నక్సలైట్లు తుపాకి పట్టింది సిద్దాంతంతో! సిద్దాంతంతోనే వారిని మార్చాలి

అరుంధతి రాయ్, మేధా పాట్కర్, ప్రొఫెసర్ హర గోపాల్, కంచ ఐలయ్య వంటి ప్రజాస్వామ్యవాదులు సామూహిక హత్యాకాండను నిలిపి వేయడానికి తోడ్పడాలి.;

Update: 2025-04-02 06:21 GMT

దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య నక్సలైట్ ఉద్యమం. ఇది రాజకీయ అధికారం కోసం మొదలైంది. ప్రజల సహకారంతో విస్తరించాలనుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, దున్నేవారికి భూమి, సాగు నీరు కావాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఆదివాసులదే . అడవి పై పూర్తి హక్కు వారిదే! వంటి ఆర్థిక సామాజిక కార్య క్రమాలతో పని చేస్తున్నారు.

ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు పట్టి క్రమంగా సాయుధ పంథా (Armed Struggle) ఎన్నుకున్నారు. తద్వారా నిర్బంధం వుంటుందని 1967 నుండి లోతట్టు అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని గెరిల్లా పద్దతిలో యుద్ధాలు చేయాలనుకున్నారు.

1967 లో సిపియం నుండి విడిపోయి నక్సలైట్లు (Naxalites) గా పిలువబడి సిపియం చేత అణిచివేతకు గురైనారు. వేలాది యువకులు నాయకులు హతులైనారు. ఆ తరువాత అనేక గ్రూపులుగా పార్టీలుగా విడిపోయారు. వాటిలో శంకర్ గుహ నియోగి (Shankar Guha Niyogi) సమగ్ర సామాజిక వికాసం లక్ష్యంగా అహింసాయుతంగా చత్తీస్ గడ్ దల్లి రాజ , హువాయి ఉక్కుగనుల ప్రాంతంలో పని చేశారు. ఆయన హత్యకు గురయ్యారు. మిగతా నక్సలైట్లు సాయుధ పంథా ఎన్నుకున్నారు.

వినోద్ మిశ్రా ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (Indian Peoples’ Front) ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు . కొందరు ప్రజా ఉద్యమాలు నిర్మించారు. వీరంతా మార్క్సిజం అనే కొన్ని సిద్ధాంతాలు చదివి, రష్యా చైనా క్యూబా, వియత్నాం వంటి దేశాల్లో జరిగిన విప్లవాలు విని చదివి అధ్యయనం చేసి ముందుకు సాగిన వారు. వారిని తుపాకులతో చంపాలనుకోవడం మానవ వనరులకు ఎంతో నష్టం. వారి చైతన్యాన్ని మలుపు తిప్పితే ఇతరులకన్నా ఎన్నో రెట్లు ఉత్తమంగా ఎదుగుతారు.

బుద్ధుడు మొదలు కొని తనను చంప వచ్చిన అంగుళి మాలుడిని మార్చి శిష్యుడిగా మార్చుకున్నాడు. తనను చంపడానికి వచ్చిన గూండాలను మార్చి మహాత్మా ఫూలే (Mahatam Phule), తన శిష్యులుగా మలుచుకున్నాడు. ఇలా ఎన్నో ఉదహరించవచ్చు. ముద్రా రాక్షసం అనే నాటకంలో నందరాజుల పక్షాన ఉన్న మహా మంత్రి రాక్షసుడిని మౌర్య చంద్రగుప్తునికి మహా మంత్రిని చేయాలని చాణక్యుడు ఎన్నో ఎత్తుగడలు వేసి ఓడించి చివరకు మౌర్య చంద్ర గుప్తునికి మహా మంత్రిని చేసి తాను రాజ గురువుగా వుండి పోతాడు. ఇలా అవతలి పక్షంలోని శక్తి సామర్థ్యాలను తన కోసం ఉపయోగించుకోవడమే నిజమైన నైపుణ్యం. అంతేగాని తుపాకితో చంపితే అసమర్థులు అంటారు.

