రాహుల్ ఒకటి చెబితే, రెేవంత్ మరొకటి చేస్తున్నాడు...

బిఆర్ ఎస్, బిజెపిలు కాటేసేందుకు మాటువేసి ఉన్నాయనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోరాదు...

Update: 2024-10-02 03:00 GMT

ప్రభుత్వాల అనాలోచిత విధానాలు అనర్ధాలకు దారి తీస్తాయి. ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ప్రజలను భయ కంపితులను చేస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం అదే జరుగుతున్నది. అక్టోబర్ 7 నాటికి రేవంత్ పాలనకు 10 నెలలు నిండుతున్నాయి. అయినా పాలన ఇంకా గాడిలో పడలేదు. ప్రభుత్వ దూరదృష్టితో కూడిన ప్రణాళిక ఇంకా ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుకు ఇప్పటికీ రోడ్ మ్యాప్ స్పష్టంగా లేదు. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కొన్ని అరకొర అడుగులు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు.

 

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బీజేపీ ,బీఆర్ఎస్ లాంటి ప్రజా వ్యతిరేక రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రాలను అందిస్తున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో ఈ రెండు పార్టీల గత పదేళ్ళ పాలన ప్రజా వ్యతిరేకంగా, పూర్తి నిరంకుశంగా ఉండింది. అందుకే ప్రజలు వాటికి బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నట్లు అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. పాత ప్రభుత్వాల ధోరణి లోనే తాను కూడా వ్యవహరిస్తున్నది.


దేశంలో బీజేపీ ఫాసిస్టు ధోరణులను ప్రతిఘటించడానికి, ఓడించడానికి ముందుకు వచ్చిన ఇండియా కూటమి లో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ , తాను స్వయంగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవహరించే తీరు , రానున్న రోజుల్లో దేశంలో ఇండియా కూటమి భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే హర్యానాలో, కాంగ్రెస్, ఆప్ పార్టీలు అక్కడి అసెంబ్లీ ఎన్నికలో పొత్తు కుదరక విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుటుంబం పై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆ ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగానే ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల పని దినాన్ని యాజమాన్యాలకు అనుకూలంగా 14 గంటలకు పెంచుకోవడానికి ఆనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్ణయం, దేశ వ్యాపితంగా కార్మికులు, ఉద్యోగులలో చర్చకు దారి తీసింది.


జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే మాటలకూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాల పని తీరుకూ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని, ప్రజలలో, పౌర సమాజ సంస్థలలో ఒక అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది. ఈ అభిప్రాయం బలపడడం కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి, మొత్తంగా దేశానికి మంచిది కాదు. ఒకవైపు బీజేపీ తన కార్పొరేట్ అనుకూల, మతతత్వ అజెండాను దేశం మీద రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా తీరు అందుకు భిన్నంగా ఉండాలి. ప్రజా పక్షంగా ఉండాలి. అవినీతికి దూరంగా ఉండాలి. రానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఇండియా కూటమి విజయాలకు దోహదపడే విధంగా ఉండాలి.


తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు 31, 000 కోట్ల రూపాయల మొత్తంతో రెండు లక్షల రూపాయల వరకూ ఋణమాఫీ చేస్తామన్న హామీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేవలం 22 లక్షల మందికి మాత్రమే 18,000 కోట్ల రూపాయల ఋణ మాఫీ అయింది. ఇంకా ఐదు లక్షల మంది రైతులకు ఋణమాఫీ కాలేదని, ఇందులో నాలుగు లక్షల మందికి రేషన్ కార్డు లేని కారణంగా మాఫీ కాలేదని, ఆధార కార్డు, బ్యాంక్ అకౌంట్లలో తేడాల వల్ల మరో లక్ష మందికి ఋణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ నివేదిక సిద్దం చేసింది. రెండు లక్షల పైన రుణం ఉన్నవారికి, రెండు లక్షల ఋణ మాఫీ ఎప్పుడు చేస్తారో ఇంకా స్పష్టత లేదు.


2024 ఖరీఫ్ సీజన్ పూర్తయినా, ఈ సీజన్ లో రైతులకు, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన రైతు భరోసా రైతులకు అందలేదు. అన్ని జిల్లాలలో కౌలు రైతుల గుర్తింపు, రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా, ఇంకా విధి విధానాలు ఫైనల్ చేయలేదు. 2024 ఖరీఫ్ నుండీ అమలు కావాల్సిన పంటల బీమా పథకం అమలు లోకి రాలేదు. 2024 ఖరీఫ్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎకరానికి 10,000 నష్ట పరిహారం ఇస్తామని చేసిన ప్రకటన కూడా ఇప్పటికీ అమలు కాలేదు. పైగా పంటలు నష్టపోయిన సందర్భంలో కేవలం భూమి యాజమానుల పేర్లు మాత్రమే రాసుకు రమ్మన్నారని, కౌలు రైతుల పేరు రాయలేదని, ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. 2024 ఆగస్ట్ 15 నుండీ అమలులోకి వచ్చిన కొత్త సంవత్సర రైతు బీమా పథకంలో ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా వ్యవసాయ కూలీలను, భూమి లేని కౌలు రైతులను చేర్చలేదు.


