భూమి లేని సేద్యం, రైతు లేని పల్లె, ఆదివాసీ లేని అడవి వర్ధిల్లాలి
గ్రామాలు ఎందుకుంటాయి? నదులెందుకు ఉంటాయి? అడవులెందుకు ఉంటాయి?
పొద్దున లేస్తే ప్రతి వాళ్ళకూ టీ/ చాయి కావాలి. చాయిలోకి చక్కెర కావాలి. కానీ చక్కెర, బెల్లం కోసం రైతులు చెరకు మాత్రం పండించకూడదు. చెరుకు ఫ్యాక్టరీలు మూసేయాలి. చాయిలోకి పాలు కావాలి. రైతులు పశువులను పోషించకూడదు. పశువులకు మేత మాత్రం దొరక్కూడదు. పశువులను కబేళాలకు అమ్మేయాలి.
ఉదయం ఎనిమిది గంటలకల్లా అందరికీ టిఫిన్ కావాలి. ఇడ్లీ, దోశ, పెసరట్టు ప్లేట్లోకి వచ్చి పడాలి. కానీ వీటిని కావలసిన మినుములు, పెసలు మాత్రం పండించకూడదు. మధ్యాహ్నానికి, మళ్ళీ రాత్రికి ప్లేట్ నిండా భోజనం కావాలి. డాక్టర్లు చెప్పారని తినడానికి రాగులు, కొర్రలు, సజ్జలు కావాలి, రంగు రంగుల కూరగాయలు కావాలి. అన్ని సీజన్లలో అన్ని పండ్లు దొరకాలి. కానీ రాష్ట్ర రైతులు మాత్రం వీటిని పండించకూడదు.
రాష్ట్రంలో భూములన్నీ, రియల్ ఎస్టేట్ వెంచర్ లై పోవాలి. రాజకీయ నాయకుల . తక్కువ బొక్కసాలు నిండాలి. ధనికులకు, నగరాల మధ్య తరగతి ప్రజలకు చవక ధరకే ప్లాట్లు దక్కాలి. గ్రామాలలో ఉన్న రైతుల భూములన్నీ పరిశ్రమల కోసం, నగరాల నిర్మాణం కోసం చవక ధరలకు ఇచ్చేయాలి. దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములైతే, వాళ్ళు ఇచ్చేదేమీ అక్కరలేదు. ప్రభుత్వమే ఉచితంగా, అప్పనంగా లాగేసుకుంటుంది. ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియచేసేదేమంటే, గ్రామాలలో ఉండే రైతులు, కూలీలు, వాళ్ళ పిల్లలు గ్రామాలను తక్షణమే వదిలేయాలి. ప్రభుత్వాలు నిర్మించే నగరాలలో, పరిశ్రమలలో (దొరికితే) కూలీ పనులు చేసుకోవాలి.
రాష్ట్ర ప్రజలు , అన్నీ రాష్ట్రంలో పండించుకుని కాకుండా, ఆహారం ఇకపై బయట నుండీ కొనుక్కుని వాడుకోవాలి. మీకు స్వయంగా కొనుక్కునే స్థోమత లేకపోతే, ఏం ఫర్వాలేదు, మీరు చచ్చి పోకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా నెలకు మనిషికి ఐదు కిలోల బియ్యం సరఫరా చేస్తాయి. కాకపోతే మీకో రేషన్ కార్డు ఉండాలి, ప్రభుత్వాలు పదేళ్లకోసారి దయ తలచి, మీకు రేషన్ కార్డులు ఇస్తుంది. కార్డు దొరికితే అదృష్టవంతులు, కొన్ని రోజులు ప్రభుత్వం ఇచ్చే బియ్యం తిని బతికేస్తారు. రేషన్ కార్డు అందక పోతే, ఆకలితో త్వరలోనే బాల్చీ తన్నేస్తారు. ఏం ఫర్వాలేదు, అన్ని గ్రామాలలో, బస్తీలలో మీ కోసం మేం వైకుంఠ ధామాలు, మహా ప్రస్థానాలు నిర్మించాం. ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. రైతులు, భూమి లేని కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఆకాలంగా చచ్చిపోయినా, రైతు బీమా ఇస్తామని ప్రామిస్ కూడా చేశాం. ఆకలితో, అనారోగ్యంతో చచ్చిపోకుండా, మీ కుటుంబంలో బతికి ఉన్న వాళ్ళు అదే మేము ఇచ్చే భరోసా.
