దక్షిణాది రాష్ట్రాలలో రైతు ఉద్యమ నిర్మాణానికి సన్నాహం

పంజాబ్, హర్యానా తరహాలో, దక్షిణ భారత దేశంలో కూడా రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు కదులుతున్న రైతు సంఘాలు

Update: 2024-10-10 03:00 GMT

దక్షిణ భారత దేశ రాష్ట్రాల సంయుక్త కిసాన్ మోర్చా (SKM) భాగస్వామ్య సంఘాల సమావేశం బెంగుళూర్ లో అక్టోబర్ 7,8 తేదీలలో జరిగింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి రాష్ట్రాల నుండి 75 కి పైగా రైతు సంఘాల ప్రతినిధులు ఈ దక్షిణ భారత నాయకత్వ సమావేశంలో పాల్గొన్నారు . 250 మందికి పైగా హాజరైన ఈ సమావేశంలో తెలంగాణ నుండీ 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పంజాబ్, హర్యానా తరహాలో, దక్షిణ భారత దేశంలో కూడా రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు ఈ సమావేశానికి అతిధులుగా హాజరయ్యారు.
2017 లో మధ్య ప్రదేశ్ లో 6 గురు రైతులను బిజెపి (BJP) రాష్ట్ర ప్రభుత్వం హత్య చేశాక, భారత దేశంలో రైతుల, వ్యవసాయ కూలీల సమస్యలు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యంతో అఖిల భారత రైతు ఉద్యమాల సమన్వయ కమిటీ (AIKSCC) ఏర్పడింది. అనేక ప్రచార, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే, 2020 కరోనా సమయంలో మోడీ ప్రభుత్వం జూన్ 6 న వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మూడు చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకు వచ్చింది . ఈ చట్టాల సారాంశాన్ని ముందుగా అర్థం చేసుకున్న పంజాబ్ రైతులు, వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలను ప్రారంభించారు. టోల్ గేట్లను బద్దలు కొట్టారు. రైళ్లను ఆపారు. జియో కంపనీ ఉత్పత్తులను బహిష్కరించారు. వందలాది సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. రిలయెన్స్ పెట్రోల్ బంకులను మూసి వేయించారు.F
ఈ క్రమంలోనే రైతు సంఘాలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించుకుని ఛలో దిల్లీకి పిలుపు ఇచ్చాయి. రైతులు డిల్లీ సరిహద్దుల వైపు ప్రయాణం ప్రారంభించారు. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం డిల్లీ సరిహద్దులను మూసేసింది. రైతులు సింఘు,తిక్రీ, గాజీపూర్ లాంటి డిల్లీ సరిహద్దులలో మోహరించారు. తమను డిల్లీలోకి అనుమతించే వరకూ తాము అక్కడే ఉంటామని ప్రకటించారు. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ రైతులు ఈ ఉద్యమంలో ముందు వరసలో ఉన్నారు. ముఖ్యంగా పంజాబ్ లో ప్రతి గ్రామం,ప్రతి ఇల్లు ఉద్యమంలో భాగస్వామి అయ్యింది. ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. తెలంగాణ సహా ,ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించడంతో పాటు దిల్లీకి కూడా తరలి వెళ్లారు. 2021 జనవరి 26 న డిల్లీ ఎర్రకోటకు ర్యాలీ నిర్వహిస్తామని పిలుపునిచ్చాయి. రైతు సంఘాలన్నీ కలసి ఇకపై సంయుక్త కిసాన్ మోర్చా (SKM) గా పని చేయాలని నిర్ణయించాయి.
మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమం పై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినా రైతులు తల ఒగ్గకుండా, సంవత్సరానికి పైగా ఉద్యమాన్ని కొనసాగించారు. వానాకాలం, చలికాలం, ఎండాకాలంలో కూడా, అనేక ఇబ్బందులను తట్టుకుని డిల్లీ సరిహద్దులలో ఈ రైతుల బైటాయింపు కొనసాగింది. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అసువులు బాశారు. ప్రభుత్వం వందలాది కేసులను రైతులపై మోపింది. రైతుల , రైతు సంఘాల సమరశీల పోరాటం ముందు మోడీ ప్రభుత్వం తలొగ్గింది . ఎవరి తోనూ చర్చించకుండా, ఏకపక్షంగా తెచ్చిన మూడు కార్పొరేట్ అనుకూల చట్టాలను వెనక్కు తీసుకుంది. రైతు ఉద్యమం ప్రధానంగా లేవనెత్తిన కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించే విషయంలో చర్చలు కొనసాగించడానికి ఒక కమిటీని వేసింది. విద్యుత్ బిల్లు 2020 ను అబయెన్స్ లో పెట్టడానికి అంగీకరించింది. వివిధ రాష్ట్రాలలో రైతులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరిస్తామని హామీ ఇచ్చింది. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని విరమించాయి.
ఈ చారిత్రాత్మక రైతు ఉద్యమం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. దేశంలో అనేక ప్రజా సంఘాలకు, ఇతర రంగాల ప్రజలకు రైతు ఉద్యమం స్పూర్తిని అందించింది. కేవలం దేశంలోనే కాదు, యూరప్ , అమెరికా దేశాల రైతులు కూడా భారత దేశ రైతు ఉద్యమం వైపు ఆసక్తిగా చూశారు. మరోవైపు , ఈ ఉద్యమం ప్రధానంగా ఉత్తర భారతదేశ రైతు ఉద్యమంగా,లేదా పంజాబ్ రైతుల ఉద్యమం గా గుర్తింపు పొందింది. వాస్తవానికి పంజాబ్, హర్యానా రైతులు ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ , దక్షిణ భారత దేశ రాష్ట్రాల నుండీ కూడా రైతులు, ఇతర ప్రజా సమూహాలు, డిల్లీ ముట్టడిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. అదే సమయంలో దక్షిణ భారత దేశ రైతులలో ఉద్యమ డిమాండ్లు బాగా ప్రచారం జరిగినప్పటికీ , కదలిక తక్కువగా ఉండింది. దక్షిణ రాష్ట్రాల నుండీ దిల్లీకి దూరం ఎక్కువ కావడం, రవాణా సదుపాయాలు కూడా తక్కువగా ఉండడం కూడా ఇందుకు మరో కారణం.
