చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి పాత సవాళ్లు, పరిష్కారం ఏమిటి?
ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్ కె ఎస్ చలం సూచనలు. అట్టడుగుకు పడిపోతున్న ఆంధ్రాని అగ్రశ్రేణి రాష్ట్రం చేయవచ్చు, చాలా మార్గాలున్నాయి. వివరాలు
అది అనేక రాజకీయ, ఆర్థిక వైషమ్యాలకు దారితీసింది. ముల్కి, ప్రత్యేక ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర అంటూ తెలుగు ప్రజలు రెండుగా విడిపోవడానికి అనేక చారిత్రక, రాజకీయ కారణాల మూలంగా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ తమ రిపోర్టులో రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలను అంచనా వేసింది. దాని ఆధారంగా తెలంగాణ ప్రజల బలిదానాల నేపధ్యంలో పార్లమెంటులో అనేక డ్రామాల మధ్య 2014 లో రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ ఒక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రి ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ను మార్చ్ 1 న రాష్ట్రపతి సంతకంతో విడుదలయింది.
ఈ చట్టంలో 108 నిబంధనలు పొందుపరిచారు. 13 షెడ్యూల్లు, 12 విభాగాలుగా 70 పేజీల చట్టం రూపొందింది. కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు విభజన తేదీని జూన్ 2, 2014 నిర్ణయించారు. అయితే 1953 నాటి ఆంధ్రప్రదేశ్ కాకుండా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను అంగీకరించడానికి ఆంద్రా ప్రాంత ప్రజలు మానసికంగా సిద్ధ పడక తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎన్నికల్లో కేంద్ర పాలక పార్టీకి వ్యతిరేకంగా తీర్పు యిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యపట్నం నిర్మాణం ఎక్కడే జరగాలనే నిర్ణయం కోసం కె.సి. శివరామ కృష్ణన్ కమిషన్ ను నియమించింది. ఆ కమిటి ఆగస్టు 31, 2014ర రిపోర్ట్ యిచ్చింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 సెప్టెంబర్ 2014 న అమరావతి రాజధానిగా తీర్మానించారు.
అయితే 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనవరి 2019 లో మూడు రాజధానుల బిల్లు ను ప్రవేశ పెట్టారు. అది న్యాయపోరాటం లోకి వెళ్ళటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరైన పరిపాలన వేదిక లేక నష్టపోయింది. భారతదేశంలో ఐదవ స్థానంలో వుండవలసిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా దిగజారిపోయింది. 2014 చట్టంలో అమలు చేస్తామన్న హామీలు పూర్తిగా అమలు కాలేదు. అవి:-
1. కొత్త రాజధాని నిర్మాణానికి 94(3)(4) ప్రకారం ఆర్థిక సహాయం పూర్తిగా అందలేదు.
2. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి నిధులు రాలేదు.
3.చట్టంలోని 84,85 అధికరణల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జరగవలసిన నీటి పంపకం కోసం ఏర్పడిన వ్యవస్థలు పూర్తిగా పనిచేయడం లేదు.
4.చట్టంలోని 90 అధికరణ ప్రకారం పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. పదేళ్లయిన యిది ఒక కొలిక్కి రాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లేక ఎడమ గట్టు కాల్వల పనులు పూర్తి కాలేదు.
5. మౌలిక సదుపాయాల కల్పనలో జరిగే లావాదేవీలకు పన్ను రాయితీలు ప్రకటించారు. నిజానికి యీ అధికరణ దృష్ట్యా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యితోధికంగా ఆర్థిక సహాయం చేయవచ్చు.
6. 75 అధికరణలో పేర్కొన్నట్లు 10 వ షెడ్యూల్ లోని 107 సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా న్యాయం జరగలేదు.
7. ఆంధ్రప్రదేశ్ వనరుల, ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని 92 అదికరణను రూపొందించి పదవ షెడ్యుల్ లో పెట్టారు. ఇదే ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను,వనరులను కాపాడుతుంది , రాష్ట్రం విషయం లో కేంద్ర ప్రభుత్వానికి మార్గ నిర్దేశనం చేయడమైనది. ఇందులో
(ఎ) బొగ్గు గనులకు సంబందించి సింగరేణి తదితర గనులలో ఆంధ్ర కు రావలసిన వాటా.
