లగచర్ల సాక్షిగా, ఇది ప్రజా పాలన ఎట్లయితది, రేవంత్ సారూ!

ఇది BRS పాలన కొనసాగింపే తప్ప ప్రజాస్వామిక పాలన అనిపించుకోదు : రవి కన్నెగంటి

Update: 2024-11-20 01:53 GMT
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను చుట్టుముట్టిన లగచర్ల గ్రామస్థులు

పరిపాలన చాత కాని అసమర్ధ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కొంతకాలమయినా సహిస్తారు కానీ, దౌర్జన్యాన్ని పాలనా పద్ధతిగా అమలు చేసే ఏ ప్రభుత్వాన్నీ, రాజకీయ పార్టీనీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించరు. ఈ విషయాన్ని తెలంగాణ లో ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఎప్పుడు సరిగా గుర్తిస్తారో తెలియడం లేదు. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం వైపు నుండీ అప్రజాస్వామిక ఘటనలు ఎదురైనప్పుడల్లా, ప్రజా సంఘాలు, పౌర సమాజం, సాధారణ ప్రజలు దానికి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తున్నది.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం లగచర్ల లో జరిగిన ఘటనలు ప్రభుత్వ భూసేకరణ పట్ల ప్రజల ఆగ్రహానికీ, తమను ప్రతిఘటించే ప్రజల పట్ల రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలికీ అద్దం పడుతున్నాయి. BRS పాలనా కాలంలో ఇసుక మాఫియాను అడ్డగించిన సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ళ దళితులపై జరిగిన పోలీసు దాడులను, ఆనాడు ప్రజలపై పోలీసులు సాగించిన చిత్ర హింసలను లగచర్ల బాధితులు, ముఖ్యంగా మహిళలు మీడియా ముందుకు వచ్చి చెబుతున్న కథనాలు గుర్తుకు తెస్తున్నాయి.

ఆ వార్తలను నిర్ధారించుకోవడానికి, జరిగిన ఘటనలపై నిజాలు తెలుసుకోవడానికి నవంబర్ 19 న ఉదయం హైదరాబాద్ నుండీ లగచర్ల గ్రామానికి బయలు దేరి వెళ్ళిన వుమెన్స్ అండ్ ట్రాన్స్ జండర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను పోలీసులు మధ్యలోనే ఆపి సాగించిన జులుం, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకులు వి. సంధ్య పై దౌర్జన్యం చేసి బట్టలు చించడం, వారి బృందం గ్రామాల లోకి వెళ్ళకుండా వెనక్కు తిప్పి పంపడం రేవంత్ ప్రభుత్వ దౌర్జన్య పూరిత వైఖరిని బయట పెట్టాయి.

లగచర్ల లో ఘటనలు జరిగిన మరుసటి రోజూ నుండీ రేవంత్ సోదరుడు కొడంగల్ నియోజక వర్గం దుద్యాల మండలంలో తిరుగుతూ వేసిన వీరంగం, చేసిన హెచ్చరికలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. అసలు ఆయనకు ఈ విషయంలో ఏమి సంబంధం? కొడంగల్ కూడా రాష్ట్రంలో ఒక నియోజక వర్గమే కదా? అక్కడ ప్రత్యేక రాజరిక వ్యవస్థ లేదే ? అక్కడ కూడా ప్రభుత్వం పాలనా పరంగా స్పందించాలి కానీ, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఏ అధికారమూ లేకుండానే వీరంగం వేయడం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫార్మా కంపనీలు నిర్మించి తీరతామని ప్రకటించడమేమిటి? ఇది రేవంత్ ప్రభుత్వం నుండీ ప్రజలు ఆశించిన విషయం కాదు.

ఘటన జరిగిన వెంటనే దుద్యాల ,కొడంగల్, బొమ్రాజ్ పేట మండలాలలో ఇంటర్నెట్ సర్వీసులు బంద్ చేసి, గ్రామాలపై పోలీసులు విరుచుకుపడి, ప్రజలను కొట్టి, అరెస్టులు సాగించినట్లు వార్తలు వచ్చాయి.

