కారంచేడు మారణ కాండకు నలభై ఏళ్లు.. మారిందేమిటి?

దళితుల మీద దాడులు, ఆపై ఉద్యమాలు ఉద్యమాలు పీడిత వర్గాలను ఐక్యం చేయ గలిగినాయా? దళిత-బహుజన సమైక్యత తీసుకురాగలిగిందా? కనీసం దళిత కులాలను ఐక్యం చేయటానికి తోడ్పడిందా?

Update: 2024-07-16 10:53 GMT

-ఎం. జయలక్ష్మి

కారంచేడు మారణ కాండ (1985 జులై 17) దేశంలోనే, ఒక ప్రముఖ దుర్ఘటన. అది జరిగి నేటికి నలబై ఏళ్లు. అనేక వాద వివాదాలకూ, రాజకీయ పరిణామాలకూ, ఉద్యమాలకూ దారితీసిన దుర్ఘటన అది. నాడు ఒంగోలు, నేడు బాపట్ల జిల్లా; ఆనాటి జనాభా 13600, అందులో సుమారు 6000 మంది కమ్మవారు; 2000 మంది దళితులు , అందులో 1100 మాదిగ, 900 మాల, మిగతా ఇతరులు వుండేవారు. ఈ సంఘటనకు ముందు, తరువాత కూడా ఈ మాదిరి సంఘటనలు అనేకం జరిగాయి. చుండూరు లో 1991 ఆగస్టు 6 న జరిగిన ఘోరం కూడా నేటికీ మరిచి పోలేనిది. వీటికి వ్యతిరేకంగా అనేక రూపాలలో ప్రతిఘటన కూడా వచ్చింది. అయినా పరిస్థితి లో పెద్ద మార్పు వున్నట్లు కనిపించదు. దీనికి కారణాలు ఏమిటో పరిశీలించటం అవసరం, సముచితం.


కారంచేడు కేసుతోపాటు ఇలాటి ఎన్నో కేసుల్నీ వాదించిన అనుభవం, చిత్తశుద్ధికల న్యాయవాది, పౌర హక్కుల ఉద్యమాల, దళిత ఉద్యమాల ప్రముఖ నేత బొజ్జా తారకం. ఈ సమస్యపై ఆయన ఇలా రాసారు: “కారంచేడు, నీరుకొండ జరగటానికి కమ్మవారి రాజకీయ అధికారం (కారణ మైతే) , తిరిగి రెడ్లకు రాజకీయాధికారం రావటంతో చుండూరు, చలకుర్తి జరిగాయి. అగ్రకుల అహంకారం భూస్వామ్య ఫ్యూడల్ లక్షణం. దానికి వ్యతిరేకంగా దళితులు సాగిస్తున్నది ఆత్మగౌరవం కోసం పోరాటం” అని నలుపు (1991 సెప్టెంబర్ 1-15) పక్షపత్రిక సంపాదకీయం లో రాశారు.“ఇంతకుముందు జరిగిన అత్యాచారాలకు, చుండూరుకు కొంత తేడా ఉన్నది. ఇప్పుడు కొత్తగా రెడ్లు, కాపు లు కలిశారు. దళితుల ఆత్మస్థైర్యం ముందు ఈ కలయిక ఒక్కటే చాలలేదు,. పోలీసు బలగం సహాయం తెచ్చు కున్నారు. వారికి కిరాయి గుండాలుగా వ్యవహరించారంటే పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి.” పొరుగు గ్రామాల రెడ్లు, తెలగల (కాపు) సహాయం కోరారు. 21 మందిని హత్య చేశారు. మొత్తం పని పూర్తయ్యే వరకూ (గంటన్నర) పోలీసులు కావలి కాసి, మరో 30 గంటల వరకూ సమాచారం ఏ అధికారులకూ అందజేయలేదు. కేసు ఏ మాత్రమూ బలంగా నిలబడకుండా చేసే ప్రయత్నాలు ఇవన్నీ..” అని చుండూరు తర్వాత ఆయన రాశారు.“ఎంత వరకయితే రాజకీయ అధికారాన్ని దళితులు హస్తగతం చేసుకోరో, అంతవరకూ ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి ,” అని ముగించారు.