(బి) చమురు, గ్యాస్ కు సంబందించి సరైన మార్గదర్శకాలు యివ్వాలి. ఇంతవరకు కె.జి.బేసిన్ లో నుండి లభిస్తున్న యీ రెండు వనరులపై యింతవరకు ఆంధ్రప్రదేశ్ కు రావలసిన అదనపు ఆదాయం రావడం లేదు.
(సి) విధ్యుత్ కు సంబందించి యింకా ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం కావలసిన ప్రాజెక్టుల గూర్చి సరైన స్పందన లేదు.
(8) విద్యాసంస్థల ఏర్పాటులో 93 అధికరణ ప్రకారం రావలసిన సంస్థలు, దుగ్గు రాజుపట్నం పోర్టు నిర్మాణం , కడప లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు.
(9) ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ను పోలిన వైజాగ్-చెన్నై కారిడార్ కు అడుగులే పడలేదు.
(10) విశాఖ కేంద్రంగా ఏర్పాడిన రైల్వే జోన్ నిర్మాణం, దాని ప్రాతిపదికన రైల్వే రిక్రూట్మెంట్ జరగలేదు.
(11).విశాఖ,విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో కు 2015 లోపు నిర్ణయం జరగాలని వున్నా ఎటువంటి పనులు ప్రారంభించలేదు.
(12) డిలివిటేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు 225 సభ్యులు గల శాసనసభకు అడుగులు పడలేదు.
(13) పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ చట్టం రూపంలో యిచ్చిన హామీలు యీ పదేళ్లలో అమలు కానందున ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా ప్రత్యేక హోదా యివ్వవలసి వుంది.
కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనేక సాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్ కు న్యాయబద్ధంగా రావలసిన ఆర్థిక సహాయం అందించలేదు. దానికోసం ప్రత్యేక హోదా అన్న అంశం యిప్పుడు వీలుకాదు అంటున్నారు. దానికి వారు చెప్పే కారణం, యిప్పుడు ప్రణాళికా సంఘం లేదు కాబట్టి ప్రత్యేక హోదా అమలుకు వీలుకాదు అని.
ఇది సాకు మాత్రమే, ఎందుకంటే నీతి ఆయోగ్ ద్వారా గతంలో ప్రణాళిక సంఘం చేసే చాలా పనులు,కార్యక్రమాలు నిధులు పంపిణీ జరుగుతుంది. ఆ నిధులు ఏ విధంగా విడుదలవుతున్నాయో అదేవిధంగా ఆంద్రప్రదేశ్ కి యివ్వవచ్చు. అందులో మిగతా రాష్ట్రాలు అడగడానికి పోటీ పడటానికి వారికి చట్టరిత్య ఎటువంటి అవకాశం లేదు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 చట్టంలో అన్ని పొందుపరిచి వుండటంతో రావలసిన నిధులు యివ్వవచ్చును. ఫైనాన్స్ కమిషన్ అంగీకరించదు అన్న అబద్ధంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం బయటపడింది. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఇందులో జోక్యం చేసుకోడానికి అమేండేట్ వుండదు.
న్యాయబద్ధంగా 2014 చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నిధులు,వనరులు,వాటాలు,ప్రోత్సాహకాలు అందకపోగా, సాధారణంగా లభించే వాటాలో కూడా రాజకీయ అవసరాలు జొప్పించి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడేలా చేశారు. నిజానికి దేశంలోకి విదేశాలనుండి వస్తున్న రెమిటెన్సేస్ లో తెలుగువారి నిష్పత్తి ఎక్కువగా వుంది. ముఖ్యంగా డాలర్ రూపేన దేశానికి వస్తున్న ఎన్ ఆర్ ఐ చెల్లింపులలో ఆంధ్రులే ముందుంటారు. అందుచేత కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి పట్ల చూపుతున్న వివక్ష ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిచూపుతూ న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావలసిన ఆర్థిక వనరులను రాబట్టుకోవాలి, అందుకు ప్రజల,రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి.