నిజంగా ఆ రెండు రోజుల పాటు ఆ గ్రామాలలో ఏం జరిగినది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తెలియదు. తెలుసుకోవడానికి వెళుతున్న వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరు చూస్తే, ఆయా గ్రామాల ప్రజలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించినట్లు ఊహించవచ్చు. ఈ ఘటనలను ఆసరా చేసుకుని, భూసేకరణకు వ్యతిరేకంగా ఇంతకాలం ఐక్యంగా ఉన్న గ్రామాల ప్రజలను పార్టీల పేరుతో విడతీసి పబ్బం గడుపు కోవాలని కూడా ప్రభుత్వం చూస్తున్నది.

ప్రజల గొంతు బయటకు వినపడకుండా, ప్రభుత్వ వాదననే ప్రధాన మీడియా హోరెత్తిస్తున్నది. కొన్ని చానల్స్ ప్రతినిధులు ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ గ్రామాలలో ఉన్న వారిని ప్రశ్నించినప్పుడు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వం తమ భూములను గుంజుకోవడం సరైంది కాదనీ, తాము ఫార్మా కంపనీల కోసం భూములు ఇవ్వబోమనీ స్పష్టంగానే చెబుతున్నారు.

లగచర్ల లో జరిగిన ఘటనలను రాజకీయంగా వాడుకుని , రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న BRS, BJP పార్టీలు 2014 నుండీ 2023 వరకూ దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పేరుతో పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ కంపనీలకు అనుకూలంగా ప్రజల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన విషయం చరిత్రలో రికార్డు అయి ఉంది. ప్రజల పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరించిన చరిత్ర ఈ రెండు పార్టీలకూ ఉంది. ఈ రెండు పార్టీల పాలనలో, వారి విధానాలను వ్యతిరేకించిన సాధారణ ప్రజలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు పోలీసు జులుం, కేసులు, జైళ్లు అనుభవించారు.

రైతు వ్యతిరేక మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు డిల్లీ కేంద్రం గానూ, దేశ వ్యాపితంగానూ సాగించిన నిరవధిక ఉద్యమాలపై మోడీ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధం చూసిన వాళ్ళకు, ఇప్పుడు లగచర్ల లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగించిన వ్యవహారం లో బీజేపీ చేస్తున్న హడావుడి, విమర్శలు హాస్యాస్పదంగా కనిపిస్తాయి. అలాగే ఖమ్మంలో పోరాడిన మిర్చి రైతులకు బేడీలు వేసిన KCR ప్రభుత్వం , ప్రస్తుతం లగచర్ల బాధితులను వెంటబెట్టుకుని మీడియా తో మాట్లాడుతున్న తీరు, జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం కూడా, వారి గత చరిత్రను కప్పి పెట్టలేవు.

కాసేపటికి , BRS , బీజేపీ నాయకుల వ్యవహార శైలిని , వారి అవకాశవాద రాజకీయాలను పక్కన బెట్టి ఆలోచిస్తే కూడా, కొన్ని అంశాలలో రేవంత్ ప్రభుత్వం ప్రజల గొంతుకు, ప్రజా సంఘాల గొంతుకు, పౌర సమాజ గొంతుకు అసలు విలువ ఇవ్వడం లేదని కూడా రాష్ట్రంలో జరిగిన మరికొన్ని ఘటనలు నిరూపించాయి. ఈ సందర్భంగా వాటిని గుర్తు చేసుకోవడం అవసరం.

నారాయణ పేట జిల్లా , మరికల్ మండలం చిత్తనూరు లో 2022 లో ప్రారంభమైన ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటం, ఆ పోరాటం పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధం అందరికే గుర్తుండే ఉంటుంది.

ఈ కంపనీ యాజమాన్యంలో BRS , కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి భాగస్వాములని గుర్తించాలి.

2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , అప్పటి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన,అదే ప్రాంతానికి చెందిన బండారి లక్ష్మయ్య అనే జూనియర్ కాలేజీ లెక్చరర్ పై, చంద్రశేఖర్ అనే టీచర్ పై మరో 6 గురు రైతులపై ఆ జిల్లా పోలీసులు అకారణంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. బండారి లక్ష్మయ్య గారిని, తాను పని చేస్తున్న హైదరాబాద్ నగరం నుండీ దూర ప్రాంతానికి కక్ష పూరితంగా ట్రాన్స్ ఫర్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, భారత్ జోడో అభియాన్ , తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున రెండు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ గారిని కలిసిన పౌర సమాజ ప్రతినిధి బృందాలు , ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చాయి. ఆయన దానిని పరిశీలిస్తాం అని చెప్పారు. కానీ 11 నెలలు గడిచినా , ఆ విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వారిపై రౌడీ షీట్ ఎత్తి వేయలేదు.

