లొంగుబాటు...వెన్నుపోటు!

"లొంగుబాటు మీద బైట ఏసీ గదుల్లో కూర్చుని ఏడ్వడం సబబు కాదేమో!"

Update: 2025-10-19 04:59 GMT
మన్యంలో ఒక చోట అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గిర వ్యాస రచయిత

అన్నల అడ్డా బస్తర్ లో, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగాడిన కొయ్యూరు లో ఒక్క వారం రోజుల వ్యవధిలో తిరిగివచ్చాను. అనుకోకుండా అట్లా జరిగినా, రెండు చోట్లా నేను మావోయిస్టుల గురించే బాగా ఆలోచించాను.

వారిదీ, ఆయనదీ ఒకటే బాట...తిరుగుబాటు, ఒకటే మాట...విప్లవం. ఆయనా, వారూ గిరిజనులు కేంద్రంగా పనిచేశారు. ఆయనేమో భరత మాత దాస్య శృంఖలాల విముక్తి కోసం అహరహం తపిస్తే, వారు దోపిడీ నుంచి తాడిత, పీడిత ప్రజల విముక్తి కోసం... భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం ఉద్యమించారు. ఆయన శత్రువు తెల్లవాడు, వీరి శత్రువు మనవాడే.
నక్సల్ ఉద్యమం పుట్టుక, వ్యాప్తి గురించి చదివి, దగ్గరి నుంచి చూసి, వార్తలు రాసి, నలుగురితో చర్చోపచర్చలు చేసిన వాడిని నేను. ఉద్యమం వల్ల ఉన్న లాభాలు, జరిగిన నష్టాలు, సూత్రధారులు పాత్రధారుల గురించి కొద్దోగొప్పో తెలిసిన వాడిని. బూటకపు ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతే కలత చెందే నేను... వర్గపోరాటం పేరుతో అన్నలు పోలీసులను గానీ, ప్రజాదరణ ఉన్న ప్రజా ప్రతినిధులను గానీ చంపితే అంతే బాధపడతాను. సొంత బుర్ర పెట్టకుండా... ఎవడేమి చెబితే అది నమ్మి... బీరు, బిర్యానీ కి ఓట్లు అమ్ముకునే వారే ఎక్కువగా ఉన్న ఈ స్వార్థ ప్రపంచంలో జనాల కోసమంటూ మావోయిస్టులు అడవుల్లో నానా చావులు చావడం నాకు క్షోభ కలిగిస్తోంది. పీడిత, తాడిత జనం కోసం పోరాడుతూ పిట్టల్లా వాళ్లు మరణిస్తే...ఇది ఘోరం అనిగాని, అయ్యో పాపం... అనిగాని అంటూ మూకుమ్మడిగా రోడ్లకెక్కే
విద్యార్థులు, యువకులు కరువయ్యాక ఈ త్యాగాలు వ్యర్థం అని అనిపించింది.
రోజులు మారినా, సాంకేతికత పెరిగి పోలీసులు, భద్రతాదళాలదే పైచేయి అయినా అన్నలు మొండి పోరాటం చేయడం నాకు గత పది, పదిహేనేళ్లుగా నచ్చడంలేదు. చాలా చోట్ల గిరిజనులు ఉద్యమకారులతో చేయి కలపడం వల్ల గూడేలకు గూడాలు పోలీసు పదఘట్టనలతో నలిగిపోవడం ఇబ్బంది కలిగిస్తోంది.
అయినా, విప్లవ పాటలు పాడి పోరగాళ్లను రెచ్చగొట్టినవాళ్ళు తూచ్... అని బయటికి వచ్చి దర్జాగా బతికి చస్తుంటే... కుటుంబాలను వదిలి సిద్ధాంతం కోసం ఏళ్లతరబడి అడవుల్లో క్షణమొక నరకంగా బతికి కేంద్ర బలగాల ఏరివేతలో భాగంగా మరణిస్తున్న ఘోరం ఇబ్బంది పెడుతోంది. కృష్ణపట్టి లో అన్నలు తిరుగుతున్నారంటే... రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేసిన సంగతి నేను చూడనిది కాదు. అయినా, అననుకూల పరిస్థితులు దాపురించినపుడు బయటపడడం మంచిపనే అని అనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో, అన్నల ప్రాబల్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి గురించి స్థానికులతో మాట్లాడతాను. వెళ్ళిన రోజే జగదల్పూర్ లో ఒక నిష్పాక్షిక విశ్లేషకుడిని కలిశాను. "ఛత్తీస్గఢ్ లో ఉన్న అందరు గిరిజనులు కోసం అన్నలు పోరాడినట్లు నాకు అనిపించడం లేదు. మైనింగ్ జరిగే ఏరియాలోనే వారు ఎక్కువగా ఫోకస్ చేసి వనరులు సేకరించుకుంటున్నారు," అని ఆయన చెప్పారు. అది పసలేని వాదన అని నేను అనుకున్నాను.
మొన్నీమధ్య దాకా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రభావంతో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మరుసటి రోజు ఉదయం కలిశాడు. ఆయన్ను గ్రౌండ్ రిపోర్ట్ కోసం అడిగాను. లొంగిపోయిన నక్సలైట్లు కాంట్రాక్టర్లుగా మారుతున్నారని, అందుకే తన మనసు విరిగిందని ఆయన చెప్పాడు. నక్సల్స్ ఆపరేషన్ లో డబ్బు పాత్ర ఉన్నదని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. విరాళాలు సేకరించడం మావోయిస్టులకు కొత్త కాకపోయినా, మరీ ఇంత చెడ్డపేరు తెచ్చుకోవడం బాగోలేదు. భాష సమస్య వల్ల స్థానికులను ఉద్యమం గురించి అడగలేక పోయాను. బస్తర్ టాకీస్ జర్నలిస్టును ప్లానింగ్ లోపం వల్ల కలవలేకపోయాను. ఒక పెద్ద సర్వే చేస్తే తప్ప ఉద్యమం గురించిన క్షేత్ర వాస్తవాలు బోధపడవు.
