బిఆర్ఎస్ రజతోత్సవ రాజకీయం బిజెపికి అనుకూలమేనా?

పదేళ్ల పాలన తర్వాత ప్రజల తిరస్కారం ఎదురైనా కెసిఆర్ లో పెద్దగా మార్పు వచ్చిన దాఖలా లేదు...;

Update: 2025-05-06 04:00 GMT

భారీ ఎత్తున జరిగిన భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభలో అధినేత కేసిఆర్‌ ప్రసంగ సందేశం ఏమిటి? ఉపన్యాసాలే అన్నీ నిర్ణయించవు కానీ దాని వెనక స్పష్టమైన రాజకీయ వ్యూహాలుంటాయి. అందులోనూ భారీ సభలు, ప్రసంగ గర్జనలకు చాలాకాలంగా విరామం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి గులాబీ స్ఫూర్తిని ఏ మేరకు నిలబెట్ట గలిగారు అనేది ఈ సభతో తేలిపోతుందని చాలామంది భావించారు.

బిఆర్ ఎస్  అధినేత కెసిఆర్‌ రాజకీయ ప్రస్థానాన్ని పదేళ్ల పరిపాలనను మనం మూడు భాగాలుగా పరిశీలన చేసాం. కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ హోరాహోరీ వాగ్యుద్ధాలు, జాతీయస్థాయిలోబిజెపి కాంగ్రెస్‌ పోరాటాల మధ్య తెలంగాణ రాజకీయం ఏ మలుపు తిరగవచ్చు? ఇంకా చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ మళ్లీ తన పూర్వ వైభవం తెచ్చుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్‌ చేసే స్థాయిలో సమంభేర్యి మోగిస్తుందా? అందుకు అవసరమైన రాజకీయ స్పష్టత, నిర్మాణ పటిష్టత క్రియాశీల కార్యాచరణ కు కేసిఆర్‌ మార్గ నిర్దేశం చేశారా?

జనసమీకరణ సామర్థ్యం
మొదటి విషయం- భారీ జన సమీకరణ దానికి సంబంధించిన ప్రచారకాండ వీటన్నింటిని క్రమ పద్ధతిలో సాగించడంలో టిఆర్‌ఎస్‌ తన సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగింది. ఉద్యమ పార్టీగానూ, పాలక పార్టీగానూ సత్తా చాటిన సందర్భాలను గుర్తుచేసింది. ఒక్క ఓటమితోనే తాము చేతికిలబడబోమని చెప్పడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. ధూమ్‌దామ్‌తో సహా ఎన్నికలనాటి వాతావరణాన్ని గుర్తుచేసింది. వారి మీడియా,అనుకూల ప్రచార యంత్రాంగం ఒక పెద్ద ఈవెంట్‌ చూడబోతున్నాం అన్న భావన తీసుకొచ్చాయి. అందుకు ఏమాత్రం తీసిపోకుండా కాంగ్రెస్‌ పార్టీ కూడా రివర్స్‌ దాడి వ్యూహం అమలు చేసింది. సభ వెనువెంటనే ఎదురు దాడికి దిగింది.తెలంగాణ రాజకీయంలో ఈ రెండు పార్టీల భీకర్ సమరం అనివార్యమని అర్థమైంది
 జనతిరస్కారానికి కారణం ఏమిటి?
అయితే సభలో ప్రధాన ప్రయోక్త, ప్రవక్త కెసిఆర్‌ అనుచరుల అంచనాలను నిజం చేశారా రాజకీయ స్ఫూర్తిని నింపగలిగారా అంటే సంతృప్తికరమైన సమాధానం రావడం కష్టం. పాతికేళ్ల సభ అనిగుర్తుంచుకున్నా గత పాతికేళ్లలో పదేపదే విన్న వినిపించిన విమర్శలు,విసుర్లు వింగడిరపులు తప్ప విభిన్నంగా చెప్పిందేమీ లేదు. తెలంగాణ పట్ల వివక్ష ,అసమానతలు వాటిపై అసంతృప్తిని వ్యూహాత్మకంగా కూడగట్టడంలో తన అపురూప ప్రతిభ ఇవన్నీ కెసిఆర్‌ చాలాసార్లు చెప్పడం, వినడం, ప్రజలు పార్టీలు బలపర్చడం జరిగిపోయింది. రాష్ట్రం ఏర్పడింది. దాన్ని పదేళ్ల పాటు ఆయనే పాలించారు. అలాంటప్పుడు ఇంకా అంతకు ముందటిే ప్రసంగాలలోనే ముంచి తేల్చడం, వాటితోనే మెప్పించడం సాధ్యమయ్యేది కాదు. తన పాలనా కాలంలో తీసుకువచ్చిన గొప్ప సంక్షేమ పథకాలను గురించి, వ్యక్తిగత శ్రద్ధను గురించి ఆయన చాలానే చాలాసార్లే చెప్పారు. వాటిలో చాలా నిజమూ ఉండవచ్చు. కానీ అనేక లోపాలు తప్పులు లేకపోతే ప్రజలు తిరస్కరించేవారు కాదు కదా? ఆ తిరస్కరణకు దారి తీసిన కారణాలేమిటి ఈ రజతోత్సవ సమయంలో ప్రత్యర్థుల మాట అటుంచి అనుయాయులు అప్పటి అమాత్యులు కూడా ఏకరువు పెట్టిన ఏకపక్ష ధోరణలపై నాటి తెలంగాణాధీశుని ఆత్మ విమర్శ ఎక్కడైనా కనిపించిందా అంటే అసలులేదు.
