యలు చేపట్టాలి.

గ్రామీణ ప్రాంతంలో భూముల విలువలు పెరిగిన మాట నిజమే కానీ, వ్యవసాయం పై ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. NSSO నివేదిక ప్రకారం 5 ఎకరాల లోపు రైతు కుటుంబ ఆదాయం నెలకు 9400 రూపాయలు మాత్రమే. పైగా చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర భూములలో మాగాణి, మెట్ట భూముల వర్గీకరణ చేయడం లేదు. కాబట్టి, రేషన్ కార్డు జారీకి ఇప్పటి వరకూ ఉన్న మాగాణి మూడు ఎకరాలు, మెట్ట ఏడున్నర ఎకరాలు అనే నిబంధన తొలగించి , 5 ఎకరాలలోపు సన్న, చిన్న కారు రైతులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి.

ఇంట్లో ఉన్న గదుల సంఖ్యను బట్టి ఒక నిర్ధారణకు రావడం కూడా పారదర్శకంగా లేదు. ఇది కూడా అధికారుల విచక్షణపై మాత్రమే అమలయ్యే నిబంధన. సిబ్బంది అవినీతికి అవకాశం ఇచ్చే నిబంధన. కాబట్టి సిబ్బంది విచక్షణాధికారం నుండి దీనిని తొలగించి, ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా, 100 చదరపు మీటర్ల లోపు ఇళ్లను లేదా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉండే ఇళ్లను ( రెండిటిలో ఏదైనా ) రేషన్ కార్డు పొందడానికి అర్హమైన ఇళ్లుగా పరిగణనలో పెట్టుకోవాలని వచ్చిన ఒక సూచనను చర్చకు స్వీకరించాలి.

నిజానికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చిన్న ఇల్లు ఉండడం ఒక హక్కుగా మారాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో స్వంత ఇంటి విస్తీర్ణం పై రేషన్ కార్డు జారీకి నిబంధనలలో తగిన సవరణలు చేయాలి. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడం ఎంత అవసరమో, అనర్హులకు తొలగించడం కూడా అంతే బాధ్యతగా చేయాలి.

Tags:    

Similar News