ఇప్పటివరకు రేషన్ కార్డుపై ప్రభుత్వాలు పనికిమాలిన దొడ్డు బియ్యమే ఇచ్చి ఉండ వచ్చు. మీరు వాటిని తినకుండా కిలో పది రూపాయలకు అమ్ముకుని ఉండవచ్చు. ఆ బియ్యం తోనే, రైస్ మిల్లర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కోటీశ్వరులై ఉండ వచ్చు. మీరేమి దిగులు పడకండి, ఇకపై మీరు తినేలా సన్న బియ్యం సరఫరా చేస్తాం.
ఇక మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పౌష్టికాహారం సంగతంటారా? తూచ్, మాకు సంబంధం లేదు. వీలైతే కొనుక్కోండి లేదా మీకు కడుపు నిండా మద్యం పోస్తున్నాం కదా, అది తాగి తాగి, రోగాలతో , రక్త హీనతతో చచ్చిపోండి. మీ ఇంటి ఆడవాళ్లకు ఆసరా పెన్షన్ ఇస్తాం.
అయితే, మీకో అనుమానం రావచ్చు. కొనుక్కోవడానికి మాత్రం ఆహార ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయని. అందుకు మీరిక దిగులు పడాల్సిందేమీ లేదు.
మీ సేవ కోసం వాల్ మార్ట్ అమెరికా నుండీ వచ్చేసింది. మెట్రో జర్మనీ నుండి వచ్చింది. మరో అమెరికన్ కంపెనీ అమెజాన్ మీరు ఆర్డర్ ఇస్తే చాలు, మీ ఇంటికే సరుకులను చేరుస్తుంది. అంబానీ మీ కోసం జియో మార్ట్ ఓపెన్ చేశాడు . అదానీ, అంబానీ, టాటా, బిర్లా సహా-అందరి కందరూ- వంట నూనెలను , పప్పు ధాన్యాలను, చిరుధాన్యాలను, కూరగాయాలను, పండ్లను, మీకు అవసరమైన సమస్త సరుకులను మీకోసం ఇతర దేశాల నుండీ, ఇతర రాష్ట్రాల నుండీ దిగుమతి చేసి తీసుకొస్తారు. మీ ఆకలి తీరుస్తారు. మీరు చేయాల్సిందల్లా మీ కష్టార్జితాన్ని, మీ బ్యాంకు అకౌంట్లను వారికి అప్పగించడమే.
మీకు పాలు కావాలంటే గుజరాత్ నుండీ అమూల్ వస్తుంది. వివిధ రాష్ట్రాల నుండీ పాలు తెస్తుంది. పెరుగు తెస్తుంది. మీకు నీళ్ళు కావాలంటే మరో అమెరికన్ కోకో కోలా కంపెనీ కిన్లే నీళ్ళు బాటిళ్లు సరఫరా చేస్తుంది. వాళ్ళు దూరం నుండే రావడానికి ,మనకు అవసరమైనవి సరఫరా చేయడానికి, ఆలస్యమవుతుందని , గత ముఖ్యమంత్రి KCR గారు, ఈ కంపెనీలను సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ గారు వాటిని ఘనంగా ప్రారంభిస్తున్నారు.
