వేదాల్లో ఉన్న సైన్సు ఏమిటి?

వేదాల్లోని సైన్స్ రహస్యాలను పాశ్చాత్యులు కాజేసి విమానాలు, కంప్యూటర్లు, రేడియోలు, టివిలు, తయారు చేయడం సాధ్యమా?

Update: 2024-11-06 06:49 GMT
source:originofscience.com


-కె.ఎల్‌.కాంతారావు

ఇటీవల డా. సుభాష్‌కాక్‌ (Dr Subash Kak) రచించిన 'వేదాలలో సైన్సు ఉందా?' (Is There Science in Vedas) అనే గ్రంథం చదివాను. దానిలో 'మన పురాతన భారతీయ విజ్ఞానశాస్త్ర శాఖల న్నింటికీ వేదమే మూలం' అని రాశారు. (పేజి13). అలాగే అనేకమంది పండితులు తమ వ్యాసాలలో వేదాలలో అత్యాధునిక శాస్త్ర విజ్ఞాన విశేషాలు ఉన్నాయని రాస్తున్నారు. ఉదాహరణకు 'భవిష్యవాణి' అనే మాసపత్రిక మార్చి 2007 సంచికలో ఆర్‌.వి విజయ అనే రచయిత 'ఋగ్వేదంలో ఓడలు, విమానం, రైలు, టెలిగ్రామ్‌, ఆధునిక శాస్త్రములు ఉన్నవి అనీ, యజుర్వేదంలో గణిత విద్య, అంతరిక్ష విద్య మొదలగునవి కలవు' అనీ రాశారు.

ఇలాగే, 'హిందూ దినపత్రిక'తో సహా అనేక పత్రికలు, గ్రంథాలు వేదాలలో ఉన్న అనేక ఆధునిక విజ్ఞానశాస్త్రాలను గూర్చి పేర్కొనబడిందని నిరంతరం ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలోని వాస్తవికతను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఈనాటికీ అనేకమంది విద్యాధికులు వేదాలలోనే విమాన నిర్మాణశాస్త్రం, అణుబాంబు నిర్మాణ పరిజ్ఞానం వంటివన్నీ ఉన్నట్లూ, ఆ వేదాలను పాశ్చాత్యులు దొంగలించి విమానాలు, అణుబాంబులను తయారుచేసినట్లు నమ్ముతున్నారు.

ఈ విశ్వాసాలలోని వాస్తవాలను తెలుసుకోవాలి. తద్వారా, మన విజ్ఞాన వారసత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి వీలుకలుగుతుంది. ఆనాటి ఆవిష్కరణలను సగర్వంగా చాటుకుంటూనే, ఆనాడు మనకు తెలియని విషయాలను వినమ్రంగా తెలుసుకోడానికీ దోహదపడుతుంది.

ఇప్పుడు వేదాలలో ఉన్న సైన్సును తెలుసుకుందాం:

1. ఇంద్రుడు ఇనుముగల వజ్రమును రెండుచేతులా పట్టినాడు (ఋగ్వేదం 1వ మండలం, 52వ సూక్తం, 8వ మంత్రం)

2. 'ఓడలు' అనే పదం ఋగ్వేదం 1-46-7లో వాడబడింది.

3. 'మేడలు' అనే పదం ఋగ్వేదం 1-121-1లో వాడబడింది.

4. బంగారము, వెండి, రాగి అనే లోహాలను గూర్చి ఋగ్వేదం 1-183-1లో వివరించబడింది.

5. 'స్వర్ణకారుడు బంగారమును కరిగించినట్లు' అనే విషయం ఋగ్వేదం 6-3-4లో వివరించబడింది.

6. పడుగుపేకలు - బట్టనేయడాన్ని గూర్చి ఋగ్వేదం 6-9-2లో వర్ణించబడింది.

7. 'వరుణుడు మాకు మూడంతస్థుల మేడ ఇవ్వవలెను. (ఋగ్వేదం 8-42-2)

8. 'పట్టు లేక నూలు వస్త్రమా!.... కంబళమా' అని శుక్ల యజుర్వేదం 10-8లో వర్ణింపబడింది.

పై అంశాలనుబట్టి వేద ఋషులకు బంగారం, వెండి, ఇనుము, రాగి ఆభరణాలు, ఆయుధాలు తయారుచేసే వృత్తి, నేర్పరితనం ఉందనీ, మూడు, నాలుగంతస్థుల మేడలు నిర్మించగల సివిల్‌ ఇంజనీర్లు వారిలో ఉన్నారనీ, ఓడల నిర్మాణం, ప్రయాణం వారికి తెలుసుననీ అర్థమవుతోంది. నాలుగు వేదాలు వెతికినా, వారికి ఇంతకుమించిన సైన్సు పరిజ్ఞానం లేదని రూఢి అవుతుంది.

ఇక వారి ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పరిశీలిద్దాం..