ఈ నేపధ్యంలో దక్షిణ భారత దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏ రూపాలలో ఉద్యమాలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుందో అక్టోబర్ 7,8 తేదీలలో బెంగళూర్ లో జరిగిన సమావేశంలో చర్చలు జరిగాయి. జాతీయ స్థాయిలో కేంద్రం తీసుకు వస్తున్న రైతు ఉద్యమ విధానాలపై పోరాడుతూనే, రాష్ట్ర స్థాయిలో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కూడా పోరాడాలనే ప్రతిపాదనలు బలంగా వచ్చాయి.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రామాలలో విస్తుతంగా ప్రచారం సాగించడం ద్వారా, సంయుక్త కిసాన్ మోర్చా ముందుకు తెస్తున్న డిమాండ్లపై రైతులలో అవగాహన కల్పించాలని సమావేశాలు భావించాయి. రైతులు పండించే పంటలకు కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులను లెక్కించి, దానిపై 50 శాతం లాభం ఉండేలా ధరలు నిర్ణయించాలని, కేవలం బియ్యమే కాకుండా, ఇతర ఆహార ఉత్పత్తులను కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించాలని సమావేశాలు గట్టిగా డిమాండ్ చేశాయి.
కేరళ తరహాలో రైతుల రుణ విమోచన చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని, వ్యవసాయ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న కార్పొరేటీకరణను ఆపేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రద్దు చేయాలని, 2022 అటవీ సంరక్షణ నియమాలను రద్దుచేసి, 2006 అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సామావేశాలు డిమాండ్ చేశాయి. పర్యావరణానికి హాని చేస్తూ, ప్రజల, పశువుల ఆహార బద్రతకు చేటు తెస్తూ బియ్యం, మొక్కజొన్న, జొన్న, చక్కెర లాంటి ఆహార ఉత్పత్తులతో ఇథనాల్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి మంజూరు అయిన 29 ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలని సమావేశాలు డిమాండ్ చేశాయి.
అన్ని రాష్ట్రాలలో పెరుగుతున్న కౌలు రైతాంగాన్నిగుర్తించాలని, వారి వ్యవసాయానికి కూడా ప్రభుత్వాలు మద్ధతు అందించాలని,మహిళా రైతుల సమస్యలను ప్రత్యేక దృష్టి తో అధ్యయనం చేసి, డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని సమావేశాలు డిమాండ్ చేశాయి.
రైతులకు 5000 రూపాయలు నెలవారీ పెన్షన్ గా ఇవ్వాలని కూడా సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన రైతు సహకార సంఘాలపై కేంద్రం పెత్తనం కోసం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సమావేశం భావించింది.
ఎన్నికలలో వివిధ పాలకవర్గ పార్టీలకు మద్ధతుగా రైతు సంఘాలు నిలబడి పోరాడితే, మొత్తంగా రైతు ఉద్యమానికి హాని జరుగున్నదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల భాష మాట్లాడిన పార్టీలు, అధికారం చేపట్టాక, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతు, పేదల వ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నాయని, ఈ ధోరణులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా కనిపిస్తున్నాయని సమావేశం భావించింది. ముఖ్యంగా ప్రభుత్వాలు భూసేకరణ పేరుతో రైతుల భూములను గుంజుకుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని సమావేశం విమర్శించింది. కాబట్టి, స్వాతంత్ర్య రైతు ఉద్యమాన్ని నిర్మించి, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అవి తీసుకు వచ్చే రైతు వ్యతిరేక విధానాలపై పోరాడేలా ఉండాలని సమావేశం నిర్ధిష్టంగా స్థానిక రైతు సంఘాలకు సూచించింది.
ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ కోసం భూసేకరణ జరిపినప్పుడు రైతులు భూమి ఇవ్వడానికి వ్యతిరేకం కాదనీ, కాకపోతే ఆ భూమి రైతుల పేరు మీదే ఉండాలనీ, కంపనీలకు లీజుపై భూమిని ఇప్పించాలనీ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి . అటవీ భూములలో పెద రైతులు సాగు చేసుకుంటున్నారనీ, వాళ్ళకు సాగు హక్కులు ఇవ్వాలనీ సమావేశం డిమాండ్ చేసింది. .
2024 నవంబర్ 15 లోపు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర సదస్సులు నిర్వహించు కోవాలనీ, రైతు,వ్యవసాయ కూలీల ఐక్యతను సాధించడానికి ఆయా జిల్లాలలో, రాష్ట్రాలలో ఎక్కువ సంఘాలను కలుపుకోవాలనీ, సంస్థ ఇప్పటికే ఆమోదించిన 12 డిమాండ్లను ప్రజల ముందుకు తీసుకు వెళ్ళాలనీ సమావేశం పిలుపు ఇచ్చింది.
రాష్ట్ర స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర జనరల్ బాడీ ని, రాష్ట్ర సెక్రటేరియట్ ను వేసుకోవాలనీ, అక్టోబర్ 14 న జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలనీ, అక్టోబర్ 16 న దిల్లీలో సంస్థ జాతీయ జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవాలనీ బెంగళూర్ సమావేశం పిలుపు ఇచ్చింది.


Tags:    

Similar News