యుద్ధమంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదు, రేవంత్
కాశ్మీర్ లో జరిగిన ఈ మారణ కాండకు కారకులెవరు ? రక్షణ వ్యవస్థలో వైఫల్యం ఎందుకు ఉంది? ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి నిజాలు ఎందుకు చెప్పడం లేదు ?;
ఏప్రిల్ 22 న కాశ్మీరు మళ్ళీ నెత్తుటి ముద్దగా మారింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని పచ్చిక బయళ్ళలో కొందరు ఉన్మాదులు సాగించిన హత్యాకాండ దేశ ప్రజలను ఎంత దుఖంలో ముంచేసిందో, కేంద్ర ప్రభుత్వ బధ్రత వైఫల్యం పై అనేక ప్రశ్నలనూ లేవనెత్తింది . కాశ్మీర్ లో జరిగిన ఈ మారణ కాండకు కారకులెవరు ? రక్షణ వ్యవస్థలో వైఫల్యం ఎందుకు ఉంది? కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు ఏమయ్యాయి? ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి నిజాలు ఎందుకు చెప్పడం లేదు ? ఘటనకు సరైన కారణాలు ప్రజలకు వివరించకుండా ఘటనకు బాధ్యత వహిస్తూ, కేంద్ర హోంమంత్రి , రక్షణ మంత్రి తమ పదవులకు రాజీనామా ఎందుకు చేయలేదు? ప్రధాని మోడీ ఘటన జరిగిన వెంటనే కాశ్మీర్ వెళ్ళకుండా, బీహార్ బహిరంగ సభకు ఎలా వెళ్ళ గలిగారు? హిందుత్వ శక్తులు దేశ వ్యాపితంగా ముస్లిం ప్రజలపై సోషల్ మీడియాలో ఎందుకు విద్వేష ప్రచారం సాగిస్తున్నాయి?
అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం చెప్పిన విషయాలను, ప్రజలకు చెప్పవద్దని ఆయా పార్టీల నాయకులకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పవలసి వచ్చింది ? ఒక వేళ బయట దేశాల వారే ఈ ఘటనకు పాల్పడ్డారని అనుకుంటే, దేశ సరిహద్దులు భారత సైన్యం చేతుల్లో సురక్షితంగా ఉంటే, దుండగులు ఎలా దేశం లోకి రాగలిగారు ? ఎలా తప్పించుకుని వెనక్కు వెళ్ల గలిగారు ? నిజంగా పాకిస్థాన్ ఈ ఘటన వెనక ఉందని భారత ప్రభుత్వం భావిస్తే, అటువంటి సమాచారం ప్రభుత్వానికి ఉంటే, ఎందుకు ఆ విషయాన్ని భారత ప్రజల ముందు చెప్పడం లేదు? ఐక్య రాజ్య సమితిదృష్టి కి , ఇతర దేశాల దృష్టికి తీసుకు వెళ్ళడం లేదు? అంతర్జాతీయ న్యాయ స్థానం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళడం లేదు ? అంటే, ఇంకా భారత ప్రభుత్వం కూడా నిందితులెవరో కనిపెట్టలేక పోయిందని అర్థం చేసుకోవాలి ? లేదా భారత ప్రభుత్వానికి తెలిసిన వాళ్ళే ఈ ఘటనలకు పాల్పడ్డారని భావించాలా ? ఇలాంటి అనేక ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వాన్ని ఆడగాల్సిన సందర్భం ఇది.