 ఈ దాడులు దళితులను ఎందుకు ఐక్య ం చేయలేకపోయయి

పై ఘటనలు, ఉద్యమాలు పీడిత వర్గాలను ఐక్యం చేయ గలిగినాయా? దళిత-బహుజన సమైక్యత, ఉద్యమాన్ని సంఘటితం చేయగలిగిందా? పోనీ కనీసం దళిత కులాలను ఐక్యం చేయటానికి తోడ్పడిందా? ఎన్నికలు, ఎన్నికల సమీక్షలు, పదవుల పంపకాలు-మొత్తంగా, దశాబ్దాలుగా- కులాల చుట్టూనే తిరుగుతున్న నేటి పరిస్థితిలో కొన్ని గమనార్హమైన విషయాలను చర్చించుదాము. తెలుగు రాష్ట్రాలు రెండూ మళ్లీ ఎన్నికల నుంచి కోలుకుంటున్న స్థితిలో ఆయా వర్గాల, కులాల, కుల సంఘాల సిద్ధాంతకారులు పరిశీలించు కోవలసిన ప్రశ్నలు వున్నాయి. ఇలాటి సంఘటనలు అవి ప్రచారం పొందుతున్నట్లుగా కేవలం ఆయా ‘కులాల మధ్య’ ఘర్షణలు కావు ఈ అన్నిటిలోనూ బలై పోయింది అట్టడుగు వర్గాల వారే, గ్రామీణ పేదలే అని తెలుసుకోవాలి.


కారం చేడులో, మరణించిన గాయపడిన బాధిత కుటుంబాల వారితో పాటు అనేక మందిని ఆ రోజుల్లో కలిసిన ఓపిడిఆర్ నిజనిర్ధారణ కమిటీ ఇతరులు విస్మరించిన అనేక విషయాలను కూడా వెల్లడించింది. వందల సంఖ్యలో వచ్చి మాదిగ వాడపై చేసిన దాడిలో ఆరుగురు గ్రామీణ పేదలు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు మానభంగాలకు గురయ్యారు ఈ దౌర్జన్యాల ప్రత్యక్ష సాక్షి అయిన మహిళను తర్వాత హత్య చేశారు. ఈ దౌర్జన్యాల్ని ‘కుల సంఘర్షణలు’ గా పాలకవర్గాలూ ప్రభుత్వమూ వారి మీడియా తొలి దశలో చిత్రించాయి. కాగా ఈ ఘటనలోని వర్గ కోణాన్ని విస్మరించి లేదా తగ్గించి ”దళితులపై కమ్మ భూస్వాముల దాడి” అని పలువురు సమీక్షించారు. ఆ గ్రామ దళిత కుటుంబాల్లో మాల మాదిగలున్నా ఈ దాడి మాదిగ కుల పేదలపై మాత్రమే జరిగింద న్నది ఒక వాస్తవం. దానికి గల కారణాలు ఓపిడిఆర్ రిపోర్టులో కనిపిస్తాయి.


దళితుల్లో ఆర్థిక పరివర్తన


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం గెలిచాక ‘కొత్త సంపన్న భూస్వామ్య వర్గాలు’ రాజకీయంగా సంఘటిత మవటానికి ప్రయత్నిస్తూ ఉండినాయి. కారంచేడులోనూ సాగిన ఆక్రమంలో భాగంగానే మైనారిటీల కుటుంబాలు సహా వివిధ కులాలకు చెందిన గ్రామీణ పేదలపై అనేక దాడులు జరిగాయి.అయితే ఆ గ్రామంలోని మాదిగలు ఐక్యంగా సంఘటితం గా ఉండి గట్టిగా ప్రతిఘటించటం భూస్వామ్య వర్గాలకు ఒక అడ్డంకిగా ఉండింది. వారు కూలీలు గానే కాక, కౌలుదారులుగా రైతులుగా భూములు దున్నుకొని ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటున్న కాలం అది.


