పెన్షన్లు సరే, ఉపాధి సంగతేమిటి?

కన్నెగంటి రవి విశ్లేషణ: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే సాంఘిక భద్రత ఒక్కటే సరిపోదు. పెన్షన్‌దార్లు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలి.

Update: 2024-06-17 07:03 GMT

ఆంధ్ర ప్రదేశ్‌లో 65 లక్షల 39 వేల మంది పింఛన్ దారులకు ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న సాంఘిక భద్రత పెన్షన్‌ను ఇకపై NTR భరోసా పేరుతో మరింత పెంచి ఇవ్వడానికి నూతనంగా ఎన్నికైన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 13న జీవో నెంబర్ 43ను కూడా విడుదల చేసింది.

వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్‌లు, చర్మ కారులు, హెచ్ఐవీ బాధితులు, డప్పు కళాకారులు, ఇతర కళాకారులకు ఇప్పటి వరకూ అందుతున్న నెలకు 3000 రూపాయల పెన్షన్‌ను ఏప్రిల్ 2024 నుంచి రూ.4 వేలకు పెంచి అందిస్తారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రావాల్సిన మూడు నెలల బకాయిలు రూ.3 వేలను కూడా జూలై నెల పెన్షన్‌తో కలిపి అందిస్తారు.

వికలాంగులకు, కుష్టు వ్యాధి గ్రస్తులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.3 వేల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచి జులై నుంచి అమలు చేస్తారు. పక్షవాతానికి గురైన వారు, కండరాల సమస్యలు, ప్రమాదాలలో గాయపడి పూర్తిగా మంచానికి పరిమితమైన, లేదా వీల్ చైర్‌లో ఉండే వారికి ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.5 వేలను పెంచి జులై నుండీ 15,000 రూపాయలు అందిస్తారు. బోదకాలు, కిడ్నీ ,లివర్, గుండె మార్పిడి లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇప్పటి వరకూ అందిస్తున్న 5,000 రూపాయల పెన్షన్‌ను జూలై నుండీ 10,000 రూపాయలకు పెంచి అందిస్తారు.

ఇప్పటి వరకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ పొందుతున్న డయాలసిస్, తలసేమియా,హెమోఫిలియా, సికిల్ సెల్ బాధితులకు అదే పెన్షన్‌ను కొనసాగిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు, మాజీ సైనికులకు ఇప్పటి వరకు అందిస్తున్న 5,000 రూపాయల పెన్షన్‌ను, అభయహస్తం క్రింద అందిస్తున్న 500 రూపాయల పెన్షన్ ను యథాతథంగా కొనసాగిస్తారు. ఇప్పటి వరకూ ఈ పెన్షన్‌లను అందించడానికి నెలకు 1,939 కోట్లు ఖర్చవుతోంది. పెరిగిన మొత్తాల వల్ల ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు, సంవత్సరానికి 33,099 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

సమాజంలో 60 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు , స్వంతంగా తమ పని తాము చేసుకోలేని శారీరక వైకల్యం ఉన్నవారికి, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, జానపద కళాకారులకు వయోపరిమితితో సంబంధం లేకుండా సాంఘిక భద్రతను పెన్షన్ రూపంలో అందించడం ప్రభుత్వాలు చేయాల్సిన మొదటి కర్తవ్యాలలో ఒకటి. రాష్ట్ర కనీస వేతనంలో 50 శాతం మొత్తాన్ని ఇలా పెన్షన్‌గా అందించాలని పెన్షన్ ఫౌండేషన్ లాంటి సంస్థలు చాలా కాలంగా కోరుతున్నాయి.

ఆహార భద్రత కోసం వీరికి ఆహార భద్రత కార్డులు కూడా తప్పకుండా అందించాలి. పేదల కోసం గృహ నిర్మాణం లాంటి పథకాలలో వీరికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. వీరి భౌతిక కదలికలకు ఉపయోగపడే పరికరాలు, యంత్రాలు సమకూర్చడం కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. బస్సు, రైలు లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థలలో వీరి ఉచిత ప్రయాణానికి పాస్ లు కూడా సమకూర్చాలి. ఇవన్నీ వారికి జీవితం పై భరోసా ఇస్తాయి. మనో నిబ్బరాన్ని అందిస్తాయి. ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి.

సమాజంలో మిగిలిన ప్రజా సమూహాలకు ప్రభుత్వం చెల్లించే సాంఘిక భద్రత పెన్షన్ చెల్లింపు అవసరమే కానీ, అదే వారికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోకూడదు. 18-60 సంవత్సరాల మధ్య ఉండే ఆరోగ్యకరమైన స్త్రీ, పురుషులకు అవసరమైన జీవనోపాధి ప్రాథమిక హక్కుగా లభించాలి. వ్యవసాయం, పశుపోషణ, స్వయం ఉపాధితో పాటు, కనీస వేతనాలు సహా కార్మిక చట్టాలన్నీ అమలయ్యే వస్తు ఉత్పత్తి,సేవా రంగం, ప్రభుత్వ , ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, కుటుంబ కుల వృత్తులుగా ఇప్పటికీ కొనసాగుతున్న చేతివృత్తులు లాంటివి ఈ జీవనోపాధుల క్రిందికి వస్తాయి.

