అడవిలో ఏనుగులు ఎదురైనపుడు ఏమి చేయాలి?
గుండాలకోన ఏనుగుల దాడి నేపథ్యంలో వెటరినరీ డాక్టర్ గోవిందరాజ భాస్కర్ సూచనలు;
-డాక్టర్ ఎం గోవిందరాజ భాస్కర్
ఏనుగులు అత్యంత బుద్ధిమంతమైన, సామూహిక జీవులు. వాటి ప్రవర్తనను వివిధ కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఏనుగులు మందగా గుంపుగా జీవించడానికి ఇష్టపడతాయి. ఈ మందలకు సాధారణంగా ఒక ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది, వాటి గుంపు వ్యవస్థలో పురుష ఏనుగులను 10-15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గుంపు నుండి తరిమివేయడం జరుగుతుంది. అది సహజ ప్రవర్తన.
పురుష ఏనుగులను గుంపు నుండి పంపించివేయడానికి కారణం
పురుష ఏనుగులు సుమారు 10-15 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, ఇవి ఆడ ఏనుగుల పోటీ పడటం ప్రారంభిస్తాయి . దీని వళ్ళ వాటి సమూహంలో అలజడి ప్రారంభమవుతుంది. ఒత్తిడిని పెరుగుతుంది. మందలో శాంతికోసం, గొడవలను నివారించడానికి పెద్ద ఆడ ఏనుగులు పురుష ఏనుగులను గుంపు నుంచి పంపించేస్తాయి. పిల్ల ఏనుగులను ఇతర పెద్ద ఏనుగులు సంరక్షిస్తాయి.
ఏనుగుల భాష
ఏనుగులు ఒక దానితో ఒకటి గర్జనలు , గాంభీర్య ధ్వనులు , మరియు లో ఫ్రీక్వెన్సీ, ఇంఫ్రాసౌండ్ ధ్వనులు ద్వారా మాట్లాడుకుంటాయి. వాటి శరీర భాష (Body Language) చెవుల కదలికలు ద్వారా కూడా ఒక ఏనుగుతో మరొకటి కమ్యూనికేట్ చేసుకొంటుంటాయి. ఏనుగులకు , మనుష్యుల కన్నా ఎక్కువ జ్ఞాపకశక్తి కలిగిన జీవులు. ఏనుగులు వాటి సహచర ఏనుగులతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటాయి. మంద లోని ఏనుగు మృతి చెందినప్పుడు మందలోని మిగతా ఏనుగులు మనుష్యుల్లా విచారం వ్యక్తం చేస్తాయి. ఏనుగులు రోజుకు సుమారు 100 నుంచి 150 కిలోల ఆహారాన్ని తింటాయి. ఎక్కువగా గడ్డి, ఆకులు, పండ్లు, చెట్ల తొక్కలు, కాయగూరలు కొన్ని చెట్ల వేర్లను తినడానికి ఇష్టపడతాయి. ఇవి నీటి కోసం, ఆహారం కోసం రోజుకు 50 కి.మీ. వరకు ప్రయాణించగలవు.
ఏనుగులు నీటిని ఎలా గుర్తిస్తాయి?
ఏనుగులు నీటి జాడను నీటిని వాసన, వినికిడి ద్వారానే కాకుండా నేలను త్రవ్వి కూడా గుర్తిస్తాయి. ఏనుగులు 12 మైళ్ల దూరంలో ఉన్న నీటి వనరులను కూడా గుర్తించగలవు. ఏనుగులు ఎల్లవేళలా ఆగ్రహంతో వుండవు. ఏనుగులలో ఆనందం, దుఃఖం, సానుభూతి మరియు ఒత్తిడితో సహా అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది.
ఎనుగులకు వ్యక్తిత్వం ఉంటుంది
మనుషుల మాదిరిగానే, ప్రతి ఏనుగుకు దాని స్వంత వ్యక్తిత్వం ఉంటుంది, కొన్ని ఎక్కువ ప్రశాంతంగా ఉంటాయి, మరికొన్ని సులభంగా ఆందోళన చెందుతాయి. ఏనుగులు బెదిరింపులకు గురైనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, గాయపడినప్పుడు లేదా వేధించబడినప్పుడు లేదా తమ పిల్లలకు ఆపద అని భావించినప్పుడు అవి ఆగ్రహిస్తాయి.
