జాతీయ సహకార విధానం 2025 ఎందుకు?

కార్పొరేట్లకు ప్రత్యామ్నాయమా ? కార్పొరేట్లకు అనుసంధానించడమా ?;

Update: 2025-08-13 09:00 GMT

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సహకార రంగాన్ని బలోపేతం చేయడం ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2025 లో తెచ్చిన సహకార విధానం మాట్లాడుతున్నది. సహకార సంఘాలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయడం, బలోపేతం చేయడం లాంటి నిర్ధిష్ట చర్యల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం తమ లక్ష్యమని ఈ విధాన పత్రంలో కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది.

గతంలోనే మోదీ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ స్థాయిలో ఒక సహకార మంత్రిత్వ శాఖను ప్రకటించి, దేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కు ఆ శాఖ బాధ్యతలు కూడా ఇచ్చిన విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. దేశంలో 10,000 రైతు ఉత్పత్తి దారుల సంఘాల (FPO) ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వ ఎజెండాలో కీలక భాగంగా గత పదేళ్లుగా ఉంటూ వచ్చింది.

గ్రామీణ స్థాయిలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి వీలుగా చట్ట పరమైన, ఆర్థిక, సంస్థాగత ఫ్రేమ్‌ వర్క్‌ను సృష్టించడం ఈ విధాన పత్రం లక్ష్యమనీ, సహకార సంస్థలను అత్యంత ప్రొఫెషనల్ గా, పార దర్శకంగా , సాంకేతికంగా సామర్థ్యం గలిగిన , బలమైన ఆర్థిక సంస్థలుగా మార్చడం మరో లక్ష్యమనీ ఈ విధాన పత్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విధాన పత్రం లో ఆరు లక్ష్యాలను, పదహారు ఉద్దేశాలను ప్రతిపాదించారు.

“ఈ విధానానికి అనుగుణంగా చట్టపరమైన, సంస్థాగత సంస్కరణలు వెంటనే చేపట్టాలని కేంద్రం , రాష్ట్రాలకు సూచించింది. ఈ సూచనల ప్రకారం రాష్ట్రాలు తమ తమ సహకార చట్టాలను (సహకార సొసైటీల చట్టాలు, నియమాలు) సవరించుకోవాల్సి ఉంటుంది. సంఘాల నిర్వహణలో పారదర్శకత తేవాల్సి ఉంటుంది. , సంఘాల స్వయం ప్రతిపత్తి పెంచాల్సి ఉంటుంది. సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం కోసం సహకారం అందించాల్సి ఉంటుంది. సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయాలను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రక్రియలో సహకార సంఘాల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలోనే సరైన సంస్థాగత చర్యలు చేపట్టి, సరిగా నడవని సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

సహకార సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి, మూడు స్థాయిలలో, ప్రాథమిక వ్యవసాయ రుణ సహకార సంస్థలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, రాష్ట్ర సహకార బ్యాంక్ ల రుణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి. క్షేత్ర స్థాయిలో సహకార బ్యాంకులను, వాటికి పై స్థాయిలో జాతీయ అర్బన్ సహకార ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి వాటిని ఏర్పాటు చేసుకుని , అభివృద్ధి చేసుకోవాలి. సహకార బ్యాంకులు, ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలను, వ్యాపారాలను కూడా నిర్వహించేలా సాధికారత సాధించాలి.

సహకార సంఘాల కార్యకలాపాలలో సులభ వాణిజ్య వ్యవస్థ అభివృద్ధి ఒక ముఖ్యమైన భాగం. ఇందుకోసం, బహుళ ప్రయోజన ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను పునాదిగా ఉంచుకుని నమూనా సహకార గ్రామాలను నిర్మించాలి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక మోడల్ సహకార గ్రామాన్ని తీర్చిదిద్దాలి. మొత్తం గ్రామీణ ఆర్థిక సమూహాలను సహకార సంఘాల లోకి సమీకరించాలి. (ఉదాహరణకు తేనె, మసాలా దినుసులు, టీ ఉత్పత్తి దారులను కూడా )

‘భారత్’ బ్రాండ్ కింద తమ ఉత్పత్తులను అమ్ముకునేలా సహకార సంఘాలకు తగిన సహకారం అందించాలి. సంఘాలను భవిష్యత్-ప్రణాళికలకు అనుగుణంగా సంసిద్దం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా సాంకేతికత ను సమకూర్చుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తుల సంబంధిత గణాంకాలను సరిగా నిర్వహించుకోవాలి. క్షేత్ర స్థాయి లో సహకార సంఘాల నుండీ సేకరించే ఈ గణాంకాల ఏకీకరణతో జాతీయ స్థాయిలో ‘సహకార గణాంకాలను’ ను నిర్వహించాలి. ఓపెన్ నెట్‌ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC), ప్రభుత్వ ఈ - మార్కెట్‌ ప్లేస్ (GeM) ప్లాట్‌ఫామ్‌ లతో సహకార సంఘాలను సమన్వయం చేయాలి. సహకార రంగ ఇన్‌క్యూబేటర్‌లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సహకార రంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి. కొత్త ఆవిష్కరణలను సాధించాలి.

