వర్గీకరణ అంతులేని కథా? అంతు తేలే కథా?
మాదిగ ఉద్యమాన్ని రాజకీయ కక్ష్యలోకి పోనివ్వరా?;
- గురు మాతంగ
ముప్పై ఏళ్లకు పైగా... కనీసం మూడు తరాలుగా ... లక్షలాది గొంతులు .... వేన వేల డప్పులై మాదిగ (Madiga) పల్లెలు మానవ హక్కులు, స్వయం గౌరవ పరిరక్షణ కోసం నినదించాయి.పెద్దపులి దరువులై మోగాయి.విద్య,ఉద్యోగ రంగాల ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ (వర్గీకరణ) అవకాశాల కోసం మాదిగ బాల బాలికల దండోరా (Dandora), మహిళల దండోరా, విద్యార్థి, యువకుల దండోరా,నిరుద్యోగుల దండోరా,వ్యవసాయ కూలీల దండోరాలు మోగించారు.చలో హైదరాబాద్,చలో ఢిల్లీ,ఇలా అనేక చలోలు సాగించారు.మాదిగల యుద్ధభేరి,కురుక్షేత్రం,శంఖారావం ర్యాలీలు,సభలు,మహాసభలు అనేకం మాదిగలు నిర్వహించారు.
రోడ్డు మీద దండోరాలు, ఊరేగింపులు,అసంఖ్యాకమైన సభలు జరిగాయి.ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేశాయి.అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు,చట్టాలు చేశాయి. పౌర,రాజకీయ సమాజం,మీడియా, మేధావులు,సంఘాలు,సంస్థలు మాదిగల పంపిణీ న్యాయ ఆకాంక్షల ఉద్యమానికి అండగా నిలిచారు.
రెండు వేల సంవత్సరంలో నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) చట్టం చేసింది. వర్గీకరణ అమలైన నాలుగేళ్లలో, బాధిత ఎస్సీ కులాలకు కొంతమేరకు న్యాయం జరిగింది.
వర్గీకరణ వ్యతిరేకుల సామాజిక అన్యాయ కార్యక్రమాల వలన, రిజర్వేషన్ల హేతుబద్ధ పంపిణీకి తరచూ న్యాయపరమైన ఆటంకాలు కలుగుతూ వచ్చాయి. విద్య,ఉద్యోగ రంగాల అభివృద్ధిలో అత్యంత వెనకబడిన ఎస్సీ కులాల వారికి అత్యంత ప్రాధాన్యత, దామాషా ప్రాతినిధ్య న్యాయం కల్పించాలన్న మాదిగల ప్రజాస్వామిక ఆకాంక్షకు 2024 ఆగస్టు ఒకటి నాడు,సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఊపిరి పోసింది. రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం కోసం మాదిగలు చేస్తున్న సుదీర్ఘ కాల ఆందోళన ఒక పరిష్కార దిశకి వచ్చినట్లు కనిపించింది.
దేశ సామాజిక వ్యవస్థలో అత్యంత వెనుకబడిన సమూహాలుగా తమ అభివృద్ధి కోసం రాజ్యాంగం రిజర్వ్ చేసి పెట్టిన విద్య,ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ సంరక్షణలు (హక్కులు) సైతం తాము అందుకోలేని వ్యతిరేక పరిస్థితులు,మాదిగలతో పాటు,చాలా ఎస్సీ కులాలకు సవాళ్ళుగా,ఆటంకాలు గా నిలిచాయి. " రాజ్యం అందుబాటు ఉన్న కొన్ని ఎస్సీ కులాలే " యాభై తొమ్మిది ఎస్సీ కులాల మొత్తం రిజర్వేషన్లలో అత్యధిక భాగం వాటా తన్నుకుపోయే పరిస్థితుల వలన,మొత్తం ఎస్సీ కులాల మధ్య తీవ్ర సమానతలు ఏర్పడ్డాయి. దీనిని సరిదిద్ది,పంపిణీ న్యాయం ద్వారా అన్ని ఎస్సీ కులాల మధ్య ఏకరూప అభివృద్ధి సాధించాలన్న మాదిగల సామాజిక న్యాయ కాంక్షను అన్ని అధికార,అనధికార వ్యవస్థలు బలపరిచాయి.
ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ (వర్గీకరణ) శాసనిక ప్రక్రియ ముగింపు కోసం మాదిగలు,మిగతా ఎస్సీ కులాల వారు గత మూడు దశాబ్దాలకు పైగా మహోద్యమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కోసం వేగంగా చర్యలు చేసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Chief Minister A Revanth Reddy),ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) గారికి అభినందనలు చెప్పాలి.
2024 ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని, ఏకసభ్య విచారణా సంఘాన్ని నియమించింది.ఈ కమిషన్ సమర్పించిన నివేదికను ఫిబ్రవరి నాలుగు 2025 నాడు రాష్ట్ర మంత్రివర్గం,అసెంబ్లీ ఆమోదించింది.రానున్న రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన,చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆహ్వానించదగ్గవి.
కాగా,ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సంరక్షణల్లో సూక్ష్మ స్థాయి పంపకాల న్యాయం కోసం,స్వయంగౌరవ పరిరక్షణ కోసం వచ్చిన మాదిగ దండోరా మహోద్యమాన్ని దీర్ఘకాలిక అంతులేని కథగా,ఎవరి వలన,ఎవరితో మార్చబడి, న్యాయం వాయిదా వేయబడుతూ వున్నదో,మాదిగ కార్యకర్తలు, బాధిత సమూహాల ప్రజలు ఇప్పుడైనా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
(1) సామాజిక అసమానతలను కొనసాగించే ఆధిపత్య కులాల రాజకీయ,అధికార వ్యవస్థల వివక్షా విధానాలు కొనసాగుతున్నాయి (2) వీటిని అవకాశంగా వాడుకున్న వర్గీకరణ వ్యతిరేక ఎస్సీ ఆధిపత్య కులాల దుర్నీతి నడుస్తున్నది (3) మాదిగల వెనుకబాటుతనాన్ని తన స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏకవ్యక్తి నాయకత్వం వాడుకుంది.
ఒక పథకం ప్రకారం ఏక వ్యక్తి నాయకత్వ ప్రాధాన్యత,వ్యక్తి పూజ మాదిగ దండోరా ఉద్యమంలో పెంచి పోషించబడింది.నాయకుడు ఎమ్మార్పీఎస్ ని బలమైన సంస్థగా నిర్మాణం కానీకుండా,జాగ్రత్త పడ్డాడు.పొమ్మనకుండా పొగబెట్టి, సీనియర్ నాయకులందర్నీ వెళ్లగొట్టాడు.
ఎమ్మార్పీఎస్ (Madigar Reservation Porata Samiti: MRPS) లో సమిష్టి,మేధో నాయకత్వం లేకుండా చేశాడు.మాదిగ అనుబంధ కులాల,అణగారిన ఎస్సీ కులాల వర్గీకరణ ఉద్యమాన్ని, ఆకాంక్షల భావావేశాలను ప్రదర్శనకు పెట్టి,ఉద్యమాన్ని దీర్ఘకాలిక ప్రాయోజిత కార్యక్రమంగా మార్చివేశాడు. పథకం ప్రకారం వర్గీకరణను ఎడతెగని అంతులేని కథగా మార్చాడు.ఒకప్పుడు నిజమైన మాదిగ ఉద్యమం ఉండింది.ఈ రోజు నిజానికి మాదిగ ఉద్యమం లేదు.మాదిగ ఉద్యమం కాస్తా రాజకీయ ప్రాయోజిత కార్యక్రమంగా మార్చబడింది.
ఒకనాడు నిజమైన ఉద్యమ నాయకత్వం ఉండింది.ఈనాడు అది పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ (Event Manager) గా మారిపోయింది.ఈ రోజు ఆవేశంతో కూడిన మాదిగ ఆకాంక్షలు బ్రతికే ఉన్నాయి. మాదిగల,అణగారిన ఎస్సీ కులాల తీరని అవసరాలు,ఆకాంక్షల మీద ఉద్యమం పేరుతో ఉద్యమం కాని మోసపు రాజకీయాలను ఏకవ్యక్తి మాదిగ " నాయకత్వం " చేస్తున్నది. మహాజన ఫ్రంట్,మహాజన సంఘర్షణ సమితి,అణగారిన కులాల ఐక్య వేదిక,మహాజన సోషలిస్టు పార్టీలను స్థాపించి, తడవకొక ఆధిపత్య కుల రాజకీయ శిబిరం గెలుపు కోసమో,లేక ఓటమి కోసమో పని చేశాడు.