ఎనుగులకు కోపం వస్తే...
ఏనుగులు కోపంగా ఉన్నప్పుడు బెదిరింపుగా వాటి చెవులను విస్తరించి, తల మరియు దంతాలను పైకి లేపి, తొండాన్ని ఊపుతూ ఘింకరిస్తాయి. ఏనుగులకు పరిమితమైన దృష్టి కోణాలు ఉంటాయి మనుష్యుల్లా అన్ని వైపులా చూడలేవు ఏనుగులు, పక్కకు లేదా వెనుకకు చూడటం కంటే ముందుకు చూడటంలో మెరుగ్గా ఉంటాయి. ప్రకాశవంతమైన కాంతిలో అంటే పగటిపూట వాటి కంటి చూపు తక్కువగా ఉంటుంది, కానీ మసక కాంతిలో అవి 45 మీటర్ల వరకు కదలికలను గుర్తించగలవు. మానవులతో పోలిస్తే ఏనుగులు రాత్రిపూట మంచి దృష్టిని కలిగి ఉంటాయి, తక్కువ కాంతి పరిస్థితులలో కూడా బాగా చూడగలుగుతాయి , అయినప్పటికీ వాటి దృష్టి పరిధి సాధారణంగా రాత్రిపూట 10 మీటర్లు ఉంటుంది.
ఎరుపు తెలుపు చేస్తే దూకుడే...
ఏనుగులు ఎరుపు మరియు తెలుపు వస్త్రాలను చూసినప్పుడు కొంత దూకుడుగా వ్యవహరిస్తుంటాయి. అందుచేతనే అటవీ సిబంది అడవులలోకి వెళుతున్నప్పుడు ఆలివ్ రంగుల దుస్తులను ధరిస్తారు. ఏనుగులు వాటి శరీరాకృతి పెద్దగా ఉండటం వలన నేలపై పడుకొని లేవడానికి కష్టంగా ఉండటం వలన నిలబడి నిద్రపోతుంటాయి. ఏనుగులు చెట్లకు ఆనుకుని గాని లేదా తొండాలను నేలపై ఆనించిగాని లేదా కొన్ని సందర్భాలలో నేలపై పడుకుని నిద్రపోతుంటాయి. పిల్ల ఏనుగులు నేలపై పడుకుని నిద్రపోవడానికి ఇష్టపడతాయి.
ఏనుగు స్వతహాగా సిగ్గరి, ఏనుగులు పిల్ల ఏనుగులతో వున్నప్పుడు, పిల్ల ఏనుగుల సంరక్షణార్థం పొదలలో నిద్రపోవడానికి ఇష్టపడతాయి.
తలకోన అడవిలో ఏమి జరిగింది?
గుండాలకోన (Gundala Kona) లో జరిగిన ఉదంతం చూద్దాం. గ్రామస్థులు శివరాత్రి కొరకు తలకోన (Talakona) వెళ్లాల్సి ఉంది., వారు ప్రభుత్వం కొత్తగా వేసిన దారిలో కాకుండా పొదల మాటున వెళ్లడం చేశారు. అంతేకాదు, ఏనుగుల నుంచి వచ్చే ఘాటు మదపు వాసన గుర్తించలేక పోయారు. ఏనుగుల గుంపుకు మరి దగ్గర వెళ్లడం జరిగింది. ఏనుగుల గుంపును చూసి వాటిని భయపెట్టాలని గట్టిగా కేకలు వేయడం , పరిగెత్తడం చేశారు. దానికి తోడు వారి చేతిలో టార్చ్ లైట్ లు వెలుగుతున్నాయి. ఇక్కడ మరొక విషయం గుర్తుంచకోవాలి. టార్చి లైట్ల నుంచి వచ్చే నీలపు కాంతిని ఏనుగులు సులువుగా గుర్తిస్తాయి. ఏనుగులు రాత్రుల్లో మనుష్యులకంటే బాగా చూడగలవు. మనుష్యులు చేసిన ధ్వనుల వల్ల పిల్ల ఏనుగులకు ఏదో ఆపద రాబోతుందని భావించాయి. దాడికి పూనుకున్నాయి. ఇలా ఏనుగుల ప్రవర్తన అర్థం చేసుకోలేకపోవడంతో కొంతమంది అమాయకుల ప్రాణాలు పోయాయి.