దక్షిణాదిలో వెనుకబడ్డ ఆంధ్ర:
2014 కు ముందు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా వుండేది. రాష్ట్ర సగటు ఆదాయం 2004 -05 -2012 -13 మధ్య 7.25 శాతం పెరిగింది. ఇది ప్రధానంగా తయారిరంగం, సేవా రంగాల వృద్ధి మూలంగా జరిగింది. 2012-13 లో రాష్ట్ర ఆదాయం 2.35 లక్షల కోట్లు. సగటు ఆదాయం రాష్ట్రంలో గాజువాకతో కూడుకున్న విశాఖపట్నం నుండి 32,423, రెండవ ర్యాంకులో కృష్ణాజిల్లా రూ.26,749 వుంది. ఇందులో సేవా రంగం నుండి 55.3 శాతం, వ్యవసాయం 23.1 శాతం, పరిశ్రమలు 21.5 శాతం నుండి వచ్చింది. ఇందులో పరిశ్రమలు, సేవరంగాల నుండి వచ్చే ఆదాయం పెరుగుతూ ఉంటే వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు 2004-05 నుండి 2012-13 లో చూడవచ్చు.
వ్యవసాయ రంగంలో మత్స్య, పశుసంపద మూలంగా వచ్చే ఆదాయం పెరుగుతూ వుంటే అడవులు తదితర రంగాలలో ఒడిదుడుకులు ప్రస్ఫుటమయ్యాయి అలాగే పరిశ్రమల రంగంలో తయారీ రంగం, మైనింగ్ లో కొంత అస్థిరత కనిపించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ చాలా వైరుధ్యాలను విషమ పరిస్థితులను ఎదుర్కొన్నది. ఒకప్పుడు బలంగా ఉన్న సేవారంగం రాష్ట్ర ఆదాయంలో 2014-15 నాటికి 44.13 శాతానికి 2020-21 కి 40.89 శాతానికి పడిపోయింది.
అదేవిధంగా పారిశ్రామిక రంగం 25.48 శాతం నుండి 21.84 శాతానికి దిగజారిపోయింది. ఈ కాలంలో వ్యవసాయ రంగమే ఆదుకుంది. అది 30.39 శాతం నుండి 37.27 శాతానికి పెరిగింది. ఇందులో ముఖ్యంగా మత్స్య పరిశ్రమ, పశువులు, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాయి. అంటే ఒకప్పుడు వ్యవసాయ ఆధారంగా వుంటూ పారిశ్రామికంగా ఎదుగుతున్న రాష్ట్రం విభజన తరువాత మళ్లీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోవడం, వ్యవసాయంపై ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఆర్థికంగా ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ఆంధ్ర ప్రజలు చాలా యిబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణగా 1950 -51 ప్రాంతంలో ధాన్యం 22.73 లక్షల టన్నులు పండిస్తే 1995- 96 నాటికి 90 లక్షల టన్నులకు ఎదిగింది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఆంధ్ర కంటే తెలంగాణ 2022 లో 251 లక్షల టన్నులు పండిస్తే ఆంధ్ర 133 లక్షల టన్నులకు పరిమితమయింది. ఇందులో మొదటి నుండి ఐదు జిల్లాలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలే ఎక్కువ ధాన్యం పండించారు.
రాజధాని పేరుమీద జరిగిన తాత్సారం మూలంగా కూడా వ్యవసాయం దెబ్బతింది. అయితే ఇందులో వ్యవసాయానికి కావలసిన సాగునీరు విషయంలో కోస్తా జిల్లాల కంటే ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా వివక్షతకు గురయినవి. మొత్తం మూడు జిల్లాల సాగునీటితో చేసిన వ్యవసాయం ఒక్క గుంటూరు జిల్లాతో సమానానికి పడిపోయింది. 2022లో శ్రీకాకుళం జిల్లా 8.7 లక్షల హెక్టార్లుంటే గుంటూరు 14.7 లక్షల హెక్టార్లు, ప్రకాశం 9.6 లక్షల హెక్టార్లు వుంటే , విజయనగరం 5 లక్షల హెక్టార్లు, విశాఖపట్నం 3.5 లక్షల హెక్టార్లు కు మాత్రమే సాగు నీరు లభిస్తోంది.