ఈ నేపధ్యంలో, కాశ్మీర్ లో జరిగిన మారణ కాండను తీవ్రంగా ఖండిస్తూ, ఏప్రిల్ 25 న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం సాక్షిగా జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన భవిష్యత్ తెలంగాణ కు ఒక మార్గం చూపిస్తున్నది. విభిన్న మతాల ప్రజల మధ్య సామరస్యం కోసం కృషి ఇంకా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ ప్రదర్శన గుర్తు చేస్తున్నది. తెలంగాణలో దశాబ్ధాలుగా, శ్రామిక ప్రజల సమస్యలపై పోరాడుతున్న అనేక సంస్థలు ఈ సందర్భంగా ఒక్క చోటికి చేరాయి. ఆసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్, తెలంగాణ వుమన్ అండ్ ట్రాన్స్ జండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, రైతు స్వరాజ్య వేదిక, భారత్ జోడో అభియాన్, క్లైమేట్ ఫ్రంట్ - హైదరాబాద్, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపు మేరకు, వివిధ మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు అర్పించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. హిందూ- ముస్లిం భాయీ భాయ్ అంటూ నినదించారు.
మత సామరస్యానికి తూట్లు పొడిచే చర్యలకు ఎవరు పాల్పడినా,ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఘటనకు పాల్పడిన తీవ్రవాదులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా పాకిస్థాన్ పేరు తీయలేదు. పాకిస్థాన్ పై యుద్ధం చేయాలని డిమాండ్ చేయలేదు. ఎందుకంటే, ఎటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వం నుండీ ప్రజల ముందుకు అధికారికంగా రాకుండా, అటువంటి డిమాండ్లు చేయడం అపసవ్యమే అవుతుంది. అనాలోచితమే అవుతుంది.
మరోవైపు, దేశంలో ఏ దుర్ఘటన జరిగినా, హిందుత్వ ఫాసిస్టు ఆలోచనలు కలిగిన శక్తులు ముస్లిం ప్రజలపై నింద మోపి, వారిపై ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం నిత్యం చేస్తున్నాయి. ఇందుకోసం, సైద్ధాంతికంగా సంఘ్, రాజకీయ శక్తిగా బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ముందు వరసలో ఉంటున్నాయి. సాధారణ ప్రజలలో ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి సోషల్ మీడియా లో మొత్తం ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం చేస్తున్నారు. కాశ్మీరీ ప్రజలను ముస్లిం ప్రజలు కాబట్టి, కాశ్మీర్ ప్రజలందరూ, ముస్లిం టెర్రరిస్టులే అని చిత్రీకరిస్తూ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ దేశ వ్యాపితంగా సామాజిక బాధ్యత కలిగిన కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు తమదైన వాదనతో ఇలా తిప్పి కొడుతున్నారు.
“ ముస్లింల టాక్సీ లలో అతిధులు (పర్యాటకులు) వచ్చారు
ముస్లింలు నడుపుతున్న హోటల్స్ లో ఉన్నారు
ముస్లిం లు చేసిన భోజనం తిన్నారు
ముస్లిం లు నడిపే గుర్రాలు ఎక్కి వెళ్లారు
ముస్లిం ల మార్గదర్శకత్వంలో ట్రెక్కింగ్ చేశారు
టెర్రరిస్టులు దాడి మొదలు పెట్టినప్పుడు
స్థానిక ముస్లిం లు వారికి అడ్డుగా నిలబడ్డారు .
ముస్లింలే అతిధులను కాపాడారు.
అతిధులను రక్షిస్తూ హత్యాకాండలో మొదట మరణించిన వ్యక్తి ముస్లిం
అతిధులకు సహాయ పడడానికి మొదట పరుగున వచ్చింది ముస్లింలే
గుర్రాలపై , భుజాలపై మోసుకు వెళ్ళి కాపాడింది ముస్లింలే
ప్రధమ చికిత్స అందించి రక్షించింది ముస్లింలే
ఆసుపత్రులకు అంబులెన్సులు నడిపింది ముస్లింలే
వైద్యశాలలో వైద్యం అందించింది ముస్లిం డాక్టర్లు, నర్సులే.
శ్రీనగర్ వరకూ అతిధులను వెనక్కు సురక్షితంగా తీసుకు వెళ్ళింది ముస్లిం టాక్సీ డ్రైవర్లే” ..
