‘ఫాసిజం’ హిందూ జాతీయవాద రాజకీయాలను ప్రభావితం చేసిందా?
ఇటలీ ప్రొఫెసర్ మార్జియా కాసోలారి విశ్లేషణ
Update: 2025-10-21 08:02 GMT
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్లుప్తంగా ఆర్ఎస్ఎస్ అనే పేరుతో పిలుస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం శతాబ్ధి(వంద సంవత్సరాలు) వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హిందూ జాతీయవాద రాజకీయాలపై ఇటాలియన్ ప్రొఫెసర్ మార్జియా కాసోలారి ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు.
ఇటాలియన్ ఫాసిజం, బీఎస్ ముంజే, సుభాష్ చంద్రబోస్ వంటి కీలక భారతీయ నాయకుల మధ్య సంబంధాలను, హిందుత్వ సంస్థలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని ఆమె వివరణాత్మక సంభాషణలో వివరించే ప్రయత్నం చేశారు.
1930 లలో భారతీయ హిందూ జాతీయవాద నాయకులు ఫాసిజం నుంచి ఎంత వరకూ ప్రేరణ పొందారు?
1931 లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తరువాత బీఎస్ మూంజే(హిందూ మహాసభ నాయకుడు, హెడ్గేవార్ గురువు) ఇటలీని సందర్శించి ముస్సోలిని కలిశారు. మూంజే ఇటాలియన్ సైనిక అకాడమీలు, బలిల్లా, అవాంట్ గార్డ్, ఆర్ఎస్ఐ వంటి మిలిటెంట్ యువజన సంస్థలను కూడా సందర్శించారు.
ఈ గ్రూపులు యువతను పారామిలిటరీ శిక్షణతో వారిని ఫాసిస్టు ఆదర్శాలలో లాగుతున్న తీరును నిశితంగా గమనించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసి సైనికీకరించడం, హిందూకరణను ప్రొత్సహించడం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ను పునర్మించాలని తాను అనుకున్నానని మూంజే రాశారు.
మూంజే విధానం, ఆర్ఎస్ఎస్ ను దాని వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ ను ఎలా ప్రభావితం చేశారు?
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ కు మూంజే గురువు. లండన్ పర్యటన తరువాత మహారాష్ట్రలో భోంసాల సైనిక పాఠశాల వంటి సంస్థలను స్థాపించడంలో సహాయం చేశారు.
ఇటలీలో మూంజే గమనించిన దానిని కొనసాగిస్తున్నట్లుగా హిందూ యువతకు సైనిక శిక్షణ, సిద్ధాంతపరమైన శిక్షణ ఇవ్వడమే వీరి లక్ష్యం. సైనికీకరణ, హిందూకరణపై ఈ ద్వంద్వ దృష్టి ప్రారంభ ఆర్ఎస్ఎస్ వ్యూహంలో ప్రధాన లక్షణంగా మారింది.
భారత జాతీయవాద నాయకులకు, ఇటాలియన్ ఫాసిస్టులకు ఇంతకుముందు కూడా సంబంధాలు ఉన్నాయా?
20 వ శతాబ్ధం ప్రారంభంలోనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇటలీలో పర్యటించారు. ఠాగూర్ శాంతికాముకుడు. అయితే కార్లో ఫార్మిచి,గియుసెప్పి టుస్సీ వంటి ఇటాలియన్ పండితులు ఆయన పర్యటనను తమ ప్రచారం కోసం వాడుకున్నారు.
ఠాగూర్ ఫాసిజానికి మద్దతుగా ఉన్నాడని ప్రచారం చేశారు. ఇది భారతీయ మేధావులలో కొత్త ఆలోచన కలగజేయడం, బ్రిటిష్ అధికారాన్ని అణగదొక్కడానికి ఇటలీ విస్తృత వ్యూహంలో భాగంగా చెప్పవచ్చు.
భారత్ లో ఇటలీ నాయకుడు గియుసేప్ టుస్పీ పాత్ర ఏంటీ?
టుస్సీ ఒక ప్రముఖ ఇటాలియన్ పండితుడు. ఆయన పర్యటనకు మొత్తం ఖర్చు ఇటలీ ప్రభుత్వమే భరించేది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన ఒక ప్రొఫెసర్ గా నియమితుడై ఇటాలియన్ ఫాసిజాన్ని ప్రొత్సహించేవారు.
యువ భారతీయ మేధావులను తన వైపు తిప్పుకుని మేధావులతో విస్తృతమైన నెట్ వర్క్ ను నిర్మించారు. తమ పాలనకు స్థానిక మద్దతుదారులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత్, పశ్చిమాసియాలో ఇటలీ రూపొందించిన బ్రిటిష్ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఉంది.