సహకార సంఘాలలోకి వివిధ ప్రజా సమూహాలను సమీకరించాలి. యువత, మహిళలు, దళితులు, ఆదివాసీలు, భిన్న సామర్థ్యం గల వ్యక్తుల సమూహాలకు ఈ సహకార సంఘాలలో చురుకైన భాగస్వామ్యం ఉండేలా చూడాలి. సహకార సంఘాలలో మహిళలకు కీలక భాగస్వామ్యం కల్పించాలి. సంఘాల పారదర్శక పాలన కోసం మోడల్ నమూనా నియమాలు రూపొందించుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో సహకార సంఘాల అవసరం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

సమాజంలో ముందుకు వస్తున్న కొత్త రంగాలలో సహకార సంస్థలను ప్రోత్సహించాలి. పునర్వినియోగ శక్తి, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం, విద్య, మొబైల్ ఆధారిత సమీకరణ సేవలు (ఉదా: ప్లంబర్‌లు, టాక్సీ డ్రైవర్లు), సేంద్రియ, సహజ వ్యవసాయం , బయోగ్యాస్, ఇథనాల్ ఉత్పత్తి మొదలైనవి తాజాగా అభివృద్ధి చెందుతున్న రంగాలు.

సహకార సంఘాలలో యువతను భాగస్వాములను చేయడానికి, వారి సామర్ధ్యాలను పెంచడానికి ఉన్నత విద్యా సంస్థలలో (HEIs) సహకార రంగ కోర్సులను అభివృద్ధి చేయాలి. జాతీయ డిజిటల్ సహకార ఉపాధి ఎక్స్ఛేంజ్‌ను నిర్మించాలి. యువతలో ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలి. ఇందుకోసం నిపుణులైన సహకార రంగ ఉపాధ్యాయులను తయారు చేసుకోవాలి. నియమించుకోవాలి.

కొత్త సహకార విధానం అమలు, పర్యవేక్షణ కోసం బలమైన బహుళ అంచెల నిర్మాణం ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం, సహకార మంత్రిత్వ శాఖలో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌ మెంట్ యూనిట్ (TPMU) మద్దతుతో సహకార విధానాన్ని సమర్థవంతంగా, సకాలంలో అమలు చేయడానికి అమలు విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.

కేంద్ర సహకార మంత్రి అధ్యక్షతన జాతీయ స్థాయిలో సహకార విధానం అమలు కోసం ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ స్టీరింగ్ కమిటీ సహకార సంఘాలకు మార్గ దర్శనం అందిస్తుంది. అంతర్-మంత్రిత్వ శాఖలను సమన్వయం చేస్తుంది. నిరంతరం విధాన అమలు తీరును సమీక్షిస్తుంది. కేంద్ర సహకార కార్యదర్శి నేతృత్వంలో సహకార విధాన అమలు, పర్యవేక్షణ కమిటీ , రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుంది. ఈ విధాన అమలులో వచ్చే అడ్డంకులను పరిష్కరిస్తుంది. సవివరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. విధానం అమలుకు అవసరమైన టైమ్‌ లైన్‌లు కూడా జారీ చేస్తుంది “ . ఇదీ కొత్త సహకార విధాన పత్రం 2025 సారాంశం.

కేంద్రం తెచ్చిన ఈ విధాన పత్రం ఎవరి కోసం ? ఎందు కోసం ?

నిరక్షరాస్యత, అనిపుణత, పేదరికం, వనరుల లేమి బలంగా ఉన్న మన దేశంలో నిరుపేదలు,నిరక్షరాస్యులు ఈ పెట్టుబడి దారీ వ్యవస్థ సృష్టించే పరుగు పందెంలో నిలబడలేరు. వ్యక్తులుగా ఇతరులతో పోటీ పడలేదు. సమాజ ఆర్ధిక వ్యవస్థలో, ఒంటరి వ్యక్తుల కంటే, సమిష్టి శక్తి ఎక్కువ ప్రయోజనాలను సాధిస్తుంది.