నిజానికి గోదావరి జలాలాల్లో అధిక భాగం ఉత్తరాంధ్ర తూర్పు కనుమల నీరైనా శీలేరు-శబరి-ఇంద్రావతి నుండే అన్నది యిక్కడ గమనార్హం. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాల్లో న్యాయబద్ధంగా రిపారియన్ హక్కు వున్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం కొరవడడంతో సుమారు 814 టి.ఎం.సి ల నీరు మూడు నాలుగు కోస్తా జిల్లాలకు మాత్రమే పరిమితమై మిగతా ప్రాంతాల వ్యవసాయ అవసరాలు తీర్చక పోవడంతో వలసలు, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎడమ కాలువ నీరు బాహుద వరకు నీరు వెళ్లగలిగితే రాష్ట్ర వ్యవసాయం రంగం యినుమడిస్తుంది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే అప్పులు, బడ్జెట్ సంబంధిత లోటు, పెరుగుతూ వుంది . లోటు అన్నది రెవెన్యూ ,బడ్జెట్ లోతుల కంటే ఫిస్కల్ లోటు కు ఎఫర్ బి ఏం చట్టం తరువాత ప్రాధాన్యత వుంది. అయితే ఈ లోటు నిష్పత్తులన్నీ రాస్తర వనరులు, ఆదాయ మార్గాలు పెరిగే మార్గాలు పెరిగే అవకాశాలను చూడకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన ల నేపధ్యం లో చూడటం తో యిదో పెద్ద సమస్యగానే వుంటుంది.
జి ఎస్ టి వచ్చిన తరువాత ఆదాయం అంతా కేంద్రము పట్టుకు పోతే రాసత్రాలు తమ ఆదాయ మార్గాలు పెంచుకుంటాయి. యిది రాజకీయమైన సమస్య విత్త శాస్త్రానికి సంబంధించినది కాదు. ఫిస్కల్ డెఫికయిట్ లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కంటే వెనుక బడి వుంది. కారణం, ఆంధ్ర ప్రదేశ్ ఆదాయ మార్గాలు తగ్గి పోయావి, కమిట్మెంట్స్ పెరిగాయి. దీనికి పరిష్కారం 2014 చట్టం లో యిస్తామన్న ఆర్ధిక పాకేజ్, ప్రత్యేక హోదా లేక దానికి బదులుగా యివ్వ వలసిన గ్రాంట్ పెరతిగితే డెఫిసెట్ తగ్గు తుంది.
ఆదాయ మార్గాలు వున్నపుడు ఆర్ధిక అభివృద్ధి పెరిగే క్రమం లో అప్పులు అభివృద్ధికి తీసుకుంటే బెంగ పడవలసింది లేదు . ఆర్ధిక శాస్త్ర వేత్తలయిన దోమర్, ముస్ గ్రేవ్ తదితరులు దీని పై విఖ్యానించి వున్నారు చూడ వచ్చు. రాష్ట్ర ఆదాయం వడ్డీ రేటు, కేంద్ర గ్రాంట్ ల పై ఈ సమస్య ఆధార పది వుంటుంది . ప్రభుత్వ ఆర్ధిక బుయ న్సీ ( తేలిక) అన్నది అనేక ఆర్ధిక, జాతీయ అంశాల మీద ఆధార పది వుంటుంది. దూర దృష్టి రాజకీయ సంకల్పం అనుభవం వున్న నాయకులు వున్నపుడు యిది పెద్ద సమస్య కాదు.
నేటి రాష్ట్ర ఆర్ధిక స్తితి ని మెరుగు పరిచేదెలా?
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ గా మారిన తరువాత రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రజలకు అందివ్వటంతో పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దేశంలో పదిశాతం లోపు దళితేతరుల పేదరికం వున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. గతంలో పేర్కొన్నట్లు అందుకు ఆహార భద్రత చట్టం కూడా అంది వచ్చింది. అయితే నిరుద్యోగం, పరిశ్రమలు లేకపోవటం, వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం కొరవడటంతో ఉత్తరాం ద్ర, రాయలసీమ తదితర ప్రాంతాల నుండి వలసలు పెరిగాయి. ఇది భవిష్యత్ లో వ్యవసాయ సాగుకు ప్రతి బంధకంగా మారుతుంది.