అలాంటప్పుడు మొత్తం ముస్లిం ప్రజలను టెర్రరిస్టులుగా చిత్రీకరించడం ఎంత అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు.
“ ఇక్కడ మొలిచే గడ్డి ఇక ఏ మాత్రమూ పచ్చనిది కాదు
బుల్లెట్ల వర్షం పడిన నేల ఇంకా కోలుకోనే లేదు
ఒకప్పుడు వలస పక్షులు వస్తుండేవి
గాయాల గాలికి భయపడి అవి వెనుదిరిగి పోయాయి
ఎంత దుఃఖమో ఈ లోయది - కాశ్మీర్ లోయది” అని దుఖం వ్యక్తం చేసిన అరుణాంక్ లాంటి కవులున్నారు.
“మనం మతాలం, కులాలం కాదు
మనం మనుషులం.
కన్నీటి తడివున్న
మనసున్న మనుషులం ” అని గుర్తు చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
“ సగటుమనిషి పాకిస్థాన్ లో ఎలా జీవనం గడుపుతాడు. రోజుకు 600 రూపాయల జీతం. పిల్లలు, ముసలి తల్లి, ఇంటి అద్దె, పండగ సమయాలు - వీటిమధ్య పాకిస్తానీయుల జీవితం గడుస్తుంది. భారత దేశ సగటు మానవుని జీవన కొలత కూడా అంతే. ఒకే నేలకదా!
రెండు దేశాల బీదరికం ఛాయలు ఒకటే. భావోద్వేగాలు, ఆనంద సమయాలు, సినిమాలు, క్రికెట్, బిరియాని రుచి, అంతా ఒకటే. పాకిస్థాన్ ప్రజలతో భారత దేశానికి రక్త సంబంధముంది. రేపటి పై బతుకు భయం వున్నప్పడు ఉగ్రవాదం అనే చోటుకు అర్ధం లేదు.
సింధు నది ప్రవాహం ఆగిపోతే గొంతు పొలమారుతుంది.నదీ తీరంలో వున్నవాడికి నది ప్రవహించి నంత మేర జీవన గమనముంటుంది. 'దాహార్తి' అంటే నీటి ధారను పోసిన భగీరధుని వారసుడవు. సింధు ప్రవాహపు దిశ మార్చకు. యుద్ధం, పగ, ప్రతీకారం ఈ పదాల వెనుక రెండు దేశాల ప్రజలున్నారు. వారి రోజు వారి పెనుగులాట ఉంది. పహల్ గాం రక్త చరిత్ర వెనుక కూడా రక్త చరిత్రే వుంది.ఎక్కడో ఒక చోట రాజకీయ పరిష్కారముంటుంది. అక్కడ సంభాషణ మొదలు కావాలి.” అని విరసం రచయిత అరసవిల్లి క్రిష్ణ ప్రభుత్వాలకు బాధ్యతగా బుద్ది చెప్పారు.