ప్రస్తుతం ఉన్న ముప్పేట దాడి లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోకుండా లొంగిపోవడం మంచిదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. విప్లవ వాతావరణం ఇప్పుడు లేదనీ, ప్రజల కోసం జీవితాలు ఫణంగా పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడని అన్నలు ప్రజాస్వామ్యయుతంగా గళం వినిపిస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి నిబద్ధత గల గళాలు ఇప్పుడు సమాజానికి చాలా అవసరం. అంత మాత్రాన విప్లవం నశించినట్లు కాదు, సవాలక్ష సమస్యలు చుట్టుముట్టి బతుకు అగమ్యగోచరం అయ్యాక గానీ మళ్ళీ జనం తుపాకి రాజ్యం గురించి ఆలోచించరు. అప్పటిదాకా నేలవిడిచి సాము చేయడం తప్పేమో!
జగదల్పూర్ అడవుల్లో కొద్దిగా తిరిగి వచ్చాక మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం సల్పిన కొయ్యూరు ప్రాంతం లో తిరుగుతున్నప్పుడు విప్లవం, ఉద్యమాల గురించి మనసు, మెదడు తర్జనభర్జన అయ్యాయి. అప్పుడే కొన్ని విరుద్ధ భావనలు కలిగాయి.
ఇప్పుడు మావోయిస్టులు ఎదుర్కొంటున్న లాంటి విపరీత నిర్బంధం ఉన్న వాతావరణంలోనే సీతారామరాజు గారి పోరాటం నడిచింది. కొండ గుహలో ఉండి, పెద్ద సంఖ్యలో గిరిజనులను సమీకరించి ఆయన యుద్ధం చేశారు. మంప అనే ప్రాంతంలో ఆయన్ను పట్టుకుని, బందీగా నాలుగైదు కిలోమీటర్లు రెక్కలు విరిచి మంచానికి కట్టి నడిపించి రాజేంద్రనగరం అనే చోట కాల్చి చంపినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఈ కింది ప్రశ్నలు ఉదయిస్తాయి.
1) ఇప్పటి మావోయిస్టుల మాదిరిగానే సీతారామరాజు గారు కూడా తుపాకులకు భయపడి లొంగిపోయి ఉండాల్సిందా?
2) అట్లా లొంగిపోయి ఉంటే ఆయన మరికొంత కాలం ప్రజలను చైతన్యవంతులను చేసే అవకాశం ఉండి ఉండే ఉండేదా?
3) సీతారామరాజు గారు ఆత్మార్పణం చేయబట్టే కదా... ఆయన 1924 లో బ్రిటిష్ సైన్యం చేతిలో హత్యకు గురైనా ఇప్పటికీ మన హృదయాల్లో సజీవంగా ఉన్నారు?
4) ఆయన హత్య స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది కదా?
ఒక్కోసారి... బతికి పోరాడేకన్నా....పోరాటంలో
చచ్చి సాధించేదే ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుందని చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
అర్జెంటీనా విప్లవ జ్వాల చే గువేరా 1967 లో బొలీవియా సైన్యం చేతిలో అమరుడయ్యాడు. దానికి మూడు రోజుల ముందు అమెరికా నిఘా సంస్థ పన్నిన పద్మవ్యూహం నుంచి చే ను బయటకు తీసుకు వచ్చేందుకు సోవియట్ రష్యా రక్షణ శాఖ ఎంతో ప్రయత్నం చేసినా ఆయన పడనివ్వలేదు. తన తోటి కామ్రేడ్స్ ను వదిలిరానని ఆయన మొండిపట్టు పట్టి అక్కడే ఉండిపోయాడట. ఇది జరిగిన మూడు రోజులకే బొలీవియా సైనికుల చేతికి చిక్కి హత్యకు గురయ్యారు చే. శత్రువు చుట్టు ముట్టినా.. తన సహచరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా.. చావు / ఓటమి తప్పదని తెలిసినా అమరత్వం వైపే అడుగులు వేశాడు ఆయన. అందుకే కోట్ల మంది గుండెల్లో, మన యువకుల టీ షర్టుల మీద చే ఇంకా ధీమాగా దర్శనం ఇస్తున్నారు. ఇది వ్యూహాత్మక ఆత్మార్పణం!
గెరిల్లా ఉద్యమాల్లో వ్యూహాత్మక వెనకడుగులు ఓకే గానీ, నిర్బంధం ధాటికి తట్టుకోలేక మూకుమ్మడిగా లొంగుబాట్లు జరిగితే... విప్లవ సిద్ధాంతం మీద జనాలకున్న గౌరవం తగ్గడం ఖాయం. ఇది ద్రోహమో, వ్యూహమో ఊహించుకోవడం అనవసరం.
చావో, రేవో అనే కఠిన పంథా తీసుకోవాలంటే... ఎంతో పోరాటపటిమ, అంతులేని ఆత్మధైర్యం కావాలి. 30, 40 ఏళ్లు అండర్ గ్రౌండ్ లో చక్రం తిప్పిన నాయకులు అవి లేకుండా పెద్ద సంఖ్యలో అనుచరులతో నవ్వుతూ లొంగిపోతే మనమేమి చేయగలం? వారి నవ్వులను చూసి
బైట ఏసీ గదుల్లో కూర్చుని ఏడ్వడం సబబు కాదేమో!


Tags:    

Similar News