పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత ఎప్పుడు?

75 ఏళ్ల భారత రాజ్యాంగంపై పార్లమెంటులో తీవ్ర చర్చ జరుగుతోంది. బాగుంది. కానీ పార్లమెంటు ముందుకు వచ్చిన కనీస మద్దతు ధర నివేదిక మర్చిపోయారు

Update: 2024-12-20 02:32 GMT
Source: World Grain

గత వారం రోజులుగా దేశ చట్ట సభల్లో 75 ఏళ్లు నిండిన భారత రాజ్యాంగంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ పక్షాల మధ్య పరస్పర ఆరోపణలతో సాగుతున్న చర్చ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. అమిత షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. వెనక్కు తీసుకోవలసినవి. దేశానికి క్షమాపణ చెప్పవలసినవి. అందులో ఏ మాత్రం సందేహం లేదు.

ఈ చర్చ జరుగుతున్న సందర్భంలోనే పార్లమెంటు ముందుకు ఒక నివేదిక వచ్చింది. 18 వ పార్లమెంటు లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు చరణ్ జిత్ సింగ్ చెన్ని నేతృత్వంలోని వ్యవసాయం, రైతు సంక్షేమం , పశు సంవర్ధన , ఆహార శుద్ధి పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2024-2025 గ్రాంట్స్ కోసం డిమాండ్ పై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మీద ఇంకా పార్లమెంటు లో చర్చ జరగలేదు కానీ, ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసులు అత్యంత ముఖ్యమైనవి.
ఈ సిఫార్సులలో అత్యంత కీలకమైన సిఫారసు  ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేది ఈ సిఫారసు. రైతు ఉద్యమం సుదీర్ఘ కాలంగా కోరుతున్న ఈ డిమాండ్ ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు గా పార్లమెంటు ముందుకు వచ్చింది. ఇది సంతోషించాల్సిన విషయం. ఈ సిఫారసును అమలు చేస్తేనే, రైతుల జీవితాలు బాగుపడతాయని, రైతుల ఆత్మహత్యలు కూడా ఆగుతాయని స్టాండింగ్ కమిటీ అభిప్రాయ పడింది.
ఈ నివేదిక పకారం 2020-2021 కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉన్న బడ్జెట్ కేటాయింపులు 3.53 శాతం కాగా, పెరగాల్సింది పోయి 2024-2025 నాటికి 2.54 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ కమిటీ పత్యేకంగా సిఫారసు చేసింది.
వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయం, రైతులు, రైతు కూలీల సంక్షేమ శాఖ గా పేరు మార్చాలని మరో సిఫార్సు చేసింది. ఒక రకంగా సుదీర్ఘ కాలం తరువాత వ్యవసాయంలో వ్యవసాయ కూలీల పాత్ర గురించి చర్చించి , వారి సంక్షేమం కోసం కూడా పని చేసేలా వ్యవసాయ శాఖ ఉండాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేయడం అభినందనీయం.
అలాగే PM కిసాన్ ను సంవత్సరానికి 6000 రూపాయల నుండీ 12,000 రూపాయల వరకూ పెంచాలని స్టాండింగ్ కమిటీ మరో సిఫారసు చేసింది. ఇది కూడా అవసరమైన సిఫారసే. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సింది. ప్రస్తుతహమ్ కేంద్రం ఇస్తున్న 6000 రూపాయలు కూశా మూడు వాయిదాలలో చెల్లిస్తున్నది. అవి రైతులకు పెద్దగా వ్యవసాయం కోసం ఉపయోగపడడం లేదు.
పైగా PM కిసాన్ పథకం 2018 లో ప్రకటించినప్పుడు, ఎవరినైతే అప్పటి మార్గ దర్శకాల ప్రకారం ఎంపిక చేశారో,వారికే ఇప్పటి వరకూ PM కిసాన్ పథకం క్రింద సహాయం చేస్తున్నారు. ఈ ఆరేళ్లలో ఈ పథకం మార్గదర్శకాల ప్రకారమే కొత్తగా రైతులుగా నమోదైన వారికి PM కిసాన్ పథకం క్రింద సహాయం అందించడం లేదు. పైగా ఈ పథకం క్రింద అందించే సహాయాన్ని , కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా అందించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.
నిజానికి రైతు ఉద్యమ సమయంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండీ కూడా రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అందరూ కలసి కొన్ని ముఖ్యమైన డిమాండ్ లను ముందుకు తెచ్చారు.
అందులో ఒకటి దేశ వ్యాపితంగా రైతుల రుణాలను ఒక విడత మాఫీ చేయాలనేది ఒకటి. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పదేళ్ళ మోడీ ప్రభుత్వ కాలంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేశారు కానీ, దేశ వ్యాపితంగా రైతులకున్న 5 లక్షల కోట్ల అప్పును మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రాలేదు.
రైతులను ఋణ విముక్తులను చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఋణ విముక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా రైతు ఉద్యమ డిమాండ్లలో ముఖ్యమైనది. కానీ ఇప్పటి వరకూ అటువంటి కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం పూనుకోలేదు. ఇప్పుడు చెన్ని నాయకత్వంలోని స్టాండింగ్ కమిటీ, ఒక ప్రత్యేక పథకం తేవడం ద్వారా, రైతుల, వ్యవసాయ కూలీ కుటుంబాల రుణాలను మాఫీ చేయాలని సిఫారసు చేసింది.
మొత్తం ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పైవేట్ పరం చేయడానికి ఉద్దేశించిన విద్యుత్ బిల్లు 2020 ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని మూడవ డిమాండ్ గా రైతు ఉద్యమం ముందుకు తెచ్చింది. కానీ తాత్కాలికంగా బిల్లును ఆపారు కానీ, ఎప్పుడైనా ఆ విద్యుత్ బిల్లు ముందుకు వచ్చే అవకాశమే ఎక్కువ. అది ఎప్పటికైనా రైతుల మెడ మీద కత్తే.