కానీ –విచిత్రమేమంటే, ఇదే ఘటనను ఖండిస్తూ , మృతులకు సంతాపం తెలియ చేస్తూ, ఏప్రిల్ 25 న అఖిల పక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన ర్యాలీ ఇందుకు పూర్తిగా భిన్నమైన స్వభావంతో సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన సాగిన ఈ ప్రదర్శనలో MIM, TJS పార్టీలు కూడా పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండీ ముఖ్యమైన జాతీయ నాయకులు కూడా కొందరు పాల్గొన్నారు. తీవ్రవాదాన్ని, కాశ్మీర్ లో జరిగిన ఘటనను ఖండించడం వరకే ఈ ర్యాలీ పరిమితం కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉపన్యాసం అత్యంత అభ్యంతర కరంగా సాగింది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా, అత్యంత ఉన్మాదంగా మాట్లాడే కొందరు బీజేపీ ముఖ్యమంత్రుల ఉవపన్యాసాలను దాటిపోయి ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన , ప్రదర్శనలో పాల్గొన్న ఇతర రాజకీయ పార్టీల పక్షాన , హైదరాబాద్ లో అప్పటికి రెండు రోజులుగా భారత సదస్సులో పాల్గొంటున్న 100 దేశాల ప్రతినిధుల పక్షాన తాను మాట్లాడుతున్నట్లు అర్థమొచ్చేలా మాట్లాడిన ఆయన, భద్రతా వైఫల్యంతో, ఈ ఘటనకు పరోక్షంగా కారణమైన కేంద్ర ప్రభుత్వ నిర్వాకంపై ఒక్క ప్రశ్న కూడా అడగ కుండానే, భారత ప్రధాని మోడీకి బేషరతుగా మద్ధతు ప్రకటించారు. పైగా ఇది భావోద్వేగాల సందర్భమనీ, రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదనీ, ఒక పార్టీ పేరు తీసుకోవాల్సిన సందర్భం కాదనీ,మనకు గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ప్రజలలో భావోద్వేగాలు బలంగా ఉన్న సమయం లోనే బాధ్యతకలిగిన ప్రభుత్వాలు, సంస్థలు బాధ్యతగా మాట్లాడాలనే విషయాన్ని మర్చిపోయారు.
పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించినా, పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేసినా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత దేశంలో కలిపేసినా , తాము బేషరతుగా మద్ధతు ఇస్తామని కూడా ఈ సందర్భంగా రేవంత్ ప్రకటించారు. పైగా 1967 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, చైనాపై చేసిన యుద్ధాన్ని మోడీ కి ఆయన గుర్తు చేశారు. 1971 లో అప్పటి ప్రధాని పాకిస్థాన్ పై యుద్ధం చేసి , ఆ దేశాన్ని పాకిస్థాన్, బంగ్లా దేశ్ గా విడగొట్టిన వైనాన్ని కూడా గుర్తు చేశారు. బీజేపీ నాయకుడు వాజపేయి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని దుర్గామాతగా అభివర్ణించిన విషయాన్ని కూడా మోడీకి గుర్తు చేసి, దుర్గామాతను ఆరాధించే ప్రధాని మోడీ, ఇందిరను స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలనీ , పాకిస్థాన్ కు ముఖం పగిలేలా జవాబు చెప్పాలనీ పిలుపు ఇచ్చారు.
ఇంతకు మించి మూర్ఖపు ఉపన్యాసం ఏదైనా ఉంటుందా? పైగా మోడీ- షా లు స్వంత రాజకీయాలలో పండి పోయి, దేశంలో అనేక రకాల నేరాలకు ఒడి గడుతున్న వేళ, ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇలాంటి ఉపన్యాసం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం కూడా ఇదేనా? పాకిస్థాన్ పై యుద్ధానికి మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ కూడా సిద్దమవుతున్నదా ? స్పష్టం చేయాల్సిన అవసరం ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి ఉంది. లేదా కాశ్మీర్ బధ్రత విషయంలో, దేశ ముస్లిం ప్రజల విషయంలో, కేంద్రం చేసిన తప్పులను ప్రజల ముందు ఉంచుతూ, పాకిస్థాన్ పై యుద్ధాన్ని నివారించాల్సిన బాధ్యతను ఆ పార్టీ తీసుకోవాలి.