గత ప్రభుత్వ హయాంలో 2022, 2023లో రెండు సంవత్సరాల పాటు వ్యవసాయ ప్రణాళిక విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ సంవత్సరం వ్యవసాయ ప్రణాళిక విడుదల కాలేదు. హామీ ఇచ్చినట్లుగా సమగ్ర వ్యవసాయ విధానం తయారీ కోసం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడలేదు. రాష్ట్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం కోసం కమిషన్ వేసినా, అందులో ఛైర్మన్ పోస్టు మాత్రమే నింపుతూ జీవో జారీ చేశారు. మిగిలిన సభ్యులను ప్రకటించడం కానీ, కమిషన్ పని ప్రారంభించడం కోసం ఇతర మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చడం కానీ చేయలేదు. పాక్షికంగా పంట ఋణ మాఫీ చేయడం తప్ప, మొత్తంగా వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పనులేవీ ప్రారంభం కాలేదని అర్థమవుతుంది.


విద్యా రంగం లోనూ ఇదే పరిస్థితి. విద్యా రంగానికి ఒక కమిషన్ వేసినా ఛైర్మన్ పోస్టు మాత్రమే నింపుతూ జీవో జారీ చేశారు. మిగిలిన సభ్యులను ఇంకా భర్తీ చేయలేదు. విద్యా రంగంలో అందరితో సమగ్రంగా అన్ని విషయాలూ చర్చించి, కమిషన్ చేసే సిఫరాసుల మేరకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, ఆ పని ప్రారంభం కాకుండానే, స్వయంగా తనకు తోచిన విధాన నిర్ణయాలు ప్రకటిస్తున్నది. కొడంగల్ నియోజకవర్గంలో స్కూలు పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు ఇవ్వడం ఇందులో భాగమే. అలాగే స్కూల్ విద్యార్ధుల డ్రస్ లు మహిళా సంఘాల సభ్యులతో కుట్టించిన ప్రభుత్వం, వారికి ఒక డ్రస్ కు 50 రూపాయల చొప్పున అతి తక్కువ కూలీ రేట్లు చెల్లించి శ్రమ దోపిడీ చేసింది. పైగా ఇప్పటి వరకూ ఆ డబ్బులు కూడా వారికి చేరలేదు. పైగా విద్యారంగాన్ని కాషాయీకరించడానికి బీజేపీ ముందుకు తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాల్సిన రేవంత్ ప్రభుత్వం, ఏదో ఒక రూపంలో దాని వైపే మొగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఇది సరైంది కాదు.


ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా మొదటి పే కమిషన్ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదు. పైగా ఇంతవరకూ ఆర్టీసీ లో కార్మిక సంఘాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టలేదు. KCR ఆర్టీసీ లో యూనియన్లను రద్ధు చేసి, కొద్ది మంది కార్మికులతో వేసిన కమిటీల తోనే ఈ ప్రభుత్వం కూడా తన చర్చలను కొనసాగిస్తున్నది. పైగా ఆర్టీసీ డ్రైవర్స్ కు అడ్డగోలుగా పని గంటలను పెంచేసింది.


రాష్ట్రంలో పర్యావరణానికి హాని చేసే విధంగా దామగుండం అడవిలో 12 లక్షల చెట్లను నరికి వేయడానికి వేగంగా అడుగులు వేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో పార్మా సిటీ రద్ధు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీకి భిన్నంగా, దానిని గ్రీన్ ఫార్మా సిటీగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.


ఎన్నికల మానిఫెస్టోలో పేదల, కార్మికుల సంక్షేమానికి, దళితుల, ఆదివాసీల సంక్షేమానికి ఇచ్చిన చాలా హామీల అమలు ఇంకా ప్రారంభమే కాలేదు. ఎందుకు ఇవన్నీ గుర్తు చేయవలసి వస్తుందంటే, వీటికి రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశారు కనుక, ఇవన్నీ తప్పకుండా చేస్తామని హామీలు ఇచ్చారు కనుక. కానీ రాష్ట్ర ప్రభుత్వ అజెండాలో ఇవేవీ పెద్దగా చర్చకు నోచుకోవడం లేదు. పైగా KCR ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి పోయిన విషయం అందరికీ తెలుసు. ప్రతి పథకం అమలుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది.


తాజాగా రోజువారీ చర్చలలో కొత్త అంశాలు చేరుతున్నాయి. ముచ్ఛర్ల దగ్గర నాలుగవ నగరం, స్కిల్ యూనివర్సిటీ, రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు రేషన్, ఆరోగ్యం, సంక్షేమం – మూడింటికీ కలిపి ఒకే డిజిటల్ కార్డ్ ఇవ్వడం అందులో కొన్ని అంశాలు. ఇప్పటి వరకూ చర్చలో లేని కొత్త అంశం ఇది. ఈ ప్రయోగం పేదలకు నిజంగా ఎంతవరకూ ఉపయోగపడుతుందో, మరింత స్పష్టత లేదు. పైగా పౌర సమాజంతో కానీ, ప్రజా సంఘాలతో కానీ దీనిపై కనీస చర్చ చేయలేదు.


ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో , లక్షన్నర కోట్ల రూపాయలతో రూపొందించిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. నగరం మధ్యలో ఉన్న నదిని బాగు చేసుకోవలసిందే కానీ, అది ప్రభుత్వానికి ఎందుకు తక్షణ ప్రాధాన్యతా అంశంగా మారిందన్నది పెద్ద ప్రశ్న. తక్షణమే నది చుట్టూ ఉన్న ప్రజలను ఎందుకు ఖాళీ చేయించాలనుకుంటున్నది కూడా అనుమానాస్పద ప్రశ్న. ఎవరి మాటా వినకుండా లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బయలుదేరిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన KCR ప్రభుత్వం చివరికి ఎక్కడ మిగిలిందో రేవంత్ ప్రభుత్వం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.


నిజానికి నగర అభివృద్ధిలో, నది పునరుద్ధరణలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వ పెద్దలు, కన్సల్టెంట్లు, అధికారులు మాత్రమే ప్రణాళికలు వేస్తే, కార్యాచరణ నిర్ణయించుకుంటే సరిపోదు. నగరంలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ, వైపరీత్యాల యాజమాన్యం లాంటి బాధ్యతలతో, హైడ్రా లాంటి సంస్థను ఏర్పరిచి, దానిని పోలీస్ గ్రేహౌండ్స్ కు నాయకత్వం వహించిన వ్యక్తి చేతుల్లో పెట్టినప్పుడే, దాని స్వభావం ఎలా ఉండ బోతున్నదో మనకు అర్థం కావాలి. ప్రజలతో, పౌర సమాజంతో, రాజకీయ పార్టీలతో కనీస సంప్రదింపులు జరపకుండానే, స్థానిక ప్రజలకు ప్రత్యామ్నాయ అవకాశాల గురించి వివరించకుండానే, వారిని అక్కడి నుండి తరలించడానికి చర్చల ద్వారా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయకుండానే పోలీసులు,అధికారులు, బుల్డోజర్లు, మోహరించడం సరైంది కాదు.


మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ప్రకటిస్తే సరిపోదు.. వారి జీవనోపాధి గురించి కూడా ఆలోచించాలి. దూరంగా ఎక్కడో వాళ్ళను తీసుకువెళ్ళి విసిరేయకుండా, వారికి మూసీ చుట్టూ పక్కల ఖాళీ స్థలాలను వెతికి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ఉన్న అవకాశాల గురించి కూడా చర్చించాలి. అసలు లక్షన్నర కోట్లతో మూసీ అభివృద్ధి పేరుతో ఏమి చేయాలని అనుకుంటున్నారో,ప్రణాళిక లేమిటో అన్ని డాక్యుమెంట్లు బయట ప్రజల ముందు ఉంచాలి. మూసీ నదిలోకి చొచ్చుకు వెళ్ళి ఇల్లు నిర్మించుకున్న వారిని బయటకు తరలించడం తప్పు కాదు. కానీ నదికి రెండు వైపులా 150 మీటర్ల వెడల్పున నదీ తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని అనుకోవడం తప్పకుండా లక్షలాది ప్రజలపై భారీ ప్రభావాన్ని పడవేసే ప్రమాదకరమైన పథకమే. మూసీ సుందరీకరణతో, కాలంలో జరిగే అభివృద్ధిలో దశాబ్ధాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఒరిగేదేమిటి? వారి భవిష్యత్తుకు భరోసా ఏమిటి?


ఈ సుందరీకరణ తో, నగరానికి బడా కంపెనీలు తరలి వస్తాయనేది అత్యాశే కానీ, నగరం మధ్యలో పేద ప్రజలకు మాత్రం రక్షణ లేకుండా పోతుంది అనేది వాస్తవం. బీజేపీ, బీఆర్ఎస్ అనుసరించిన అభివృద్ధి నమూనా లాగే, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ అభివృద్ధి నమూనా కూడా స్పష్టంగా కార్పొరేట్ అభివృద్ధి నమూనాయే. ఇది ఎంతమాత్రం ప్రజల అభివృద్ధి నమూనా కాదు. 1990 దశకం లాగే, ఇప్పుడు కూడా రోజూ ప్రపంచ బ్యాంకు మాట రాష్ట్రంలో వినిపిస్తున్నది. ఆ ప్రపంచ బ్యాంకు విధానాలు మనకు పనికి వచ్చేవి కావని అప్పుడే తేలిపోయింది. మళ్ళీ వాటిని నెత్తికి ఎక్కించుకోవడం ఎంతమాత్రం సరైంది కాదు.

Tags:    

Similar News