1. 'భూమి, అంతరిక్షము స్థిరముగా ఉన్నవి' (ఋగ్వేదం 1-22-14)

2. 'ఇంద్రా! నీవు మహంతము, అనంతము, చలనశీలమగు భూమిని సమభావమున దాని స్థానమున నిలిపినావు (ఋగ్వేదం-3-30-9)

3. సకల భూతములకు సుఖములు గలిగించు 'ద్యావా పృధ్వ'లను సృష్టించినాడు. ఆ రెంటినీ కదలకుండా మేకులతో బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్ఠుడు' (ఋగ్వేదం 1-160-4)

4. 'ధృవాసిభూమీ!' అంటే 'భూమీ నీవు స్థిరత్వము కలదానవు'. (కృష్ణయజుర్వేదము 1-1-13-6)

5. 'భూమి దేవనిర్మిత నౌక. అది మహాజలములపై తేలియాడుచున్నది' (కృష్ణయజుర్వేదము 1-5-11-18)

6. పూర్వము సూర్యుడు భూలోకమున ఉండెను. దేవతలు 'సామిధేనీ ఋక్కు'ను ఉచ్చరించినారు. అందువలన సూర్యుడు భూలోకము నుండి ఎత్తి 'ద్యులోకము'న స్థాపించినారు' (కృష్ణ యజుర్వేదము 2-5-8-2)

7. 'భూమి స్థిరమైనది గదా!' (కృష్ణ యజుర్వేదము 2-6-5-24)

8. 'స్థిరము, విస్తారమగు భూమికి నమః' (అధర్వవేదము 12-3-1-11) అంటే, వేదాలన్నిటిలోను భూమి స్థిరముగా ఉంటుందనిగానీ, నీటిపై తేలుతుంటుందనిగానీ, అది మేకులతో బిగించబడి ఉంటుందనిగానీ చెప్పబడింది. అంతేకాని, భూమి గుండ్రంగా ఉంటుందనిగానీ, దానికి భ్రమణం, పరిభ్రమణం ఉంటాయనిగానీ చెప్పబడలేదన్నమాట. ఇదీ వైదిక ఋషుల ఖగోళ విజ్ఞానం!

ఇక్కడ సుభాష్‌కాక్‌ పది అడుగులు వెనుకకు వేసి 'సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని అంగీకరించబడింది. ఈ పద్ధతికి ఆధారాలు పురాతన ఖగోళశాస్త్ర గ్రంథాలలో మనకు లభిస్తాయి' అని 'వేదాలలో సైన్సు ఉందా?' అనే గ్రంథం 33వ పేజీలో రాశారు. ఇది రుజువు చేయబడిన సైన్సును అవహేళన చేయడం కాదా?

ఇక వైదిక ఋషుల వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్ని పరిశీలిద్దాం.

  1. 1.జలోదరరోగీ! నీవు అబద్ధము ఆడినావు. అసత్యము మహాపాపము. అదే జలోదర కారణము' (అధర్వవేదము 1-1-4-3)

2. 'సర్వ విష చికిత్స కొరకు మంత్రముచే గడ్డిని కాల్చి పాము ముందు వేయునది' (అధర్వవేదము 7-8-2- వినియోగము6)

3. 'సర్వజ్వర చికిత్సకు కప్పను కట్టి మంచము కింద వైచి మంచము మీద, రోగిమీద 9,10 మంత్రములచే (పైన చెప్పబడినవి) నీటిని చల్లునది'. (అధర్వవేదము 7-10-3 వినియోగం7)

4. 'ఈ వ్యక్తికి వచ్చు వరుసజ్వరము కప్పను చేరునుగాక! (అధర్వవేదము 7-10-3-4-2).

ఇవీ వేదాలలో చెప్పబడిన జ్వర కారణా లు, చికిత్సా పద్ధతులు. ఇవి వేద ఋషుల యొక్క వైద్య పరిజ్ఞానాన్ని సూచిస్తున్నది.

ఇక సృష్టిని గూర్చి, జీవ పరిణామాన్ని గూర్చి వేదం ఇలా తెలియజేస్తుంది.

'ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను, పశువుల ను సృష్టించదలచినాడు. అట్లు తలచినవాడు తన ఉదరము నుండి 'వపను' ఖండించి, తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందునుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడు అయినాడు. ప్రజలను, పశువులను సృజించినాడు' (కృష్ణ యజుర్వేదం, 2-1-1-7) డార్విన్‌ నిరూపించిన జీవపరిణామ సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం కాదా?

ఇదీ వేద ఋషుల శాస్త్ర పరిజ్ఞానం! వేదాలలో ఎంత కాగడా పట్టి వెతికి చూసినా విమానం, రైలు, అంతరిక్ష విద్య మొదలగు వాటి గురించిన విజ్ఞానం కనిపించదు.

ఇక వేదాలను పాశ్చాత్యులు దొంగిలించారనే విషయాన్ని పరిశీలిద్దాం.

వేదాలకు 'శృతులు' అనే మరో పేరు కూడ ఉంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి గురువు గారి నోటి నుండి వచ్చిన వేద శ్లోకాలను విని, శిష్యులు నేర్చుకుంటున్నారు. అవి లిఖితపూర్వకంగా 70, 80 ఏళ్ళ కిందటి వరకూ లేవు. అందుకే వెయ్యేళ్ళనాటి బైబిల్‌ ప్రతిగానీ, ఖురాన్‌ ప్రతిగానీ దొరుకుతుందిగానీ వెయ్యేళ్ళ నాటి వేదాల లిఖిత ప్రతి ఎక్కడా లేదు. 70, 80 ఏళ్ళ నుండి కూడా వేదాల లిఖిత ప్రతిని తయారు చేయదలచిన వారు, వేద పండితులచే అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇక వేదాల లిఖిత ప్రతులను పాశ్చాత్యులు కాజేయడమనే ప్రశ్న రానేరాదు.

కాబట్టి, వేదాలను మన ప్రాచీన వారసత్వ సంపదగాను, సారస్వత భాండాగారంగానూ గుర్తించాలిగానీ 'అన్నీ వేదాలలోనే ఉన్నాయిష!' అనే అగ్నిహోత్రావధానులులాగా ప్రకటన లీయడం సమంజసం కాదు.

(కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక - తెలంగాణ)


Tags:    

Similar News