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రానికి దగ్గరలో ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఒకరు నెలకొల్పుతున్న ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా , ఆ ప్రాంత ప్రజలు గత సంవత్సర కాలంగా పోరాడుతున్నారు. ఆ కంపనీ యాజమాన్యానికి అనుకూలంగా స్థానిక బీజేపీ పార్టీ MLA సహా, BRS, కాంగ్రెస్ పార్టీ శాసనసభా స్థాయి నాయకులందరూ జట్టు కట్టారు. ఈ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రజలు సాగిస్తున్న ఉద్యమం పట్ల సానుకూలంగా ఉన్నా, ఈ నియోజక వర్గ స్థాయి నాయకులు ప్రజా ఉద్యమాన్ని అణచి వేయడానికి అన్ని కుట్రలు సాగిస్తున్నారు. పై స్థాయిలో ఉన్న నాయకులను, కంపనీ యాజమాన్యం డబ్బులు వెదజల్లి లొంగదీసుకున్నదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో లాగే ఈ ప్రభుత్వ హయాంలో కూడా ప్రజల కంటే, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా వ్యవవహారాలు నడుస్తున్నాయని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

మరో వైపు రేవంత్ ప్రభుత్వం గత ఏడాది కాలంగా “వద్దురా నాయనా ఇథనాల్ ఫ్యాక్టరీ “ అనే అక్కడి ప్రజల గొంతును విని సమస్య పరిష్కారానికి పూనుకోవడం లేదు. స్థానికంగా అక్టోబర్ 16 న బహిరంగ సభ నిర్వహించాలని ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు, స్థానిక, జిల్లా పోలీసులు సభకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. అనివార్యంగా ప్రజలు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించి, కోర్టు అనుమతితో అక్టోబర్ 18 న 5000 మందితో భారీ బహిరంగ సభను నిర్వహించుకుని, కంపనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేశారు.

ఈ గ్రామాల నుండీ ప్రజలు రెండు బస్సులు మాట్లాడుకుని, నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం , చిత్తనూరు మండలం పరిసర గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి, స్థానిక ఇథనాల్ కంపనీ వెదజల్లుతున్న కాలుష్యం గురించీ తెలుసుకోవాలని అనుకుని బయలుదేరి వెళ్లారు.

కానీ రెండు జిల్లాల పోలీసులు పరస్పరం చర్చించుకుని , మరికల్ వరకూ వెళ్ళిన బస్సులను ఆపి, వారిని మళ్ళీ నిర్మల్ జిల్లాకు తిప్పి పంపారు. అంటే, రేవంత్ పాలనలో మన రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రజలు , మరో ప్రాంతానికి నిజ నిర్ధారణకు కూడా వెళ్ళడానికి లేకుండా పోయిందన్నమాట.

ఇంతవరకే రేవంత్ ప్రభుత్వం ఆగలేదు. స్థానికంగా ఈ గ్రామీణ ప్రజల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ఆరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని ,అమాయక రైతులను రెచ్చగొడుతున్నారనే తప్పుడు ఆరోపణతో సస్పెండ్ చేసింది. ఆయన గత 20 ఏళ్లుగా సామాజిక ఉద్యమాల మద్ధతుదారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసిన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర, జిల్లా నాయకుడు. TJAC లాంటి సంస్థకు జిల్లా ఛైర్మన్ గా అనేక ప్రజా ఉద్యమాలకు సంఘీభావం కూడ గట్టిన వాడు. పైగా 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గత ప్రభుత్వ నిరంకుశ వైఖరులను ఎండగడుతూ , మార్పు కోసం ప్రజలను చైతన్య పరుస్తూ తిరిగిన వాడు. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి నాయకులకు అండగా అనేక ఉద్యమాలలో భాగస్వామి అయిన వాడు.