వారిలో కొందరు చదువుకొని గ్రామం వెలుపల ఉద్యోగాలు కూడా సంపాదించుకొని ఉన్నారు. ఆ గ్రామంలో ఉండిన 120 ఎకరాల పోరంబోకు భూములను వశం చేసుకొని మాదిగ కులానికి చెందిన గ్రామీణ పేదలు దాదాపు 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ ఉండినారు. ఆ పొలాల్లో తమ పశువుల్ని మేపటం, చెడగొట్టటం ద్వారా భూస్వాములు ఆటంకాలు కల్పించే వారు. ఆ భూములపై పట్టాలు కావాలని కోరుతూ ఆ పేదలు అనేక సార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. అంతేకాక భూస్వాముల నాయకుడైన ఆ గ్రామ పెద్ద దగ్గుబాటి చెంచు రామయ్య ను కూడా కలిశారు. ఆయన మొదట్లో అలాగే చూద్దాం అన్నారు కానీ తర్వాత మాట తప్పారు. పొరుగున ఉన్న స్టువర్టుపురం సెటిలర్లను రంగంలోకి దించారు. ఆ భూమిని తాము దున్నుకుంటున్నాం అని వారితో చెప్పించారు. ఐక్యంగా, సంఘ టితం గా నిలబడ్డ కారంచేడు పేద రైతులు అధికారులను మళ్లీ మళ్లీ కలిసి తమ ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి వారి కోరికల్ని అంగీకరించిన జిల్లా కలెక్టర్ తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అది జూలై 15న జరిగింది; అది పేద రైతులకు ఉత్సాహాన్ని, భూస్వాములకు క్రోధాన్ని కలిగించింది. మండల ఎన్నికలు సమీపిస్తుం డటంతో కొత్త భూస్వామ్య వర్గాల పక్షాన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తన శక్తులను సమీకరించు కుంటున్న తరుణం అది. జులై 16 నాడు చెరువు దగ్గర జరిగిన చిన్న ఘటనని భూస్వాములు రగిలించారు: దళిత పేదలు మంచినీటి కోసం వాడే చెరువు దగ్గర పశువుల్ని కడుగుతుండగా ఆ నీళ్లు మళ్లీ చెరువులోకి వస్తున్నాయని మాదిగ మహిళ సువార్తమ్మ అభ్యంతరం చెప్పింది. దానికి అలిగిన కమ్మ యువకుడు ఆమెను తిట్టి చర్నాకోలతో కొట్టాడు. ఆమె తన చేతిలోని బిందెతో అడ్డుకొని ప్రతిఘటించింది. ఆ రాత్రి పెట్టిన పంచాయితీకి ఆ మహిళ రా నని నిరాకరించగా, ఇతర దళిత ప్రతినిధులు హాజరయ్యారు. వారి పక్షాన తేళ్ళ మోషే తదితరులు రాజీ ప్రయత్నాలు చేశారు. ఆ గొడవ సద్దుమణిగినట్టు పైకి కనిపించడంతో వారు రాత్రి విశ్రమించారు.


 దాడులు ఎలా మొదలయ్యాయంటే...


తెల్లవారక మునుపే పేదల్లో అధిక భాగం వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. కానీ రాత్రంతా భూస్వాముల శిబిరం సన్నాహాలు చేసుకుని, అదను చూసుకొని సుమారు వందమంది కర్రలు, గొడ్డళ్లు, బరిసెలతో పేదల వాడపై దాడి చేశారు. ప్రజలు వారిని ప్రతిఘ టించి వెనక్కి పంపించారు. కానీ కొద్ది సేపట్లోనే 400 మంది సాయుధ మూకలు మళ్ళీ వచ్చి దాడి చేశాయి. పారి పోతున్న వారిని వెంబడించి పొలాల్లోనే ఇద్దరినీ పొడిచి చంపేశారు. ఈ గ్రామంలో ఏడు దగ్గుపాటి భూస్వామ్య కుటుంబా లు - ఒక్కొక్కరూ 500 పైగా ఎకరాలు కలవారు; 50 కుటుంబాలు ఒక్కొక్కరూ 200-300 ఎకరాలు కల వారు; 30-50 ఎకరాలున్న చిన్న భూస్వాములు అనేకులూ ఉన్నారు. వాణిజ్యంలో పరిశ్రమల్లో సినిమాల్లో కూడా పై చేయి కలిగిన బడా భూస్వాములూ ఉన్నారు. ఈ వర్గం చేతిలో మొత్తం తొమ్మిది వేల ఎకరాలు ఆ గ్రామంలోనూ, మరో రెండు వేల ఎకరాలు ఆ పక్క గ్రామాల్లోనూ ఉండినాయి: ఇందిరమ్మ భూమి సీలింగు చట్టాలు తెచ్చిన దశాబ్దం తర్వాత లెక్కలు ఇవి.