అసమానతలతో కూడిన ఇలాంటి సామాజిక పరిస్థితులలో ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన సామాజిక వర్గాలు, తమ జీవితాలను, జీవనోపాధులను, ఆదాయ బధ్రతను, సాంఘిక బధ్రత ను మెరుగు పరుచుకోవడానికి సహకార సంఘాలను నిర్మించుకోవడం, పరస్పర సహకారంతో జీవించడం అవసరం.

ప్రజలు తమ సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా, స్థానికంగా ఎక్కడికక్కడ, క్షేత్ర స్థాయిలో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ఇందులో ముఖ్యమైన అంశం. ఈ ఉద్దేశం తోనే రాజ్యాంగం షెడ్యూల్ 7 ప్రకారం సహకార సంస్థల ఏర్పాటు రాష్ట్రాల జాబితా క్రింద ఉంది.

ఈ కారణం చేతనే రాష్ట్రాల స్థాయిలో గత 6 దశాబ్ధాల కాలంలో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చట్టం (PACCS), పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం ( MACS ) ఉనికిలోకి వచ్చాయి. ఈ చట్టాల క్రింద ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వేలాది సహకార సంఘాలు ఏర్పడ్డాయి. కేంద్ర స్థాయిలో మల్టీ స్టేట్ సహకార సంఘాల చట్టం కూడా ఉనికిలో ఉంది. కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా, వివిధ రాష్ట్రాలలో సభ్యులను చేర్చుకుని కార్య కలాపాలను నిర్వహించే సహకార సంఘాలను ఈ కేంద్ర చట్టం క్రింద రిజిస్టర్ చేస్తారు.

ఇప్పటికే ఏర్పడి ఉన్న సహకార సంఘాలు అనేక మౌలిక సమస్యలను ఎదుర్కుంటున్నాయి. వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా కాకుండా, కార్పొరేట్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా సహకార సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఆ చర్యలను చేపడితే, గ్రామీణ, పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది.

కానీ ఆ పనేమీ చేయకుండా , ఇప్పటి వరకూ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార సంఘాల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తన అదుపు లోకి తీసుకోవడానికి వీలుగా ఈ కొత్త సహకార విధానం - 2025 తీసుకు వచ్చింది. కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, సహకార సంఘాలను కార్పొరేట్లకు అను సంధానంగా మార్చడానికి, సహకార వ్యవస్థలో రాష్ట్రాల అధికారాలను కుదించి, “ఒకే దేశం- ఒకే మార్కెట్” పేరుతో తన అవగాహనను ఈ సహకార విధానం ద్వారా ఏకీకృత మార్కెట్ పరిధిలోకి తీసుకు రావడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నం లో భాగంగా దీనిని మనం చూడాలి.

2020 లో తీసుకు వచ్చిన మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను దేశ వ్యాపితంగా సాగిన రైతు, ప్రజా ఉద్యమం ఫలితంగా మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఐదేళ్లకు ఇప్పుడు వివిధ రూపాలలో వాటిని తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నది. 2024 లో తెచ్చిన వ్యవసాయ మార్కెట్ ల జాతీయ విధానం , 2025 లో తెచ్చిన జాతీయ సహకార విధానం ఇందులో భాగమే.

ఈ విధానాలను రాయడంలో వాడిన భాషను చూస్తే దేశ వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తపన పడుతున్నట్లు, అందుకోసమే ఈ విధానాలను తీసుకువస్తున్నట్లు సాధారణ ప్రజలు, గ్రామీణ కార్యకర్తలు, చివరికి ఆయా రాష్ట్రాలలో సహకార సంఘాల నిర్మాణంలో భాగస్వాములవుతున్న వాళ్ళు కూడా భ్రమ పడే ప్రమాదం ఉంది.

2014లో నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం గత పదకొండేళ్లుగా క్రమంగా అన్ని వ్యవస్థలను తమ రాజకీయ, పాలనా అధిపత్యం లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అందరం చూస్తున్నాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల కమిషన్ సహా కేంద్ర స్థాయిలో పని చేసే అన్ని స్వతంత్ర్య సంస్థలను తన అనుకూల మనుషులతో నింపేయడం, రాష్ట్రాల అధికారాల పరిధి లోకి విస్తరించి, నిర్ణయాలు చేస్తున్నది.