ఇవాళ అటువంటి ప్రజల మనిషిని, తెలంగాణ ఉద్యమ కారుడిని ఎవరి కోసం రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.? ఆంధ్ర పెట్టుబడి దారుడికి అనుకూలంగా నిలబడడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా? తెలంగాణ భూముల్లోకి, గ్రామాల మధ్యలోకి మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారుల చొరబాటును అడ్డుకోకుండా, వారికి అండగా నిలబడి ప్రజలను , ప్రజా పక్ష విద్యా వంతులను మాత్రం కేసులతో, సస్పెన్షన్ లతో, రౌడీ షీట్లతో అడ్డుకోవాలని చూడడం ఎంతవరకూ సమంజసం ? దిలావర్ పూర్ మండల గ్రామాలలో పోలీస్ పికెట్ లు పెట్టి, సెక్షన్ 30 పెట్టి ప్రజల నోరు మూయించాలని చూడడం ఎంతవరకూ సమంజసం ? నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ విధుల నుండీ సస్పెన్షన్ కు గురైన ఆరేపల్లి విజయ్ కుమార్ TJAC నాయకులుగా ఉన్నారని, ప్రొఫెసర్ కోదండరాం గారి పార్టీ తెలంగాణ జన సమితి కు జిల్లా బాధ్యులుగా ఉన్నారని సస్పెన్షన్ ఆర్థర్ లో ఆరోపణలు చేయడం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నట్లు? BRS, BJP ,TDP నాయకులతో,,పారిశ్రామిక వేత్తలతో,కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అంటకాగవచ్చు, కానీ మేధావులు,సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు ప్రజల పక్షాన నిలబడడం ఈ ప్రభుత్వం దృష్టి లో తప్పయిపోయింది ?

రేవంత్ ప్రభుత్వ ఈ వైఖరిని ఎట్లా అర్థం, చేసుకోవాలి ?

ఈ ప్రభుత్వానికి బీజేపీ ,BRS ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గత దశాబ్ధ కాలం పాటు పౌర సమాజం పోరాడిన చరిత్ర పట్ల అసలు అవగాహన ఉందా ?

దామగుండం, మూసీ, ఇథనాల్ , ఫార్మా కంపనీల వంటి సమస్యల విషయంలో ప్రజల పక్షాన, పర్యావరణం పక్షాన పౌర సమాజ వేదికల సభ్యులు లేవనెత్తుతున్న అంశాలను చర్చకు వేగంగా చేపట్ట వలసిన అవసరముందనే సోయి ఈ ప్రభుత్వానికి ఉందా? పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో వ్యవహరించడంలో, ప్రజలకు ప్రజాస్వామిక పాలన హామీని అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం తాను చేస్తున్న తప్పులను వేగంగా సరి చేసుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

భవిష్యత్తులో తెలంగాణలో నిరంకుశ బి.ఆర్.ఎస్ , ఫాసిస్టు బీజేపీ పార్టీలు బలపడకుండా చూడాలనే తపనతో, పౌర సమాజం గత సంవత్సర కాలం గా, అవసరమైన సమయంలో కూడా సూచనలు చేయడం తప్ప, ఇంకా కటువైన విమర్శలు ఈ ప్రభుత్వం మీద చేయడం లేదంటే, అది వారి రాజకీయ పరిణతికి చిహ్నమే తప్ప, చాతకాని తనం కాదు. కొద్ది రోజులు వేచి చూసే ధోరణితో, కొన్ని సార్లు పౌర సమాజం మౌనంగా ఉంటున్నదే తప్ప ఎప్పటికీ ఇదే వైఖరి కొనసాగుతుందని ఈ ప్రభుత్వం ఆశించకూడదు.

గత ప్రభుత్వాలు ప్రజల పట్ల వ్యవహరించడంలో చేసిన నేరాలను, ఈ ప్రభుత్వం కొనసాగించడం మంచిది కాదని ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఇటీవల సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికలను సీరియస్ గా వినిపించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర అధికార పార్టీకి ఎలా అర్థమవుతుంది ? ఆ స్పృహ వారికి ఎలా, ఎప్పటికి వస్తుంది ?

భారత దేశంలో బీజెపీ ఫాసిస్టు పాలనను ఓడించాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయన్నది గమనించుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ పాలనా తీరును మార్చుకొమ్మని హెచ్చరించాల్సిన అవసరం లేదా? ఒక జాతీయ పార్టీలో ఆ స్పృహ లేకపోతే, ఆ పార్టీ సాధించే విజయాలు ఏమీ ఉండవు.

Tags:    

Similar News