సభలో కెసిఆర్ అసహనం
మనం ఏం చేశామనుకుంటామో దాన్ని బట్టి మనను అంచనా వేసుకుంటాం, మనం ఏం చేసామో దాన్నిబట్టి అవతలి వారు అంచనా వేస్తారు. సాధారణంగా చెప్పుకునే వాక్యమే. కెసిఆర్‌ ఆయన అనుయాయులు తాము చేసిన మహత్తర కృషి గురించే మాట్లాడుకోవాలని కోరుకోవచ్చు. కానీ పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారం చలాయించిన తర్వాతా దానికి ముందు చెప్పినమాటలే  చెప్తాం అంటే ఎలా కుదురుతుంది? తమను అన్న వాళ్ళది తప్ప అధికారం చేసిన వాళ్ళ దోషం లవలేశం లేదంటే ఎలా జరుగుతుంది? ఆత్మ విమర్శ అన్నది ఏ కోశానా లేకపోవడం, ఎదురు దాడి మాత్రమే ఆత్మ రక్షణ సాధనమనొకోవడం కెసిఆర్‌ అతిపెద్ద పొరపాటు. చర్విత చరణం ఒకటి అయితే ఆత్మ స్తుతి పర విమర్శ మరొకట. వీటితోపాటుగా ఈ సభలో కొంత అసహనం కేసీఆర్లో స్పష్టంగా కనిపించింది. వేదిక సమీపంలో ముందుండి నినాదాలు ఇచ్చేవారిపై పదేపదే ఆయన విసుక్కున్నారు, ఆగ్రహించారు. కొన్నిసార్లు వ్యూహాత్మకంగా ఇటువంటివి చేస్తుంటారు కానీ ఈ సభలో మాత్రం ఆయన అసౌకర్యానికి గురి కావటం స్పష్టంగా కనిపించింది. అధినేత అంతగా చెప్తున్నా వారి లొల్లి ఆగ లేదంటే అది పార్టీ నాయకత్వం ఏర్పాట్లలోపాన్ని చెప్తుంది. మీరు మా పార్టీ వాడేనా అని ఆయన అనేకసార్లు రెట్టించటం ఆశ్చర్యం కూడా కలిగించింది. ే ఇంతకీలకమైన సభలో అల్లరి చేసే వ్యక్తులు చొరబడటం ఎలా సంభవం?
తెలంగాణాకు కాంగ్రెసే పెద్ద విలన్‌. దీనర్థం?