రాజ్యాంగం 7 వ షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీస్తూ ఇచ్చిన అధికారాలను, బాధ్యతలను కూడా ఏదో ఒక పేరు చెప్పి కబళిస్తూ వాటిని కూడా తన అదుపులోకి తెచ్చుకోవడం ఇదంతా మనం చూస్తున్నదే. రాష్ట్ర అసెంబ్లీ లు చేసిన చట్టాలను ఆమోదించకుండా సంవత్సరాల కొద్దీ తొక్కి పెట్టడం, గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని ముఖ్యమంత్రుల, రాష్ట్ర చట్ట సభల అధికారాలను కాల రాస్తున్నది.

GST పేరుతో, కేంద్రం చేస్తున్న ఆర్ధిక వనరుల దోపిడీ, పెట్రోల్, డీజిల్ ధరలను GST పరిధి లోకి తేకుండా విచ్చల విడి పన్నులతో, ప్రజలనూ, రాష్ట్రాలనూ కూడా చేస్తున్న దోపిడీ ఇప్పటికే మనల్ని ప్రభావితం చేస్తున్నది.

రాష్ట్రాల నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం కోసం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థపై ఆధిపత్యం కోసం తెచ్చిన నూతన జాతీయ విధానం, రాష్ట్రాల పరిధిలో ఉండే విద్యా రంగాన్ని కూడా ప్రభావితం చేసేలా తెచ్చిన జాతీయ విద్యా విధానం, తప్పుడు పద్ధతులలో ఉత్పత్తి ఖర్చులను లెక్క వేస్తూ, ప్రతి సంవత్సరం పంటలకు ప్రకటించే కనీస మద్ధతు ధరలూ, కార్మిక చట్టాలను కబళిస్తూ, తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లూ రైతులను, కార్మికులను, సాధారణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలపై ఆధిపత్యం కోసం మరో కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది.

ఈ సహకార విధానం డ్రాఫ్ట్ చదివితే బాగుంది కదా, అనిపిస్తుంది కానీ, బీజేపీ పాలనా స్వభావం, ముఖ్యంగా మోదీ షా ల కార్పొరేట్ అనుకూల విధానాలు, దేశంలో సహజ వనరులను కార్పొరేట్ కంపనీలకు కట్ట బెడుతున్న తీరు – ఇవన్నీ చూసినప్పుడు , ఈ సహకార విధానాన్ని లోతుగా పరిశీలించి వ్యాఖ్యానించాల్సి ఉంటుందనిపించింది. ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలో ఇప్పటికే ఉన్న వివిధ సహకార సంఘాలను ఈ విధానం ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.

భారతదేశంలో 8. 44 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 2 లక్షల రుణ సహకార సంఘాలు ఉంటే, 6 లక్షల రుణేతర సహకార సంఘాలు ( గృహ, పశు , మత్స్య రంగాలకు చెందిన ) ఉన్నాయి. గత 6, 7 దశాబ్ధాలలో వివిధ రాష్ట్రాలలో ఏర్పడి, 30 కోట్లకు మందికి పైగా గ్రామీణ, పట్టణ సాధారణ సభ్యులతో నడుస్తున్న ఈ సహకార సంఘాలుగ్రామీణ భారత దేశంలో నిజానికి సామాజిక, ఆర్థిక శక్తిగా కీలక పాత్ర పోషించాలి.

కానీ వాస్తవ పరిస్థితులలో గత 30 సంవత్సరాల క్రితం - ముఖ్యంగా నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు, ముఖ్యంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమయ్యాక - ప్రజల సహకార సంఘాలు చాలా బలహీన పడ్డాయి.కొన్ని సంఘాలు ఆర్ధికంగా దివాళా తీశాయి. కొన్ని సహకార సంఘాలు రాజకీయ పార్టీల జోక్యంతో, వాటి సహకార స్పూర్తిని కోల్పోయాయి. కొన్ని సహకార సంఘాల నిర్వహణలో అధికారులు, సిబ్బంది, పాలక వర్గాల సభ్యులు చేసిన అవినీతి వల్ల, వాటిపై ప్రజలకు విశ్వాసం తగ్గింది. సహకార సంఘాలు నిర్వహించే అనేక కార్యక్రమాలకు ఈ మూడు దశాబ్ధాలలో ప్రభుత్వాలు చేసిన విధాన నిర్ణయాల కారణంగా తగిన కార్య క్షేత్రం లేకుండా పోయింది.

రుణ సహకార సంఘాలు సభ్యులకు రుణాలు, పొదుపు వంటి ఆర్థిక సేవలను అందిస్తాయి. రుణేతర సహకార సంఘాలు సభ్యులకు అవసరమైన వ్యవసాయ ఉప కరణాలు, గ్రామీణ, పట్టణ కుటుంబాలకు అవసరమైన ఇతర వస్తువులను / సేవలను అందిస్తాయి.

సహకార సంఘాలను బలోపేతం చేయాలంటే నిజంగా ఏమి జరగాలి ?

1. దేశ వ్యాపితంగా గ్రామీణ, పట్టణ సాధారణ ప్రజా సమూహాలను సహకార సంఘాలుగా నిర్మించడం తప్పకుండా అవసరమైన చర్య. కానీ ఈ సహకార సంఘాల ప్రధాన ఉద్దేశ్యం - సహకార సంఘాల సభ్యుల జీవనోపాధులు మెరుగు పరచడం, వారి పని, జీవన నైపుణ్యాలను (స్కిల్స్ ) పెంచడం, వారి ఉత్పత్తులకు, సేవలకు న్యాయమైన ధరలు లభించేలా చూడడం, తద్వారా వారి ఆదాయ బధ్రత కు గ్యారంటీ ఇవ్వడం, వారికి అవసరమైన సరుకులు, సేవలు తక్కువ ధరలకు లభించేలా చూడడం, వారి సాంఘిక బధ్రతకు కనీస గ్యారంటీ ఇవ్వడం కావాలి. కానీ ఇలాంటి ప్రజా సమూహాల కేంద్రంగా స్పష్టమైన లక్ష్యం కేంద్రం తెచ్చిన తాజా సహకార విధానంలో కనిపించలేదు. కొన్ని చోట్ల కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినా, సహకార సంఘాల సభ్యుల కేంద్రంగా స్పష్టంగా అది కనిపించలేదు.

2. సహకార సంఘాల స్థాయిలో,ముఖ్యంగా గ్రామీణ సహకార సంఘాల స్థాయిలో వారి జీవనోపాధులకు ఉపయోగపడే మౌలిక వసతులు ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిర్మాణమై,నిర్వహించబడాలి. ముఖ్యంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సరుకుల రవాణా వాహనాలు పశువుల మేత, దాణా యంత్రాలు, పశువుల వైద్య సౌకర్యాలు, పశువుల, వ్యవసాయ వ్యర్ధాలను కంపోస్ట్ గా మార్చే వసతులు లాంటివి సహకార సంఘాల చేతుల్లో ఉండాలి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇందు కోసం తగిన పెట్టుబడులు పెట్టాలి.

3. కానీ దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికే, గ్రామీణ , ఆదివాసీ ప్రాంతాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. భారీ రహదారులు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, గ్రీన్ ఎక్స్ ప్రెస్ హై వే లు, స్కై వే లు, రీజనల్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, డ్రై పోర్టులు, లాంటి వాటికి లక్షల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు, గ్రామీణ ,ఆదివాసీ ప్రాంతాలలో మౌలిక వసతుల కోసం అవసరమైన పెట్టుబడులు మాత్రం పెట్టవు.

4. 5 కిలో మీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ ఉండాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫారసును కూడా అమలు చెయ్యవు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం, జాతీయ సహకార విధానం రాసిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి( AIF) ద్వారా చేసే సహాయం ఏమిటంటే, సహకార సంఘాలు తీసుకునే బ్యాంకు రుణం పై 3 శాతం వడ్డీ రాయితీ మాత్రమే. సహకార సంఘాలు స్వంత పెట్టుబడి కొంత , మిగిలినది బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకుని వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సహకార విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలన్న అంశం ప్రస్తావనే చేయలేదు.

5. రాష్ట్ర స్థాయి చట్టాల ద్వారా క్షేత్ర స్థాయిలో అప్పటికే ఉన్న సహకార సంఘాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా,కేంద్ర ప్రభుత్వం తిరిగి అదే గ్రామాలలో,ఆదివాసీ ప్రాంతాలలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. నాబార్డ్, నాఫెడ్ ,SFAC,NCDC లాంటి కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో,NGO సంస్థల భాగస్వామ్యంతో కొత్తగా FPO లను ఏర్పాటు చేయించింది. నిజంగా ఈ ప్రక్రియ ఆర్ధిక వనరులను దుర్వినియోగం చేసింది తప్ప, అప్పటికే ఉన్న,లేదా కొత్త రైతుల, ఇతర ఉత్పత్తి దారుల సంఘాలను,వాటి సభ్యులను బలోపేతం చేయలేదు. ఉన్న చోటనే ఇలా ఒకటికి మూడు సహకార సంఘాల ఏర్పాటు అవసరమా ? అన్న ప్రశ్నకు కొత్త సహకార విధానం కూడా ఎలాంటి జవాబు ఇవ్వలేదు.

