వర్గీకరణలో ఇరుక్కుపోయిన మంద కృష్ణ

మనిషి తన భావోద్వేగాలకు ప్రతీకగా వొక చిహ్నం ఉండాలని కోరుకుంటాడు. అది తమ విస్తృత ప్రయోజనాలకు కారణమైనది అయినప్పుడు, ఆ కోరిక మరింత బలంగా ఉంటుంది.

Update: 2024-09-16 08:38 GMT

జాన్ సన్ చోరగుడి

మనిషి తన భావోద్వేగాలకు ప్రతీకగా వొక చిహ్నం ఉండాలని కోరుకుంటాడు. అది తమ విస్తృత ప్రయోజనాలకు కారణమైనది అయినప్పుడు, ఆ కోరిక మరింత బలంగా ఉంటుంది. చరిత్రలో ఇటువంటి గుర్తులు ఎన్నో మనకు కనిపిస్తాయి, వాటి నుంచి మనం చరిత్రను గ్రహిస్తాము. అయితే వర్తమానంలోనే సజీవంగా కూడా అటువంటివి కొన్ని ఉంటాయి. ఒకానొక సమూహం మేలు కోసం ఎవరో ఒకరు ముందుకు వస్తారు. వాళ్లకు కొందరు సహచరులు తోడై ఆ నాయకుడి నిర్దేశం మేరకు కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతూ దానితో ‘ఐడెంటిఫై’ అవుతారు. చరిత్ర వారికి తనలో చోటిచ్చి తనతో కలుపుకుంటుంది. ఆ తర్వాత వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోతారు. తమ గత చరిత్ర పట్ల గౌరవం వున్న సమాజాలు వారిని గుర్తు పెట్టుకుంటాయి.

ఇక్కడ సందర్భం ‘మాల-మాదిగ’ కావడంతో ‘మాదిగ దండోరా’ నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలలోని ఉపకులాల విభజన కోసం, కుగ్రామం ఎదుమూడిలో చిన్నపాయగా మొదలైంది వర్గీకరణ ఉద్యమం. ఆగస్టు ఒకటిన సుప్రీం కోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుతో ఆ ఉద్యమం, యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కోర్టు- ‘రిజర్వేషన్’ కోసం ఎస్సీ, ఎస్టీ కులాలలోని ఉపకులాలను ఒకే ‘యూనిట్’ గా కాకుండా విడివిడిగా పరిగణిస్తూ, వాటిని వర్గీకరించవచ్చు’ అంటూ తీర్పు ఇచ్చింది. ఈ లక్ష్యం సాధించిన ఘనత మంద కృష్ణ ‘మాదిగ’గా అందరికీ తెలిసిన 59 ఏళ్ళ శ్రీ మంద ఏలియాకు దక్కుతుంది’ అంటూ ‘ది హిందూ’ పత్రిక వ్యాఖ్యానించింది.

కృష్ణ తన తొలి ఇరవైల వయస్సులో నిషేధిత ‘పీపుల్స్ వార్ గ్రూప్’ పట్ల ఆకర్షితుడై కొద్దికాలం దానికోసం అజ్ఞాతంలో పనిచేసారు. అయితే ‘పీపుల్స్ వార్ గ్రూప్’ నుంచి కె.జి. సత్యమూర్తి బహిష్కరణకు గురైయ్యాక, ఆయనతోపాటు కృష్ణ కూడా అ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అక్కణ్ణించి ప్రకాశం జిల్లాలో సత్యమూర్తి ప్రారంభించిన- ‘మార్క్సిస్ట్ - లెనినిస్టు అధ్యయన కేంద్రం’తో కలిసి కొన్నాళ్ళు పనిచేసారు.

ఈ కాలంలోనే- ‘ఎస్సీ’ల లోనే మాదిగల పట్ల అమలవుతున్న వివక్ష పరిష్కారం కోసం, ఈ కేంద్రం పనిచేయాలని కృష్ణ ఆశించారు. అయితే, అందుకు సానుకూలమైన స్పందన ఈ శిబిరం నుంచి కృష్ణ దొరకలేదు. దాంతో, ఈ కేంద్రం కార్యకలాపాల నుంచి ఆయన క్రమంగా దూరమై, తనతో పాటు బయటకు వచ్చిన మిత్రులతో కలిసి 1994లో- ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ని (MRPS) స్థాపించారు.

మాదిగ డప్పు కొడుతూ ఊళ్ళల్లో చాటింపు వేయడాన్ని, వీరు తమ ఉద్యమానికి స్పూర్తి ప్రతీకగా తీసుకుంటూ, ‘మాదిగ దండోరా’ పేరుతొ ప్రజలలోకి ఉద్యమాన్ని ఒక శక్తిగా తీసుకెళ్ళారు. దాంతో ఎస్సీ వర్గీకరణను అంగీకరించని మాలలు నుంచి- ‘మాల మహానాడు’ పేరుతో దీనికి తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది.