ఫాసిజం ప్రచారానికి ఇటాలియన్ కాన్సులేట్లు ఎలా దోహదపడ్డాయి?
వలసరాజ్యాల కాలంలో ఇటలీ రాయబార కార్యాలయాలు కాకుండా కాన్సులేట్లను నిర్వహించింది. కలకత్తా కాన్సులేట్ ఫాసిస్ట్ ఆలోచనలను ప్రొత్సహించడానికి పూనుకుంది. ఇందుకోసం అమృత బజార్ వంటి పత్రికలకు నిధులు సమకూర్చింది.
తరువాత బొంబాయి కేంద్రంగా మరొకటి ప్రారంభించారు. ఇది బ్రిటిష్ వారికి తెలుసు కానీ చర్యలకు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికి కొంతమంది కాన్సులేట్ అధికారులను బహిష్కరించారు.
ఫాసిస్ట్ లకు సుభాష్ చంద్రబోస్ కు ఉన్న సంబంధం ఎలా ఉంది? మీరు వివరింగలరా?
1933 లో రోమ్ లో జరిగిన ఆసియా విద్యార్థుల కాంగ్రెస్ ను నిర్వహించడానికి, ఇంకా అనేక విషయాల మీద సుభాష్ చంద్రబోస్ ఇటలీని చాలాసార్లు సందర్శించారు. గియోవన్నీ జెంటైల్ పోషకత్వంలో ఉన్న ‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ది మిడిల్ అండ్ ఎక్స్ ట్రీమ్ ఓరియంట్’ తో బోస్ కు సత్సంబంధాలు ఉన్నాయి.
ఇది ఇటాలియన్ ప్రచారానికి కేంద్రంగా కూడా పనిచేసింది. బోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత్ లో బ్రిటిష్ పాలనను పడగొట్టడంలో సహాయపడతాయని ముస్సోలిని ఆశించాడు. జాతి వివక్ష కారణంగా నాజీ జర్మనీ నుంచి బోస్ కు ఆశించిన సాయం అందలేదు
బోస్ ఫాసిజాన్ని స్వీకరించాడా?
భారత స్వాతంత్య్ర సమరయోధుడు పూర్తిగా ఫాసిస్టు కాదు. అతను ఒక సంకర జాతి సిద్దాంతాలను మిళితం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి ప్రయత్నించాడు.
అందుకోసం సోషలిజాన్ని, ఫాసిస్టు ప్రభుత్వాలను వ్యూహాత్మక పొత్తులతో మిళితం చేశాడు. భారత్ లో ఫాసిస్టు పాలనను అమలు చేయడం, బ్రిటిష్ వారిని తరిమికొట్టడం ఆయన లక్ష్యం.
ఇప్పటి హిందూ జాతీయవాద సంస్థలలో ఫాసిస్టు ప్రభావం ఉందా?
నేడు హిందూత్వ సంస్థలు కొన్నిసార్లు యూరోపియన్ ఫాసిస్టుల పద్దతులను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీలు లక్ష్యంగా చేసుకున్నాయి. ముస్లింలు, క్రైస్తవులపై జరిగే దాడులు ఈ కోవలోకి చెందినవే.
ఇవి ఫాసిజం లోని పారామిలిటరీ, సైద్దాంతిక వ్యూహాలను ప్రతిబింబిస్తాయి. ప్రత్యర్థులను అణగదొక్కడానికి తమ క్రమశిక్షణ, వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ కు భారత్ మద్దతు ఇవ్వడంలో ఏదైన అంతరార్థం దాగి ఉందా?
యూదులకు, సమకాలీన జియోనిజానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఆధునిక మితవాద జియోనిజం ఫాసిజం నాటి పద్దతులను గుర్తుకు తెలుస్తోంది. వాటిలో జాతీయవాద తీవ్రవాదం వంటివి ఉన్నాయి.
భారతీయ మద్దతు చారిత్రక హిందూత్వ భావజాలానికి విరుద్దంగా కాకుండా ప్రస్తుత రాజకీయ వ్యూహాంతో ముందుకు వెళ్తోంది. ఇటాలియన్ ఫాసిజం, భారతీయ హిందూ జాతీయావాద రాజకీయాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అవి స్థానికంగా ఎలా మార్పు చెందాయి. వాటితో రాజకీయాలు ఎలా ప్రభావితం అయ్యాయే తెలుస్తోంది.