6. ప్రైవేట్ పెట్టుబడులతో కూడిన మార్కెట్ వ్యవస్థ రాజ్యమేలుతున్న కాలంలో అలవి కాని లక్ష్యాలను NGO లకు, FPO లకు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మూడేళ్లలో ఆ లక్ష్యాలను చేరుకోలేని FPO లకు సహాయాన్ని నిలిపేసింది. మన తెలంగాణ లో 500 పైగా FPO లు ఏర్పడినా ఇప్పటికీ 100-150 కి మించి FPO లు ఆర్ధికంగా నిలదొక్కుకోలేదంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆర్ధికంగా ఒక మేరకు నిలబడిన FPO లు కూడా రసాయన ఎరువులు, పురుగు విషాల అమ్మకం, కంపనీల విత్తనాలు, పురుగు విషాలు స్ప్రే చేసే డ్రోన్ సర్వీస్ లు లాంటి వాటి ద్వారా సంఘాల టర్నోవర్ పెంచుకున్నాయి తప్ప , స్థానిక రైతులు/ సభ్యులు పండించే వ్యవసాయ, పశు ఉత్పత్తులను బయట మార్కెట్ చేయడం ద్వారా కాదన్నది ఒక చేదు వాస్తవం. ఈ సంఘాలు కూడా తమ సభ్యులందరికీ సేవలు అందించలేకపోతున్నాయి.

7. సహకార సంఘాలు , FPO లు ఎదుర్కుంటున్న కీలక సమస్య సంఘాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడి అందుబాటులో లేకపోవడం, 500 మంది సభ్యులను చేర్చుకుని, ఐదు లక్షల రూపాయల వాటా ధనం సభ్యుల నుండీ సమీకరించిన FPO లకు నాబార్డ్ సంస్థ మరో ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ గా ఇస్తున్నది కానీ, నాబార్డ్ ప్రోత్సహించి ఏర్పాటు చేసిన నాబ్ కిసాన్ బ్యాంకు తాను ఇచ్చే రుణాలపై 11.50 శాతం వడ్డీ వసూలు చేస్తున్నది. ఇది ఆర్ధికంగా సహకార సంఘాలపై భారాన్ని పెంచుతున్నది. ఇతర బ్యాంకులు ఏవీ సహకార సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదు. నగరాలలో ఉండే స్థలాలు, భవంతులను సహకార సంఘాలు తాకట్టుగా పెడితే మాత్రమే రుణాలు ఇస్తామని ఆ బ్యాంకులు చెబుతున్నాయి. సహకార సంఘాల సభ్యులా చేతుల్లో వ్యవసాయ భూములు ఉంటాయి తప్ప, నగరాలలో స్థిరాస్తులు ఉండవనే కనీస స్పృహను కూడా బ్యాంకులు కలిగి ఉండడం లేదు. కేంద్రం తెచ్చిన కొత్త సహకార విధానం ఈ సమస్య గురించి అసలు మాట్లాడనే లేదు.

8. సహకార సంఘాలు ఎగుమతి చేసే సంస్థలుగా ఎదగాలని కొత్త వ్యవసాయ విధానం కలలు చూపిస్తున్నది కానీ , క్షేత్ర స్థాయిలో సహకార సంఘాలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. ముఖ్యంగా సహకార సంఘాలు కొనుగోలు చేసే వ్యవసాయ యంత్రాలు, పని ముట్లపై , ప్రాసెసింగ్ యూనిట్లపై GST వసూలు చేస్తున్నది. సహకార సంఘాలు, తమ సభ్యుల నుండీ వ్యవసాయ ఉత్పత్తులను బల్క్ గా కొనుగోలు చేసి, ప్యాక్ చేసి, బ్రాండ్ చేసి రిటైల్ గా అమ్ముకుందామంటే వాటిపై కూడా GST వసూలు చేస్తున్నది. ఫలితంగా సహకార సంఘాలు తీవ్ర ఆర్ధిక భారాన్ని మోయవలసి వస్తున్నది. ఈ సమస్య గురించి కూడా కొత్త సహకార విధానం ఏమీ మాట్లాడడం లేదు.