అయితే- ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ మొదటి మహాసభ 1996లో హైదరాబాద్ నిజాం కాలేజి మైదానంలో లక్షలాది మంది హాజరైన భారీ బహిరంగ సభ నిర్వహించి, కృష్ణ మాదిగ తన నాయకత్వ లక్షణాలు ఎటువంటివో నిరూపించుకున్నాడు. ఈ సభ- ఎస్సీలను- ‘ఏ.బి.సి.డి’.లుగా వర్గీకరించాలి అనే- ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ఉద్యమానికి కీలకమైన మలుపుగా మారింది.

ఆ తర్వాత, కృష్ణ వెనక్కి తిరిగి చూసింది లేదు. వరసపెట్టి అసంఖ్యాకమైన ‘ర్యాలీలు’ నిర్వహించాడు. అటువంటివాటిలో- 1996లో MRPS ఇచ్చిన- ‘చలో అసెంబ్లీ’ పిలుపుతో, అప్పటి చంద్రబాబు టి.డి.పి. ప్రభుత్వాన్ని అది మోకాళ్ళ మీద నిలబెట్టింది. ఆ రోజు బషీర్ భాగ్ బాబూ జగజీవన్ రాం విగ్రహం వద్ద వేలాది మంది తన అనుచరులుతో కృష్ణ మాదిగ దీక్షకు కూర్చుని, అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన చేస్తేగానీ ఇక్కణ్ణించి తాము లేచేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దానికి ప్రభుత్వం తలొగ్గింది.

కృష్ణ 1997లో నారావారి పల్లె (చంద్రబాబు స్వగ్రామం) నుంచి హైదరాబాద్ వరకు ‘మహా పాదయాత్ర’ చేసారు. ఈ యాత్రలో ఆయనతో దారిపొడుగునా కలసిన ప్రజలు వారు చూపిన ఆదరణ ఆయన్ని విలక్షణ నాయకుడిగా మార్చింది. అలా సామాజిక ఉద్యమాల చరిత్రలో పోలిక లేని నాయకుడుగా కృష్ణ మారారు. కృష్ణ బృందం పాదయాత్ర హైదరాబాద్ చేరేసరికి ప్రభుత్వం ఎస్సీ కోటాను- ‘ఏ.బి.సి.డి’.లుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కానీ, ఈ ఆనందం ఎంతో కాలం వారికి నిలవలేదు. మాల మహానాడు నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఉపకులాలను విభజించే అధికారం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులను సవాలుచేస్తూ వారు హైకోర్టులో ‘రిట్ పిటీషన్’ దాఖలు చేయడంతో, కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. దాంతో 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వర్గీకరణపై- ‘ఆర్డినెన్స్’ తెచ్చింది. మరోసారి ‘మాలమహానాడు’ దాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో, కోర్టు ఆ వర్గీకరణ ఉత్తర్వులను కొట్టివేసింది.

ఈ కాలంలోనే కృష్ణ రాజకీయాలలో తన అవకాశాలను పరిశీలించుకుని విఫలమయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా 2004, 2009 లో వరసగా పోటీచేసి ఓడిపోయారు. వర్ధన్నపేట నుంచి ఆయన 2014లో చేసిన ప్రయత్నం కూడా విఫలమయింది. కృష్ణ 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బి.జే.పి.కి దగ్గరయ్యారు. ఆ విషయంలో ఆ కులస్తులలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి.

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత న్యూడిల్లీ నుంచి కృష్ణ మాదిగ తిరిగివచ్చినప్పుడు, కృష్ణకు స్వాగతం చెప్పడానికి సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు తరలి వచ్చిన జనసందోహాన్ని చూస్తే ‘మంద కృష్ణను ఒక శక్తిగా తప్ప మరొకలా చూడడం సాధ్యం కాదు’ అంటూ ‘ది హిందూ’ పత్రిక రాసింది. సహజంగా ఏ ఉద్యమ నాయకత్వం పైన అయినా వచ్చే భిన్న అభిప్రాయాలు మాదిరిగానే ఈ ముప్పై ఏళ్లలో మంద కృష్ణ మాదిగ గురించి కూడా వచ్చాయి. కారణం ఆయన గత పదేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు, ఏదో ఒక పార్టీకి మద్దత్తు ప్రకటించారు. అయితే, ఆ కులస్తులు దాన్ని పెద్దగా పట్టించుకునట్టుగా అనిపించదు. ఇప్పటికీ మాదిగలు ఆయన నాయకత్వాన్ని ‘వర్గీకరణ’కు మాత్రమే పరిమితం చేసి చూస్తున్నారు.

ఇటువంటి సమస్య కూడా మనకే పరిమితం కాలేదు. ఈ ముప్పై ఏళ్లలో మరికొన్ని రాష్ట్రాలు ఇటువంటి సమస్యతోనే కోర్టు మెట్లు ఎక్కాయి. అయితే, అన్ని చోట్ల సమస్య రూపం ఒకే తీరుగా లేదు. అయినా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు అమలుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా అటువంటి చర్యలు మొదలుపెట్ట లేదు. అయితే, మాల మాదిగ ఇద్దరూ కూడా ఈ విషయంలో తెలంగాణ అంత ‘ఓపెన్’గా ఏ.పి. ప్రభుత్వం ప్రవర్తిస్తుందని అనుకోవడం లేదు. (సశేషం)

Tags:    

Similar News