'స్వేచ్ఛ' లేని లోకంలో స్వేచ్ఛ కోసం...
అణగారిన కులాలు జాతుల తెగల వారు పేదరికం ,చదువు లేనితనం , అంటరానితనం వల్ల చెప్పనలవికాని ఎన్నో రూపాల్లో అణచివేతలకు గురౌతున్నారు.;
‘స్వేచ్ఛ’ ఇప్పుడు నామ వాచకం కాదు,సర్వనామం.స్వేచ్చ మానవ సమూహ జీవనేచ్ఛ.స్వేచ్ఛ అంటే వ్యక్తీ,సమూహం ఇచ్ఛాపూర్వక జీవనం; సమాజానికి హానికరం కాని పద్ధతుల్లో వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టు తాను బ్రతకడమే స్వేచ్ఛ;వ్యక్తిగత జీవన సమగ్రత, గోప్యతా హక్కు సమాజం చేత గౌరవించబడి,కాపాడబడడమే స్వేచ్ఛ. సాటి మనిషి పట్ల గౌరవం, సంఘీభావం,సమ భావంతో ఉండటమే సహోదరత్వం.
ఆధిపత్య శ్రేణీయ సామాజిక వ్యవస్థ,జెండర్,ఆర్థిక,సాంస్కృతిక వ్యత్యాసాలు,అసమానతలు, దౌర్జన్యాలు,దాష్టీకాలకు నిలయమైన మన దేశంలో,పైన పేర్కొన్న మానవీయ వాతావరణమేదీ మార్జినలైజ్డ్ సమూహాల ప్రజలకు,వారి మహిళకు అనారక్షితమైనదిగా తయారయ్యింది. అణగారిన కులాలు జాతులు తెగల వారు పేదరికం వల్ల,చదువు లేనితనం వల్ల,అంటరానితనం వల్ల చెప్పనలవికాని ఎన్నో రూపాల్లో అణచివేతలకు గురౌతున్నారు.
ముఖ్యంగా సంపద పిడికెడు ఆధిపత్య కుల్లాల్లోని కొన్ని కుటుంబాలకు చెందిన వారి దగ్గర అసహజంగా కేంద్రీకృతమై వుంది. సంపద+మగ జెండర్+ఆధిపత్య కులము+అధికార రాజకీయాలు+ వారి మీడియా - ఇవన్నీ కలగలిసిపోయి,ఒక ప్రమాదకరమైన జెండర్ సోషల్ నిరంకుశాధికార వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి.
అభివృద్ధి చెందిన సమూహాలతో పాటుగా సమానంగా,ఏకరూప అభివృద్ధి చెందిటానికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు విద్య,ఉద్యోగ,సంక్షేమ,రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలను దేశ స్వాతంత్య్రానంతర భారత రాజ్యాంగం కల్పించింది. బలహీన వర్గాలకు రాజ్యాంగ సంరక్షణలుగా లభించిన ఈ పరిమిత అవకాశాలు ఇప్పటికీ అందుకోలేనంతగా దేశంలో మెజారిటీ సంఖ్యలోని అణగారిన కులాలూ,జాతులు,తెగలవారు అణచివేతలకు గురౌతున్నారు.
స్వేచ్ఛ లాంటి కొందరు మార్జినలైజ్డ్ అంటరాని సమూహాల యువతులు జర్నలిజం వంటి ఉన్నత వృత్తి విద్యలు అభ్యసించి, అత్యంత ప్రమాదకరమైన ఆధిపత్య కులాల మగ రాజకీయ మీడియాలో, అణగారిన సమూహాల యువతులకు జెండర్,కులం,లైంగిక సాంఘిక విపత్తులుండే చోట ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది.ఎన్నో వృత్తి,జెండర్,కులం సవాళ్ళను ఎదుర్కొంటూ ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి స్వేచ్ఛ పోరాడింది.
ఇక ఉన్నత చదువులు, దూసుకుపోయే చురుకుదనం, వృత్తి నైపుణ్యాలు,రచనా వ్యాసంగం,సామాజిక కార్యకర్తృత్వం,తెలివితేటలు,అందరితో కలివిడిగా స్నేహించే తత్వం,సామాజిక విశ్లేషణ చేసే మేధస్సు,సామాజిక అణచివేతలపై ధిక్కార తత్వం, వయసు, అందం,ఇవన్నీ కలిసి - ఒక మేధావినియైన నాయకురాలికి ఉండే సెలబ్రిటీ అర్హతలను స్వేచ్ఛకు సంతరించి పెట్టాయి. కానీ,ఆధిపత్య కుల,మగ రాజకీయ మీడియా అనేది ఆమె వృత్తి జీవితం చుట్టూ విషప్పామై చుట్టుకుంది;స్వేచ్ఛకు ఉండవలసిన,ఉంచవలసిన స్వేచ్ఛా జీవితాన్ని నిరాకరించింది.
ఇష్టమున్న వ్యక్తులు కలిసి జీవించవచ్చు అనీ,స్వేచ్ఛా స్వాతంత్య్రా లతో,గౌరవమూ,భద్రత,గోప్యతలతో జీవించే హక్కు ప్రతీ ఒక్కరికీ వుందనీ రాజ్యాంగం, ఉన్నత న్యాయస్థానాలు పదే పదే నొక్కి చెబుతుంటాయి.అయితే, ఆధిపత్య జెండర్,కుల సమాజం స్వేచ్ఛకు జీవన స్వేచ్ఛను నిరాకరించాయి.స్వేచ్ఛ బలవన్మరణానికి కారణమైన పరిస్థితులు ఏ ఆధిపత్య కులాల యువతులకూ లేనివి.
మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వాటిలోని మరింత మార్జినలైజ్డ్ వ్యక్తుల పట్ల వ్యవస్థీకృత ఆధిపత్య వ్యవస్థల క్రూరత్వాలు ఎలా ఉంటాయంటే, వీలైతే ప్రత్యక్షంగా,వీలు కాకపోతే పరోక్షంగా నిర్మూలించేంత దుర్మార్గంగా ఉంటాయి.స్వేచ్ఛ బలవన్మరణం తర్వాత మీడియా ఆమె గౌరవప్రదమైన వ్యక్తిగత జీవన గోప్యతా హక్కును కాలరాసింది. కృష్ణుడు జరాసంధుణ్ణి చీలికలు బాలికలు చేసినట్టు మీడియా,స్వేచ్ఛ వ్యక్తిగత జీవిత గోప్యతా మర్యాదను నిర్దయగా, దుర్మార్గంగా పీలికలు చేసింది. ఇలా మరణాంతరం యే ఆధిపత్య కులం మహిళనైనా,యీ ఆధిపత్య కులం మీడియా హీనపరిచే సామాజిక అత్యాచారం చెయ్యగలదా?ఎన్నటికీ చెయ్యదు!
మీడియా దుర్మార్గాన్ని మాటవరసకు ఖండిచినప్పటికీ, ప్రజాస్వామ్య,ప్రగతిశీల,ఆధునికవాద,జెండర్ సమానత్వ ముసుగుల్లో వున్న ఆధిపత్య కులాల మహిళా సంఘాలు,వాటి నాయకురాళ్లు కూడా లోలోపల ఆచరణలో,వారి మీడియా వైపే ఉన్నారా?వారి ఖండనలలో కూడా,వారి మీడియా (జరాసంధుణ్ణి పీలికలు చేసిన శ్రీకృష్ణుని) వైఖరే ఉన్నట్టు లేదూ? వారి ఆస్తిపర, కులపర, అధికారపర పితృస్వామ్య విలువలను తోసిపుచ్చి,స్వేచ్ఛ వైపు నిలబడినట్టు పైకి కనిపించినా, మార్జినలైజ్డ్ అంటరాని కులం యువతియైనందుకు స్వేచ్ఛకు పొంచి వుండిన వల్నరబుల్ సామాజిక విపత్తులు తమ ఆధిపత్యాల కులమింటి ఆడ బిడ్డలకు ఉండబోవనే ఉద్దేశ్యంతో ఉన్నారని అనిపించడం లేదూ?
మన దేశంలో చాలా విషయాల్లో రాజ్యాంగం ముందస్తుగా ఉంది.కానీ,పౌర సమాజమే దానిని అందుకోలేనంత వెనకబడి ఉంది!ఉదాహరణకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చట్టం చెబుతున్నది.కానీ,పౌర సమాజంలో చాలా పని స్థలాల్లో ఒకే పని చేస్తున్నప్పటికీ, మగవారితో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వటం లేదనేది వాస్తవం.చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ,పౌర సమాజంలోని ఆధిపత్య కుల,జెండర్ వ్యవస్థలు ఎస్సీ,ఎస్టీ,బీసీలకు,వారి మహిళలకు సమానత్వ హోదాని, సహోదరత్వాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.వీరిని హీనంగా చూస్తున్నాయి.వారి రాజకీయాలు, మీడియా కూడా ఇవే స్వభావంతో, విధానాలతో ఉన్నాయి.
ఏకలవ్య బొటన వేళ్లను దానమడిగే గురుత్వాలను తన్నేస్తాం.శంభుకుల శిరస్సులను ఉత్తరించే రాజకీయాలను బొంద పెడతాం. కింది కులాల ఆంజనేయుళ్లతో, అంజమ్మలతో వెట్టి చేయించుకునే కులాధిపత్య వ్యవస్థల రాజకీయాలను తూర్పార పడతాం.శూర్పణఖ ముక్కూ చెవులను కోసిన లక్ష్మణుడి అత్యాచారాలను ఖండించని సీతమ్మల,వూర్మిళల సంఘీభావాలు మాకొద్దు.మన సామూహిక దుఃఖాలకు మన ఏడ్పులు స్తంభించిపోతే,ఆధిపత్య సమాజాలు వినోదాల సరుకుగా మార్చుకుంటాయి.స్వేచ్ఛ మరణాన్ని పండుగ జేసుకుని, స్వేచ్ఛ వ్యక్తిత్వ హననానికి కారణమైన సవర్ణ మీడియాను, స్వేచ్ఛ బలవన్మరణంపై సవర్ణ మీడియా చేసిన వివక్షాపూరిత కథనాల ప్రసారం, ప్రచురణను, వాటిని వినోదించిన వారిని దోషులుగా ప్రకటిస్తున్నాము.
-- కృపాకర్ మాదిగ
(ఈ వ్యాసంలోని అభిప్రాయాలన్నీ రచయిత వ్యక్తిగతం)