నక్సలైట్లు తుపాకి పట్టింది ఒక సిద్దాంత భూమికతో! అందువల్ల అలాంటి వారిని తిరిగి సిద్దాంత చర్చతో ఒప్పించి మెప్పించి మార్చాలి. అందుకు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం , ప్రజల పౌరహక్కులు, రష్యా చైనాల్లో రాజ్యాంగం పౌరహక్కులతో తులనాత్మక అధ్యయనం చేసి సిద్దాంతీకరించి ప్రజల్లో వ్యాప్తి చేయాలి. అందులో చేరిన వారు ప్రతి దశలో వెనక్కి వచ్చి గౌరవప్రదంగా సామాజిక రాజకీయ జీవితంలో ముందుకు సాగే అవకాశం ఉండాలి.

అంగుళి మాలుడు 999 మందిని చంపిన వాడిని బుద్ధుడు తన చర్చతో శిష్యుడిగా మార్చుకున్నాడు. ఇటీవల ఫూలన్ దేవి (Phulan Devi), సీతక్క (Seethakka) పాత పంథా వదిలి చట్ట సభల్లో ఎన్నికయ్యారు. అలాంటి అవకాశాలు వారికి కలిగిస్తే ప్రజలకు ఇలా కూడా సేవ చేయవచ్చు అని తెలుసుకుంటారు.

ముఖ్యంగా వారిని ఆదివాసీ ప్రాంతాల ప్రజల సమగ్రాభివృద్ధిలో భాగం చేసే ఒక శాఖను ఏర్పాటు చేసి క్వాలిఫికేషన్లతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలి. పోలీసుల్లో వీరిని రిక్రూట్ చేసి వీరినే చంపించే ఎత్తుగడలు తొలగించాలి. వారనుకున్న ఆదర్శ సమాజ నిర్మాణం ప్రజాస్వామ్య యుతంగా చేయడానికి అబూజ్ మడ్ వంటి స్థావర ప్రాంతాలను వారికే ఎస్ ఈ జెడ్ (SEZ) అనుకుని కెటాయించి నిధులను దారాళంగా కెటాయించాలి. అవినీతి మచ్చ లేని అధికారులను అక్కడ కు పంపాలి. ఆధునిక అభివృద్ది లోకి వారందరిని ఇంగ్లీషు మీడియంతో పాటు మాతృభాషలో 16 ఏళ్ల ఉచిత గురుకుల విద్య అందించాలి. 300 రోజుల పని కల్పించాలి. ఆది వాసుల ఉత్పత్తి నైపుణ్యాలు , మార్కెటింగ్, ఎంటర్ ప్రెన్యూర్, శిక్షణ ఇవ్వాలి.

ఎస్టీ రిజర్వేషన్లను ఆయా ప్రాంతాలో ఈశాన్య రాష్ట్రాల్లో వలె రాజ్యాంగం 245 ఆర్టికల్ నుండి 275 ఆర్టికల్సు దాకా గల ఆర్టికల్స్ మార్గ దర్శకత్వంలో మొత్తం ఉద్యోగాలు , వ్యాపారాలు, లైసెన్సులు, డీలర్ షిప్ లు ఆదివాసులకే కెటాయించాలి. మైదాన్ ప్రాంత జనాభాను తరలించి ప్రత్యేక అవకాకాశాలు కల్పించాలి. ఆదివాసులకు అటవీ ప్రాంతాన్ని ఐటీడీఏ కు స్పెషల్ ఎకనమిక్ జోన్గా అప్పగించాలి.

భారీగా నిధులు కెటాయించి మిగతా పౌరసమాజంతో పోటీ పడేలా ఎదిగించాలి. నిధుల సక్రమ వినియోగం కోసం మద్య దళారీల నిషేదం, మద్యపాన నిషేదం, ప్రయివేటు రంగాన్ని నిషేధించడం , అన్ని ప్రభుత్వమే నిర్వహించడం మొదలైనవి చేపట్టాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులకు, ప్రభుత్వాలకు సూచించి ఇరు పక్షాలను ఒప్పించాలి. అరుంధతి రాయ్ , మేధా పాట్కర్, ప్రొఫెసర్ హర గోపాల్, కంచ ఐలయ్య వంటి మేధావులు ప్రజాస్వామ్యవాదులు పూనుకోవాలి. ఈ సామూహిక హత్యాకాండను నిలిపి వేయడానికి తోడ్పడాలి.