కోట్లాది మందికి జీవనోపాధి కల్పించే ఈ రంగాలన్నిటినీ కాపాడడం, వాటిలో పని చేస్తున్న వారికి తగిన ఆదాయలు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. స్వంతంగా పని చేసుకోవడానికి అవసరమైన భూమి, నీరు, అడవులు, ఖనిజాలు లాంటి సహజ వనరులపై ఆయా ప్రాంతాల సాధారణ ప్రజలకు హక్కులు కల్పించడం ఇందులో మొదటి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఆయా కుటుంబాలు తగిన ఆదాయాలతో , చట్టబద్ధ హక్కులతో హాయిగా జీవిస్తాయి. ప్రభుత్వాలు విద్యా, వైద్యం లాంటివి ప్రభుత్వ రంగంలో ప్రజలకు ఉచితంగా అందిస్తే ఆ మేరకు, ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చు .

1970 దశకంలో భూ సంస్కరణలను అమలు చేయడానికి తీసుకు వచ్చిన భూ గరిష్ట పరిమితి చట్టం, కౌలు రైతుల చట్టం, అసైన్డ్ భూమి హక్కు దారుల చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటివి అమలు చేస్తే గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల కుటుంబాలకు సహజ వనరులపై హక్కులు లభిస్తాయి. ఆ వనరులు ఆయా కుటుంబాలకు మెరుగైన జీవనోపాధిని అందిస్తాయి. పశువుల పోషణ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అది ఆయా కుటుంబాల ఆదాయ బధ్రతకు దారి తీస్తుంది.

జీవనోపాధుల కల్పన, ఆదాయాల పెంపు క్రమం సరిగా ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి . పౌష్టికాహారం తీసుకోవడానికి కూడా ఆయా కుటుంబాలకు చైతన్యం, ఆర్ధిక వెసులు బాటు ఉంటుంది. కొన్ని అనివార్య పరిమితులలో స్వయం కృషి ద్వారా ఇవి పొందలేని వారికి అనివార్యమైన పరిస్థితులలో ప్రభుత్వాలు అందించే సాంఘిక బధ్రత పెన్షన్ ఆసరాగా ఉంటుంది.

కానీ, గత నాలుగు దశాబ్ధాలుగా ప్రభుత్వాలు ప్రజల జీవనోపాధుల మెరుగుదల గురించి, ఆయా కుటుంబాల ఆదాయ భద్రత గురించి ఆలోచించడం తగ్గించాయి. దీర్ఘ కాలిక దృష్టితో కాకుండా తక్షణ ఉపశమనం అందించే పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. మెజారిటీ ప్రజలను ఒక ఫిక్సెడ్ బాస్కెట్‌లో కుదించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకడం కాకుండా, సమగ్ర ఆర్ధికాభివృద్ధి కాకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను ఓటర్లుగా చూస్తూ, వచ్చే ఎన్నికలలో ఓట్ల ప్రయోజనం పొందే వైపు పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. తెలంగాణ లో 57 సంవత్సరాలకు, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో SC, ST లకు 50 సంవత్సరాలకే పెన్షన్ లాగా, క్రమంగా వయోపరిమితిని తగ్గిస్తూ, సమాజంలో పెద్ద సంఖ్యలో వ్యక్తులకు జీవనోపాధి హక్కులు కాకుండా, సాంఘిక భద్రత పెన్షన్ మాత్రం అందించాలనే ప్రయత్నం ఇందులో భాగమే.

వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాల ఆదాయం పెరగక పోవడానికి, ఆయా కుటుంబాలు పండించే పంటలకు, ఇతర ఉత్పత్తులకు న్యాయమైన ధరలు అందకపోవడం. ఫలితంగా స్వంత భూమి ఉన్న రైతు కుటుంబాలు కూడా పేదరికం లోనే ఉంటున్నాయి. అప్పుల లోనే కుంగుతున్నాయి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ అందుకే వచ్చింది.

వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామని భావించే గ్రామీణ ప్రాంత భూమి లేని ,లేదా తక్కువ భూమి ఉన్న కుటుంబాలకు సహజ వనరైన భూమిని హక్కుగా అందించడానికి పూనుకోవడం లేదు. అడవిపై పూర్తి హక్కులను ఆదివాసీలకు కల్పించడానికి పూనుకోవడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ భూమి లేని వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా ఉండడానికి ప్రభుత్వాల ఈ వైఖరే కారణం.

