పేర్ల  మార్పు  దేనికి  సంకేతం 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పేర్లమార్పు పై ప్రకృతి వైద్యులు అఖిల మిత్ర ఏమంటున్నారంటే..;

Update: 2025-03-18 07:05 GMT

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు అలాగే 55 సంవత్సరాల కిందట బల్కంపేట లో ఉన్న గాంధీ ప్రకృతి వైద్యశాలకు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లి లో నిర్మించిన రైల్వే టెర్మినల్ కు కేంద్ర సహకారంతో అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్ గా నామకరణం చేయాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు ఆయనను కులం గాటికి కట్టకూడదు, అయన విశ్వమానవుడు.

ప్రకృతి వైద్యం అంటే గాంధీ అని గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన అందరి మదిలో ఉంది. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లు గాంధీ ప్రకృతి వైద్యం రెండు విడదీయరానిది. ఒక సంస్థ ప్రపంచ వ్యాపితంగా వర్ధిల్లాలి అనుకుంటే దానికి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి పేరు పెడితే బాగుంటుంది. గాంధీ పేరు విశ్వవ్యాపితం, జాతిపిత పేరు తీసి రోశయ్య గారి పేరు పెట్టడం సముచితం కాదు. యాభై ఐదు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏమాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బి ఎన్ వైఎస్ కోర్సు తప్ప కొత్తగా డిప్లొమా, పీజీ కోర్సులు లేవు.

భారతదేశంలో పురాతన వైద్య కళాశాల పాలకుల నిర్లక్ష్యంతో ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. ఎప్పుడు పేషంట్స్ తాకిడితో రద్దీగా ఉంటుంది, అరకొర డాక్టర్లు స్కిల్ ఉన్న ట్రీట్మెంట్ అటెండర్లు, పర్యవేక్షకులు లేకుండా కేవలం ఔట్ సోర్సింగ్ స్టాఫ్ తో కాలం గడుపుతున్నారు. తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో భారంగా నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ గాంధీ నేచర్ క్యూర్ కళాశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను చేర్చడానికి, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నేచురోపతి ఆసుపత్రుల స్థాపన కోసం ప్రభుత్వం చొరవ చూపాలి.

సహజ పద్ధతుల ద్వారా వారి శ్రేయస్సుపై నియంత్రణను తిరిగి పొందేందుకు వ్యక్తులను శక్తివంతం చేయడంపై దృష్టి సారించిన ప్రకృతి వైద్యం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. వ్యక్తిగతీకరించిన సంరక్షణ పై దాని ప్రాధాన్యత అలాగే ఆరోగ్య సమస్యల మూల కారణాలు పరిష్కరించడం సంప్రదాయ వైద్యానికి ప్రత్యామ్నాయాలను కోరుకునే వారికి ప్రకృతి వైద్యం వరప్రదాయిని. ప్రకృతి వైద్యం ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అలాగే విశ్వసనీయమైన ప్రకృతి వైద్య ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరత గుర్తించదగిన గా ఉంది. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ గాంధీ నేచర్ క్యూర్ కాలేజీ భారతదేశంలోనే పురాతన సంస్థగా నిలుస్తోంది.

ప్రకృతి వైద్యశాల ప్రారంభించి యాభై ఏళ్ళు గడుస్తున్నా ఇంకా పోస్ట్ గ్రాడుయేట్ కోర్సులు, రీసర్చ్ సెంటర్ గా అభివృద్ధి చెందలేదు. సత్వరమే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు , పరిశోధన విభాగం ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ వాది మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి పేరు పెడితే సమంజసంగా ఉంటుంది. గతంలో కళాశాలను అప్ గ్రేడ్ చేసి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర రాజ నరసింహ గారు ప్రకటించారు. అందుకు అనుగుణంగా సత్వరమే యోగ ప్రాణాయామ కన్వెన్షన్ సెంటర్, బయోడైవర్సిటీ పార్క్, జీవన శైలి కేంద్రం ఏర్పాటు చేసి అందులో రోశయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తే సబబుగా ఉంటుంది.

జాతిపిత పేరు తొలగిస్తే మనల్ని మనం దిగజార్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా వస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు అలాగే ఉంచి కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ కు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే సమంజసంగా ఉంటుంది. మెరుగైన పౌర సమాజమే ధ్యేయం గా పనిచేస్తున్న, విజ్ఞత గల ప్రభుత్వం మంచి సంప్రదాయాలకు తెరతీస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. సత్వరమే సంస్థల విశ్వవిద్యాలయాల పేర్ల మార్పు ఉపసంహరించుకొని పీజీ, పరిశోధన కేంద్రానికి ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరంలో రోశయ్య గారి పేరు విగ్రహం ఏర్పాటు చేయాలి.

Tags:    

Similar News