2022- 23 నాటి మల్టి డైమెన్సనల్ పవర్టీ ఇండెక్స్ పేదరిక సూచిక ప్రకారం రాష్ట్రంలో 12.31 శాతం మంది పేదలున్నారు. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 24 శాతం విశాఖ 18 శాతం మంది వున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. నిరుద్యోగ సమస్యలో డిగ్రీ చదువుతున్న వారు 27.7 శాతం, పి.జి డిగ్రీ వున్న వారు 29.9 శాతం మంది వున్నారు. ఈ నిరుద్యోగిత దేశ సగటు డిగ్రీ ( 19.8) కంటే ఎక్కువ వుంది.
అందుకే రాష్ట్రం లో ఆర్ధిక లావాదేవిల పరంగా జి.యస్. టి ని కొలమానంగా చూస్తే ఆంధ్ర వెనుకబడి వుంది. దేశంలో మహారాష్ట్ర 2022 లో వసూళ్ల లో అందరి కంటే 2,67770 కోట్లతో ముందుంది, కర్ణాటక రెండో స్తానం లో 117546 కోట్లు ,తెలంగాణ 9 వ స్థానం లో 50394 కోట్లతో వుంటే ఆంధ్ర ప్రదేశ్ 12 వ స్థానం లో 37675కోట్లు పన్ను చెల్లింపు ద్వారా వెనుకబడివుంది. ఇది రాష్ట్ర ఆర్ధిక లావా దేవీలను తెలియజేస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోకముందు 1990 ప్రాంతంలో రాష్ట్ర ఆదాయం ప్రకారం దక్షిణాది లో 3 వ స్థానం లో, కేరళ కంటే ఎగువన వుండేది. 1922- 23 గణాంకాల ప్రకారం చూస్తే సగటు రాష్ట్ర ఆదాయంలో మొదటి స్తానంలో తెలంగాణ రూ 3,08,732 తో వుంటే, ఆంద్ర ప్రదేశ్ రూ రూ 2,19,518 తో 5 వ స్తానానికి దిగజారి పోయింది. ఇది రాష్ట్రాల నుండి వసూలవుతున్న జి.యస్. టి రూపంలో కూడా ప్రతిఫలిస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వం వెనుక బడిన రాష్ట్రాలకు యిస్తున్న రాయితీలకు అర్హులు అని చెప్పటానికి ఈ గణాంకాలు. కాని నేటి పరిస్తితి అలాలేదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరుపాయి జి.యస్.టి కి చెల్లిస్తే తిరిగి 0.49 పైసలు మాత్రమే మనకు అందుతోంది. బీహార్ కు రూ 7.06 అందుతోంది. ఉత్తరాది రాజస్తాన్, మధ్య ప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ లు ఎక్కువ గ్రాంటులు పొందుతున్నాయి. ఫైనాన్స్ కమిషన్ వినియోగించే జనాభా, ఏరియా, అడవులు , ఆదాయం, డెమోగ్రాపిక్ దూరాలను బట్టి అంచనా వేయటం తో దక్షినాది రాష్టాలు ముఖ్యం గా ఆంధ్ర ప్రదేశ్ నష్ట పోతుంది.
ఈ విషయమై దక్షిణాది రాష్ట్రాలు ఇదివరకే తమ గొంతు విప్పాయి . బీహార్ ప్రత్య క స్టేటస్ కోసం రాజకీయంగా ఒత్తిడి తేవడంతో సుమారు రూ 125000 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. అంటే ఏడాదికి 25 వేల కోట్లు ఎందుకు పనికిరావు . ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీయిస్తాం అంటే ఆంధ్రప్రదేశ్ కు అంతే మొత్తం లేక కొంచెం ఎక్కువ రావచ్చు. అది వెనుకబడిన నేటి ఆంధ్రప్రదేశ్ కు 2014 చట్టం ప్రకారం రావలసిన రాయితీలు అందవలసి ఉండగా లెక్క గడితే సరిపోదు. నిజానికి ప్రత్యేకహోదా మూలంగా పన్నుల్లో, ప్రోత్సాహకాల్లో వచ్చే రాయితీల మూలంగా ఎక్కువ ఫలితం వుంటుంది. రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయి.