21 గ్రామాలను ముంచీ , వేలాది మంది ప్రజలను నిర్వాసితులను చేసే, మల్లన్న సాగర్ , కొండ పోచమ్మ రిజర్వాయర్ లను కట్టీ, ఆ నీళ్ళను ఈ కంపెనీలకు ఇవ్వడమేమిటని కొందరు ఆడిపోసుకుంటారు కానీ, వాళ్ళ మాటలు మీరు వినొద్దు. మనకు కిన్లే నీళ్ళు ముఖ్యం, అమూల్ పాలు ముఖ్యం. “తెలంగాణ వద్దు – అమెరికా ముద్దు”, “తెలంగాణ వద్దు- గుజరాత్ ముద్దు “ అని మనం రిథమిక్ గా పాడుకోవచ్చు. అమెరికా ఎగిరెళ్ళి కావాలని కలలు కంటున్న మన పిల్లలు, మనం ఓట్లేసి నెత్తిన పెట్టుకుంటున్న మోడీ పిల్లలు సంతోషిస్తారు.
అడవిపై హక్కు ఆదివాసీలకు మాత్రమే ఉండాలని విప్లవ కారులు, అర్బన్ నక్సల్స్ అంటుంటారు. అది ప్రమాదకరం. వారిని నిర్మూలించాలి. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేసేది. వాళ్ళ పని వాళ్ళు సజావుగా చేస్తుంటారు, UAPA కేసులు పెట్టడం, ఎన్కౌంటర్స్ కొనసాగించడం ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లడంలో భాగమని అందరికంటే పోలీసులకు బాగా తెలుసు. పౌర సమాజంలో ఉండి, విమర్శించే వాళ్ళదేముంది, ప్రభుత్వం నడిపితే తెలుస్తుంది, ఈ లింకు ఎక్కడి వరకు విస్తరించి ఉందో..
అసలు కొందరివి, పాత ఆలోచనలు కానీ, ఆదివాసులు అడవిలోనే ఎందుకు ఉండాలి ? వాళ్ళు కూడా మారు మూల గూడేలు వదిలి అడవి బయటకు వస్తే, వారిని కూడా అభివృద్ధి చేస్తాం కదా, వాళ్ళ కోసం కాలనీలు కడతాం, డబుల్ బెడ్ రూమ్ యిల్లో, ఇందిరమ్మ యిల్లో ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం. వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు పెడతాం. ఇక ఆదివాసీల అభివృద్ధే అభివృద్ధి.
ఇక మేం అడవిని కాపాడి, పర్యాటక స్థలంగా చేస్తాం . పులులకు ఆవాసంగా చేస్తాం. అక్కడ కొండలలో ఉన్న సంపదను కంపనీలు వెలికి తెస్తాయి. బయట దేశాలకు తీసుకు వెళ్ళి అమ్ముకుంటాయి. వాళ్లు అభివృద్ధి చెందుతారు. రాష్ట్రానికి పన్నుల ఆదాయం వస్తుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. ఇక రాష్ట్రమూ అభివృద్ధి చెందుతుంది.
గ్రామాలు ఎందుకుంటాయి? నగరాలకు చౌక శ్రమ జీవులను సరఫరా చేయడానికి
నదులెందుకు ఉంటాయి ? నగరాల దాహం, ఇతర అవసరాలు తీర్చడానికి
అడవులెందుకు ఉంటాయి ? నగరాల కలప అవసరాలు తీర్చడానికి
మార్కెట్ లు ఎందుకుంటాయి ? కార్పొరేట్ లు తమ సరుకులు అమ్ముకోవడానికి
ప్రభుత్వాలు ఎందుకు ఉంటాయి ? ప్రజలు ఎదురు తిరగకుండా బుజ్జగించడానికి
పోలీసులు ఎందుకు ఉంటారు ? ఎదురు తిరిగిన వాళ్ళను బంధించి చంపడానికి
ప్రస్తుతం దేశంలోనూ, తెలంగాణ లోనూ కొనసాగుతున్నది అభివృద్ధి గురించి, ఇదే ఆలోచనా ధోరణి. ఆచరణ. అందుకే ఎన్నికల సమయంలో ఏం చెప్పినా, ఏ పార్టీ అధికారం చేపట్టిన, ఇదే ఆచరణ ప్రస్తుతం తెలంగాణ లోనూ కొనసాగుతున్నది.