రైతు ఉద్యమలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, రైతులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తేయాలని కూడా రైతు ఉద్యమం డిమాండ్ చేసింది, కానీ ఆయా రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడం కానీ, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం కానీ జరగలేదు.
రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన మరో డిమాండ్ , 2013 భూ సంస్కరణల చట్టాన్ని ఆ చట్టం స్పూర్తితో అమలు చేయాలని. 2013 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేసే అనేక అంశాలతో, కొత్త భూసంస్కరణల చట్టాన్ని తెచ్చింది. కానీ ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆ చట్టానికి తమకు తోచిన స్థాయిలో రాష్ట్ర అసెంబ్లీ లలో సవరణలు చేసి కొత్త చట్టాలను ఆమోదించుకున్నారు.
ఈ కొత్త చట్టాలతోనే, రైతులకు సరిగా పరిహారం చెల్లించకుండా, గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా , రైతుల నుండీ భూములను గుంజుకుంటున్నారు. తెలంగాణ లో KCR ప్రభుత్వం కూడా అలాగే చట్ట సవరణ చేసి , రైతుల నుండీ వేలాది ఎకరాల భూములను గుంజుకున్నది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా , తానే తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, KCR తెచ్చిన ఈ కొత్త చట్టం ఆధారంగానే ఇప్పటికీ నోటిఫికేషన్ ఇస్తున్నది. ఒక రకంగా, రైతుల నుండీ భూములు గుంజుకుని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంలో ఆయా ప్రభుత్వాల మధ్య పెద్ద తేడా లేదని ఈ వైఖరి స్పష్టం అవుతుంది.
స్టాండింగ్ కమిటీ చేసిన మరి కొన్ని సిఫారసులలో సన్న, చిన్నకారు రైతులకు యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలనేది ఒకటి. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్య పథకం తరహాలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉండాలని సిఫారసు చేసింది.
గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు కనీస జీవన వేతనాలు ఉండేలా సిఫారసు చేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ వేయాలని కూడా స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పదేళ్లుగా కనీస వేతనాల జీవోలు విడుదల కావడం లేదు. అమలు కావడం లేదు.
2017 లో దేశ వ్యాపితంగా మొదలైన రైతు ఉద్యమం గత రెండేళ్లుగా కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో బలపడుతున్నది. 2020 జూన్ లో లో రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల మూడు ఆర్డినెన్సులను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చినప్పుడు, దేశ వ్యాపితంగా రైతు ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమలో 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు. ఈ ఉద్యమ ఒత్తిడికి లొంగి మోడీ ప్రభుత్వం మూడు చట్టాలను వెనక్కు తీసుకుంది. కానీ ఏదో ఒక రూపంలో ఆ చట్టాల్లోని అంశాలను ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. కాపవరేట్ అనుకూల ఎజెండాను ఈ ప్రభుత్వం మార్చుకోలేదు. 2024 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పంజాబ్, హర్యానా , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో, మహారాష్టలో బీజేపీ తీవ్రంగా దెబ్బ తినడానికి రైతు ఉద్యమమే కారణం. మోడీ ప్రభుత్వ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ని సాధించలేకపోవడానికి కూడా రైతు ఉద్యమమే కారణం.
గత రెండేళ్లుగా నవంబర్ 26 రైతు ఉద్యమం స్మారకంగా , రైతులు ఛలో డిల్లీకి పిలుపు ఇస్తూనే ఉన్నారు. డిల్లీ చేరడానికి రైతులు యాత్రలు చేస్తున్నారు. కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత గురించి నినాదాన్ని బలంగా ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఈ సంవత్సరం కూడా పంజాబ్, ఉత్తర పరేదెశ రైతులు డిల్లీ వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, హర్యానా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రం మద్ధతుతో రైతు ఉద్యమాన్ని అణచి వేయడానికి ఎంతటి నిర్బంధాన్ని ప్రయోగించిందో దేశ మంతా చూసింది.

ఈ నేపధ్యంలో రైతుల గొంతుకు బలమిచ్చేలా, అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ , రైతు అనుకూల సిఫారసులను చేస్తూ నివేదికను ఇవ్వడం మంచి పరిణామం. మరీ ముఖ్యంగా కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడం నే సిఫారసు నిజంగా కేంద్ర పభూత్వానికి ఇరుకున పెట్టేదె .
స్టాండింగ్ కమిషన్ ఇచ్చిన ఈ సిఫారసులను అమలు చేయాలని రైతు ఉద్యమం తప్పకుండా ఒత్తిడి చేస్తుంది. ఇప్పటికే దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తే, కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు తమ సభ్యులు కూడా ఉన్న స్టాండింగ్ కమిటీ ఈ సిఫారసులు చేసింది. కాబట్టి పార్లమెంటు లో ఇండియా కూటమి ప్రతినిధులు , ఈ అంశాన్ని చర్చకు తెచ్చి, మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని రైతు ఉద్యమం కోరుతున్నది.


Tags:    

Similar News