తెలంగాణాకు కాంగ్రెసే పెద్ద విలన్‌ అని కెసిఆర్‌ బల్లగుద్ది చెప్పటం యాదృచ్ఛికంగా జరగలేదు. బి.ఆర్‌.ఎస్‌ ఏర్పాటు చేశాక ఒక దశ వరకు ఇండియా పట్ల సానుకూలత సూచిస్తూనే బిజెపి కాంగ్రెస్‌ రెండు పార్టీలకు సమాంతరంగా సొంత వేదిక ఏర్పాటు చేస్తున్నానని కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. తానే ప్రధానమంత్రి అభ్యర్థి నన్న చర్చ కూడా నడిపించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్సే విలన్‌ అని చెప్పడం ద్వారా బిజెపి విలన్‌ కాదని ప్రకటించడానికే ఈ ప్రకటన చేశారని అందరూ భావించారు. కాంగ్రెస్‌ పాలనను విమర్శించటం. రేవంత్‌ రెడ్డి పై ధ్వజమెత్తడం. ఆ ప్రభుత్వ తప్పిదాలను చీల్చి చెండాడటం ఒక ఎత్తు. కానీ తను స్వయంగా విలీనం చర్చలు జరిపిన ఆ పార్టీ విలన్‌ గా ఎలా మారిపోయింది? 2023 ఎన్నికలకు ముందు పనిగట్టుకుని విమర్శించిన బిజెపి విలన్ల జాబితా నుంచి ఎలా జారిపోయింది? ఎందుకు తప్పించారు? బిజెపి మారిందా లేక ిబిఆర్‌ఎస్‌ మారిందా? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బిజెపిలకే సగం సగం స్థానాలు రావడానికి కారణం బిఆర్‌ఎస్‌ ఓట్ల మళ్లింపు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తకుండా ఉండవు. కచ్చితంగా చెప్పాలంటే నేను, మేము కాంగ్రెస్‌ నే ఓడిరచటానికి పని చేస్తాము అని కెసిఆర్‌ చెప్పారన్నమాట .హైడ్రా వంటి వాటిని కూడా సమయానుకూలంగా లేవనెత్తి రేవంత్‌ సర్కారుపై వచ్చిన అసంతృప్తిని తమపై అనుకూలతగా మార్చుకోవాలని ఆయన ప్రయత్నించారు. కాంగ్రెస్‌ నే ఓడించటం అంటే అందుకోసం ప్రధాన ప్రత్యర్థయిన బీజేపీతో కలవడం లేదా సహకరించటం లాంటి కూడా అవకాశాలు తోచిపుచ్చడానికి లేదు
బిజెపి కోసం ఒకే ఒక్క వాక్యమా
ఈ సందేహం కలగడానికి కేసీఆర్‌ మరిన్ని ఆధారాలు ఇచ్చారు. తన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ పై రకరకాల దాడి చేశారు కానీ బిజెపి కోసం ఒకే ఒక్క వాక్యం కేటాయించారు. మేము ఉన్న పదేళ్లలో 11 రూపాయలు కూడా కేంద్రం కేటాయించలేదు అన్నారు. అంటే ఇక్కడ కూడా కేంద్రం అని రాజ్యాంగపరంగా అనడం తప్ప రాజకీయంగా బిజెపి రాజకీయ నాయకత్వాన్ని, మరీముఖ్యంగా ప్రధానమంత్రి మోడీని పేరు ఎత్తలేదన్న మాట. కాశ్మీర్‌ ఉగ్ర దాడి నేపద్యంలో దేశమంతా ఉడికిపోతున్నా, ఆ పేరుతో ముస్లిం వ్యతిరేకత పెంచటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా కేసీఆర్‌ మాత్రం ఆ ఊసే ఎత్తుకోలేదు గతంలో చెప్పినట్టు అధికారంలోకి వచ్చాక మజ్లిస్‌త్తో ప్రగాఢ స్నేహం చేసిన, తొలిగా వారినే కలుసుకున్న కెసిఆర్‌ ఇంతగా గొంతు మార్చటం నిజంగా ఆశ్చర్యమే.
వక్ఫ్‌ చట్టం వంటి వాటి ప్రస్తావనే తేలేదు.
  వ్యూహాత్మక మౌనం, అవసరార్థపు దాటవేతగా దీన్ని చెప్పవచ్చు కానీ దేశ పరిస్థితులను బట్టి చూస్తే అవకాశం లేదు. కుమార్తె కవితను చాలా కాలం నిర్బంధించి కేసులలో పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం కేసీఆర్‌ను ఎంత బాధ పెట్టిందో అందరికీ తెలుసు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొలుపుతున్నారని అంతకు ముందు కాలంలో ఆయన నిప్పులు జరిగారు. ఆపరేషన్‌ ఫామ్‌ హౌస్‌ వంటి ఘటనలను కోర్టుల దాకా తీసుకెళ్లి అమీతుమీ తేల్చుకుంటాను అన్నారు. ఇప్పుడు ఆ ముచ్చటలూవీ ఎత్తుకోవడం లేదు. పైగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీద సిబిఐ ఈడి ఎందుకు దాడి చేయడం లేదని బిఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తున్నది. కనుక కవిత అరెస్టు, కేసు పై రాజకీయ పోరాటం కాక చేతులు కలపటమే శ్రేయస్కరమని కొంతమంది నాయకుల్లా కెసిఆర్‌ నిర్ణయానికి వచ్చారా? జిహెచ్‌ఎంసలోనూ  లోక్‌ సభ ఎన్నికల్లోనూ, తమ స్థానాన్ని బిజెపి ఆక్రమిస్తుంటే అడ్డుకోవలసింది పోయి కాంగ్రెసే తమ ప్రత్యర్థి¸ అని చెప్పడం లో స్పష్టమైన రాజకీయ మార్పు కాబోతుందా?