కాగా వ్యవసాయ కూలీ రేట్లు అధమ స్థితిలో ఉండేవి. గ్రామీణ పేదల్లో సుమారు 30% కౌలు దారు లుగా, మిగతా వారు దాదాపు కట్టు బానిసలుగా ఉండేవారు. రోజుకి 12 గంటల చొప్పున, ఏ సెలవు లేకుండా, ఏడాది పొడవునా చాకిరి చేయాలి: రోజు కూలి 4-5 రూపాయలు. కౌలుదారులు తమ పంటలో సగభాగం కౌలుగా ఇచ్చుకునేవారు. మిగతా సగంలో చాలా భాగం తీసుకున్న అప్పులను, వాటిపై వడ్డీలను చెల్లించటానికి సరిపోయేది . భూస్వాములు ఇతరులు వడ్డీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించే వారు. నాలుగు వందల శాతం వడ్డీ రేటు, నాగు పెచ్చుల పద్ధతిలో ధాన్యం కూడా అప్పుగా ఇచ్చి విపరీతంగా దోచుకునే వారు. బస్తా వడ్లు అప్పు తీసుకుంటే రెండు నెలల్లో పంట వచ్చాక రెండు బస్తాలు తిరిగి చెల్లించాలి. అంటే ఏడాదికి 600% దాకా వడ్డీ అన్నమాట.


ఈ దాడి జరిగాక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాట వరుసకు సందర్శించారు. కానీ నేరస్తులను వారాల తరబడి కనీసం అరెస్టు చేయలేదు. వందలాది బాధితులు చీరాల చర్చిలో నెలల తరబడి తలదాచుకున్నారు. నేరస్తులకు శిక్ష పడాలన్న పట్టుదల ప్రభుత్వానికి ఏ కోశానా లేకపోయింది. ఈ స్థితిలో భూస్వాముల దాడి వెనుక కీలకపాత్ర పోషించిన దగ్గుపాటి చెంచురామయ్య నక్సలైట్లచే హత్యకు గురయ్యారు( 6.4.1989). ఆయన ఎన్టీఆర్ వియ్యంకుడు కూడా. దీనికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి భూస్వాముల పరిరక్షణకై గ్రామీణ రక్షణ దళాలను ఏర్పాటు చేస్తామని గ్రామానికి ఇద్దరు పెత్తందారులకు తుపాకులు ఇస్తామని ప్రకటించారు. అంటే పోలీసులకు అదనంగా ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు వీలు కల్పించటమే ఇది: ‘తెలుగు తుపాకీలు’ అని దీనిపై బొజ్జాతారకం వ్యాఖ్య రాశారు :

కారంచేడులో దౌర్జన్యం చేసింది కమ్మ భూస్వాములు అయితే, చుండూరులో రెడ్డి భూస్వాములు. రెండు చోట్ల ఆ కులాల వారు ఇతర కులాల్లో తమపై ఆధారపడి ఉన్న అనుచరులను సమీకరించారని శ్రీ తారకం రాశారు. లక్ష్మీపేట (శ్రీకాకుళం జిల్లా) 2012 జూన్ 12 దాడిలో ఐదుగురు దళితులు మరణించారు. దాడి జరిపినవారు తూర్పు కాపులు. వారిపై కొద్ది నెలల వరకు అరెస్టులు కూడా లేవు (నిజ నిర్ధారణ కమిటీ 2012 సెప్టెంబరు 8). ఇది కూడా హఠాత్తు దాడి కాదు. ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు అధికారులు సీఐ, ఏఎస్పీ, డీఎస్పీ, ఎమ్మార్వో, ఎమ్మెల్యే అంతా దళితులే అన్నది గమనార్హం.