ఇలా చేసినప్పుడే నక్సలిజం ఆవశ్యకత అదృశ్యమవుతుంది. ఇలా కాకుండా మనుషులను కార్య కర్తలను చంపుకుంటూ పోతే అది మరో రూపంలోకి మారుతుంది. తీవ్రవాదం (Extremism) నుండి అవి ఉగ్ర వాదంగా ( టెర్రరిజం) మలుపు తీసుకుంటాయి. మీరు చంపేద్దురు? మేమే బాంబుకట్టుకొని చస్తాం. మిమ్మల్ని వెంటాడి ఆత్మహత్య దళాలుగా ఏర్పడి మిమ్మల్ని చంపి మరీ చస్తాం అంటారు. శ్రీలంక ఎల్టీటీఈ (LTTE) దాడులు, రాజీవ్ గాంధీ హత్య , గుర్తుండే వుంటుంది . స్వర్ణ దేవాలయం (Golden Temple) పై దాడి పర్యవసానాలు చరిత్ర తెలిసిందే! భగత్ సింగ్ బ్రిటిష్ అధికారిపై బాంబుదాడి సుప్రసిద్ధం.

ఆయుధాలున్నాయని, అధికారం ఉందని సామూహిక హత్యాకాండకు, నిర్బంధాలకు పాల్పడితే చరిత్ర ఔరంగ జేబు సరసన నిలబెడుతుంది. హిందూ మతస్థులను , మతతత్వ వాదులను చంపితే హిందూ మతం పోయిందా? 60 లక్షల మంది యూదులను హిట్లర్ చంపించాడు యూదుమతం లేకుండా పోయిందా? ఏసుక్రీస్తును చంపించారు. క్రీస్తు మతం పోయిందా? హత్యాకాండతో చార్వాకులను చంపారు, బౌద్దులను చంపారు . బౌద్దం చార్వాకం పోయిందా?

సిద్ధాంతాలను సిద్ధాంతాలతో జయించడం ద్వారానే తమ ఆధిక్యతను నిలుపుకోవడం సాధ్యం. మార్క్సిజం మీద ప్రజా స్వామ్యం విజయం సాధించింది. అందువల్లనే సోవియట్ యూనియన్ ఏక పార్టీ సోషలిజం నుండి ప్రజాస్వామ్యం లోకి మలుపు తిరిగింది.

అర్బన్ నక్సలైట్ల సమస్య (Urban Naxals)

అర్బన్ నక్సలైట్లు అంటే తమ జీవితం తాము జీవిస్తూ సిద్దాంత పరంగా, భౌతికంగా, పౌరహక్కులు, సాహిత్యం, కళల ద్వారా నక్సలైట్లకు సహకరించేవారు.

ఇది ప్రజాస్వామ్య హక్కుల పరిధిలోనే సాగుతున్నది. వీరు బహిరంగంగానే జీవిస్తారు. వీరిని అర్బన్ నక్సలైట్లు అని ఆడిపోసుకోవడం, కేసులు పెట్టడం, చంపడం, చంపించడం వల్ల భయానికి లోనై వ్యాప్తి తగ్గ వచ్చు గాని మొత్తం నశించరు గద! మార్క్సిజం రాజకీయ కార్య కలాపాలపై భిన్నాభిప్రాయాలుండవచ్చుగానీ ఆర్థిక సామాజిక , చరిత్ర శాస్త్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆధిక్యతలో కొనసాగుతున్నది. అంతకన్నా ఉన్నతంగా కార్మికులకు ప్రజలకు మేలు చేసే సిద్ధాంతాలు మాత్రమే మార్క్సిజాన్ని పూర్వ పక్షం చేస్తాయి. వన్ మ్యాన్ వన్ వోట్, వన్ వాల్యూ అనేది భారత రాజ్యాంగం అధికారికంగా ప్రకటించిన మహోన్నత లక్ష్యం. ఇప్పటి వరకు ఏ తత్వ శాస్త్రం దీన్ని చెప్పలేకపోయింది. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని బిజేపీ ఆరెసెస్ (RSS) శక్తులు అంగీకరించ లేక రకరకాల రూపాల్లో అసమానతల వర్ణవ్యవస్థను, కుల వ్యవస్థను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులు పాశ్చాత్య భావాలు అంటూ ఖండిస్తున్నాయి.

Tags:    

Similar News