భూమి లేని పేదలకు పంచడానికి కనీసం ఎకరం భూమి దొరకదు. పారిశ్రామిక వేత్తల కోసం ఎన్ని వందల ఎకరాలైనా సిద్ధం చేస్తారు. కౌలు రైతులను గుర్తించడానికి ధైర్యం ఉండదు. వ్యవసాయం చేయని భూ యజమానులకు మాత్రం రైతు భరోసా, పంటల బీమా పరిహారం,పంట రుణాలు కూడా నిస్సిగ్గుగా అందిస్తారు. చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని, ఎన్నికలలో హామీలిస్తారు, అటువైపు కనీస అడుగులు పడవు.
తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో సజ్జ కంకులు పెడతారు , కానీ రాష్ట్రం నుండీ చిరు ధాన్యాలు ఎందుకు మాయమయ్యాయో కనీస చర్చ చేయరు. రాష్ట్రంలో అన్ని చోట్లా కందులు పండే ప్రాంతాలు ఉండగా, వినియోగదారులుగా ప్రజలు కిలో 180 రూపాయలకు కందిపప్పు ఎందుకు కొనవలసి వస్తుందో, మన రాష్ట్రంలో వినియోగించే కూరగాయలలో 80 శాతం బయట రాష్ట్రాల నుండీ ఎందుకు వస్తున్నాయో, ఆ నిజాన్ని మాత్రం ఈ “అభివృద్ధి కాముకులు” ప్రజలకు చెప్పారు .
యాసంగిలో కూడా సన్న ధాన్యం పండించండి , బోనస్ ఇస్తాం అని ప్రకటిస్తారు. మన బియ్యానికి మార్కెట్ ఉంది, విదేశాలకు ఎగుమతి చేస్తాం అని గప్పాలు కొడతారు. కానీ నగదు బదిలీ క్రింద ఒక సీజన్ కు ఎకరానికి 7500 వేల రైతు భరోసా పంచి, కంపనీల నుండీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ తో, భూమి నుండీ నీళ్లు బయటకు తీసి, లేదా ఎత్తిపోతలతో నీళ్ళు తెచ్చీ, కేంద్రం ఇచ్చే సబ్సీడీతో అందే రసాయన ఎరువులు విపరీతంగా వేసీ. మిథేన్ కాలుష్యంతో రాష్ట్రాన్ని నింపేసి, వరి బియ్యం పండించి ఎగుమతి చేయడమంటే, రాష్ట్రం నుండీ నీళ్ళనూ, బడ్జెట్ నుండీ నిధులను ఎగుమతి చేయడమే అనే స్పృహ కూడా ఈ అభివృద్ధి కాముక ప్రభుత్వాలకు ఉండటం లేదు.
అందుకే ప్రభుత్వాలతో గొంతు కలిపి, వాళ్ళ అభివృద్ధి నమూనాను కీర్తిస్తూ, కోట్లూ , ప్లాట్లు అందుకునే వాళ్ళు
ఇప్పుడిక ఒక నినాదం చేస్తున్నారు.. భూమి లేని వ్యవసాయం, రైతు లేని గ్రామం, ఆదివాసీ లేని అడవి, నిధులు లేని బడ్జెట్ ఉపాధి నివ్వని అభివృద్ధి, హక్కులు లేని కార్మిక వర్గం ఎన్నికలు లేని నిరంకుశత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అని.
ఇది, కుదరదు అనుకున్న వాళ్ళు, గ్రామం కేంద్రంగా, మనిషి కేంద్రంగా అభివృద్ధి నమూనా ముందుకు రావాలని కోరుకునే వాళ్ళు మరో నినాదం చేయాలి.
లగ చర్ల ప్రజల పోరాటం వర్ధిల్లాలి.
దిలావర్పూర్ ప్రజల పోరాటం వర్ధిల్లాలి.