గ్రామాలే తిరస్కరించాయి
రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పుంజుకుని అధికారంలోకి రావడం బిఆర్‌ఎస్ కు పెద్ద దెబ్బే.అయితే కేసీఆర్‌ చెప్పిన పథకాలలో అత్యధిక భాగం గ్రామాలకు సంబంధించినవి. కానీ ఆ ప్రాంతాల్లోనే ఆ పార్టీ ఎక్కువగా ఓడిపోయింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల వచ్చిన స్థానాలే టిఆర్‌ఎస్‌ చెప్పుకుంటున్నట్టుగా ఓటమిలోనూ గౌరవం నిలబెట్టాయి.(కాకపోతే ఆ ఎంఎల్‌ఎలు నిలిచింది లేదు) కనుక పథకాలతోనే గట్టెక్కి వచ్చును అన్న ఆశ ఇప్పుడు ఉండకపోవచ్చు. తెలంగాణ సెంటిమెంటు ఒక్కటే గతంలోలా ఇప్పుడు చెల్లడం కష్టం. ే అధికారం కోసం వాటిని ఆయనే పదును తగ్గించారు అసలు పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా చేశారు. అలా అని బిఆర్‌ఎస్‌ గా పోరాడా రా అంటే ఆ శక్తి, ఆసక్తి రెండు లేకపోయాయి. సొంత పునాది గడ్డపైనే ఓడిపోయాక మరెక్కడో గెలవడం అన్నది వూహకందని విషయమే. పైగా ఇతర చోట్ల పోటీలు పెట్టిఓట్లు చీల్చడాన్ని బిజెపి ఆమోదించే పరిస్థితి ఉండదు. మూడో నాలుగో లేదా రెండో ప్రత్యామ్నాయమని తాను బయలుదేరినప్పుడే ఇలాంటి సందేహాలు ఉన్నాయి ఓటమి స్ఫూర్తివంతంగా తీసుకున్నారా అంటే అదీ జరగలేదు. శాసనసభకు మొహం చాటేస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోయారని రేవంత్‌ రెడ్డి డెప్పిపోడుస్తుండగా దానికి నేనేందుకు నా పిల్లలకే నువ్వు జవాబు చెప్పలేకపోతున్నావని ఎదురుదాడి చేస్తున్నారు. మాటలు ఏం చెప్పినప్పటికీ శాసనసభకు రాకపోవడం బాధ్యతల విస్మరణగా,రంగం నుంచి నిష్క్రమణగా ప్రజలు భావిస్తారు

రేవంత్‌ రెడ్డి వయస్సు ,అనుభవం, గత రాజకీయాలు ఏమైనా కావచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన లెక్కే లేనట్టుగా మాట్లాడటం ప్రజాస్వామ్య లక్షణం కాదు. రేవంత్‌కు స్థాయి లేదని, స్టేచర్‌ లేదనిఇటీవల కెటిఆర్‌ తదితరులు ఈసడిరచడం వివాదమైంది. రేవంత్‌ పేరు తీయకపోవడం, అవమానించడమేనని కేసిఆర్‌ భావించవచ్చు కానీ నా పేరు తీసే ధైర్యమే లేదని ముఖ్యమంత్రి ఖండిరచడానికి అవకాశం ఇవ్వలేదా? పదేళు పాలించి ప్రజల తిరస్కరణకు గురైన తమ పాలనపై ఇసుమంతా విమర్శ చేసుకోకుండా పది నెలలు కూడా కాకుండానే రేవంత్‌ రెడ్డి నే టార్గెట్‌ చేసి తిట్టిపోస్తామంటే ఎలా? అంతకుముందు కాలంలో కేంద్రం ఏమి సహాయం చేయలేదంటూనే ్త ఇప్పుడు మాత్రం తప్పంతా రాష్ట్రానిది అన్నట్టు మాట్లాడితే ఎలా చెల్లుతుంది? అసలు బిఆర్‌ఎస్‌గా మారడం, ఆ ఏర్పాటు వైఫల్యం గురించి రజతోత్సవం లాంటి కీలక సందర్భంలోమాట్లాడకుండా దాటేయటంలో అర్థం ఉందా? కేసీఆర్‌ వాటిని చూచాయిగా కూడా ప్రస్తావించలేదు.గతవారం చెప్పుకున్నట్టు నాయకత్వ పరమైన సమస్యాత్మక అంశాలకు కూడా కెసిఆర్‌ దగ్గర సమాధానం లేదు. అంటే వాటిని కదిలించటానికి ఆయన వెనుకడుగు వేస్తున్నారు అన్నమాట. ఇదంతా ఆ పార్టీ యంత్రాంగం నిర్మాణం లోపాన్ని సూచిస్తుంది. దేశ రాజకీయాలు రాష్ట్రంలో ఇతర కోణాలు అన్ని విస్మరించి కేవలం కాంగ్రెస్పై మాత్రమే కత్తి కట్టడం వల్ల సమగ్ర సందేశం ఎలా ఇస్తారు
ఆపరేషన్ కగార్ మీద...