అడవిలో ఏనుగులు ఎదరైనపుడు ఏమి చేయాలి?
అడవిలో ఏనుగు 100-150 మీటర్ల దూరం లో ఎదురైనప్పుడు, వాటికి మన వలన ఎటువంటి ప్రమాదం లేదు అని సూచించే విధంగా ఎటువంటి శబ్దం చేయకుండా ప్రశాంతంగా వుండాలి. ఆకస్మిక జెర్కీ కదలికలను లేదా పరిగెత్తడం చేయరాదు. మీ వీపును వాటి వైపు తిప్పడం మానుకోవాలి. ఏనుగును చూసి పరిగెత్తడం, ఏనుగును మిమ్మల్ని వెంబడించేలా ప్రేరేపిస్తుంది. దీని వలన పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఏనుగును దాని శరీర కదలికలను గమనిస్తూ నెమ్మది నెమ్మదిగా వెనుకకు తగ్గాలి. ఒక వేళా ఏనుగు మన వైపు దూసుకు వస్తే, దాని నుండి తప్పించుకోవడానికి ఉత్తమ మార్గం జిగ్‌జాగ్ నమూనాలో పరిగెత్తాలి. ఎందుకంటే ఏనుగు దాని శరీరాకృతి వలన త్వరగా దిశను మార్చుకోవడం కష్టం, ఇది మనం తప్పించుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది.
అటవీ జీవికి దూరంగా వున్నప్పుడు మన ఉనికిని తెలుపడానికి చిన్నపాటి శబ్దం చేస్తూ పక్కకు తప్పుకోవాలి కానీ మరి వాటి దగ్గరకు వెళ్లి భీకర ధ్వనులతో భయపెట్టాలని చూస్తే వినాశనం తప్పదు. ఎక్కడో మూడు వందల నలభై కిలోమీటర్లు దూరం ఉన్న కర్ణాటక రాష్ట్రం లోని బన్నేరుఘట్ట (Bannerghatta National Park) అడవులనుంచి పలమనేరు ,కుప్పం , మంగళంపేట మీదుగా ఇప్పుడు శేషాచల అడవులలోకి వచ్చిన పదనాలుగు ఏనుగులే ఈ ప్రమాదానికి కారణం అయ్యివుండవచు.
డాక్టర్ భాస్కర్
ఇవి కర్ణాటక నుంచి శేషాచల అడవుల (Seshachalam Forest) లోకి వచ్చే మార్గంలో వస్తూ ఈ దాడికి పూనుకుని ఉంటాయని ఒక అంచనా. ఇదివరకు శేషాచల అడవులలో వున్నవి పదైదు ఎనుగులు. ఈ కొత్తవాటి చేరికతో మొత్తం ఏనుగుల సంఖ్య కి 29 చేరింది. చిత్తూరు , తిరుపతి జిల్లాల అడవుల సమీపాన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏనుగులకు కనీసం 500 అడుగుల దూరంలో ఉండాలి. అలాకాకుండా వాటిని బెదరగొట్టాలని ప్రయత్నిస్తే అవి కోపం తో జనాల పై తిరగబడతాయి. అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.
ఓబులవారి పల్లె మండలం ఎర్రగుంట కోట కు సమీపం లో ఏనుగుల దాడి ఘటనలో శివ భక్తుల మరణ వార్త విన్నవెంటనే ప్రముఖ అభ్యుదయ వేత్త, ట్రెక్కర్ అయినటువంటి భూమన్ తమ అటవీ ప్రాంత ట్రెకింగ్ ను మానుకుని వారి సహచరులతో దాడి జరిగిన స్థలాన్ని సందర్శించి మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.
(రచయిత డా. గోవిందరాజ భాస్కర్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సత్యవేడులో వెటరినరీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు)