ప్రధాని మోదీని కన్వెర్టెడ్ బీసీ అనాల్సిన సమయమా ఇది!
రేవంత్ వ్యాఖ్య వ్యూహమా, తప్పిదమా!;
— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లక్ష్యంతో రాష్ట్ర బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం న్యూఢిల్లీలో ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాతే ఈ బిల్లులు చట్టాలుగా మారతాయి. ఆ తర్వాతే వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియ మొదలవుతుంది. ఈ రెండు దశలు పూర్తయితేనే ఈ రిజర్వేషన్లు కోర్టు పరీక్షలను తట్టుకునే శాశ్వత రక్షణ పొందుతాయి. తమిళనాడు చూపిన దారి దీనికి ఉత్తమ ఉదాహరణ.
ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగమా? లేక అవే అడ్డంకులా? ఈ ప్రశ్నల చుట్టూ ఈ వ్యాసం కేంద్రీకరించబడింది. ఈ విశ్లేషణలో ఒక స్పష్టత ఉంది– ఇది BJP లేదా ఏ ఇతర పార్టీ ఆలోచనలను ప్రశంసించడం కాదు. లక్ష్యం ఒక్కటే: 42% రిజర్వేషన్ల సాధన కోసం అవసరమైన వ్యూహం ఏమిటి అన్నది ప్రజల ముందుకు తేవడం.
ప్రధానిపై వ్యక్తిగత దూషణ – వ్యూహమా, తప్పిదమా?
రేవంత్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని “Converted BC” అంటూ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా చర్చలు రేపవచ్చు. కానీ దీని మూల్యం ఏమిటి? ఒక ముఖ్యమంత్రి కేంద్రం సహకారం కావలసిన సందర్భంలో ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేయడం వ్యూహపరంగా తెలివైన నిర్ణయమా? లేక రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదకరమా?
42 శాతం రిజర్వేషన్ల లక్ష్యం కేవలం రాష్ట్రంలో చట్టాలు చేయడం ద్వారా సాధ్యం కాదు. ప్రస్తుత 31 C పరిధిలోరాష్ట్రపతి ఆమోదం లేకుండా ఆ బిల్లులు చట్టాలుగా మారవు. అంతేకాదు, వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి కేంద్రం సహకారం తప్పనిసరి. ఈ వాస్తవ పరిస్థితిలో ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేయడం, అదే సమయంలో ఆయన సహకారం కోరడం, వ్యూహరహిత పోకడగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
వాస్తవాలు – రికార్డులు ఏమి చెబుతున్నాయి?
రేవంత్ చేసిన వ్యాఖ్యలు కొత్తవి కావు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇదే వాదనను గతంలో చేశారు. కానీ రికార్డులు వేరే చెబుతున్నాయి. గుజరాత్‌లో మోద్ఘాంచి (తేలి) కులాన్ని OBC జాబితాలో చేర్చింది నరేంద్ర మోడీ కాదు. అది 1994 జూలై 25న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఛభీల్‌దాస్ మెహతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ తీర్మానం (Social Welfare Department Resolution No. SaShaP./1994/1411/A) ద్వారా 36 వెనుకబడిన కులాలను OBC జాబితాలో చేర్చారు. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అదే కులాన్ని జాతీయ OBC జాబితాలో చేర్చింది. ఈ ప్రక్రియలు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యే 2001 కంటే ముందే జరిగింది.
మోద్ఘాంచి కమ్యూనిటీకి చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీఈ మధ్యకాలంలోఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కూడా నిరాధారం, అసంబద్ధం, తమ కమ్యూనిటీని అవమానించే పనికి జాతీయ స్థాయి నాయకులు ఓడి కట్టడం మంచిది కాదు. అని ఆయన హితు పలికారు వాస్తవాలు అందుబాటులో ఉన్నా, రాహుల్ గాంధీ చేసిన అదే తప్పును ఇప్పుడు రేవంత్ పునరావృతం చేయడం వ్యూహరహిత వైఖరే.
కేంద్రాన్ని అవమానిస్తూ సహకారం కోరడం?
ఒక ముఖ్యమంత్రి ప్రధానితో ఘర్షణాత్మక రాజకీయాన్ని ఎంచుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆ ప్రధానితో 9వ షెడ్యూల్ చేర్పు కోసం సహకారం కోరడం ఏ విధమైన వ్యూహం? ఈ రెండు దిశలు కలిసేనా? కేంద్రాన్ని అవమానిస్తూ సహకారం కోరడం తెలివైన రాజకీయమా? లేక వ్యూహరహిత పోకడా?