కొన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణను బలపరిచినాయి అన్న సాకుతో,వివిధ పాలక కులాల రాజకీయాలకు దండోరా నాయకత్వం అంటకాగింది. హక్కుల కోసం దశాబ్దాలుగా పదే పదే భంగపడి,సొంత నాయకత్వం చేతిలో కూడా మాదిగలు,ఇతర ఎస్సీ కులాల వారు మోసపోతున్నారు.మాదిగ యువకులు,విద్యావంతులు, ఇకనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ముందుకు రావాలి.
శాసనిక ప్రక్రియలో వర్గీకరణ వ్యతిరేకుల నుంచి ఎలాంటి ప్రమాదాలు మాదిగలకు,ఇతర వెనకబడిన ఎస్సీ కులాలకు పొంచి ఉన్నాయి? (1) అధికార వ్యవస్థలను ప్రభావపరిచి,వర్గీకరణ ప్రక్రియ శాస్త్రీయంగా జరగనీయకుండా చెయ్యవచ్చు (2) ప్రతీ గ్రూప్ లోనూ అభివృద్ది చెందిన వర్గీకరణ వ్యతిరేక సమూహాలను చేర్పించి,అసలు వర్గీకరణ ఉద్దేశ్యాన్ని నీరుగార్చవచ్చు (3) బాధిత సమూహాల వారికి, వారి వాస్తవ శాతానికి తగ్గ నిష్పత్తిలో విద్య,ఉద్యోగాల ప్రాతినిధ్య న్యాయం జరగనీయకుండా చెయ్యవచ్చు (4) ప్రభుత్వాన్ని న్యాయపరమైన,రాజ్యాంగ లొసుగుల శాసనిక ప్రక్రియ వైపు నడిపించి,వాటి సాకుతో మళ్ళా న్యాయపరమైన వ్యాజ్యాలకు పూనుకొని,బాధిత కులాలకు మరింత అన్యాయం జరిపించవచ్చు.ఇన్ని అన్యాయమైన కుయుక్తులను వర్గీకరణ వ్యతిరేక కులాల నుంచి మాదిగ,సహ కులాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.మాదిగలు చేసే పోరాటం ఏ వ్యక్తికీ,ఏ కులానికి వ్యతిరేకం కాదు.మానవ గౌరవం కోసం,కోల్పోయిన రాజ్యాంగ హక్కులను తిరిగి పొందడం కోసం మాత్రమే.
సమాజంలో అత్యధిక సంఖ్యాకులైన మాదిగలు,ఎస్సీ సహ కులాల ప్రజలు కేవలం విద్య,ఉద్యోగ భాగస్వామ్య హక్కుల సాధన కోసం అంతులేని సమయాన్ని,శక్తులను దీర్ఘ కాలం ధారపొయ్యడం సరైంది కాదు.ఇన్ని దశాబ్దాల సమయం,శక్తి,తెలివి రాజకీయ సాధికారం కోసం వెచ్చించి ఉంటే,మాదిగలకు ఎప్పుడో రాజ్యాధికారం వచ్చి ఉండేది.లేదా అధికారంలో భాగస్వాములై ఉండే వారు.
మాదిగలు ఇప్పటికైనా, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా మారాలి.కమ్యూనిటీలో అపారమైన మానవ వనరులు ఉన్నాయి.విద్యావంతులు,అధికారులు,గాయకులు,నాయకులు,కళాకారులు,తత్వవేత్తలు,ప్రసంగీకులు, ఆర్గనైజర్లు,ఆర్థిక సహాయం అందివ్వగలిగే వారు,కవులు, రచయితలు,ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు.వీరంతా,ఒక రాజకీయ దార్శనికత,రాజకీయ కార్యక్రమం,రాజకీయ సంస్థ కలిగి,స్వతంత్ర రాజకీయ సమన్వయంతో కృషి చెయ్యగలిగితే,సమిష్టి రాజకీయ నాయకత్వాన్ని నిర్మించుకోగలిగితే, మాదిగలు తమ మెరుగైన భవిష్యత్ ను తామే నిర్ణయించ గలరు.ఫలితానికి వచ్చిన ఉద్యమం చేసినవారౌతారు.