పరిష్కారామేమిటి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలు, ప్రోత్సాహకాల కోసం పోరాడుతూనే రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత దశ నుండి పారిశ్రామికీకరణ కోసం ప్రయత్నించాలి. గతంలో రాష్ట్రాo విడిపోయిన సందర్భంలో తెలుగుసీమ డెవలప్మెంట్ విజన్ పేరుతో మేమొక పత్రాన్ని విడుదల చేశాము. అందులో ఆంధ్రప్రదేశ్ కు వున్న 900 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తూర్పు దిక్కున అంటే ఉదయిస్తున్న సూర్యుడు గల రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చో పేర్కొన్నాం. అంటే విదేశీ వాణిజ్యానికి సింగపూర్, జపాన్, చైనా, తదితర తూర్పు దేశాలకు దగ్గర ద్వారంగా దేశంలోని ఎగుమతులు, దిగుమతులు కు అనువైన ప్రాంతంగా మార్చాలి. ఢిల్లీ- ముంబై పారిశ్రామిక కారిడార్ వివరాలు యిస్తూ విశాఖ- చెన్నై కారిడార్ కోసం ప్రయత్నించాలి అన్నాము.
ఇప్పుడు ఇది విశాఖ - కలకత్తా వరకు భోగాపురం కలుపుకొని విస్తరిస్తే ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు బీహార్, యూపీ, చత్తీస్గడ్, జార్ఖండ్ ఆంధ్ర వైపు చూస్తాయి. అది ఒక ప్రారంభంగా అనుకొని నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి.
ఇప్పుడు ఐటీ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతుంది. ఏ. ఐ వచ్చిన తర్వాత మానవ ఆధారిత ప్రక్రియలు తగ్గిపోయి నిరుద్యోగం పెరగవచ్చు. అంటే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించడానికి సదవకాశము వస్తుంది. విదేశాల్లో ఉన్న మన వారి దగ్గర అనుభవం, పెట్టుబడి కూడా ఉంటుంది. వారికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రతి జిల్లా, ప్రాంతంలో చిన్నా, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రయత్నించాలి. విదేశీ పెట్టుబడులు,వేల, లక్షల కోట్ల డాలర్లు వస్తే మంచిదే వాటి కోసం వెంపర్లాడకుండా మనవారికి అవకాశాలు ఇచ్చే సమయం వచ్చింది.
తమిళనాడు ఇప్పుడు వ్యవసాయ ఆధారితంగా కాకుండా పరిశ్రమలు, సేవారంగం వైపు పయనిస్తుంది. గుజరాత్, మహారాష్ట్ర కూడా అదే బాటలో ఉన్నాయి. దక్షిణాదిలో మనకున్న అవకాశాలు వనరులు యికోకరికి లేవు. అద్భుతమైన తీరం, తూర్పు కనుమలు ప్రకృతి వనరులు కష్టపడే ఆదివాసీ, దళిత, సేవక కులాలు అందుబాటులో ఉంటాయి. అయితే సాంప్రదాయ పరిశ్రమలు కాకుండా బయో ఫార్మాసిటికల్, బయో మెడికల్, శాటిలైట్ అప్లికేషన్, నూతనంగా వస్తున్న ఫోటో వాల్టిక్, ప్యుయర్ సెల్, పర్యావరణ అనుకూల సముద్రతీర మత్స్య పరిశ్రమలు వంటివి ఆలోచించాలి.
దీనికి కావలసిన పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చి వ్యవసాయ రంగం నుండి వస్తున్న ఆదాయ మిగులును పరిశ్రమల వైపు మళ్ళించాలి. ప్రజల ఆదాయం పెరగకుండా, పొదుపు లేకుండా పెట్టుబడి పెరగదు. ఇలా చేయగలిగితే భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, ఉపాధి ప్రతి జిల్లాలో కల్పించి తే వలసలు తగ్గుతాయి. జిల్లాలు, సామాజిక వర్గాల సమతుల్యం పెరిగి వైష మ్యాలు తగ్గుతాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం అవసరమే, అయితే దానిపై సమయం, ఖర్చు ఎక్కువ పెట్టే బదులు, రాజధానితో సహా మిగతా జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావలసిన మేధోమధనం నూతన ప్రభుత్వం చేపట్టాలి .