అధికారంలో వుండగా ఎన్‌కౌంటర్లను పునరుద్ధరించారని పేరు తెచ్చుకున్న కెసిఆర్ ఆపరేషన్‌ కగారు నిలిపేయాలని ఒకే ఒక్క రాజకీయ పిలుపునిచ్చారు. అది సరైందే గానీ ఉద్యమ కాలంలో వలె వామపక్ష తీ వ్రవాద ప్రాంతాలలో మద్దతు కూడగట్టుకోవడానికి ఈ ప్రయత్నమా?.తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను బలపరిచే బుద్ధిజీవులు కొ ందరు ఈ పిలుపు చుట్టు ఒక వేదికలు నిర్మించడానికి ప్రయత్నిస్తూనే ఈ చొరవ కెసిఆర్‌ చుట్టూ పెంచే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తుంది. ఈ ఆపరేషన్‌ కేంద్రం ఆధ్వర్వంలోనే జరుఉతున్నది.వామపక్షాలే గాక కాంగ్రెస్‌ కూడా ముఖ్యమంత్రితో సహా దాన్ని నిలిపేయాలని కోరుతున్నారు. కేంద్రం చొరవ తీసుకుని చర్చలు కూడా చేయాలంటున్నారు. కనక ఈ పిలుపు ఒక్కటే కెసిఆర్‌ వైఖరిలో మార్పుగా తీసుకుని మిగిలినవి వదిలేయడం కుదిరేది కాదు.
ఉద్యమ సహచరుల వైఖరి
ఈ సమయంలోనే తెలంగాణలో కొన్ని మేధా బృందాలు వర్గాలు మళ్ళీ ఉద్యమ కాలం నాటి చర్చలను ముందుకు తేవాలని చూడటం యాదృచ్ఛికం కాదు. పత్రికలో కూడా ఇలాంటి వాదనలే సాగుతున్నాయి. పదేళ్ల తర్వాత బలపడవలసిన ఈ గొంతులు అంతకుముందే చెప్పిన వాటికి తిరిగిపోవడం దేన్ని సూచిస్తుంది? ఉద్యమ కాలంలో కేసీఆర్‌ తో నడిచిన ఎంతోమంది వ్యక్తులు శక్తులు దూరం కాగా వీరు మాత్రం ఎందుకు పరోక్షంగా ఆ వాదనాలకు అనుకూలత ప్రకటిస్తున్నారు? రాష్ట్ర విభజన పదేళ్ల తర్వాత కూడా పెత్తనాల గురించి ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఉద్యమపార్టీ అనాడు చెప్పిన నినాదాలు తర్వాత అనుసరించిన విధానాలకు మధ్య వైరుధ్యం వారు గుర్తించలేదా? జరుగుతుందని భావించాము కానీ జరగలేదని ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారు. తమాను వదిలేసి మరి ఎవరెవరినో ఇతర పారీల్ట నుంచి తెచ్చుకొని పెద్దపీట వేసిన కెసిఆర్‌ పై ఎందుకు సూటిగావిమర్శ చేయలేకపోతున్నారు? రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ మాత్రమే కాక దాన్ని ఆశ్రయించుకున్న దాని ఆదరణ పొందిన శక్తులు కూడా ఒక సంఘర్షణను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని దీన్ని బట్టి తెలియడం లేదా? మరి ఈ శక్తులైనా కేసీఆర్‌ రాజకీయ విధానాన్ని ఆమోదిస్తారా?వారే ఆమోదించలేనిది ప్రజలు స్వీకరిస్తారా? ఈ ప్రశ్నలకు రాబోయే కాలమే జవాబు చెప్పాలి,


Tags:    

Similar News