9. సహకార సంఘాల సభ్యుల నుండీ వ్యవసాయ ఉత్పత్తులను, కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు కొని , క్లీన్ చేసి, గ్రేడింగ్ చేసి మార్కెట్ లో వ్యాపారులకు అమ్మాలనుకుంటే సహకార సంఘాలు తీవ్రంగా నష్ట పోతున్నాయి. దీనికి కారణం వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు , పంట చేతికి రాగానే పడిపోతున్నాయి. వ్యాపారులు అతి తక్కువ ధరకు ఆయా పంటలను రైతుల నుండీ కొనుగోలు చేస్తున్నారు. FPO లు సభ్యులా నుండీ కనీస మద్ధతు ధరలకు కొనుగోలు చేయాలనే కండిషన్ పెట్టుకుంటే వ్యాపారం చేయలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త సహకార విధానం ఎలాంటి ప్రతిపాదనా చేయడం లేదు.

10. కేవలం 23 పంటలకు మాత్రమే కేంద్రం కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. ఈ ధరలకు కూడా చట్టబద్ధత లేదు. పాలు, గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లు,పసుపు, మిరప లాంటి ఉత్పత్తులకు అసలు కనీస మద్ధతు ధరలే లేవు. ఈ నేపధ్యంలో మార్కెట్ లో దళారీ వ్యాపారులు రైతులతో,ఇతర ఉత్పత్తి దారులతో తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రైతులకు స్వయంగా బేరమాడే శక్తి లేదు.

11. సహకార సంఘాలు ప్రైవేట్ వ్యాపారులతో, కార్పొరేట్ కంపనీలతో వ్యాపారం గురించి చర్చలు జరుపుతున్నా, నాణ్యతా ప్రమాణాల విషయంలో వాళ్ళు పెట్టే కండిషన్ లను పాటించే పరిస్థితి రైతు సహకార సంఘాలకు లేదు. ఫలితంగా సహకార సంఘాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ లో ఎలాంటి ప్రభావం వేయలేకపోతున్నాయి. వ్యవసాయ, పశు ఉత్పత్తులకు అన్నిటికీ కనీస మద్ధతు ధరలు ప్రకటించాలనీ, వాటికి చట్టబద్ధత కల్పించాలనీ రైతు సంఘాలు, సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతుంటే మోదీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. తాజాగా తెచ్చిన సహకార విధానంలో కూడా దీనిపై ప్రస్తావన లేదు.

12. సహకార సంఘాల/సభ్యుల/ఉత్పత్తుల వివరాల డిజిటలైజేషన్ గురించి తాజా సహకార విధానం అనేక సార్లు ప్రస్తావించింది. సంఘాల డిజిటలైజేషన్ అవసరమే కానీ, వీటి లక్ష్యం ఏమిటి ? సహకార సంఘాల ధగ్గర ఉన్న రైతుల, ఇతర ఉత్పత్తిదారుల ఆర్ధిక, సామాజిక స్థితిని అర్థం చేసుకోవడానికీ, పంటల పొందికను అర్థం చేసుకోవడానికీ, వారికి రుణాలు, బీమా లాంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి, నిజమైన సాగు దారులకు నగదు బదిలీ లాంటి పథకాలు అందుతున్నాయా లేదా అనేది సమీక్షించి సరి చేయడానికి ఈ డిజిటలైజేషన్ ఆయా సంఘాలకు ఉపయోగపడాలి.

13. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం దీనికి భిన్నమైనది. నగదు బదిలీ పథకాల క్రింద సహాయం కేవలం భూ యాజమానులకే అందిస్తున్నది. పంటల బీమా పథకం, పంట రుణాలు కూడా భూ యాజమానులకే అందిస్తున్నది. వరి , పత్తి తప్ప ఇతర పంటలను రైతుల నుండీ నేరుగా కొనుగోలు చేయడం లేదు. పప్పు ధాన్యాలను , నూనె గింజలను రైతుల నుండీ నేరుగా కొనుగోలు చేసే కేంద్ర నాఫెడ్ సంస్థ ఇటీవల కాలంలో ఈ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసింది. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు తప్ప, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చిరు ధాన్యాలను కొనుగోలు చేయడమే లేదు.

14. సహకార సంఘాల డీజిటలైజేషన్ ద్వారా రైతులు సాగు చేసే పంటల వివరాలను రాబట్టి , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సేకరణకు ప్రణాళిక చేసుకుంటే మంచిదే. కానీ అలా కాకుండా కేవలం కేంద్రం ప్రతిపాదించే డిజిటలైజేషన్ అనేది బడా వ్యాపారులకు, బడా కార్పొరేట్ రిటైల్ చైన్లకు మాత్రమే ఉపయోగపడే ప్రమాదం ఉంది.