వ్యవసాయ రంగంలో కూలీ రేట్లు కూడా ఆయా కుటుంబాల కుటుంబ పోషణ ఖర్చులకు అనుగుణంగా పెరగడం లేదు. పైగా రైతులు ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునే పేరుతో, కలుపు నివారణకు రసాయనాలు వినియోగించడం, వ్యవసాయంలో యంత్రీకరణ వల్ల కూలీలకు పనులు తగ్గి పోతున్నాయి. దీంతో చాలా మంది నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.

ఈ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, యధాలాపంగా ఆయా కుటుంబాలలో కొందరికి పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. భూమి పంపిణీ చేస్తే రెగ్యులర్ ఆదాయమే కాకుండా, భూమి విలువలు కూడా లక్షల్లో పెరుగుతాయి. భూమి ఊసెత్తకుండా కేవలం సాంఘిక బధ్రత పెన్షన్ మాత్రమే ఇస్తే అది వందల్లో కూడా ఎప్పటికీ పెరగదు. పైగా ప్రతి నెలా ప్రభుత్వాల దాయా దాక్షణ్యాల మీద పెన్షన్ కోసం ప్రజలు ఆధార పడాల్సి ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా విస్తరించిన మద్యం వ్యాపారం, తాటి , ఈత కల్లు వ్యాపారాన్నితద్వారా గీత కార్మికుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. పెరిగిన మద్యం వ్యాపారం వ్యాపారులకు లాభాలను, ప్రభుత్వాలకు పన్నులను,డాక్టర్లకు ఫీజులను, పార్టీలకు చందాలను పెంచి ఉండవచ్చు కానీ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నది. మహిళలపై హింసని పెంచుతున్నది. తాటి, ఈత చెట్ల నుండీ వచ్చే ఆరోగ్య కరమైన నీరా పానీయంగా, బెల్లం గా, ఇతర పోషక విలువలు కలిగిన ఆహారంగా ఉపయోగ పడుతుంది. వీటికి ప్రోత్సాహం లభిస్తే ఆయా కుటుంబాలు నిలదొక్కుకుంటాయి. కానీ ప్రభుత్వం వీటికి ప్రోత్సాహం ఇవ్వకుండా గీత కార్మికులకు పెన్షన్ మాత్రమే ఇస్తున్నది.

చేనేత వృత్తి కూడా అంతే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న చేనేత మరమగ్గాలను, చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నది. ఆయా కుటుంబాలకు చేతి నిండా పని కల్పించడం, వారికి నూలు, రంగులు లాంటివి తక్కువ ధరలో సరఫరా చేయడం, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం లాంటి చర్యలు ఆయా కుటుంబాలకు నికర ఆదాయాన్ని పెంచుతాయి. కేవలం సాంఘిక బధ్రత పెన్షన్ మాత్రమే వారిని ఆదుకోలేదు.

ఇప్పటికీ కుల వృత్తులుగా కొనసాగుతున్న మత్స్యకారులకు, చర్మ కారులకు కూడా వారి జీవనోపాధుల మెరుగుదలకు అవసరమైన చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. ఆయా కుటుంబాలు వృత్తి పరమైన పనులు చేసుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన చేయాలి. బ్యాంకుల నుండీ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి. ఇవేవీ చేపట్టకుండా, వారికి కేవలం సాంఘిక భద్రత పెన్షన్ తోనే సరి పెట్టడం సరి కాదు.

వితంతు, ఒంటరి మహిళలకు,ట్రాన్స్ జండర్ లకు పెన్షన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, వారి పోషణకు అవసరమైన ఆదాయం సమకూర్చుకోవడానికి జీవనోపాధుల కల్పన పై దృష్టి సారించాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే ఉమ్మడి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా కేరళ కుటుంబశ్రీ తరహాలో సాగు భూములను కౌలుకు ఇప్పించాలి.పెట్టుబడిగా పంట రుణాలు ఇప్పించాలి. పశు పోషణకు సహకరించాలి. నగరాలలో అన్న క్యాంటీన్ లాంటి వాటిని నిర్వహించడానికి అవకాశం కల్పించాలి. హెచ్ఐవి బాధితులను మిగిలిన దీర్ఘకాలిక రోగుల జాబితాలో చేర్చి, వారికి 10,000 రూపాయల పెన్షన్ అందించాలి.

సమాజంలో సగానికి పైగా ఉన్న పేద కుటుంబాలకు నెలకు ఐదు కిలోల ఉచిత బియ్యం, ఒక ఆరోగ్యశ్రీ కార్డు, సాంఘిక బధ్రత పెన్షన్ మాత్రం ఇచ్చి, సహజ వనరులన్నీ కంపెనీలకు, వ్యవసాయంతో సంబంధం లేని వారికి కట్టబెట్టాలనే అభివృద్ధి నమూనాను ప్రభుత్వాలు మార్చుకోవాలి. ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే, ప్రజలకు జీవనోపాధులు, నికర ఆదాయలు ముఖ్యం. సాంఘిక భద్రత ఒక్కటే సరిపోదు.

Tags:    

Similar News