భూస్వాముల కిరాయి మూకల్లో దళితు లు, బోయలు కూడా ఉన్నట్టు రాయలసీమలో అనేక ఉదాహరణలు చూడవచ్చును. తెలుగు ప్రాంతాల్లో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో వేలాదిగా గ్రామీణ పేదల్ని హత్య చేశారు. వాటిలో కొన్ని భూస్వాములు, వారి కిరాయి మూకలు చేసిన హత్యలు. అత్యధిక భాగం భూస్వాములకు అండగా పోలీస్ వ్యవస్థ సాగించినవి. హతుల్లో అత్యధికులు దళితులు, క్రింది కులాల వారు; కానీ ఆ ఘటనల్ని ‘దళితులపై దాడులు’ గా చిత్రించరు. ప్రజల్ని కులాల వారిగా చీల్చటానికి ఇతర సందర్భాల్లో దళితులపై దాడులను మాత్రమే హైలైట్ చేస్తారు; పోనీ కఠిన చర్యలు తీసుకున్నారా, వాటిని పూర్తిగా అరికట్టారా అంటే అదీ లేదు.


తమిళనాడులోనూ అలాగే జరిగింది


తెలుగు ప్రాంతాల్లోనే కాదు పెరియారు గడ్డ తమిళనాడులో దళిత గ్రామీణ పేదలపై వన్నియార్లు చేసిన దాడుల్లో తమపై ఆధారపడిన దళిత పేదల్ని ప్రయోగించినట్టు హిందూ(6.4.2022) ఒక సమీక్షలో రిపోర్టు చేసింది. ఈ సందర్భంలో 1967 లో తమిళనాడులో కీలవెన్మణి గ్రామం లో జరిగిన దురంతాన్ని కూడ గుర్తు చేసుకోవాలి. అది డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై పాలనలో, బ్రాహ్మణ వ్యతిరేక ఆత్మగౌరవ ఉద్యమ పితామహుడు పెరియార్ జీవన కాలంలోనే జరిగింది. 20 మంది మహిళలు, 19 మంది పిల్లలు సహా 44 మంది ప్రాణాలు బలిగొన్న పైశాచిక కాండ అది.


సుమారు 100 మంది, పోలీసు వాహనాల్లోనే గ్రామంలోని దళిత వాడలోకి వచ్చి ఈ దాడి చేశారు. పేదలు ఎర్రజండా చేతబట్టి తమ జీతాలు పెంచాలని ఊరేగింపు తీయటమే నేరంగా భావించిన భూస్వాములు, పేద దళితుల పై చేసిన దాడి అది, ‘ఒక భయానక పీడకలని, ఒక పిడుగుని మర్చిపోయి నట్టే ఈ ఘటనని ప్రజలు మర్చిపోవాలి’ అని అన్నాదురై. ‘జీతాలు మీరు డిమాండ్ చేయగలిగినవి కావు, అవి మార్కెట్ పరిస్థితులపై నిర్ణయించబడతాయి’ అని పెరియారు అన్నారు. కానీ పేదల పక్షాన నిలువలేదు. ఆ ఘటనలపై వారిద్దరి స్పందనలు గమనించవలసి వుంది. 4-5 దశాబ్దాల కోర్టు కేసుల తర్వాత హంతకులను హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఏ శిక్షా లేకుండా నిరపరాధులుగా తేల్చి విడిచి పెట్టేశాయి( ఎక్విటెడ్).

అప్పటి నుండి నేటివరకూ తమిళనాడులో పెరియారిస్టు [ద్రవిడ] పార్టీలు మాత్రమే నిరంతరాయంగా అధికారంలో వున్నాయని గుర్తించాలి. తమిళనాడు లో దళిత గ్రామీణ పేదలపై శూద్ర వన్నియార్ల ముకుమ్మడి దౌర్జన్యాలు, దాడులు అనేకానేకం ఇప్పటికీ పట్టపగలే జరుగుతున్నాయి. దళితులపై దాడుల గురించి ఆవేదన చెందే వారంతా దానికి గల సాంఘిక ఆర్ధిక పునాదిని పునరాలో చించటం అవసరం.

.



Similar News