తమిళనాడు మోడల్ – మనకు నేర్చుకోవాల్సింది ఏమిటి?
తమిళనాడు 69% రిజర్వేషన్ల చట్టం (1993) రాష్ట్రపతి ఆమోదం పొందింది. వెంటనే 76వ సవరణ (1994) ద్వారా ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. ఇది ద్వంద్వ రక్షణ. అక్కడ రాజకీయ విభేదాల కంటే చట్టబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆ చట్టం నిలిచింది. తెలంగాణకు కూడా ఇదే మార్గం. కానీ దారుణమైన వ్యక్తిగత వ్యాఖ్యలతో కేంద్రాన్ని దూరం చేసుకోవడం వలన ఈ లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు?
తెలంగాణ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడవాలి. 42 శాతం రిజర్వేషన్లను శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే Article 31‑C రక్షణతో పాటు 9వ షెడ్యూల్ చేర్పు తప్పనిసరి. కేంద్రం సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని చట్టపర, రాజకీయ వాస్తవాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి పైనా కూడా – ఘోరమైన దుమారం రేపిన సీఎం వ్యాఖ్యలు
ఇంకా మరొక అంశం గమనార్హం. హర్యానా మాజీ గవర్నర్ బందారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో రేవంత్, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డిని “నాకు అత్యంత ఆత్మీయుడు” అన్నారు. కానీ అంతకుముందు ఆయనపై “రాష్ట్రంలో నివాస అర్హత లేని వ్యక్తి” అంటూ ఘాటైన విమర్శ చేశారు. ఒకే నాయకుడిపై ఇంత విరుద్ధ వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిపక్వతేనా? లేక పరిస్థితికి అనుగుణంగా మాటలు మార్చే ఆలోచనలేని పోకడేనా?
రహస్య ఎజెండా?
ఇక్కడ ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. రేవంత్ రెడ్డి నిజంగానే 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారా? లేక ఇది కాంగ్రెస్‌లో తన స్థానాన్ని బలపరచుకోవడానికి, రాహుల్ గాంధీ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చేసే రహస్య ఎజెండాా? రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి వ్యక్తిగత రాజకీయ లబ్ధికి పాటుపడడం ఎంతవరకు సమంజసం?
చట్టపర సత్యం – రాష్ట్ర బిల్లుల స్థితి
ప్రస్తుతం 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినవి రాష్ట్ర బిల్లులు మాత్రమే. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే ఇవి చట్టాలుగా (Acts) మారతాయి. ఆ తర్వాతే వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. Article 31‑C రక్షణ కూడా తాత్కాలికం మాత్రమే. శాశ్వత రక్షణకు తమిళనాడు చూపినట్లు పార్లమెంట్ సవరణ తప్పనిసరి.
ఈ ప్రక్రియలో న్యాయపరమైన మార్గాలు కూడా ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు “State of Tamil Nadu vs Governor” (2025) కేసులో గవర్నర్లు, రాష్ట్రపతులు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదని స్పష్టం చేసింది. అవసరమైతే Writ of Mandamus ద్వారా రాష్ట్రపతిపై గడువు విధించుకునే చట్టపర మార్గాలు కూడా పరిశీలించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ దిశలో ముందడుగు వేయడం కనిపించడం లేదు.
ముగింపు – Script ప్రజల కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసమా?
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒప్పించాల్సిన కీలక దశలో ప్రధానిపై, కేంద్ర మంత్రులపై దూషణలు చేయడం వ్యూహపరంగా ప్రమాదకరం. 42 శాతం రిజర్వేషన్లు బీసీల న్యాయ హక్కుల కోసం సాధించాల్సిన చట్టపర పోరాటం. కానీ ఈ పోరాటం ఒక వ్యక్తిగత రాజకీయ రహస్య ఎజెండాకు బలి అవుతుందా? ఈ Script నిజంగా ప్రజల ప్రయోజనానికేనా? లేక వ్యక్తిగత రాజకీయ లాభం కోసమేనా? ఈ ప్రశ్నకు సమాధానం రేవంత్ ఇవ్వాలి.