యుద్ధమంటే – ఓట్లు కాదు, ఎన్నికలు కావు. కేవలం ప్రభుత్వాల మార్పు కాదు. అది నర మేధం. పర్యావరణ విధ్వంసం. వనరుల విధ్వంసం. యుద్ధాలు చేసిన దేశాలు ఏం సాధించాయి? ఏం పోగొట్టుకున్నాయి? యుద్ధాలలో గెలిచిందెవరు ? ఓడినదెవరు ? ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో రష్యా ఏం సాధించింది? నగరాలను, ప్రజల జీవితాలను విధ్వంసం చేయడం తప్ప, గాజాపై, మొత్తం పాలస్తీనాపై, ఇజ్రాయిల్ సాగిస్తున్న అమానుష యుద్ధంలో ఇజ్రాయిల్ ఏం సాధించింది ? పసి పిల్లలను, మనుషులను చంపడం తప్ప. నగరాలను విధ్వంసం చేయడం తప్ప. ఆ యుద్ధాల నుండీ మీరేం నేర్చుకున్నారు రేవంత్, మళ్ళీ పాకిస్థాన్ పై యుద్ధం చేయమని ప్రధానికి పిలుపు ఇవ్వడానికి ? అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే మిగిలేది సార్వత్రిక విధ్వంసమే నని మన డాక్టర్ బాలగోపాల్ ఎప్పుడో చెప్పాడు కదా ? చదువు కోలేదా ?
కాశ్మీరు ఇప్పుడిలా కావడానికి, అన్ని రాజకీయ పార్టీలు కాశ్మీరు జాతి ప్రజలకు, అక్కడి స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన వాగ్ధానాల ఉల్లంఘన ప్రధాన కారణం కదా ? కాశ్మీర్ ప్రజల మనో భావాలను పట్టించుకోకుండా, వారి స్వాతంత్ర్య ఆకాంక్షలను పట్టించు కోకుండా, నిత్య నిర్బంధంతో, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నాలు, అందుకు అక్కడి ప్రజల ప్రతిఘటన కారణం కాదా ? ఆ రాష్ట్రంలో ప్రజాస్వామికంగా సాగించిన ఉద్యమాలను కూడా అణచివేయడానికి, ఆయా ఉద్యమాల నాయకులను ఉరి తీయడానికి కేంద్ర ప్రభుత్వాలు సాగించిన విధానాలు కారణాలు కాదా ? కాశ్మీర్ ని పూర్తి ఎస్టేట్ గా మార్చి, ఆ ప్రాంతాన్ని కొంతమంది కార్పొరేట్ లకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇందుకు కారణం కాదా ?
ఆర్టికిల్ 370 రద్ధు చేసి, అక్కడి ప్రజలపై నిత్యం నిఘా పెట్టి, వారి చదువులను, వ్యవసాయాన్ని, జీవితాలను దుర్భరం చేసి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు కారణం కాదా ? ఇవన్నీ మర్చిపోయి ఏ ప్రభుత్వమయినా , ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పౌర సమాజమయినా వ్యవహరిస్తే, అది కాశ్మీరు ప్రజలకు, వారి కాశ్మీరియత్ కు అవమానం చేయడమేనని గుర్తించాలి కదా ?
మతతత్వాన్ని(అది ఏ మతమయినా) , టెర్రరిజాన్ని మనం తప్పక ఖండించాలి. వ్యతిరేకించాలి. అది మన బాధ్యత. మతతత్వం తో బాధలు పడిన ప్రజలకు అండగా నిలబడడం కూడా మన బాధ్యత. అంతవరకూ మనుషులుగా ,నాగరికులుగా మనం వ్యవహరించాలి.
అంతకు మించి యుద్ధ బాష మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ప్రజలు అభివృద్ధి చేసుకున్న మానవ సమాజ విలువలకు వ్యతిరేకులే. అందుకే రేవంత్ తన ఆలోచనలను మార్చుకోవాలి. తన ఏప్రిల్ 25 ఉపన్యాసంపై పునరాలోచించుకోవాలి. అన్నిటి కన్నా ముందు ఈ దేశంలో సంఘ్ మూకలు ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని ప్రచారం చేయకుండా ఆపడానికి ఒక ప్రభుత్వ పెద్దగా రేవంత్ బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో మత సమరస్యాన్ని కాపాడడానికి మనం అందరం కలసి పని చేయాలి.