15. ఈ బడా వ్యాపారులు, తమకు సహకార సంఘాల డిజిటలైజేషన్ ద్వారా అందిన సమాచారాన్ని ఉపయోగించుకుని, దేశంలో పంటల దిగుబడులను , స్థానిక ధరలను అంచనా వేసుకుని తామే పంటల సేకరణ ధరలను నిర్ణయించే ప్రమాదం ఉంది. చాలా పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు కనుక, ప్రకటించే కనీస మద్ధతు ధరలకు కూడా చట్టబద్ధత లేదు కనుక, ఆయా ఉత్పత్తులను ఏ రాష్ట్రంలో , ఏ సహకార సంఘం నుండీ తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందో చూసుకుని కార్పొరేట్ వ్యాపారులు అటువైపు ప్రయాణం చేస్తారు. ఎక్కువ ఉత్పత్తి ఖర్చుల య్యే రాష్ట్రాలకు, కనీస మద్ధతు ధరలు సభ్యులకు చెల్లించి పంటలను కొనుగోలు చేసే సహకార సంఘాల ధగ్గరకు ఈ వ్యాపారులు అసలు రారు. లేదా వచ్చినా తక్కువ ధరలకే కొనుగోలు చేయడానికి బేరం మొదలు పెడతారు. సహకార సంఘాలకు పంటలను కొని, ఎక్కువ రోజులు నిలవ చేసే ఆర్ధిక స్థోమత ఎలాగూ ఉండదు. కాబట్టి ఏడో ఒక చోట వ్యాపారుల ఒత్తిళ్లకు లొంగి తాము తమ సభ్యుల నుండీ సేకరించిన పంటలను అమ్ముకోవలసి ఉంటుంది.

16. ఈ మార్కెట్ పరిస్థితుల గురించి కొత్త సహకార విధానం మౌనంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వం రైతులకు, సహకార సంఘాల సభ్యులకు లాభాలు ఆర్జించి పెట్టడం కాకుండా, కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ను అప్పగించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కొత్త సహకార విధానం మరోసారి నిరూపిస్తున్నది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు జాగరూకులై ఉండాలి. రైతు సంఘాలు, రైతు సహకార సంఘాలు మెలకువగా ఉండాలి. ఇప్పటికే ఉన్న సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నిర్ధిష్ట చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేలా ఒత్తిడి చేయాలి.

17. రాష్ట్రంలో సహకార సంఘాలు లేని ప్రాంతాలలో ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో కొత్తగా ఒక సహకార సంఘాన్ని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్న చట్టాల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. ఒక గ్రామ పంచాయితీ ప్రాంతంలో ఎక్కువ సహకార సంఘాలు ఉంటే, ఒకే సహకార సంఘంగా మారడానికి ప్రయత్నం చేయాలి. గ్రామీణ సహకార సంఘం తమ సభ్యులను ఆర్ధికంగా, సంస్థాగతంగా బలోపేతం చేసే విధంగా ఉండాలి తప్ప, కార్పొరేట్ బడా కంపనీల మార్కెట్ పనిముట్లుగా మారిపోకూడదు.

18. యువత , మహిళలు, దళితులు, ఆదివాసీలు సహకార సంఘాలలో ముఖ్యమైన భాగస్వామ్యం వహించాలని ఈ సహకార విధానంలో చెప్పిన మాట ఉపయోగ కరమైనది. తప్పకుండా ఆ కృషి వెంటనే జరగాలి. ఇప్పటి వరకూ రైతులతో కూడిన ఆయా సహకార సంఘాలలో మహిళల భాగస్వామ్యం అతి తక్కువగా ఉంటున్నది. అలాగే యువత వ్యవసాయం నుండీ దూరం జరుగుతున్న స్థితి కూడా ఉంది. కౌలు రైతులు, అసైన్డ్ రైతులుఇప్పటికీ సహకార సంఘాలలో అతి తక్కువగానే ఉన్నారు. గ్రామీణ ఉత్పత్తిలో ఏదో ఒక రూపంలో భాగం పంచుకునే వ్యవసాయ కూలీలను కూడా సహకార సంఘాల లోకి తీసుకు రావడానికి, వాళ్ళ ప్రత్యేక సమస్యలను పట్టించుకోవడానికి సహకార సంఘాలు ప్రత్యేక దృష్టి సారించాలి. 

Tags:    

Similar News